గోదావరి ఉత్తర తీరాన ఉండే గిరిజన ప్రాంతం విభిన్నమైన సంస్కృతీ, ఆచారాలకు ప్రసిద్ధి చెందింది. ఆ ప్రాంతంలో అడవి తల్లి ఒడిలో గిరిజనులు జరుపుకొనే అందమైన పండగ ‘దండారి’. ఆదివాసీల ఆచారాలు, సంప్రదాయాలు ప్రతిబింబించే ఈ పండుగను దీపావళి సందర్భంగా జరుపుకొంటారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వారం పాటు ఘనంగా సాగే ఈ పండుగ నృత్య గానాలతో హోరెత్తుతుంది.
గోండులు, తోటీలు, పర్దాన్లు, కోలములు ఈ పండుగను ఎక్కువగా జరుపుకొంటారు. ఆదివాసీ సంస్కృతిలో దీపావళి పండుగకు ప్రత్యేక స్థానం ఉన్నది. ఈ పండగ సందర్భంగా జరిపే దండారి పండగలో గిరిజనులు తమ ఆరాధ్య దైవమైన అమ్మమ్మ పద్మల్ పురి కాకో దేవాలయానికి భారీగా తరలి వస్తారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల నుంచి భారీగా గిరిజనులు ఈ ఆలయానికి వస్తారు. దండారి వేడుకలో గుస్సాడి వేషధారణ, రేలారే రేలా ఆటపాటలు, కొమ్ముల విన్యాసాలు, ఆదివాసీ మహిళల ప్రత్యేక పూజలు అందరినీ ఆకట్టుకుంటాయి. చుట్టూ దట్టమైన అడవి, పక్షుల కిలకిల రావాలతో అడవి వారం పాటు హోరెత్తుతుంది.
దండారి పండుగ జరిగే వారం రోజులపాటు ఆదివాసీ గూడేలు, పల్లెలు గుస్సాడీ నాట్యాలతో శోభాయమానంగా కనిపిస్తాయి. గోండులు ప్రత్యేక నృత్యాలు చేస్తారు. ఈ పండగ ఆదివాసుల్లో ఐక్యతను, ఆప్యాయతను మరింత బలోపేతం చేస్తుంది. దండారి బృందాలు ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లి అక్కడివారితో కలిసి ఆడి పాడతాయి. విందు, వినోదాల్లో పాలుపంచుకుంటాయి. దండారిలో ఆట పాటలకు డప్పు, రడమేళా, డోల్, వెట్టి, కర్ర, పెప్రి, తుడుం సంగీత పరికరాలు ఉపయోగిస్తారు. నెమలీకలతో పేర్చిన గుస్సాడి కిరీటాలను, ముఖానికి ధరించే పువ్వులను గ్రామం మధ్యన గుట్టపైన పేర్చి సంప్రదా య రీతిలో పూజలు జరిపి గొర్లు, మేకలు, కోళ్లను బలివ్వడం ఆచా రం. దేవతల అనుగ్రహం పొందామని సంతృప్తి చెందిన తర్వాతనే గిరిజనులు నృత్యాలు ప్రారంభిస్తారు. పురుషులు గుస్సాడి, చచ్చాయి, చాహోయి నృత్యాలు చేస్తారు. శరీరం నిండా బూడిద పూసుకుంటారు. ముఖానికి మసి పూసుకుంటారు. ఎడమ భుజంపై మేక చర్మం లేదా జింక చర్మం వేలాడదీసుకుంటారు. కుడి చేతిలో మంత్ర దండం లాంటి రోకలి పట్టుకుంటారు. లయబద్ధంగా సాగే గుస్సాడి నృత్యానికి వాయిద్యాల చప్పుడు తప్ప పాట నేపథ్యం ఉండదు.
దండారి సందర్భంగా నృత్య బృందాలు కాలినడకనే ఊరూరూ తిరుగుతాయి. ఈ పండగ సందర్భంగా యువకులు తమకు సరైన జోడి కోసం వెతుక్కుంటారు. పండగ తర్వాత పెళ్లి సంబంధాల గురించి మాట్లాడుకుంటారు. దీపావళి అమావాస్య తర్వాత ఒకట్రెండు రోజు లు జరిపే కోలబోడితో దండారి ఉత్సవాలు ముగుస్తాయి. ఊరు బయటినుంచి చెంచి భీమ న్న దేవుడు ఉండే ఇప్పచెట్టు దగ్గర దండారి వాయిద్యాలు, దుస్తులు తీసేసి వాటి ముందు జంతువులను బలిచ్చి పూజలు చేస్తారు. విందు భోజనం తర్వాత అన్ని వస్తువులనూ ఇళ్లకు తీసుకెళ్తారు. చివర్లో గుస్సాడీల దగ్గర్లో ఉన్న చెరువు, కాలువకు వెళ్లి స్నానం చేసి దీక్ష విరమిస్తారు. ఈ పండగ ప్రాధా న్యం గుర్తించిన రాష్ట్ర ప్రభు త్వం ఏటా ఈ పండగ నిర్వహణకు తగినన్ని నిధులను కేటాయిస్తున్నది. వం దల ఏండ్ల నుంచి గిరిజను లు ఈ దండారి పండుగను జరుపుకొంటున్నారు. తమ సంస్కృతీ సంప్రదాయాల ను కాపాడుకుంటూ భావితరాలకు అందిస్తున్నారు.
కామిడి సతీష్‌రెడ్డి: 98484 45134