కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ ఆమెకు 9వది. మహిళా మంత్రిగా ఇదొక రికార్డు. ఏ ఒక్కవర్గాన్నీ సంతృప్తి పరచలేకపోవడం అనేది మరో రికార్డుగా నిలుస్తున్నదని చెప్పుకోవచ్చు. పేరుకు రూ.53.47 లక్షల కోట్ల బడ్జెట్ అని గొప్పగా చూపినప్పటికీ అందులో . మధ్యతరగతికి ఆదాయపన్ను రాయితీ దక్కలేదు. ఆహారం, ఎరువులు, ఇంధన సబ్సిడీలను పెంచాల్సింది పోయి 4.47 శాతం తగ్గించడం గమనార్హం.
మరోవైపు కొత్తకొత్త వాతలు వేస్తూపోయారు. షేర్ల లావాదేవీల పన్ను పెంచుతున్నట్టు ప్రకటించడంతో స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. ఈ ఏడాది రూ.40 వేల కోట్లుగా ఉన్న పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రెట్టింపు చేసి రూ.80 వేల కోట్లుగా ప్రకటించడమే అందుకు నిదర్శనం. దవ్యోల్బణం 6 శాతం దాటిపోతుంటే వివిధ రంగాలకు ఆ స్థాయిలో కేటాయింపుల పెంపు లేకపోతే ప్రభుత్వం చెప్తున్న వికసిత్ భారత్ ఎలా సాధ్యమవుతుందనేది ప్రశ్న.
ఇక తెలంగాణ రాష్ర్టానికి ఏం ఒరిగింది అని ప్రశ్నించుకుంటే గుండు సున్నా అనే సమాధానం వస్తుంది. 60 సార్లు ఢిల్లీ వెళ్లి దర్శనం చేసుకున్నా చోటేభాయ్ని బడేభాయ్ ఏమాత్రం పట్టించుకోలేదని బడ్జెట్ స్పష్టం చేస్తున్నది. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా పంపిన రూ.1.63 లక్షల కోట్ల ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. హైదరాబాద్ చుట్టూ రోడ్లకు రూ.45,000 కోట్లు, గ్రీన్‌ఫీల్డ్ రహదారులకు రూ.45,000 కోట్లు, మెట్రో విస్తరణకు రూ.2,426 కోట్లు, మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి రూ.17 వేల కోట్లు.. ఇలా కేటాయింపుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపితే కేంద్రం ఒక్కటీ మంజూరు చేయలేదు.
హైదరాబాద్-బెంగళూర్, హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-పుణె మధ్య మూడు హైస్పీడ్ రైలు మార్గాల ప్రకటన తప్ప తెలంగాణకు ఈ బడ్జెట్లో ఏ కేటాయింపులూ చేయలేదు. మామూలు రైలు మార్గాలు పూర్తిగా దిక్కులేని పరిస్థితుల్లో, భారీ వ్యయంతో కూడుకున్న హైస్పీడ్ కారిడార్లు ఎప్పటికి పూర్తవుతాయనేది పెద్ద ప్రశ్న. కొన్ని గ్రాంట్స్‌ను విడుదల చేయాలని తెలంగాణ సర్కార్ కోరింది. కానీ ఆ దిశగా కూడా బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయలేదు. రైల్వే బడ్జెట్ కింద కేటాయింపుల్లోనూ తెలంగాణకు అన్యాయమే జరిగింది. ఆంధ్రప్రదేశ్ విడిపోయి 12 ఏండ్లు కావొస్తున్నా ఇప్పటికీ తెలుగు రాష్ర్టాలు అని గుండుగుత్తగా కలిపి మాట్లాడుతున్న కేంద్రం తెలంగాణకు రూ. 5,454 కోట్లు, ఏపీకి అంతకు రెట్టింపుగా రూ.10 వేల కోట్లు కేటాయించడం చూస్తుంటే.. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ పలుకుబడి ఏ పాటిదో తెలియజేస్తున్నది.
రాష్ట్రం నుంచి కాంగ్రెస్‌కు 8 మంది, బీజేపీకి 8 మంది ఎంపీలున్నారు. ఎనిమిది ప్లస్ ఎనిమిది సున్నా అన్నట్టుగా ఉన్నది బడ్జెట్ కేటాయింపులను చూస్తే. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ ఎంపీలు కేంద్రాన్ని నిలదీయడంలో, మెప్పించి తెప్పించడంలో బీజేపీ ఎంపీలు విఫలమయ్యారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో ఇరు పార్టీల నేతలు దొందూ దొందే అన్నట్టుగా తయారయ్యారు. దేశ సంపదకు గణనీయమైన వాటా అందిస్తున్న తెలంగాణకు ఆ స్థాయిలో కేటాయింపులు జరగకపోవడం, 8+8 మంది ఎంపీలు విఫలం కావడం విచారకరం.