BRS | బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే ? కొన్ని రోజులుగా కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం ఇది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ సర్కిళ్లలో, ప్రజల్లో ఇదే హాట్‌టాఫిక్‌గా మారింది. ఎక్కడ చూసినా ఈ చర్చే జరుగుతున్నది. దీంతో అటు బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తల్లో కూడా ఒక అయోమయం నెలకొన్నది. మరి ఇదంతా నిజమేనా? కాంగ్రెస్ లేదా కాంగ్రెస్ అనుకూల మీడియా, యూట్యూబ్ చానెల్స్ చేస్తున్న ప్రచారం కరెక్టేనా? అంటే కచ్చితంగా కాదు. కేవలం పొలిటికల్ మైలేజీ కోసమే ఇలాంటి దుష్ప్రచారం జరుగుతున్నట్టు స్పష్టంగా తెలిసిపోతున్నది.
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటి అనేందుకు ఒక్కటంటే ఒక్క ఆధారమైనా ఉన్నదా? కేవలం ఊహాజనితమైన అంశాలతో పక్కాగా ఈ ప్రచారాన్ని స్టార్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు, అదే విధంగా ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి మరికొంతమందిని అరెస్ట్ చేయటం లేదని అందుకే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటంటూ వితండ వాదాన్ని మొదలుపెట్టాయి. బీజేపీ అధ్యక్షుడి మార్పులో కేసీఆర్‌కు హస్తం ఉందంటూ తలాతోక లేని వాదనను సోషల్ మీడియాలో ప్రచారంలో పెట్టింది. ఈ కారణాలతో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటైతే మరి ఇంతకన్నా ఎక్కువ కారణాలను చూపించి కాంగ్రెస్, బీజేపీ ఒక్కటి అని చెప్పే చాలా అంశాలున్నాయి.
ముఖ్యంగా అవినీతి కేసుకు సంబంధించి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీపై కూడా నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక విషయంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి సోనియా, రాహుల్ గాంధీలను కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రశ్నించటం కూడా జరిగింది.
సోనియాగాంధీ, రాహుల్ గాంధీని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదంటే కాంగ్రెస్, బీజేపీ కూడా ఒక్కటయ్యాయని అనాలా? కాంగ్రెస్ పార్టీలో కూడా అధ్యక్ష పదవి విషయంలో చాలా చర్చలే జరిగాయి. చివరకు రాహుల్‌గాంధీ ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. గాంధీ కుటుంబాన్ని కాదని వేరే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పజెప్పటం చూస్తుంటే అది బీజేపీకి మేలు చేసినట్టు కాదా? అంటే ఈ విషయంలో మోదీ హస్తం ఉన్నట్టు భావించాలా? ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చేస్తున్న వాదన పరిశీలిస్తే మాత్రం కచ్చితంగా కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని చెప్పాలి.
కాంగ్రెస్, బీజేపీ బంధానికి సంబంధించి రాష్ట్రంలో చాలా సంఘటనలను మనం ఉదాహరణలుగా తీసుకోవచ్చు. ముఖ్యంగా గత లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ స్థానాల ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై బీఆర్ఎస్ను ఓడించాయి. నిజానికి కాంగ్రెస్, బీజేపీ ఈ దేశంలో ఒక్కటవుతాయని ఎవ్వరూ ఊహించరు. కానీ బీఆర్ఎస్ను ఓడించాలన్న క్రమంలో నీతి తప్పాయి. ఎవ్వరూ ఊహించని విధంగా లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయి. అవి మాత్రమే కాదు హుజురాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల్లో ఏం జరిగింది. బీఆర్ఎస్ను ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీ ఒక్కటి కాలేదా? ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలే బహిరంగంగా మీడియా ముందే ఆరోపించారు. ఒక్క తెలంగాణలోనే కాదు దేశంలో చాలా ప్రాంతాల్లో అక్కడున్న బలమైన పార్టీలను ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటైనాయి. కానీ బీఆర్ఎస్ ఆవిధంగా అటు కాంగ్రెస్‌తో గానీ బీజేపీతో గానీ మిలాఖత్ అయిన సంఘటన ఒక్కటంటే ఒక్కటి లేదు. అయినా సరే ఓ పథకం ప్రకారం బీజేపీతో బీఆర్ఎస్కు దోస్తి ఉందనే తొండిమాటను కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నది.
ఇది నిజం కాదని తెలిసీ కాంగ్రెస్ ఎందుకు ఇలాంటి ఓ ప్రయత్నం చేస్తున్నది? ఇది కాంగ్రెస్‌కు పాతకాలం నాటి రాజకీయ ఎత్తుగడే. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్యే పోటీ ఉందన్నట్టు సీన్ క్రియేట్ చేసే ప్రయత్నం. అలా చేస్తే బీఆర్ఎస్ను బీజేపీని వ్యతిరేకించే వాళ్ల ఓట్లు తమకే పడతాయన్న భావన. ఇక బీఆర్ఎస్ను ఓడించాలంటే కాంగ్రెస్‌కు ఇప్పుడు పోటీలో మరో పార్టీ ఉండకూడదు. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బలమైన ఓటు బ్యాంక్ ఉన్నది. ఆ ఓటు బ్యాంక్‌ను కదిలించే పరిస్థితి లేదు. మరి కాంగ్రెస్ అక్కడోటి, అక్కడోటి గెలవాలంటే మిగతా ఓట్లన్నీ తమకే పడాలనేది వ్యూహం. బీజేపీకి ఉన్న చిల్లర మల్లర ఓటుబ్యాంక్‌ను తనవైపు తిప్పుకోక పోతే కాంగ్రెస్‌కు గెలుపు సాధ్యమయ్యే పని కాదు. అందుకే పథకం ప్రకారం తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది. అదే విధంగా షర్మిల పార్టీకి వచ్చే ఓట్లను కూడా తమ ఖాతాలో వేసుకునేందుకు ఆ పార్టీని విలీనం చేసుకునే ప్రయత్నం కూడా జరుగుతోంది. అంటే సొంతంగా గెలిచే పరిస్థితి లేని కారణంగానే ఇలా ఓ తప్పుడు దారిని కాంగ్రెస్ ఎంచుకున్నదన్నది స్పష్టంగా తెలిసిపోతోంది.
బీజేపీతో బీఆర్ఎస్ లాలూచీ పడ్డట్టు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నేతలు ఇక్కడే చిన్న లాజిక్‌ను మర్చిపోయారు. అలాంటి లాలూచీ అవసరమనుకుంటే కేసు బయటకు రాకముందే ఆ పనిచేసి ఉండవచ్చు కదా? అసలు బీజేపీతో సై అంటే సై అంటూ ఈ దేశంలో మోదీని ఎదిరించిందే కేసీఆర్.
ఆయన చేస్తున్న దాడి కారణంగానే లిక్కర్ కేసు, మంత్రుల పై ఈడీ దాడులు, ఐటీ దాడులు అనేవి మొదలైనవి. అయినా సరే కేసీఆర్ ఏకంగా మోదీని ఎదుర్కొంటున్నారు. దేశానికి కాంగ్రెస్, బీజేపీలేని నాయకత్వం కావాలంటూ బీఆర్ఎస్ను దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్రంలోని మోదీ సర్కార్ బీఆర్ఎస్ పై కక్ష కట్టిన విషయం అందరికీ తెలిసిందే. కేసుల పరంపర మొదలైన తర్వాత కూడా మోదీ సర్కార్ పై అదే స్థాయిలో దాడి చేస్తున్నది ఒక్క బీఆర్ఎస్ మాత్రమే. దేశంలో చాలా పార్టీలు మోదీ, ఈడీలకు భయపడి ఆయనకు లొంగిపోయినప్పటికీ బీఆర్ఎస్ మాత్రం ఆ పని చేయలేదు. రెండు, మూడు రోజుల క్రితం రాష్ర్టానికి వచ్చిన మోదీ మరోసారి బెదిరింపులకు దిగినప్పటికీ డోంట్‌కేర్ అంటూ మోదీ వైఖరిని ఎండగట్టింది బీఆర్ఎస్. ఇక్కడ విచిత్రమేమిటంటే ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చి కాంగ్రెస్‌ను ఒక్కమాట అనలే. అదేవిధంగా అంతకుముందు రాష్ర్టానికి వచ్చిన రాహుల్‌గాంధీ కూడా మోదీ మాట ఎత్తలేదు. అంటే కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటి అనాలా? అసలు తెలంగాణలో ఏ పార్టీకైనా సరే పోటీ బీఆర్ఎస్తోనే అందుకే ఆ పార్టీని టార్గెట్ చేస్తున్నాయి. అదే విధంగా బీఆర్ఎస్కు కూడా రాష్ట్రంలో కాస్తో, కూస్తో బీజేపీ, కాంగ్రెస్ తోనే పోటీ. అలాంటిది పోటీ ఉన్న పార్టీతో ఒక్కటవటం ఎలా సాధ్యమన్నది ఆలోచించాలి.
ఈ తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో కాంగ్రెస్ సహా వారికి మద్దతిస్తున్న మీడియా, యూట్యూబ్ చానెల్స్ అసలు లాజిక్‌ను పక్కనపెట్టి కన్ఫ్యూజ్ చేస్తున్నాయి.పోటీ ద్విముఖంగా ఉండవద్దని త్రిముఖ పోటీయే తనకు మేలని బీఆర్ఎస్ భావిస్తోందని ఇటీవలే ఆంధ్రజ్యోతిలో ఓ కథనం రాశారు. మళ్లీ వాళ్లే బీజేపీతో బీఆర్ఎస్ ఒక్కటైందని రాస్తున్నారు. నిజంగా బీజేపీతో బీఆర్ఎస్ ఒక్కటైతే ఆ అడ్వాంటేజ్ అంతా కాంగ్రెస్‌కే పోతుందన్నది సాధారణ వ్యక్తులకు కూడా తెలిసిన విషయమే. మరి అపర చాణక్యుడైన కేసీఆర్‌కు ఇంత చిన్న విషయం తెలియదా?
ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బలమైన ఓటు బ్యాంక్ ఉన్నది. ఆ ఓటు బ్యాంక్‌ను కదిలించే పరిస్థితి లేదు. మరి కాంగ్రెస్ అక్కడోటి, అక్కడోటి గెలవాలంటే మిగతా ఓట్లన్నీ తమకే పడాలనేది వ్యూహం. బీజేపీకి ఉన్న చిల్లర మల్లర ఓటుబ్యాంక్‌ను తనవైపు తిప్పుకోక పోతే కాంగ్రెస్‌కు గెలుపు సాధ్యమయ్యే పని కాదు.