‘ఎవరో చెప్పారని, లేదా సంప్రదాయమని, లేదా నీకు నీవే ఊహించుకొని దేనినీ నమ్మొద్దు! చెప్పిన గురువు మీద గౌరవంతో విన్నదంతా నమ్మొద్దు! నీకు నువ్వే పరీక్షించి, విశ్లేషించుకుని అది మంచిదని, సమాజానికి మేలు చేస్తుందని బోధపడిన తర్వాతే దాన్ని స్వీకరించు, దాన్ని నీ పథంగా అందుకో !’ అని రెండున్నర వేల సంవత్సరాల క్రితం బుద్ధుడు చెప్పాడు. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలా పరిగణించి ముందుకెళ్లాలో తెలియజెప్పడానికి ఈ మార్గాన్ని ఆయన సూచించాడు. దీనినే ప్రపంచవ్యాప్తంగా ‘సైంటిఫిక్ టెంపర్’ అనే భావనకు సమగ్రమైన నిర్వచనంగా పరిగణిస్తున్నారు.
‘సైంటిఫిక్ టెంపర్’ అనే మాటను తొలుత వాడింది సిద్ధాంతకర్త కాదు, భాషావేత్త అసలే కాదు. జవహర్లాల్ నెహ్రూ 1946లో తన పుస్తకం ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’లో ఈ మాటను మొదటిసారి ఉపయోగించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ భావన మరింత గౌరవనీయమైన స్థానాన్ని ఆక్రమించింది. 1958లో సైన్స్ పాలసీ వచ్చినప్పటి నుంచి ఈ మాటను విరివిగా వాడటంతోపాటు సైన్స్- సమాజం మధ్యనున్న సంబంధ బాంధవ్యాలను బలోపేతం చేయడానికి కృషి పెరిగింది. ‘సైన్స్ టెంపర్’ అనే మాటను తెలుగులో ‘సైన్స్ అభినివేశం’ లేదా ‘శాస్త్రీయ అభినివేశం’ అని అనువాదం చేసుకోవచ్చు. ప్రశ్నించడం, పరిశీలించడం, పరీక్షించడం, ప్రతిపాదించడం, విశ్లేషించడం, సమాజానికి అనువర్తింప చేయడం, ఫలితాలను జాగ్రత్తగా పరిశీలించడం వంటివి ఈ కోవలోకి వస్తాయి.
ప్రపంచంలో భారతదేశమే తొలిసారి తన రాజ్యాంగంలో ఈ ‘సైంటిఫిక్ టెంపర్’ గురించి పేర్కొన్నది. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నియమాలని విధిగా గౌరవిస్తూ జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించాలని మొదలయ్యే ప్రాథమిక విధులు పౌరులకు ఉంటాయని ఆర్టికల్ 51 (ఏ) హెచ్ చెప్తుంది. ఇందులో ఎనిమిదవది అయిన హెచ్.. ‘To develop the scientific temper, humanism and spirit of inquiry and reform’ అని వివరిస్తున్నది. ఈ మాటలను జాగ్రత్తగా గమనిస్తే సైంటిఫిక్ టెంపర్‌తో పాటు మానవత, జిజ్ఞాస, సంస్కరణ అనే భావనలు కూడా కనబడతాయి. ఈ నాలుగింటిని కలగలిపి మన దృష్టి పథాన్ని రూపొందించుకోవాల్సింది ఉంటుంది. 1976లో 42వ రాజ్యాంగ సవరణ చేసినప్పుడు ఈ ‘హెచ్’ అధికరణం వచ్చి అంతర్భాగమైంది.
మరి భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాలకు ఎంత ఖర్చు పెడుతున్నదనే సందేహం రాకమానదు. జీడీపీలో 0.66 శాతమే భారతదేశం ఇం దుకు కేటాయించింది. నిజానికి ఒక శాతం చేస్తున్నట్టు రెండు దశాబ్దాలు గా మనం వింటున్నాం, కానీ వాస్తవరూపం ధరించలేదు. తమ తలసరి ఆదాయంలో అమెరికా సంయుక్త రాష్ర్టాలు 3.07, చైనా 2.4, దక్షిణ కొరి యా 4.5 శాతం చొప్పున ఖర్చు పెడుతున్నాయి. కనుకనే, ఆ మేరకు ఫలితాలు వస్తున్నాయి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మంచి పరిశోధనలు చేయ డం వల్లే పారిశ్రామికంగా ఆ దేశాలు లాభదాయకమైన స్థానంలో ఉండగలుగుతున్నాయి. ఉత్తమమైన మానవ వనరులున్న మన దేశం కనీసం ఒక శాతం ఖర్చు పెట్టగలిగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి.
– డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ 94407 32392