తెలంగాణ కాంగ్రెస్ వాదులకు సీమాంధ్ర ధనిక వర్గాల పట్ల కాంప్రడారిజం 1956లో రెండు ప్రాంతాల విలీనం నాటికే మొదలైంది. అప్పటి నుంచి 2014 వరకు 58 సంవత్సరాల పాటు కొనసాగిన ఆ జీ హుజూర్ లక్షణాలు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత సైతం కొనసాగుతుండటం గమనించదగ్గది. అది తాజాగా నదీ జలాల విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆయన మంత్రులు, తక్కిన కాంగ్రెస్ వాదుల వైఖరి మూలంగా స్పష్టమవుతున్నది.
చర్చలోకి వెళ్లే ముందు కాంప్రడార్ అనే మాటకు అర్థమేమిటో తెలుసుకోవాలి. ఈ పదం ప్రపంచమంతటా పాశ్చాత్య దేశాల వలస పాలనలు, దోపిడీలు సాగుతుండిన కాలంలో ఉపయోగం లోకి వచ్చి ంది. వలస పాలకులకు, వారి కంపెనీలకు పెట్టుబడులు, వాణిజ్యం, ఆర్థిక, రాజకీయ ఆధిపత్యాలు, దోపిడుల విషయంలో ఏజెంట్లుగా వ్యవహరించేవారు కాంప్రడార్లు అయ్యారు. ఏజెంట్ అనేది మనకు తెలిసిన కమీషన్ ఏజెంట్ అని కాదు. తమ దేశ ప్రయోజనాలను వదిలివేసి అందుకు ఉపయోగపడేవాడు అని. అట్లా ఉపయోగపడే క్రమంలో కాంప్రడార్లు ఆర్థికంగా, స్థానిక అధికారంలో, ఇతరత్రా కూడా లాభపడ్డారు.
అటువంటి ఏజెంట్ల వర్గాన్ని కాంప్రడార్ తరగతి అన్నారు. కాంప్రడార్లకు విరుద్ధ స్వభావం గలవారు స్వదేశ ప్రయోజనాల కోసం, తమ ప్రజల కోసం పోరాడతారు, నిలబడతారు. త్యాగాలకూ సిద్ధపడతారు. వలసల కాలంలో వారిని దేశ భక్తులని, జాతీయ బూర్జువాలని అన్నారు. ఇవే నిర్వచనాలను కొంత పొడిగించి చెప్పాలంటే కాంప్రడార్లకు ప్రాతినిధ్యం వహించే రాజకీయ పార్టీలు (అటువంటివి అన్ని సందర్భాల్లో లేవు) ఉండి ఉంటే, వాటిని కాంప్రడార్ పార్టీలని, అందుకు విరుద్ధమైన వాటిని దేశ భక్త పార్టీలని, జాతీయ బూర్జువా పార్టీలని అన్నారు.
ఈ నిర్వచనాలను ఇపుడు నదీ జలాల అంశానికి వర్తింపజేసి చూడండి. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల మధ్య నదీజలాల అవసరాలు, వినియోగం, పంపిణీలు 1956 నుంచి ఏ విధంగా ఉండేవి? తెలంగాణ ఉద్యమాలు ముందుకు వచ్చినపుడల్లా అందు గురించిన వివాదాలు, చర్చలు ఏమిటి? చివరకు 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక 2023 వరకు కేసీఆర్ నాయకత్వాన బీఆర్ఎస్ పాలించిన కాలంలో ఏమి జరిగింది? ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ హయాంలో ఏమి జరుగుతున్నది? అనేవి ప్రశ్నలు.
ఈ నాలుగు దశల వివరాలన్నీ తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా రైతాంగం, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ పైన ఆధారపడిన వ్యవసాయ కూలీలు, వివిధ వృత్తులపైన ఆధారపడిన వారికి తెలిసినవే. తిరిగి ప్రస్తుతం గత వారం పది రోజులుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మంత్రి వర్గ సభ్యులు, వారి తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకవైపు ఏమంటున్నారో, మరొకవైపు ఇటు నుంచి రేవంత్ రెడ్డి, ఆయన సహచర మంత్రులు, పార్టీవాదుల వైఖరి ఏమిటో రోజువారీగా చూస్తున్నాము. ఈ విషయాలన్నింటిపై, బీఆర్ఎస్ నాయకులతో పాటు, తెలంగాణకు చెందిన జల వ్యవహారాల నిపుణులు సుదీర్ఘమైన విషయ నిరూపణలు చేస్తున్నారు.
అందువల్ల ఇక్కడ ప్రధానంగా, మొదటి నుంచి తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌వాదులు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రయోజనాలు, స్వభావాలను, అందుకు మూలమైన పరిస్థితులను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిద్దాము. అదేమిటో పైన ‘కాంప్రడారిజం’ అనే మాట ద్వారా సూచన ప్రాయంగా చెప్పిందే. దానిని ఎంతగా అర్థం చేసుకుంటే, కాంగ్రెస్‌వాదుల స్వభావం, వ్యవహరణలు 1956 నుంచి ఈ 2025 వరకు 69 సుదీర్ఘ సంవత్సరాలుగా కాంప్రడార్ ధోరణిలోనే ఎందుకు ఉంటూ వస్తున్నదనేది బోధపడదు.
దీనికి మూలాలు తెలంగాణలోని వందల సంవత్సరాల ఫ్యూడల్ ముస్లిం పాలనలు, వెనుకబాటుతనాలలో ఉన్నాయి. అప్పటి ప్రభువులకు తామిచ్చిన జమీందారీలను, స్థానిక పెత్తందారీలను అనుభవిస్తూ, కప్పాలను చెల్లిస్తూ అవసరమైనప్పుడు సైన్యాలను సమకూర్చుతూ, తమకు విధేయులుగా ఉండేవారు అవసరమయ్యారు. అనగా, తమపై ఆధారపడటం తప్ప స్వతంత్రం ఉండకపోవటమన్నమాట. దీనిని అకడమిక్ పరిభాషలో డిపెండెన్స్, డిపెండెంట్ క్లాస్ అంటారు. ఆ కాలంలో వ్యవస్థలు, వాటి నిర్వహణలు అటువంటివి.
ఇందులో ముఖ్యంగా గుర్తించవలసిందేమంటే, ఆ కాలంలో కూడా తెలంగాణ మీదుగా కృష్ణా, గోదావరులు ప్రవహిస్తూ, కాకతీయుల కాలం నుంచి గల భారీ చెరువులు ఉండినా, ఖనిజాలు, అడవుల వంటి ప్రకృతి వనరులు ఎన్ని ఉన్నా, మొత్తం మీద వాటిని తగినంత మేర వినియోగంలోకి తెచ్చి, అప్పటి భూస్వామ్య ప్రభువులు ఆర్థికంగా అందుకు తగినట్లు ఎదగలేకపోయారు. వారి ఏజెంట్లు అయిన జమీందార్ల పరిస్థితి అదే. అది ఏ మేరకు జరిగి ఉంటే ఆ మేరకు ఆ ఏజెంట్లలో స్వతంత్ర భావనలు చోటుచేసుకోవటం, హైదరాబాద్ ప్రభువులపై డిపెండెన్సీ తగ్గటానికి అవకాశాలు ఏర్పడటం జరిగేది. అట్లా వారి మనుగడ ఆర్థికంగానే గాక, రాజకీయంగా కూడా ఫ్యూడల్ డిపెండెన్సీ పరిధిలో కొనసాగింది. సాలార్ జంగ్ ప్రవేశపెట్టిన సంస్కరణలు కూడా పెద్ద తేడాను తేలేదు.
ఆ పరిస్థితుల మధ్య 1948లో నిజాం రాజ్యం పోయి, హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడి, భారతదేశం కూడా ఆధునిక రాజ్యాంగ వ్యవస్థలోకి ప్రవేశించింది. 1948 నుంచి 1956 వరకు స్వతంత్రంగా ఉండిన హైదరాబాద్ అదే విధంగా కొనసాగి ఉంటే, అప్పటి కాంగ్రెస్ నాయకత్వాన వెనుకటి ఫ్యూడల్ వర్గాలు, స్వల్ప స్థాయిలో ఉండిన పారిశ్రామిక, వాణిజ్య వర్గాలు ఏ విధంగా ఎదిగేవి? ఈ కొత్త పరిస్థితులలో డిపెండెన్సీ అవసరం రాజకీయంగా కాని, ఆర్థికంగా కాని అవసరం లేదు గనుక, తెలంగాణకు అపారంగా ఉండిన సహజ వనరులను క్రమంగా వినియోగంలోకి తెస్తూ, స్థూలంగా జాతీయ బూర్జువాజీ అనే నిర్వచనం ప్రకారం తెలంగాణలో స్థానిక బూర్జువాజీ ఎదిగేదననుకోవాలి. తెలంగాణ ప్రయోజనాలలోనే తమ ప్రయోజనాలు కూడా ఇమిడి ఉన్నాయని భావించి, అందుకు విరుద్ధంగా వ్యవహరించే సీమాంధ్ర ధనిక వర్గాలకు లొంగకుండా, అటువంటి ప్రయత్నాలు అటువైపు నుంచి జరిగితే బలంగా ఎదుర్కోవటం తప్పక జరిగేది.
కానీ వారిలో పాత డిపెండెన్సీ లక్షణాలు ఇంకా పోనందున, కొత్త స్పృహ రానందున, 1956 వచ్చేసరికి సీమాంధ్ర ధనిక వర్గాలకు, వారి రాజకీయ ప్రాబల్యానికి లొంగిపోయారు. 1948-56 కాలపు స్వతంత్రాన్ని, భవిష్యత్తులోనూ స్వతంత్రంగా ఎదిగే అవకాశాలను, తెలంగాణను స్వతంత్రంగా అభివృద్ధి పరచగల ఆస్కారాన్ని వదులుకొని, ఆంధ్ర రాష్ట్రంలో విలీనమయ్యారు. వారిలో కొత్త స్పృహ కలిగి ఉంటే, కేంద్రం వత్తిడికి, ఆంధ్రుల చాణక్యానికి లొంగేవారు కాదు. ఆ విధంగా, ఆర్థిక-రాజకీయ ఆధిక్యత లేక సీమాంధ్ర ధనిక వర్గాలపై డిపెండెంట్లుగా మారారు. అనగా డిపెండెన్సీ నుంచి, స్వతంత్రం నుంచి తిరిగి డిపెండెన్సీ అన్న మాట. తమ తెలంగాణ పట్ల భక్తి, కొత్త స్పృహ లేనందున పాత డిపెండెన్సీ కొత్త డిపెండెన్సీకి బదిలీ అయ్యింది. మరొక విధంగా చెప్పాలంటే, ఆ వర్గాల నియంత్రణలో గల రాజకీయ పదవులు, ఆర్థిక అవకాశాల కోసం దేబిరిస్తూ, మోచేతి నీళ్లు తాగుతూ వారి వద్ద పడి ఉండటమన్న మాట. అంతిమంగా తెలంగాణ ప్రయోజనాల కోణం నుంచి చూసినపుడు, అది కాంప్రడార్ వేషధారణ రెండవ అధ్యాయం అయింది.
ఆ విధమైన పతనం అంతటితో ఆగలేదు. సీమాంధ్ర ప్రాబల్య వర్గ దోపిడీని, ఒప్పందాల బుద్ద్ధిపూర్వక ఉల్లంఘనలను, కొనసాగుతున్న వెనుకబాటుతనాన్ని గుర్తించిన తెలంగాణ ప్రజలు ఉద్యమాలు జరపగా, ఈ డిపెండెంట్ తరగతిలోని కాంప్రడార్ అవతారం మరో ముందడుగు ముందుకు వేసింది. తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా అవతలి వారితో కుమ్మక్కు అయి, కొల్యూడింగ్ క్లాస్‌గా తయారైంది. తమ ప్రజల కోసం అవతలి వారితో ఘర్షణ పడటానికి బదులు, అవతలి వారి ప్రయోజనాల కోసం, పనిలో పనిగా తాము కొంత లాభపడేందుకు, ప్రతిసారి తమ వారినే అణచివేసింది. అణచివేత ఏజెంటుగా పని చేసింది. ఇదే కథ 2014 వరకు సాగింది. గతంలో వలస దేశాలలోనూ ఇదే విధమైన కుమ్మక్కు తరగతులు తయారయ్యాయి. ఇది ఇండియాలోనూ కనిపించింది.
పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో గాని పోవన్నట్లు, స్వతంత్ర భావనలన్నవే ఏ దశలోనూ ఏర్పడని తెలంగాణ కాంగ్రెస్ గాని, అందులో మరింత అధమ శ్రేణికి చెందిన రేవంత్ రెడ్డి గాని, ఇపుడు తెలంగాణకు ప్రాణప్రదమైన జల వనరుల విషయమై, తమ కాంప్రడారిజాన్ని సాగిస్తూ, సీమాంధ్ర ప్రభువులకు ఊడిగం చేయజూస్తున్నారు. దీనిని మరొక మారు వమ్ము చేయగలవారు తెలంగాణ రైతులు, ప్రజలే.
– టంకశాల అశోక్