తెలంగాణ అవతరణలో కీలక పాత్రధారి బీఆర్ఎస్ (టీఆర్ ఎస్)తో రెండు జాతీయపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ ఇప్పుడు ఏక కాలంలో కలబడుతున్నాయి. కాంగ్రెస్ పేరుకే జాతీయ పార్టీ కానీ, ప్రస్తుతం కొన్ని రాష్ర్టాలకే పరిమితమై ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నది. తెలంగాణలో అధికార పగ్గాలు చేతికి రాగానే స్వస్వరూప జ్ఞానాన్ని కోల్పోయి భ్రమాజనిత లోకంలో బతుకుతున్నది. రెండో జాతీయపక్షమైన బీజేపీ కేంద్రంలో 11 ఏండ్లకు పైగా పాలన కొనసాగిస్తూ దక్షిణాదిన రెండో రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అడ్డగోలు దూకుడు రాజకీయాలకు తెరతీస్తున్నది. ఈ క్రమంలో ఈ రెండు జాతీయపక్షాలూ బీఆర్ఎస్పై అప్రజాస్వామిక రీతిలో పాలనాపరమైన ప్రకటనల ‘దాడుల’కు తెగబడుతున్నాయి.
ఉమ్మడి ఏపీలో 1983, 1985 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాలు మూటగట్టుకున్న కాంగ్రెస్ 1989 డిసెంబర్ ఎన్నికల తర్వాత పాలకపక్షంగా అవతరించింది. గద్దెనెక్కిన తర్వాత చేసిన తప్పిదాలు పదేండ్లు కాంగ్రెస్ను అధికారానికి దూరం చేశాయి. ఇదిలా ఉంటే, తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014, 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. తెలంగాణ సాధన కోసం పుట్టిన టీఆర్ఎస్ చేతిలో చావుదెబ్బ తిన్నది. 2023 ఆఖరిలో బొటాబొటి మెజారిటీతో తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. 1989-94 మధ్య అవిభక్త ఏపీలో పాలకపక్షంగా హస్తం పార్టీ ఎన్ని ప్రజా వ్యతిరేక, అప్రజాస్వామిక పోకడలు ప్రదర్శించిందో ఇప్పుడు తెలంగాణలో అదే పార్టీ అంతకన్నా ఎక్కువ అవలక్షణాలతో పరిపాలన సాగిస్తున్నది.
కొత్త పథకాలు, ప్రజా ప్రయోజన ప్రణాళికల్లేని కాంగ్రెస్ సర్కారు… 2023 డిసెంబర్ శాసనసభ ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలు పూర్తిగా అమలుచేసే కార్యక్రమం జోలికి పోవడం లేదు. రాజధానిలో అక్రమ నిర్మాణాలు జరిగాయంటూ ‘హైడ్రా’ అనే సాధనంతో ఇండ్లు కూలగొట్టింది. జనాన్ని ప్రధాన సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టు వంటి చర్యలను చాలానే తీసుకున్నది. ఇలాంటి ఏకపక్ష ప్రభుత్వ నిర్ణయాలపై రాష్ట్ర హైకోర్టు తరచూ మందలిస్తున్నా సర్కారుకు చీమ కుట్టినట్టయినా లేదు. తెలంగాణ సాధనే లక్ష్యంగా పుట్టిన టీఆర్ఎస్ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి అధికారంలోకి వచ్చింది. ఉద్యోగాలు, సాగు నీరు, తాగు నీరు వంటి మౌలిక ప్రజా అవసరాలు తీర్చడానికి గద్దెనెక్కిన వెంటనే నడుంబిగించి కొత్త పథకాలు రూపొందించింది. ఈ క్రమంలోనే జనం నీటి అవసరాలు తీర్చడానికి మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి వినూత్న కార్యక్రమాలతో ముందుకువచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ఊహించడానికే సాహసం చేయని ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలు ఎన్నింటినో కేసీఆర్ ప్రభుత్వం అమలుచేసి చూపించింది. ఈ పథకాల ప్రయోజనాలు వెంటనే తెలంగాణ పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అందాయి. ఫలితంగా, 2018 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-టీడీపీ కూటమిని టీఆర్ఎస్ భారీ మెజారిటీతో ఓడించింది.
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వంటి అనేక కొత్త సాగునీటి పథకాలు తెలంగాణలో లక్షలాది ఎకరాల వరిసాగుకు దోహదం చేశాయి. అయితే, ఇలాంటి ప్రాజెక్టుల నిర్మాణంలోని చిన్న చిన్న లోపాల ఆధారంగా లబ్ధి పొందడం ఒక్కటే ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు లక్ష్యంగా కనిపిస్తున్నది. అలాగే, గత ప్రభుత్వ హయాంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు మాట్లాడుకున్న అనేక కీలక విషయాలు వినడానికి భారీస్థాయిలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే ఆరోపణల్ని కూడా కాంగ్రెస్ సర్కారు కేవలం రాజకీయ లబ్ధి పొందడానికి వాడుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నది.
ఏ రాష్ట్రంలోనైనా అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి గెలిచి అధికారంలోకి వచ్చే ఏ జాతీయ లేదా ప్రాంతీయపక్షమైనా అవకాశం ఉంటే అన్నిరకాల స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించడానికి వెంటనే సిద్ధమౌతుంది. అయితే, 2023 డిసెంబర్ ఆరంభంలో గద్దెనెక్కిన రేవంత్రెడ్డి సర్కార్ ఇప్పుడు 17 నెలల తర్వాత కూడా స్థానికసంస్థల ఎన్నికలు జరిపించడానికి వెనుకాడుతున్నది. పూర్వ పాలకపక్షంపై ఆరోపణలు, విచారణల పేరుతో కాంగ్రెస్ సర్కార్ కాలయాపన చేస్తున్నది.
ఎన్నికల్లో పాలకపక్షాలను గెలిపించేది ఆయా ప్రభుత్వాల విధానాలు, ప్రజలకు మేలుచేసే పథకాలనేది విస్తృత జనాభిప్రాయం. అయితే, మొన్న హైదరాబాద్లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో జరిగిన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ, టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశాల్లో సీఎం రేవంత్ చేసిన ప్రసంగం అందుకు విరుద్ధంగా ఉన్నది. ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ నాయకుల మాటలు, గత 18 నెలల ప్రభుత్వ పాలన పరిశీలిస్తే ఉమ్మడి ఏపీలో 1989-94 మధ్య సాగిన కాంగ్రెస్ సర్కార్ల అడ్డగోలు పాలన గుర్తుకొస్తున్నది. ఆ ఐదేండ్ల పాలనే కాంగ్రెస్ను దశాబ్దం పాటు అధికారానికి దూరం చేసింది. ఇప్పుడు 30 ఏండ్ల తర్వాత అప్పటి ఫలితాలే 2028 డిసెంబర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పునరావృతమయ్యేట్లు కనిపిస్తున్నాయి.