తెలంగాణలోని సంక్షేమ వసతి గృహాల్లో 7,65,705 మంది విద్యార్థులు ఉంటున్నారు. బుర్రా వెంకటేశం ఆధ్వర్యంలోని ఉన్నతాధికారుల కమిటీ ప్రతిపాదనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం 10 నెలల క్రితం డైట్ చార్జీలను 40 శాతం పెంచింది. ద్రవ్యోల్బణంతోపాటు జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) సూచనలను పరిగణనలోకి తీసుకున్న ఈ కమిటీ కాస్మొటిక్ చార్జీలను 200 శాతం వరకు పెంచాలని కూడా ప్రతిపాదించింది. అంతేకాదు, ప్రతి నెల గ్రీన్ ఛానల్ ద్వారా వసతిగృహాలకు డైట్ బిల్లులు చెల్లించాలని కోరింది. అయితే, రాష్ట్రవ్యాప్తంగా వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఓ విద్యార్థిని మరణించడం, తల్లిదండ్రుల నుంచి తీవ్ర ఒత్తిళ్లు, తత్ఫలితంగా సర్కారుపై వస్తున్న వ్యతిరేకతను దారిమళ్లించేందుకు డైట్ చార్జీలను ప్రభుత్వం పెంచింది. డైట్ చార్జీలు పెంచామని, ఇకపై విద్యార్థులకు ఆకలి బాధలుండవని, ఫుడ్ పాయిజన్ ఘటనలు పునరావృతం కావని మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు గప్పాలు కొట్టారు. అయినా ఇంకా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతుండటం శోచనీయం.
ఉన్నతాధికారుల కమిటీ చేసిన ప్రతిపాదనల్లో డైట్ చార్జీల పెంపును మాత్రమే అమలు చేసి రాష్ట్ర సర్కారు చేతులు దులిపేసుకున్నది. గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెలా డైట్ చార్జీలను చెల్లించాలన్న ప్రతిపాదనను గాలికొదిలేసింది. 10 నెలలుగా డైట్ చార్జీలను చెల్లించకపోవడంతో వసతి గృహాధికారులు అవస్థలు పడుతున్నారు. పెంచిన డైట్ చార్జీల ప్రకారం మెనూ అందించడం వారికి తలకు మించిన భారంగా మారింది. పర్సనల్ లోన్లు తీసుకొని, ఫైనాన్షియర్ల వద్ద వడ్డీలకు నగదు తీసుకొని, పుస్తెలతాడులమ్మి, తాకట్టు పెట్టి వారు విద్యార్థుల కడుపు నింపుతున్నారు.
రాష్ట్రంలో సుమారు 2,300 ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలు, 400కు పైగా గురుకులాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. సర్కారు కిరాయిలు చెల్లించకపోవడంతో యజమానులు భవనాలకు తాళాలు వేస్తున్నారు. భవనాలను ఖాళీ చేయాలని గొడవలకు దిగుతున్న ఘటనలను రాష్ట్రవ్యాప్తంగా చూస్తున్నాం. మరోవైపు పాత భవనాలు శిథిలావస్థకు చేరి పెచ్చులూడుతున్నాయి. వర్షాకాలంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. బిల్లులు చెల్లించకపోవడంతో వసతి గృహాలకు, గురుకులాలకు కూరగాయలు, పాలు, కోడిగుడ్లు, చికెన్, అరటిపండ్లు అందించే టెండర్దారులు చేతులెత్తేశారు. సంక్షేమ వసతి గృహాల అధికారులు, గురుకులాల ప్రధానోపాధ్యాయులపై టెండర్దారులు, భవనాల యజమానులు తీవ్ర ఒత్తిడి చేస్తుండటం గమనార్హం.
కేజీబీవీల సమస్యలు వర్ణనాతీతం. ఉపాధ్యాయులు లేకపోవడం, నిధుల కొరత, మౌలిక సదుపాయాల లేమి తదితర సమస్యలు కేజీబీవీలను తీవ్రంగా వేధిస్తున్నాయి. ఇతర సొసైటీలతో పోలిస్తే అక్కడి విద్యార్థులు పొందుతున్న సౌకర్యాలు చాలా తక్కువ. ఉద్యోగ భద్రత కల్పించాలని, జీవిత బీమా, ఆరోగ్య బీమా వర్తింపజేయాలని అక్కడి ఉద్యోగులు ఎప్పటినుంచో మొరపెట్టుకుంటున్నారు. 20 ఏండ్లుగా శ్రమ దోపిడీకి గురవుతున్నామని సిబ్బంది వాపోతున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ వసతిగృహాలు, గురుకులాలు, కేజీబీవీల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతున్నది. మొత్తంగా విద్యావ్యవస్థ నిర్వీర్యమవుతున్నది. నాసిరకం భోజనం, అపరిశుభ్రమైన పరిసరాలు, వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు, అధికారుల నిర్లక్ష్యం, చాలీచాలని తిండి అందుకు ప్రధాన కారణం. వసతి గృహాలు, గురుకులాల నిర్వహణ కోసం బడ్జెట్ కేటాయింపులు సరిగ్గా లేకపోవడం మరో కారణం. ఇకనైనా ప్రభుత్వం స్పందించి విద్యావ్యవస్థపై దృష్టిసారించాలి. లేకపోతే ప్రభుత్వ విధానాల మూలంగా రానున్న రోజుల్లో వసతి గృహాలు మూతబడే ప్రమాదం ఉన్నది.
– బి.వీరభద్రం 94929 30835