హైదరాబాద్ జీవన రుచికి అలవాటుపడ్డవారు హైదరాబాద్‌ను వదులుకోరు. దీని మహత్తు అది. పదేండ్ల ఉమ్మడి రాజధాని అయినా రేవంత్ ఓటుకు నోటు వ్యవహారంతో బాబు రాత్రికి రాత్రే విజయవాడకు మకాం మార్చారు. అదే రేవంత్‌రెడ్డి వల్ల ఇప్పుడు హైదరాబాద్‌పై పరోక్షంగా బాబు తన అధికారాన్ని చెలాయిస్తున్నారు. టీడీపీ నాయకులు రేవంత్‌లో చంద్రబాబును చూసుకుంటున్నారు. అసలు కాంగ్రెస్ నాయకులకు ఇది నచ్చినా, నచ్చకపోయినా మౌనంగా ఉండక తప్పని పరిస్థితి.
రోజురోజుకు రేవంత్, టీడీపీ బంధం బలపడుతున్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో ఇది బహిర్గతమైంది. కమ్మ సంఘాలు బహిరంగంగా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించాయి. ఆంధ్రలో కాంగ్రెస్‌కు డిపాజిట్ దక్కనివ్వకుండా కృషిచేస్తున్న వీళ్లు తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ వెన్నంటే నిలిచారు. జూబ్లీహిల్స్ ఫలితం వచ్చాక గాంధీభవన్‌లో కాంగ్రెస్ జెండాల కన్నా టీడీపీ జెండాలే ఎక్కువగా రెపరెపలాడాయి. సాధారణంగా కమ్మ సంఘాల సమావేశంలో ఎన్నికల్లో ఏ పార్టీ అయినా కమ్మ అభ్యర్థికి ఓటు వేయాలని పిలుపునిస్తారు. కానీ, జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ప్రత్యర్థిగా కమ్మ అభ్యర్థే రంగంలో నిలిచినా ఆ సంఘాలు కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించాయి. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటుచేశాయి. కూటమి భాగస్వామిగా ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి టీడీపీ మద్దతు ఇవ్వాలి. కానీ, ఏకంగా టీడీపీ నాయకులు కాంగ్రెస్ కోసం పనిచేసినా బీజేపీ అభ్యంతరం చెప్పలేదు. కాంగ్రెస్, బీజేపీల ఉమ్మడి శత్రువు బీఆర్ఎస్ అనే భావనతో ఉన్న బీజేపీ మౌనంగానే ఉన్నది. కేంద్రంలోని తమ కూటమి ప్రభుత్వంలో ఉన్న టీడీపీ తమ పార్టీ జెండాలతోనే గాంధీభవన్‌లో విజయోత్సవాలు జరుపుకున్నా టీడీపీ-బీజేపీ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు.
కాంగ్రెస్ బలహీనపడితే అది బీఆర్ఎస్కు లాభం. అది బీజేపీకి ఇష్టం లేదు. కాంగ్రెస్ లాభం పొందినా పరవాలేదు కానీ బీఆర్ఎస్కు నష్టం జరగాలనేది బీజేపీ వ్యూహం. రేవంత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా కాంగ్రెస్ సీనియర్లు అతన్ని ఔట్ సైడర్గానే చూస్తున్నారు. అదే సమయంలో టీడీపీ నాయకులు రేవంత్‌రెడ్డిని టీటీడీపీ సీఎంగా చూస్తున్నారు. ఒకవైపు బీజేపీ కూటమి ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉంటూనే తెలంగాణ వరకు మాత్రం చంద్రబాబు కాంగ్రెస్ సీఎంకు అండగా ఉన్నారు. చంద్రబాబు, రేవంత్‌లు గురుపాలకుడు, శిష్య పాలకుడుగా వెలిగిపోతున్నారు. కాంగ్రెస్ వ్యతిరేకతే తమ పార్టీ సిద్ధాంతమని టీడీపీ ఆవిర్భావంలోనే ఎన్టీఆర్ ప్రకటించారు. ఆ తర్వాత బాబు కూడా అదే తమ సిద్ధాంతమని చెప్పుకొచ్చారు. కానీ, ఒక వైపు బీజేపీతో కలిసి కేంద్రంలోనూ, ఏపీలోనూ ప్రభుత్వాల్లో భాగస్వామిగా ఉంటూ మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్‌తో చెట్టాపట్టాలు వేసుకొని ఎన్నికల్లో పనిచేస్తున్నారు. టీడీపీకి అండగా నిలవడం తమ సామాజిక బాధ్యతగా భావించే మీడియా, ఇప్పుడు దాదాపు అదేస్థాయిలో కాంగ్రెస్ సీఎంకు అండగా నిలుస్తున్నది. కాంగ్రెస్ సీఎంకు పూర్తి అధికారాలివ్వాలని కాంగ్రెస్ హై కమాండ్‌ను టీడీపీ మీడియా నిలదీస్తున్నది. రూ.1000 కోట్లు ఖర్చుచేసి చెమటోడ్చి రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చారని, సంపూర్ణ అధికారం ఇవ్వకపోతే ఎలా అని కాంగ్రెస్ హైకమాండ్‌ను ప్రశ్నిస్తున్నది.
ఓటుకు నోటు కేసులో పట్టుపడినప్పుడు టీడీపీ అధ్యక్షునిగా ఉన్న రేవంత్ తనకు అండగా నిలిచిన మీడియా సంస్థల పేర్లు కూడా చెప్పారు. ఆ వీడియో ఇంకా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నది. ఆ తర్వాత రేవంత్ టీడీపీని వీడి కాంగ్రెస్ సీఎం అయ్యారు. అయినా, ఆ మీడియా మాత్రం రేవంత్ చెప్పినట్టు కాంగ్రెస్, రేవంత్‌కు అండగా నిలుస్తూనే ఉన్నది. ఈ వ్యవహారాన్ని బట్టే తెలంగాణలో కాంగ్రెస్-టీడీపీ అనుబంధాన్ని అర్థం చేసుకోవచ్చు. రేవంత్ సొంత రాజకీయాలు నడుపుతూ టీడీపీ, కాంగ్రెస్ అనుబంధాన్ని బలంగా పెనవేస్తున్నా ఏం చేయాలో తెలియనిస్థితి కాంగ్రెస్ సీనియర్లది. రేవంత్ అధికారంలోకి రాగానే తన టీడీపీ బృందానికి మంత్రివర్గంలో, ప్రభుత్వ సలహా దారుగా, నామినేటెడ్ పోస్ట్‌లలో, పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో చోటు కల్పించారు. ఆ తర్వాత హై కమాండ్ ఈ స్పీడ్‌కు బ్రేక్ వేసింది. అయినా, రేవంత్ మాత్రం మొదటినుంచీ కాంగ్రెస్ విధానం అని కాకుండా టీడీపీతో తన సొంత అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు.
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ విజయానికి టీడీపీ మద్దతు దోహదం చేసింది. కాబట్టి హైకమాండ్ ఈ బంధాన్ని పట్టించుకోలేదు. కాంగ్రెస్ వ్యతిరేకతే మా మీడియా పాలసీ అని ఏకంగా కోర్టుకు అఫిడవిట్ ఇచ్చిన టీడీపీ మీడియాతో కాంగ్రెస్ సీఎం అనుబంధం కాంగ్రెస్ సీనియర్లకు కంటగింపుగా ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీది ఒకదారి, కాంగ్రెస్ సీఎంది సొంత దారి అన్నట్టుగా ఉన్నది. దేశంలో మూడు రాష్ర్టాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంటే కర్ణాటక, తెలంగాణనే చెప్పుకోదగ్గ పెద్ద రాష్ర్టాలు. కర్ణాటక కాంగ్రెస్‌లో రెండు ప్రధాన గ్రూపుల మధ్య పార్టీ భవిష్యత్తు డోలాయమానంలో పడిపోగా, మిగిలిన ఒక్క తెలంగాణ విషయంలో ఏం చేయాలో పాలుపోని స్థితిలో కాంగ్రెస్ హై కమాండ్ ఉన్నది. ఈ కాంగ్రెస్ డోలాయమాన స్థితి తెలంగాణలో రేవంత్‌కు కలిసి వస్తున్నది. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ అనుబంధం ఇలాగే కొనసాగుతుందా? ఎన్నికలకు ఇంకా మూడేండ్ల కాలం ఉన్నది. రాజకీయాల్లో మూడేండ్లు అంటే ఎక్కువ వ్యవధే. అంటే, ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం.
– బుద్దా మురళి