2014, మార్చి 1.. తెలంగాణ ప్రజల అరువై ఏండ్ల స్వప్నం సాకారమైన రోజు. పార్లమెంట్ ఉభయసభల్లో పాసైన తెలంగాణ బిల్లును రాష్ట్రపతి ఆమోదించి గెజిట్ ప్రకటించిన రోజు. తెలంగాణ సంస్కృతి, భాష, చరిత్రపై ఆంధ్రా వలస పాలకులు చేసిన విధ్వంసాన్ని భరించిన తెలంగాణ స్వేచ్ఛా వాయువులను పీల్చిన రోజు.
సమైక్య పాలకులు, పెట్టుబడిదారులు ఢిల్లీలో తిష్ట వేసి బిల్లును అడ్డుకోవటానికి ప్రయత్నించి.. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి తలవంచక తప్పని పరిస్థితుల్లో చిక్కుకున్నారు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న కొందరు నాయకుల మద్దతుతో ఎలాగైనా బిల్లుకు మోకాలడ్డటానికి చేసే ప్రయత్నంలో విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ఏం కావాలో కూడా డిమాండ్ చేయకుండా తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వాళ్లెందరో.. కానీ, తెలంగాణ ప్రజల దశాబ్దాల పోరాటానికి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తలవంచక తప్పలేదు. అమరుల త్యాగాలు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన ఈ రోజు చరిత్ర పుటల్లో నిలిచిపోయే రోజు.
తెలంగాణ ప్రజలకు తమ ఉద్యమంపై నమ్మకం ఉన్నప్పటికీ ఇందిరాగాంధీ హయాంలో ఎలాగైతే ఉద్యమాన్ని చల్లార్చే ప్రయత్నం చేశారో అలాగే 2011 నుంచి 2014 వరకు తెలంగాణ ప్రజల్లో చిన్న అనుమానం ఉండేది. కానీ ‘ఔర్ ఏక్ ధక్కా తెలంగాణ పక్కా’ అంటూ నినదించిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆంధ్రా పెత్తందారుల ఆశలను కకావికలం చేసి తెలంగాణ సాధించారు. కాంగ్రెస్ నేతృత్వంలో నెహ్రూ తెలంగాణను విలీనం చేస్తే.. ఇందిరా గాంధీ ఆ గాయాలపై మరింత కారం చల్లారు. 2009 నుంచి తెలంగాణ ఇస్తామని ఏదో మాట వరుసకు చెప్పిన కాంగ్రెస్ ఎంతోమంది విద్యార్థుల ప్రాణాలను బలి తీసుకున్నది.
పద్నాలుగేండ్లు ఉద్యమాన్ని ఉర్రూతలూగించి దేశంలోని అన్ని ప్రధాన పార్టీలను ఒప్పించిన కేసీఆర్ తొలి తెలంగాణ ప్రభుత్వానికి రథసారథిగా మారారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడిన తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా ప్రాజెక్టుల నిర్మాణం, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు. దేశంలోనే భారీ ప్రాజెక్టుగా కాళేశ్వరం ద్వారా గోదావరి నదికి జీవం పోశారు. కాకతీయుల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ విలీనం ముందు వరకు గొలుసు కట్టు చెరువులతో సస్యశ్యామలంగా ఉండే తెలంగాణ ప్రాంతం ఆంధ్రా పాలనలో వెనుకబాటు గురైంది. దీనికి విరుగుడుగా ‘మిషన్ కాకతీయ’ అనే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన కేసీఆర్ ఆ చెరువులన్నింటినీ పునరుద్ధరించారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో భూగర్భ జలాలు పెరగటాన్ని నీతి ఆయోగ్ సహా అన్ని కేంద్రసంస్థలు గుర్తించాయి. గత 75 ఏండ్లలో దేశంలో సాగు భూమి 7.7 శాతం పెరిగితే కేవలం పదేండ్లలో తెలంగాణలో 117 శాతం సాగు భూమి వినియోగంలోకి వచ్చింది.
హైదరాబాద్‌ను బంగారు బాతుగా, రియల్ ఎస్టేట్ ఆదాయ వనరుగా చూసిన బాబు లాంటి వాళ్లకు ఐటీ అభివృద్ధి అంటే ఏమిటో చూపించారు కేసీఆర్. ఒకప్పుడు హైదరాబాద్ అంటే ట్రాఫిక్, మత ఘర్షణలు గుర్తుకువచ్చేవి. కానీ, పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో మచ్చుకైనా ఇలాంటి ఘటనలు కనిపించలేదంటే ఆ ఘనత తెలంగాణ సోయి ఉన్న కేసీఆర్‌కే సొంతం. టీహబ్ లాంటి వినూత్నమైన ఆలోచనలతో ఐటీ రంగం దేశంలోనే అగ్రగామిగా ఎదిగింది.
2014లో హైదరాబాద్ కేంద్రంగా రూ.57 వేల కోట్ల ఐటీ ఎగుమతులు జరిగితే 2023లో రూ.2,41,275 కోట్ల ఎగుమతులు జరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో స్థానిక రిజర్వేషన్లు వలస పాలకులు కొల్లగొడితే… కేసీఆర్ భవిష్యత్ దృక్పథంతో 95 శాతం రిజర్వేషన్లను స్థానికులకు కేటాయించారు. రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి పదేండ్లలో రెండున్నర లక్షల ఉద్యోగాలను భర్తీచేశారు. కేసీఆర్ కిట్లు, కంటివెలుగు, బస్తీ దవాఖానాలు, తెలంగాణ డయాగ్నోస్టిక్స్, నూతన మెడికల్ కళాశాలలు నిర్మించారు. ఇవన్నీ తెలంగాణ ప్రజలకు ఆరోగ్యాన్ని అందించటానికి బీఆర్ఎస్ చేసిన గొప్ప కార్యక్రమాలు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో గ్రామీణ, పట్టణ పరిసరాలను పూర్తిగా మార్చేశారు. జాతీయస్థాయిలో 20 ఉత్తమ గ్రామ పంచాయతీలకు గానూ 19 తెలంగాణ నుంచే ఎన్నికవటం గర్వకారణం. హరిత తెలంగాణ నిర్మించే క్రమంలో 7.7 శాతం పచ్చదనాన్ని పెంపొందించారు. 2023 వరకు తెలంగాణ మోడల్ అభివృద్ధిని పాటించేందుకు దేశంలోని అన్ని రాష్ర్టాలు ముందుకువచ్చాయి. పదేండ్ల కాలంలో సాగు విస్తీర్ణం, భూగర్భ జలాలు, పంట దిగుబడులు, అక్షరాస్యత, శిశు మరణాల రేటు ఇలా చెప్పుకొంటూ పోతే ప్రతి రంగంలోనూ కేసీఆర్ తనదైన ముద్ర వేశారు.
కానీ, అలవి కానీ హామిలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇటు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక, అటు అభివృద్ధిని కొనసాగించలేక చతికిల పడుతున్నది. పాలనపై ఎలాంటి పట్టు లేని రేవంత్ రెడ్డి అభివృద్ధిని కొనసాగించలేక పాలనను అస్తవ్యస్తంగా మార్చారు. కృష్ణా జలాలను ఆంధ్రా పాలకులు తరలించుకుపోతుంటే చేష్టలుడిగి చూస్తున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ఖాళీ అయిన తర్వాత మేలుకున్న రేవంత్ అధికారులకు ఆదేశాలిచ్చి మాత్రం ఏం లాభం? గత పదేండ్లలో ఒక్క చుక్క కూడా అక్రమంగా తరలించుకుపోవటానికి ఆంధ్రా ప్రభుత్వాలు జంకాయి. కానీ, ప్రస్తుతం యథేచ్ఛగా నీళ్లు దోచుకుపోతున్నాయి. మరోవైపు కాళేశ్వరానికి మరమ్మతులు చేయకుండా రాజకీయ ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి పాకులాడుతున్నారు. పదేండ్లలో ప్రతి ప్రాజెక్టులో పుష్కలంగా నీళ్లుంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే యాసంగి పంటలు వేసుకోవద్దని అధికారులు సూచించే పరిస్థితికి తీసుకువచ్చారు.
ఇలాంటి ప్రభుత్వంపై పోరాటాలు చేయటానికి బీఆర్ఎస్ శాయశక్తుల కృషిచేస్తున్నది. లగచర్ల లాంటి ఘటనలు సహా సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల మరణాలపైనా పోరాడుతున్నది. అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు చరమగీతం పాడేందుకు బీఆర్ఎస్తో కలిసి నడిచేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు సహా కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు బీఆర్ఎస్ చేస్తున్న పోరాటానికి ప్రజలు బాసటగా నిలుస్తున్నారు.
( నేడు తెలంగాణ రాష్ట్ర బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర పడిన రోజు)
– ఓ.నరసింహా రెడ్డి 80080 02927