విలువల రాజకీయాలంటూ ఊదరగొట్టి అధికారంలోకి వచ్చిన బీజేపీ గత పన్నెండేండ్ల పైచిలుకు పాలనలో ప్రతినిత్యం విలువలకు పాతరేస్తూ వచ్చింది. వికృత రాజకీయ క్రీడలో కాంగ్రెస్ కన్నా రెండాకులు ఎక్కువే చదివి విపరీత పోకడలు పోతున్నది. ఇప్పుడు తన ప్రత్యేక ఎజెండాసాధనకు వేస్తున్న ఎత్తుగడల్లో భాగంగా ప్రజాస్వామ్యాన్ని ప్రహసనంగా మారుస్తున్నది. కశ్మీర్‌కు సంబంధించిన 370 అధికరణం ఎత్తివేయడం, ప్రణాళికా సంఘాన్ని మూలకు నెట్టడం వంటివి ఈ సరికే సాధించుకోగలిగింది. ఏమాత్రం అవకాశం దొరికినా ఇంకా చాలానే చేయాలనేది బీజేపీ అత్యాశ. ఒకే దేశం ఒకే ఎన్నిక, ఒకే విధానం, ఒకే నేత.. ఇలా లిస్టు చాలా పెద్దదే. మోదీ మొదటిసారికన్నా రెండోసారి మెజారిటీ పెంచుకున్నారు. అదే ఊపు అలాగే కొనసాగి మూడో విడుతలో 400 మార్కు దాటుతామేమోనని కమలదళానికి ఆశ కూడా కలిగింది. అయితే ఓటర్లు ఆ పార్టీకి ఉన్న మెజారిటీని ఊడగొట్టి మూలకు నెట్టారు. అయితేనేం..ఇతర పార్టీల మద్దతుతో కేంద్రంలో అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది బీజేపీ.
ప్రస్తుతం నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులను పార్లమెంటులో ఆమోదింప జేసుకోవడం తక్షణ కర్తవ్యంగా ఉన్నదన్నది బహిరంగ రహస్యమే. అందుకు అవసరమైన బలం పెంచుకునేందుకు నానా గడ్డి మేస్తున్నది. ఒకప్పుడు కాంగ్రెస్ నిస్సిగ్గుగా పాల్పడిన రాజకీయ అకృత్యాలన్నిటినీ ఇప్పుడు అనుసరిస్తున్నది. రాజకీయాల్లో విలువల గురించి మాట్లాడే బీజేపీ ఆ విలువలను కట్టగట్టి అటకెక్కిస్తున్నది. గవర్నర్ల వ్యవస్థను భ్రష్ఠుపట్టించింది. కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ అవసరాలకు దుర్వినియోగపరుస్తున్నది. న్యాయవ్యవస్థపై పట్టుకోసం జాతీయ న్యాయ నియామక మండలి (ఎన్ జాక్) తీసుకువచ్చి సుప్రీంకోర్టు తిరస్కరణతో చేతులు కాల్చుకున్నది.
ఇప్పుడు పార్లమెంటులో తమ బలం పెంచుకునేందుకు విపక్షాలను చీల్చేందుకు అనైతిక ఎత్తుగడలను అమలు చేస్తున్నది. మరో రెండేండ్లలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో సొంతంగా బలం పెంచుకునేందుకు నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులే దిక్కని బీజేపీ గట్టిగా నమ్ముతున్నట్టున్నది. అయితే ఆ బిల్లులను ఒడ్డున పడేయాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి. ఆ మేరకు పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీ కూడా లేదనే సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న బెంగాల్ ఎన్నికల ముందు నాటకీయమైన రీతిలో ఆ బిల్లులను కలగలిపి ప్రవేశపెట్టి అపజయాన్ని మూటగట్టుకున్నది.
దేశంపై రాజకీయంగా తన పట్టు బిగించేందుకు పై రెండు బిల్లులు సానుకూల వాతావరణం తీసుకువస్తాయని బీజేపీ భావన. అందుకు విపక్షాలను చీల్చే అప్రతిష్ఠాకరమైన ఎత్తుగడలకు పాల్పడుతున్నది. బెంగాల్ ఎన్నికల దరిమిలా తృణమూల్‌ను నిలువునా చీల్చింది. ఆ పార్టీకి చెందిన 20 మంది ఎంపీలు వేరుకుంపటి పెట్టారు. వారు నేరుగా బీజేపీలో చేరకుండా అధికారికంగా నమోదు కాని త్రిపురకు చెందిన ఎన్సీపీఐ (నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా)లో చేరారు. అయితే వారు ఎన్డీయే కూటమికి మద్దతు ప్రకటించడం మాత్రం మరువలేదు. దీనిని బట్టే టీఎంసీ చీలిక వెనుక ఎవరున్నదీ చెప్పకనే తెలిసిపోతున్నది. ఢిల్లీలో ఆప్ నుంచి మొదలుకొని మహారాష్ట్రలో ఎన్సీపీ దాకా బీజేపీ చీలిక ఎత్తుగడలకు బలికాని ప్రాంతీయ పార్టీలు దేశంలో బహు తక్కువగా మిగిలి ఉన్నాయి.
తాజాగా మహారాష్ట్రలో శివసేన చీలికవర్గంలో మరో చీలికకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఉద్ధవ్ బాల్ ఠాక్రే వర్గంలో ఉన్న 9 మంది ఎంపీల్లో ఆరుగురు మహారాష్ట్ర బీజేపీ కూటమిలో భాగస్వామిగా ఉన్న షిండే వర్గంలో చేరుతామని అంటున్నారు. ఈ చీలిక వెనుక బీజేపీ పాత్రను రుజువు చేయడానికి ఇంతకన్నా సాక్ష్యాలు కావాలా? అంతా బహిరంగ రహస్యమే. పైగా ఫిరాయింపు ఎంపీలకు పెద్ద ఎత్తున డబ్బు ఆశ చూపారనే ఆరోపణలు వెల్లువెత్తుతుండటం గమనార్హం. మరోవైపు ఎన్నికల వ్యవస్థను అడ్డు పెట్టుకుని తమవారిని పార్లమెంటుకు పంపే ఎత్తుగడలకూ బీజేపీ వెనుకాడటం లేదు. విలువల పేరిట కాంగ్రెస్‌పై పోరాడినట్టు దేశాన్ని మభ్యపెట్టిన బీజేపీ అదే కాంగ్రెస్ బాటలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుండటం విడ్డూరం. అందుకు కాంగ్రెస్ తెచ్చిన ఫిరాయింపు వ్యతిరేక చట్టం ఓ సాధనంలా మారడం మరీ విడ్డూరం.