తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కొన్నాళ్లుగా వార్తల్లో నలుగుతున్నది. కల్తీ నెయ్యికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. అందులో కలవగూడని పదార్థాలు కలిశాయన్నట్టుగా ఆయన మాట్లాడటంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వామివారి భక్తులు ఆందోళనకు గురయ్యారు. లడ్డూ నాణ్యతపై చంద్రబాబు కావాలనే అనుమానాలు కలిగేలా చేశారు. విపక్ష పార్టీని ఇరకాటంలో పెట్టాలనే ఆలోచన బహుశా అందుకు కారణమై ఉంటుం ది. మొత్తంగా ఆలయాల నిర్వహణపైనే ఈ సందర్భంగా మౌలిక చర్చ మొదలు కావడం పరాకాష్ఠ. ఈ హడావుడిలో కొందరు ఒకడుగు ముందుకువేసి శుద్ధి కార్యక్రమాల పేరిట హడావుడి చేశారు. అటు కేంద్రంలోని బీజేపీ నాయకత్వం కూడా వివాదంలో దూరిపోయి హంగామా చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో ఆధ్యాత్మికం కన్నా రాజకీయాల పాలే ఎక్కువని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసిం ది. ఎలాంటి ఆధారాలు లేకుండా లడ్డూ కల్తీపై ఆరోపణలు చేయడాన్ని ఆక్షేపించింది. అసంపూర్తి సమాచారంతో అనుమానాలు రేకెత్తించేలా మాట్లాడి పవిత్రమైన ప్రసాదాన్ని వివాదాల్లోకి లాగడం దురదృష్టకరం. ఓ వైపు తన ఆదేశాల మేరకే దర్యాప్తు జరుగుతుండగా సీఎం స్థాయి వ్యక్తి మీడియా ముందు అదే అంశం గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమిటని సుప్రీంకోర్టు నిలదీయడం గమనార్హం. దేవుని చుట్టూ రాజకీయాలు అల్లుకోవడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో లడ్డూకు సంబంధించి స్పష్టత రావడంతో అశేష భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
దేవుడిని, మతాన్ని రాజకీయాల కోసం వాడుకోవడం భక్తుల దృష్టిలో అపచారం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యంలో అపమార్గం కూడా. మత విశ్వాసాలను రెచ్చగొట్టి ఓట్లు పిండుకునే ధోరణి ఇటీవలి కాలంలో పెచ్చరిల్లింది. తెలంగాణ ప్రథమ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ధోరణిని అనేక సందర్భాల్లో ఎండగట్టిన సంగతి తెలిసిందే. ఆయన భక్తి విశ్వాసాలు నిండుగా, మెండుగా ఉన్న నిష్ఠాగరిష్టుడు. పూజాదికాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తారు. యజ్ఞయాగాదుల్లో పాల్గొంటారు. యాదాద్రికి పునర్ వైభవ ప్రాప్తికి కర్త, కర్మ, క్రియ కేసీఆరే. కొండగట్టు బృహత్తరమైన అభివృద్ధికి నాందీ ప్రస్తావన జరిపారు. ఇంకా అనేక ఇతర ఆలయాల అభివృద్ధికి కృషి చేశారు. ధార్మిక కార్యాలకు ఎప్పుడూ ముందుంటారు. కానీ, ఆయన ఏనాడూ అందుకు సంబంధించిన ప్రచారాన్ని లేశమాత్రం కూడా చేసుకోలేదు. మతాన్ని రాజకీయాలకు వాడుకోలేదు. అభివృద్ధి, సంక్షేమం ఎజెండాగా ముందుకు సాగారు తప్ప భావావేశాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే పనికి ఎన్నడూ పూనుకోలేదు. పరిణత రాజనీతిజ్ఞునిగా దేశానికే ఆదర్శంగా నిలిచారు. గంగ ఒడ్డున చిన్న ఘాట్ కట్టి, దానికి ఇబ్బడి ముబ్బడిగా ప్రచారం చేసుకుంటున్న ఈ కాలంలో అంత ప్రభవంగా యాదగిరి గుట్ట కృష్ణశిలా నిర్మాణాన్ని చేపట్టి కూడా ఎటువంటి ప్రచారం చేసుకోని వ్యక్తి కేసీఆర్. భక్తి వ్యక్తిగతం. దాన్ని రాజకీయం చేయాలని చూస్తే దేవుడు ఊరుకుంటాడా? చంద్రబాబు విషయంలో జరిగింది ఇదే!