ఆరూ గ్యారెంటీలు ఆవిరి జేసిన్రూ
అడ్డగోలు హామీలు గంగల కలిపిన్రూ
గాలి గాలి మాటలతో గత్తర లేపిన్రూ
రోతపుట్టే మాటలతో రోజులు గడిపిన్రూ
మోఖా జూస్తిరిదోఖా జేస్తిరి
కన్ను మూసి తెర్సే వరకు మొత్తం దోస్తిరీ
మాయజేస్తిరీ మత్పరిస్తిరీ
అందమైన తెలంగాణనాగం జేస్తిరీ
తొండి చేసినరు కొడుకా
మొండి చెయ్యి చూపినరు కొడుకా
ఇందిరమ్మ రాజ్యమని కొడుకా
నిండా ముంచినరు కొడుకా
గల్లీ కాంగ్రెస్ మాటనమ్మరని
ఢిల్లీ పెద్దల తీసుకొస్తిరి
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ
బాధ్యత తమదని బాస జేసిరీ
తల్లి తోడని.. పిల్లితోడని
బాండు పేపర్లు భలే రాస్తిరి
వంద రోజుల్లో అమలు చేస్తమని
బొంకులాడితిరి.. బొందబెట్టితిరి
తొండి చేసినరు కొడుకా
మొండిచెయ్యి చూపినరు కొడుకా
ఇందిరమ్మ రాజ్యమని కొడుకా-
నిండముంచినరు కొడుకా
దండి మోసగాళ్లు కొడుకా
దండు పాళ్యం బ్యాచురా కొడుకా
మహాలక్ష్మి పథకమంటిరీ
మహిళల ఓట్లను కొల్లగొడితిరీ
ప్రతినెల ఇరవై ఐదు వందలని
కల్లబొల్లి మాటలు భలే చెప్తిరి
గెలిచినంక దాని ఊసే లేదు
ఇద్దామన్న రోఖే లేదు
నమ్మినోల్లను నిండాముంచితిరి
అడిగినోల్లనూ అణగదొక్కితిరి
తొండి చేసినరు కొడుకా
మొండిచెయ్యి చూపినరు కొడుకా
ఇందిరమ్మ రాజ్యమని కొడుకా
నిండా ముంచినరు కొడుకా
కన్నకొడుకు వలే కేసీఆరు
కాచుకున్నడు అవ్వతాతలను
రెండు వందల ఆసర పింఛను
రెండు వేలకు పెంపు జేసినడు
నాలుగు వేలు మేమిస్తామని
గాలి మాటలతో గారడీ చేస్తిరి
ముసలోళ్ల ఆశలు వమ్ము జేస్తిరి
వాళ్ల బోసినోళ్లలో దుమ్ముకొడితిరి
తొండి చేసినరు కొడుకా
మొండిచెయ్యి చూపినరు కొడుకా
ఇందిరమ్మ రాజ్యమని కొడుకా
నిండాముంచినరు కొడుకా
యువ వికాసమని పోజు కొడితిరి
యువకుల కలలను చిదిమివేస్తిరి
ఐదు లక్షల భరోసా కార్డని
తెగ జెప్పితిరి, తెడ్డు జూపితిరి
రెండు లక్షల ఉద్యోగాలు
యాదాదిలోనే ఇస్తామంటిరి
రెండేళ్ల పొద్దు దగ్గరికొచ్చే
నిరుద్యోగుల ఆశలు చచ్చే
తొండి చేసినరు కొడుకా
మొండిచెయ్యి చూపినరు కొడుకా
ఇందిరమ్మ రాజ్యమని కొడుకా
నిండాముంచినరు కొడుకా
ఇందిరమ్మ ఇండ్లన్నారు
ఇండ్లు కూల్చేందుకు మోపైనారు
రైతు భరోసని రాగం దీసి
ఎరువు బస్తకే ఏడిపిస్తిరి
అన్నదాతకు సున్నం పెడితిరి
దేవుని తోడని దగా జేస్తిరి
మీ లెక్క తేలాలే కొడుకా..
మీ తిక్క కుదరాలే కొడుకా
– దేశపతి శ్రీనివాస్