అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు భారత ప్రధాని మోదీ సన్నిహితంగా ఉన్నారని భావిస్తున్న వేళ భారత్‌పై అమెరికా 27 శాతం వాణిజ్య సుంకాలను విధించడం ఆశ్చర్యానికి గురిచేసింది. తొలుత ఈ సుంకాన్ని 26 శాతంగా నిర్ణయించినప్పటికీ వైట్‌హౌస్ దాన్ని27 శాతానికి పెంచింది.
మోదీ ప్రభుత్వం మాత్రం ఈ సుంకం 10-15 శాతంగా ఉంటుందని భావించింది. కానీ, ఇప్పుడు ఏకంగా 27 శాతానికి పెంచడం రుచించడం లేదు. రెండు ప్రధాన వాణిజ్య భాగస్వాములైన మెక్సికో, కెనడాపై విధించిన 25 శాతం సుంకాలను ఇది మించిపోవడం గమనార్హం. జపాన్, మలేసియాపై 24 శాతం సుంకం విధించ గా భారత్‌పై ఇంకా ఎక్కువ విధించడం విశేషం. చైనాపై అమెరికా 54 శాతం భారీ సుంకాలను విధించినప్పటికీ ఇది భారత్‌కు ఏ మాత్రం ఉపశమనాన్ని కలిగించదు. ఎందుకంటే, చైనా సమర్థవంతమైన ఉత్పాదకత కలిగిన ఆర్థిక శక్తిగా ఉన్నది. ఇక, వియత్నాంపై 46 శాతం, బంగ్లాపై 37 శాతం, థాయిలాండ్‌పై 36 శాతం సుంకాలను అమెరికా విధించింది. ఎందుకంటే ఈ దేశాల్లో కార్మిక శక్తి చాలా చౌకగా దొరుకుతుంది.
మోదీ ప్రభుత్వం అమెరికాను మిత్రదేశంగా భావిస్తున్నప్పటికీ, ట్రంప్ ప్రభుత్వం భారత్‌పై భారీ వాణిజ్య సుంకాలను విధించింది. దారుణమైన విషయం ఏమంటే.. భారత్‌ను ఘోరంగా విమర్శించే అమెరికా వాణిజ్యశాఖ నివేదికను ట్రంప్ మీడియాతో పంచుకోవడం. ఈ నివేదిక 2014 తర్వాత భారతదేశం రక్షణాత్మక వాణిజ్య విధానాలను అవలంబించిందని విమర్శించింది. దీని ఫలితంగా, భారత్ నుంచి అమెరికాకు ఎగుమ తయ్యే బంగారు ఆభరణాలు, కార్పెట్లు, పాలు, బియ్యం, ఇతర వస్తువు లు అధిక సుంకాలకు గురికావాల్సి వస్తున్నది. అమెరికాలో భారీ ఎన్నారై మార్కెట్ కారణంగా ఇవి సుంకాల తీవ్రతను ఎదుర్కొంటున్నాయి. అయి తే, మోదీ ప్రభుత్వం దీన్ని తేలికగా తీసుకున్నది. దీనిపై అధికారికంగా స్పందించడానికి సాహసించలేదు. ట్రంప్‌కు దగ్గరగా ఉన్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ కూడా ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఐరోపా కమిషన్ అధ్యక్షుడు, ఆస్ట్రేలియా ప్రధాని సహా అనేక మంది ప్రపంచ నాయకులు అమెరికా నిర్ణయంపై తీవ్రంగా స్పందించారు. ఈ నిర్ణయం అమెరికాకు ప్రయోజనం చేకూర్చదన్నారు. కానీ, మోదీ ప్రభుత్వం మాత్రం ఆ పాటి ధైర్యం చేయలేకపోయింది. కనీసం అధికారికంగా స్పందించేందుకు అవసరమైన ధైర్యాన్ని కూడగట్టుకోలేకపోయింది. మోదీ ఈ అంశంపై మౌనం పాటించడమే కాకుండా, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌ను కూడా నోరెత్తకుండా చేశారు. వాణిజ్య మంత్రిత్వ శాఖ మాత్రం దీన్ని పరిశీలిస్తామని ఒక సాధారణ ప్రకటన మాత్రమే ఇచ్చింది.
అమెరికా వాణిజ్య సుంకాలను పెంచుతుంటే, అదే సమయంలో భారత ప్రభుత్వం మాత్రం అమెరికాకు పలురకాల రాయితీలిస్తూ ట్రంప్ ఎదుట మోకరిల్లుతున్నది. అధిక ధరల బైక్‌లు, ఎలక్ట్రిక్ వాహనాలు, బోర్బన్ వంటివాటిపై భారత ప్రభుత్వం సుంకాలను తగ్గించింది. అమెరికన్ టెక్ కంపెనీలకు హాని కలిగించే డిజిటల్ సేవల పన్నును కూడా రద్దుచేసింది. ఇందుకు సంబంధించిన సంకేతాలు ఇప్పటికే కేంద్ర బడ్జెట్లో కనిపించాయి. ఫిబ్రవరి 1న సమర్పించిన బడ్జెట్లో, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఈ రాయితీలను ప్రధాన బడ్జెట్లో కాకుండా అనుబంధాల్లో దాచిపెట్టారు. దీనిద్వారా, మోటార్ సైకిళ్లపై 50 శాతం, ఎలక్ట్రిక్ వాహనాలపై 85 శాతం దిగుమతి సుంకాలను తగ్గించారు. ఈ నిర్ణయాలు అమెరికా కంపెనీలకు లాభదాయకంగా ఉంటాయి. ఉదాహరణకు, మోటార్ సైకిళ్లపై సుంకం తగ్గించడం హార్లే డేవిడ్సన్కు ఉపయోగపడుతుండగా, ఎలక్ట్రిక్ వాహనాలపై తగ్గింపు టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్‌కు లాభదాయకంగా మారనున్నది. అయితే, భారతదేశపు స్థానిక కంపెనీలైన మహీంద్రా, టాటా, మారుతీ కంపెనీలను ఇది తీవ్రం గా దెబ్బతీయనున్నది.
నిజానికి అమెరికా విధించిన వాణిజ్య సుంకాలు కథలో ఒక భాగమే. అసలైన పెద్ద కథ భారత ప్రభుత్వం అమెరికాకు మరింత రాయితీలు ఇచ్చిన విషయంలో ఉన్నది. వాణిజ్య సుంకాలు పెరగడం, భారత ప్రభు త్వం ఇచ్చే రాయితీలతో కలిపి పరిశీలిస్తే, భారత్ లాభపడుతున్నదా? లేక, నష్టపోతున్నదా? అన్న ప్రశ్న ఉదయిస్తుంది. మోదీ మద్దతుదారులు దీన్ని మరోవిధంగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. వారు దీన్ని భారత్-అమెరికా సంబంధాలను మలుపు తిప్పే పరిణామంగా చిత్రీకరిస్తున్నారు. అయితే, భారత వ్యవసాయ ఉత్పత్తులపై అమెరికాకు మరిన్ని సడలింపులివ్వాలని ప్రతిపాదనలున్నాయి. భారత వ్యవసాయరంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలురకాలుగా సాయం చేస్తున్నాయి. దీనిలో రుణాలపై రాయితీలు, రుణమాఫీ, పంటబీమా, ఎరువులు, ఇం ధనం, విద్యుత్తు, విత్తనాల రాయితీలు వంటివి ఉన్నాయి. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి భారత్ అంగీకరించినట్టయితే, భారత రైతులు తీవ్రమైన ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం భయానకంగా మారుతున్నది. 37 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులును కలిగి ఉన్న భారత్ తన ప్రయోజనాన్ని కోల్పోయే ప్రమాదం ఉన్నది. కానీ, మోదీ ప్రభుత్వం అమెరికాతో సంబంధాలను బలోపేతం చేయడానికి అతి త్వరగా అడుగులు వేస్తున్నది. ఏప్రిల్ 2న అమెరికా విధించిన పరస్పర వాణిజ్య సుంకాల నిర్ణయానికి ముందే, మోదీ ప్రభుత్వం అమెరికాతో చర్చలు ప్రారంభించింది. ప్రస్తుతం, భారత్, అమెరికా మధ్య బహుముఖ వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నా యి. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ త్వరలోనే దీనిపై సంతకం చేసే అవకాశం ఉన్నది. 2030 నాటికి భారత్-అమెరికా వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచే ప్రణాళిక అమెరికాకు ఎక్కువ ప్రయోజనకారిగా మారనున్నది. భారత్ ఇంధన వ్యయాలను అధికంగా చెల్లించాల్సి వస్తుంది. అలాగే వ్యవసాయం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉన్నది. మొదటిసారి, విదేశాంగ విధానాలను ఆర్థిక ప్రయోజనాలకు అనుగుణంగా మార్చే ప్రయ త్నం జరుగుతున్నది. జనసంఘ్ అమెరికాకు మద్దతుగా ఉన్న రాజకీయం చేపట్టింది. 1977-79 జనతా ప్రభుత్వం కాలంలో అమెరికాతో సంబంధాలను పెంచే ఉద్దేశంతో వాజపేయి ‘నిజమైన అలీన విధానం’ అనే సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. 1980 ఏప్రిల్ 6న బీజేపీ ఆవిర్భవించినప్పటి నుంచీ అమెరికాకు అనుకూలంగా ఉన్న విధానాన్ని కొనసాగించింది. 2003లో ఇరాక్ యుద్ధంలో అమెరికాకు మద్దతుగా భారత్ చేరేలా వాజపేయి ప్రభుత్వం ప్రమాదకర చర్యలు తీసుకున్నది. అప్పటి ఉప ప్రధాని ఎల్కే అద్వానీ వాషింగ్టన్లో పర్యటించి ఇరాక్‌తో యుద్ధంలో అవసరమైన మిలిటరీ సాయం అందిస్తామని అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్‌కు హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి మోదీ ఎప్పుడూ అమెరికాకు దగ్గరగా ఉండాలనే లక్ష్యాన్ని ఎంచుకున్నారు. ఈ విషయంలో ఎన్నడూ దాపరికం వహించలేదు. ఇప్పుడు, అమెరికా విధించిన వాణిజ్య సుంకాలపై మోదీ ప్రభుత్వం మౌనం పాటించడం ఆ దిశగా జరిగిన మరో అడుగుగా కనిపిస్తున్నది.