రాష్ట్ర అవతరణ తొలినాళ్ల నుంచీ తెలంగాణ ప్రభుత్వం పచ్చదనం అభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నది. దీనిలో భాగంగానే నేటి నుంచి ఈనెల పదో తేదీ వరకు ఏడో విడత హరితహారం కార్యక్రమంలో పచ్చదనం-పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యమిచ్చింది. పది రోజుల పాటు సాగే ఈ కార్యక్రమానికి నాలుగో విడత పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాన్ని కూడా జోడించి మెరుగైన జీవన పరిస్థితులే లక్ష్యంగా కదులుతున్నది. గత ఆరు విడతల్లో ఇప్పటికే 220.70కోట్ల మొక్కలు నాటిన ప్రభుత్వం ఈ సారి ప్రతి ఇంటికి ఆరుచొప్పున 19.91 కోట్ల మొక్కలను నాటేందుకు సన్నాహాలు చేసింది. దేశంలోనే అత్యధిక మొక్కలు నాటిన రాష్ట్రంగా పార్లమెంటు రికార్డుల్లో తెలంగాణ నిలువటం హరితహారం విశిష్టతకు, విజయానికి నిదర్శనం.
‘హరితహారం’తో పాటు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలలో మౌలిక వసతుల కల్పనకు, ఆరోగ్య సమాజ ఆవిష్కరణకు రాష్ట్రప్రభుత్వం రూపకల్పన చేసింది. సీజనల్ వ్యాధుల నివారణ కోసం దోమలను అరికట్టే ప్రత్యేక కార్యాచరణను చేపట్టింది. ప్రతి పల్లెలో, పట్టణంలో వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డుల నిర్మాణం పూర్తిచేయనున్నది. భద్రమైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం, ఈ పది రోజుల్లో ఒక రోజును విద్యుత్ మరమ్మతుల కోసం కేటాయించింది. ఈ పనులన్నీ సజావుగా లక్ష్యాలకు అనుగుణంగా సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పర్చింది. ప్రజా ప్రతినిధుల్లో ఎంపీ మొదలు గ్రామ స్థాయి వార్డు మెంబరు, కౌన్సిలర్ దాకా, అధికారుల్లో జిల్లా కలెక్టర్ మొదలు గ్రామ కార్యదర్శి దాకా అందరూ సమిష్టిగా, సమన్వయంతో పనిచేసేలా నిర్దేశించింది. ఈ పనుల నిర్వహణకు అవసరమైన నిధులను విడుదల చేసి పల్లె, పట్టణ ప్రగతిలో నూతన శకాన్ని ఆవిష్కరిస్తున్నది.
స్వీయ పాలనలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి దిశగా వడిగా పరుగులు తీస్తున్నది. అందులో పర్యావరణం, పచ్చదనానికి ప్రాధాన్యమిచ్చి ‘ఆకుపచ్చని ఆవరణ కోసం- పసిడిపచ్చని రాష్ట్రం కోసం’ హరితహారం కార్యక్రమాన్ని 2015 జూన్లో చేపట్టింది. ఇప్పటికే ఆరువిడతలుగా సాగిన హరితహారం లక్ష్యాన్ని దాటేదిశగా సాగుతున్నది. 230కోట్ల మొక్కలు లక్ష్యంగా పెట్టుకుంటే ఏడో విడత కాకుండానే లక్ష్యాన్ని చేరుకున్నది. దేశంలో సగటు అటవీ విస్తీర్ణం 21.34శాతం ఉంటే తెలంగాణలో 24.05శాతం ఉన్నది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 33శాతానికి పెంచేదిశగా రాష్ట్రప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. దీనిలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా భాగస్వాములు కావాలి. బ్రెజిల్, చైనా తర్వాత మూడో అతిపెద్ద మానవ ప్రయత్నంగా ‘హరితహారం’ చరిత్రకెక్కడం తెలంగాణకు గర్వకారణం.