అది 2016 దూరాడి మాసం… ఎండ సెక చిటపటలాడుతున్న కాలం. తొగుట మండలం మల్లన్నసాగర్ పల్లెలు మంట మీదున్నయి. ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న వ్యథపరులు కడుపు రగిలి తిరుగుబాటు చేస్తున్న సందర్భం. భూ సేకరణకు వెళ్లిన ముత్యంరెడ్డి అనే ఆర్డీవో మీద జనం పెట్రోలు దాడికి తెగబడ్డరు. తిరుగుబాటులోనూ మానవత్వం మరవని ఆ.. జనమే మళ్లీ దాడికి అడ్డుపని నిలువరించారు.
ప్రాజెక్టు ఏదైనా కావచ్చు. భూములు గుంజుకుంటా అంటే బాధితుల్లో తిరుగుబాటు రాదా? తినే కూడు కాళ్ల తన్ని బంగారు పళ్లెంలో భూములు పెట్టి రాజ్యానికి అప్పగిస్తారా? నాగార్జునసాగర్ కట్టేటప్పుడు బాధితులు ఎదురు తిరిగిండ్రు. శ్రీశైలం, సింగూరు ప్రాజెక్టు కట్టినప్పుడు నిర్వాసితులు దుఃఖ భరితులై తిరగబడ్డరు. మల్లన్నసాగర్ కట్టేటప్పుడు ప్రజలు మర్లబడ్డరు. ఇప్పుడు వికారాబాద్ జిల్లా లగచర్ల, మంచిర్యాల జిల్లా వేంపల్లిలో కూడా అదే జరుగుతున్నది.
హరీశ్‌రావు కాళ్లకు గిరకలు కట్టుకొని తిరుగుతున్నడు. అప్పుడాయన నీళ్ల శాఖ మంత్రి. ముంపు బాధితులను, నిర్వాసితులను బతిలాడుతున్నడు, బామాడుతున్నడు. ఒప్పించేందుకు అవకాశం ఉన్న ప్రతి వనరును ఒడిసి పట్టుకుంటున్నరు. అట్లా ఓ సారి బ్రాహ్మణ బంజేరుపల్లి గ్రామస్థులను చర్చలకు పిలిచారు. ఊరు ఊరంతా కదిలింది. హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్ కమ్యూనిటీ హాలు చర్చా వేదిక. నేను అప్పుడు ఓ దిన పత్రికకు ఉమ్మడి మెదక్ జిల్లా బ్యూరో ఇన్చార్జిగా పనిచేస్తున్నాను.
జర్నలిస్టులకు అనుమతి లేదు కానీ, నేను, మరో జర్నలిస్టు సోదరుడు విష్ణువర్ధన్‌రెడ్డి గ్రామస్థుల్లో కలిసిపోయి చెరో మూలకు కూర్చున్నాం. గ్రామస్థుల కోసం జిల్లా కలెక్టర్ వాహనాలు ఏర్పాటు చేశారు కానీ, జనం ఎక్కటానికి నిరాకరించారు. ఆటోలు, ట్రాక్టర్లు ఏవి దొరికితే వాటి మీద వచ్చారు. వచ్చినవాళ్లకు హరీశ్ రావు స్వయంగా ట్రే పట్టుకొని, మంచినీళ్ల గ్లాసులతో వాళ్లకు ఎదురువెళ్లారు. నిజానికి ఆ పని నౌకర్లు చేయాలి. సిబ్బంది కూడా సిద్ధంగానే ఉన్నారు. కానీ, వాతావరణాన్ని చల్లబరుచుదామనుకున్నాడో ఏమో..! తనే నీళ్ల గ్లాసులు తీసుకొచ్చారు. అయినా జనం ఎడమ చేతితో కూడా గ్లాసులు ముట్టలేదు. అంతా వెళ్లి హాల్లో కూర్చున్నారు.
‘మాట్లాడుత అని పిలిచినవ్.. ఏం మాట్లాడుతవో మాట్లాడు’ పెడసరి తనంతోనే నిలదీసినట్టు అడిగారు. మహిళలే సమావేశ సరళిని లీడ్ చేస్తున్నారు. హరీశ్‌రావు వాళ్లకేదో చెప్పబోయారు. ఆడోళ్లంత గయ్యిని లేచి నిలబడ్డరు. అంతా గందరగోళం. ఓపికగా హరీశ్‌రావు వాళ్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రెండు గంటలు గడిచింది కానీ ఒక్కడుగు ముందుకు పడలేదు. చర్చల మధ్యలో (చర్చలు అనటం కంటే రభస అనడం కరెక్టు) తినటానికి గారెలు స్నాక్స్‌గా తెప్పించారు.
‘అక్కడ కొంపలు ముంచి, ఇక్కడ గారెలు పెడుతున్నవా’ అంటూ ఓ మహిళ గారెలు పెట్టిన పేపర్ ప్లేట్‌ను హరీశ్‌రావు మీదికి విసిరేసింది. (ప్లేట్ విసిరిన మహిళ రూపం, ఆ దృశ్యం ఇప్పటికీ నా మనసులో సజీవమే.) ఆ సంఘటనతో అందరూ అవాక్కైపోయారు. హరీశ్‌రావు మోములో ఏ ఆక్రోశము, అసహనమూ లేకుండా రెండు చేతుల దండం పెడుతూ.. ‘నీ ఆవేదన, ఆవేశం నాకు అర్థమవుతుందమ్మా’ అన్నారు. నాలుగు గంటలున్నారు గానీ, చర్చలేవీ ముందు పడలేదు. భూములు ఇచ్చేది లేదని తెగేసి చెప్పి వెళ్లిపోయారు.
అయినా అక్కడి ప్రజలను ఒప్పించే ప్రయత్నం మాత్రం ఆపలేదు. రెండు రోజులు ఆగి హరీశ్‌రావు మళ్లీ స్థానిక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిని తీసుకొని ముంపు గ్రామాలకు వెళ్లారు. బంజేరుపల్లి గ్రామస్థులను కలిశారు. తుక్కాపూర్ జనం సహకరిస్తున్న తీరు వాళ్లకు వివరించారు. రామలింగారెడ్డి వెంట ఉన్నారు కానీ, ఆయనదెప్పుడూ బాధిత పక్షమే. నోరు తెరిచి రాజ్యానికి మద్దతుగా మాట్లాడంగ చూడలేదు. ఆయన వెంట ఉండటం హరీశ్‌రావుకు ఒకరకంగా నష్టమే కానీ, లాభమైతే ఉండదు. బంజేరుపల్లిలో ఓ యాప చెట్టుకింద కూర్చున్నరు. ‘మా బాధ నీకొస్తే తెలుస్తది.
ఊరునిడిసి, గూడునిడిసి ఎల్లిపొమ్మంటున్నవు. మా బాధ దేవునికి సుతి మట్టదాయే, నీకు సుతి మట్టదాయే’ తలో తీరుగ ఎవరి ఆవేదనతో వాళ్లు ఎండగడుతున్న రు. ‘అనుభవించిన తల్లీ.. నీ బాధ నేనూ అనుభవించిన. తోటపల్లి రిజర్వాయర్ కింద మా భూములు మునిగినయి. కానీ, మీరు త్యాగం చేస్తేనే రాష్ట్రం బాగుపడుతది, పంట పొలాలకు నీళ్లు వస్తయి, రైతు ఆత్మహత్యలు ఆగుతయి’ వేడుకోలుగానే వివరణ ఇస్తున్నడు హరీశ్‌రావు. అక్కడ కూడా చర్చలు ముందు పడలేదు గానీ, కనీసం జనం కడుపు బాధ బయటికి కక్కేసిండ్రు. ఒకసారి జిల్లా కలెక్టర్‌ను వెంటబెట్టుకొని, మరోసారి స్థానిక ఎమ్మెల్యేను తీసుకొని, ఇంకోసారి జిల్లా ప్రజా ప్రతినిధులందరినీ తోడు తీసుకొని, మొత్తానికి ఆపకుండా తన ప్రయత్నం తాను చేస్తూనే ఉన్నడు. ఆరు నెలల తర్వాత ఎట్టకేలకు హరీశ్‌రావు ప్రయత్నాల్లో ఫలితం కనిపించింది.
మరోసారి బంజేరుపల్లి వాళ్లతో చర్చలు మొదలయ్యాయి. తొలిసారిగా వాళ్లు ‘ఎకరాకు ఎంత కట్టిస్తరు’ అని అడిగారు. రూ.4.50 లక్షల నుంచి బేరం మొదలైంది. అది రూ.5.75 లక్షల వరకు హరీశ్‌రావు ఓకే చెప్పారు. బాధితులు రూ.6 లక్షలు అన్నారు. చివరికి ఎకరాకు రూ.6 లక్షల చొప్పున భూములు ఇవ్వటానికి సిద్ధమయ్యారు. కానీ, ఒక కండిషన్ పెట్టారు. అసైండ్ భూములకు, లావుణీ పట్టాలకు, ఇనాం భూములకు, దళిత భూములకు ఒకటే ధర కట్టియ్యాలన్నారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ మీ పట్ల మానవతా దక్పథంతో ఉన్నారు. విషయం వారి దృష్టికి తీసుకువెళ్తాం’. అన్నారు హరీశ్‌రావు. వాళ్లలో కొంతమందిని ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు తీసుకువెళ్లారు. విషయం ఆయనకు వివరించారు.
‘వాళ్ల త్యాగాన్ని మనం వెల కట్టలేం.. ఎంత ఇచ్చినా తక్కువే, ఎకరానికి రూ.6 లక్షలు కాదు, అంతకంటే ఎక్కువే కట్టిద్దాం, అన్ని రకాల భూములకు ఇదే ధర, ఒక్కో కుటుంబానికి రూ.7.5 లక్షల ప్యాకేజీ, ప్లాట్లు తీసుకున్న వారికి ఇంటి నిర్మాణానికి రూ.5.04 లక్షలు, తీసుకోనివారికి ఆర్ అండ్ ఆర్ కాలనీలో డబుల్ బెడ్రూం ఇండ్లు, 18 ఏండ్లు నిండిన వారికి రూ.5 లక్షల ప్యాకేజీతో పాటు 250 గజాల ప్లాట్లను ఇద్దాం’
అనే కేసీఆర్ హామీతో బాధితులు ఆనందంతో భూములు ఇవ్వటానికి ముం దుకొచ్చారని చెప్పలేను కానీ, అయిష్టంతో అయి నా భూములు వదులుకోవటానికి సిద్ధపడ్డరని చెప్పగలను. ఇదీ నిర్వాసితులను ఒప్పించే తరీఖ. ఇప్పుడేం జరుగుతున్నది? దుద్యాల మండలంలోని లగచర్ల, హకీంపేట, పోలేపల్లి, రోటిబండతండా, పులిచర్లకుంట తండాల పరిధిలో సుమారు 1,375 ఎకరాల్లో ఫార్మా విలేజ్‌ను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. పంట పొలాల్లో ఫార్మా కంపెనీల ప్రతిపాదనే సోయి లేని నిర్ణయం. మూడు పంటలు పండే పంట భూముల్లో ఫార్మా కంపెనీలు పెడుతరా? పంట పొలాలను ఫార్మా విషంతో నింపాలనుకు నే ఈ పాలకులకు ఏమైనా ఆలోచన విధానం ఉన్న ట్టా? భూమే వాళ్లకు జీవనాధారం. అదే సాగు, అక్కడే సావు తప్ప వాళ్లకు ఇంకో పని రాదు. మరో ఉపాధి లేదు.
అటువంటి వాళ్ల భూములను బలవంతంగా గుంజుకుంటుంటే కడుపు మండిన రైతులు తిరగబడక, బంగారు పళ్లెంలో పెట్టి భూములు అప్పగిస్తారా? వికారాబాద్ జిల్లా లగచర్ల గిరిజన గ్రామాల్లో అదే జరిగింది. బాధాతప్త జనం తిరగబడ్డారు. అధికారుల మీద దాడి సమర్థనీయం కాదు. కానీ… ప్రైవేటు కంపెనీ కోసం కలెక్టర్ భూ సేకరణ చేయడం రాజ్యాంగబద్ధమా? ప్రైవేటు సంస్థలు కంపెనీ పెట్టాలనుకుంటే నేరుగా రైతుల వద్దకు వెళ్తాయి. రైతులతో బేరమాడి భూములు కొనుగోలు చేసుకుంటాయి. కానీ కలెక్టర్ భూసేకరణ చేయడం బ్రోకరిజం కిందికి రాదా? అది రాజ్యాంగ ఉల్లంఘన కాదా? మరో విషయం, గ్రామ సభ ఎక్కడ పెట్టాలి? గ్రామంలో పెట్టాలి, కానీ ఊరుకు రెండు కిలోమీటర్ల దూరంలో సభ పెట్టారంటేనే మీ విధానంలో లోపం ఉన్నదనే అర్థం.
ఇది కాదా నిబంధనల ఉల్లంఘన. చట్ట విరుద్ధంగా కలెక్టర్‌ను భూసేకరణకు పంపింది ఎవరు? దాన్ని వదిలేసి అమాయక గిరిజనుల మీద అర్ధరాత్రి దాడులకు తెగబడటం జన జీవన హక్కులకు విరుద్ధం. పాలకుని అవగాహన, ఆలోచనలతో అభివృద్ధి అనుసంధానమై ఉంటుంది. సరైన అవగాహన ఉన్నప్పుడు మంచి ఆలోచన వస్తుంది. మంచి ఆలోచనతో చేసిన పని అభివృద్ధికి పునాదులు వేస్తుంది. ఇక్కడో సంఘటన గుర్తుచేయాలి.
కేసీఆర్ తొగుట మండలంలోనే మల్లన్నసాగర్ నిర్మించటం వెనుక గొప్ప అధ్యయనం ఉన్నది. సాధారణ మనుషుల ఊహకు అందనంత అన్వేషణ ఉన్నది. అన్నిటింకీ మించి ఆత్మహత్యల తెలంగాణను ఆకుపచ్చ తెలంగాణగా మార్చాలనే సంకల్పం ఉన్నది. ప్రవాహ దిశను మార్చి నదిని నడిపించాలంటే సాధారణ విషయం కాదు.
అతి తక్కువ ఆస్తి నష్టంతో 50 టీఎంసీల జల భాండాగారం కట్టడం అంటే మాటలు కాదు. తొగుట మండలంలోని గ్రామాల్లో మల్లన్నసాగర్ ప్రాజెక్టు ప్రతిపాదించటానికంటే ముందే కేసీఆర్ వెయ్యి విధాలుగా ఆలోచన చేశారు. రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ సహాయం తీసుకున్నారు. శాటిలైట్ సర్వే చేయించారు. వ్యాస్కోప్ అధికారులను పిలిపించి అంచనాలు కట్టించారు. నీటి పారుదల నిపుణులతో ఎడతెగని చర్చలు పెట్టారు. చిట్టచివరికి అతి తక్కువ భూ నష్టంతో, కేవలం 12 గ్రామాల నిర్వాసితంతో భారీ ప్రాజెక్టును కట్టవచ్చని నిపుణులు చెప్పిన తర్వాత ఆయన ధైర్యంగా ముందడుగు వేశారు. అది లోక కల్యాణం కోసం.
ప్రైవేటు ఫార్మా కోసం భూమి పుత్రులను బలిపెట్టడమే సోయి తప్పిన నిర్ణయం. ప్రాణం పోయినా భూములు ఇచ్చేది లేదని మర్లబడ్డ రైతులకు సంకెళ్లు వేసి జైలుకు పంపడం ఇంకా విషాదం. భూ నిర్వాసితులకు ప్రభుత్వం నచ్చజెప్పాలి. బాధితులకు ఉద్యోగ కల్పన, పునరావాస హామీలు ఇవ్వాలి. వారిని ఒప్పించి, మెప్పించి భూ సేకరణ చేయాలి.
కానీ తొక్కు తా.. పేగులు మెడలో వేసుకొని భూములు గుంజుకుంటా అనో, వేంపల్లి, పోచంపాడు తరహాలో మెడ మీద కత్తి పెట్టి ఇస్తారా? చస్తారా? అని గుంజుకుంటా అని రైతాంగాన్ని బెదిరించడం ప్రజాస్వామ్యం అవుతుందా? రైతుల చేతులకు సంకెళ్లు వేసి జైళ్లో నిర్బంధించడాన్ని పౌర సమాజం హర్షిస్తుందా? ప్రజలెప్పుడూ బలహీనులు కారు. వారిలో ఉద్యమ చైతన్య కదలికలు వచ్చేవరకే పాలకుల ఆటలు సాగుతాయి. పంజాబ్‌లో రైతులు తిరగబడితే మోదీ అంతటివారే వెనుకడుగు వేశారు. రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నారు. రాజ్యాన్ని అడ్డం పెట్టుకొని, పోలీసులను ప్రైవేటు సైన్యాలుగా చేసుకొని, రజాకార్ల పాలన చేస్తే మరో వీర తెలంగాణ సాయుధ పోరాటానికి అంకురార్పణ జరగక తప్పదు.
లగచర్ల గాయం మానకముందే మంచిర్యాల జిల్లా వేంపల్లి, పోచంపాడు రైతన్నల మీద పడ్డారు. ఇండస్ట్రియల్ పార్క్ కోసం 276 ఎకరాలు కేటాయించింది. అక్కడి రైతులను భయభ్రాంతులకు గురిచేసి బలవంతంగా సంతకాలు తీసుకుంటున్నారని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి.
– వర్ధెల్లి వెంకటేశ్వర్లు