‘పెండ్లి చెయ్యడమంటే చేతకాదుగానీ, చెడగొట్టడమంటే అదెంతపని’ అనేది మాయాబజార్ సినిమాలో ఓ డైలాగ్. ఇది ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్‌కు అచ్చంగా సరిపోతుంది. నీటిగోసతో అలమటించే కరవు నేలకు జలాలను మళ్లించి, దండగన్న సాగును పండుగలా చేసేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన మేధోమథనం ఫలితంగా ఆవిర్భవించిన కాళేశ్వర జలాశయాలను రకరకాల సాకులతో ఈ సర్కార్ పక్కనబె ట్టింది. బీఆర్ఎస్ హయాంలోనే దాదాపు పూర్తికావచ్చిన పాలమూరు ప్రాజెక్టులోని కొద్దిపాటి మిగులు పనులను గాలికి వదిలేసింది.
నీటిపారుదల రంగంలో ఏ పని ముట్టుకుంటే ఎక్కడ కేసీఆర్‌కు పేరు వస్తుందోననే దుగ్ధతో ఈ సర్కా ర్ వ్యవహరిస్తుండటం వల్ల జలకళతో మురిసిన తెలంగాణ ఇప్పుడు నీటిగోస పాలవుతున్నది. కేసీఆర్ హయాంలో చెరువులు, కుంటలను బరాజ్‌ల నీళ్లతో నింపడం వల్ల ఉబికి వచ్చిన భూగర్భజలాలు..ఇపుడు మారిన పరిస్థితుల్లో పాతాళానికి పడిపోతున్నాయి.
బోర్లు వేసినా ఫలితం దక్కటం లేదు. పంటలకు నీరు లేక క్రాప్ హాలిడేస్ ప్రకటించే పరిస్థితి వచ్చింది. ఇలా బరాజ్‌లను నిర్లక్ష్యం చేస్తూ నీటిగోస తెచ్చిపెట్టిన కాంగ్రెస్ సర్కార్..మరోవైపు ఇసుకాసురుల ఇష్టారాజ్యానికి తలుపులు బార్లా తెరిచి మరోరకం సమస్య సృష్టిస్తున్నది. జలాశయాల్లోని ఇసుకను తరలించే ముఠాలతో చేతులు కలిపి ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నది. అధికారం అండ ఉంటే ఆపేది ఎవరు అనే రీతిలో ఇసుక మాఫియా యథేచ్ఛగా వ్యవహరిస్తుండటం గమనార్హం. పెద్దఎత్తున ఇసుక తరలింపు బరాజ్‌ల భద్రత రీత్యా ఆమోదయోగ్యం కాదనేది తెలిసిందే. వివిధ బరాజ్‌ల వద్ద ఇసుక తోడటం ద్వారా వాటి మనుగడకు ముప్పు తీసుకొచ్చే చర్యలు కూడా ఎందుకు చేపడుతున్నారనేది ప్రశ్న. కాంగ్రెస్ పెద్దలు, అధికారులు, కాంట్రాక్టర్లు ముప్పేటగా కలిసి మూకుమ్మడిగా ఇసుక దోపిడీకి పాల్పడుతుండటం దారుణం.
కాంగ్రెస్ హయాంలో ఇసుక మాఫియా ఆగడాలు ఇప్పటికిప్పుడు వచ్చినవి కావు. ఇరవై ఏండ్ల క్రితం హైదరాబాద్ నగరం నుంచి యాదాద్రి వైపు వెళ్తే..ఇసుక యథేచ్ఛగా తోడిపోయటం వల్ల మట్టి మేటవేసిన జలవనరులు దారిపొడవునా కనిపించేవి. కానీ కేసీఆర్ హయాంలో నీరు పారడంతో వాటి తీరు మారింది. కానీ ఇప్పుడు ఇసుక కథ మళ్లీ మొదటికొచ్చింది. కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన తర్వాత వాగులను అడ్డాగా చేసుకుని అక్రమార్కులు బరితెగిస్తున్నట్టు వార్తలు వెలువడుతూనే ఉన్నాయి. ఆఖరికి వాగులపై గత ప్రభుత్వం నిర్మించిన చెక్‌డ్యామ్‌లను సైతం ఇసుక కోసం పేల్చివేస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో చెక్‌డ్యామ్‌ల కూల్చివేతపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది.
ఈ ఇసుక దోపిడీపై నీటిపారుదల అధికారులు ఫిర్యాదులు చేయరు. ఒకవేళ చేసినా పోలీసులు స్పందించరు. దీంతో పెద్ద తలకాయలు ఇసుక మాఫియా కొమ్ముకాస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూలిన చెక్‌డ్యామ్‌ల తీరు చూస్తుంటే వాటిని కుట్రపూరితంగా పేల్చివేసినట్టు స్పష్టమవుతున్నదని ఇరిగేషన్ నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలక పెద్దలు రైతులకు నీళ్లు ఇచ్చేందుకు కొత్తగా చెక్‌డ్యామ్‌లు నిర్మించకపోగా, ఉన్నవి కాపాడలేకపోతున్నారు. ఇసుక అక్రమార్కులు రైతుల నోట్లో మట్టికొడుతుంటే చోద్యం చూస్తున్నారు. ప్రధానంగా కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల పరిధిలో ఇసుక మాఫియా ఆగడాలకు అంతులేకుండాపోయింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతీ వర్షపు నీటిబొట్టును ఒడిసిపట్టి రైతులకు అందించాలనే సంకల్పంతో చెక్ డ్యామ్‌ల నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా మానేరు, మున్నేరు, ఆకేరు, పాలేరు, స్వర్ణ, పెద్దవాగు, కూడవెల్లి, చలివాగు, నారింజవాగు, బొగ్గులవాగు వంటి ముఖ్యమైన వాగులపై 1100 చెక్‌డ్యామ్‌లు నిర్మించింది. ఒక్క మానేరు నది మీదనే 114 చెక్‌డ్యామ్‌లు వెలిశాయి. మేజర్, మీడియం, మైనర్ ప్రాజెక్టులతో వీటిని అనుసంధానం చేసి, క్రమం తప్పకుండా నీటిని విడుదల చేసింది. చెక్‌డ్యామ్‌ల వద్ద నిల్వ అయిన నీటిని చూసి రైతులు సంబురాలు చేసుకున్నారు.
ఈ సర్కార్ హయాంలో ఇసుక మాఫియాకు పం డుగలా మారింది. చెక్‌డ్యామ్‌ల వద్ద మేటలు వేసిన ఇసుక వారి లాభాల వేటకు బలవుతున్నది. సిద్దిపేట జిల్లా మోయతుమ్మెద వాగుపై 19 రీచ్‌లు పెట్టి తవ్వకాలు జరుపుతుండటం భారీ ఇసుకదోపిడికి నిదర్శనం. జలప్రవాహమే ఇసుక తయారీకి మూలం. ముందుచూపు లేని కాంగ్రెస్ సర్కార్ నీటి ప్రవాహాలు లేకుండా చేసి, ఉన్న ఇసుకను పందేరం చేస్తున్నది. ఏకకాలంలో అటు నీటి గోసకు, ఇటు ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నది.