మూడు భాషల విధానం దేశంలో మరోసారి వివాదాల తుఫాన్ రేపుతున్నది. సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వ దృక్పథం, అమలులో లోపాలు, సమాఖ్య విలువలపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ముఖ్యంగా సీబీఎస్ఈ ద్వారా 9వ తరగతి నుంచి మూడో భాషను తప్పనిసరి చేయాలనే నిర్ణయం తీవ్ర విమర్శల పాలవుతున్నది. ఇప్పటికే బోర్డు పరీక్షల బెంగతో విద్యార్థులు నలిగిపోతున్నారు. ఉన్నపళంగా త్రిభాషా సూత్రం అమలు చేయడం వారిని మరింత కృంగదీసే అవకాశం ఉన్నది. ‘భాష నేర్చుకోవడం ఎప్పుడూ వృథా కాదు’ అని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ, అదే సమయంలో 9వ తరగతి వంటి కీలక దశలో కొత్త భాషను రుద్దడం విద్యార్థులపై మానసిక భారం అవుతుందని హెచ్చరించడం గమనార్హం. కేంద్రం, సీబీఎస్ఈ నిర్ణయాల్లోని అసంబద్ధతను సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు స్పష్టంచేస్తున్నాయి.
దేశవ్యాప్తంగా భాషా, సాంస్కృతిక, సామాజిక స్థితిగతుల్లో ఎంతో వైవిధ్యం ఉన్నది. వాటన్నిటినీ కాదని ఒకే విధానాన్ని అన్ని రాష్ర్టాలపై రుద్దే ప్రయత్నం జరుగుతున్నది. ఉపాధ్యాయుల కొరత, పాఠ్యపుస్తకాల లభ్యత, మౌలిక సదుపాయాల లోపం వంటి ప్రాథమిక సమస్యలు పరిష్కరించకుండా, మూడో భాషను తప్పనిసరి చేయడం విద్యార్థులపై ప్రయోగాలు చేయడం తప్ప మరొకటి కాదు. విధాన రూపకల్పనలో క్షేత్రస్థాయి వాస్తవాలను పట్టించుకోకపోవడం మంచిది కాదు. సీబీఎస్ఈ ద్వారా దేశవ్యాప్తంగా ఒకే విధానాన్ని అమలు చేయాలనే పట్టుదల భారత సమాఖ్య వ్యవస్థను బలహీనపరుస్తున్నది.
సంస్కృతి, గుర్తింపు, ఆత్మగౌరవానికి ప్రతీక భాష. అలాంటి సున్నితమైన అంశాన్ని కేంద్రం ఒక పరిపాలనా ఉత్తర్వుగా చూడడం, రాష్ర్టాల భావోద్వేగాలను తక్కువ అంచనా వేయడమే. కేంద్ర ప్రభుత్వ దృక్పథం మొదటి నుంచీ ప్రశ్నార్థకమే. జాతీయ ఐక్యత పేరుతో భాషా విధానాలను ముందుకు తెస్తున్నప్పటికీ, అవి ప్రాంతీయ భావోద్వేగాలను గౌరవించేలా ఉన్నాయా? అనేది సమస్య. మహారాష్ట్ర, బెంగాల్తోపాటుగా దక్షిణాది రాష్ర్టాల్లో భాషాపరమైన ఆత్మాభిమానం ఎక్కువ. తమిళనాడు వంటి రాష్ర్టాలు త్రిభాషా విధానాన్ని భాషా దౌర్జన్యంగా భావిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నాయి. మూడు భాషల విధానం పేరుతో కేంద్రం అమలు చేస్తున్నది భాషా సమతుల్యత కాదు, హిందీ ఆధిపత్యాన్ని నెమ్మదిగా నెత్తిన ఎక్కించే వ్యూహమనే అనుమానం అంతకంతకూ పెరుగుతున్నది.
బీజేపీకి హిందీ పట్ల గల ప్రత్యేక అభిమానం చిరపరిచితమే. ‘ఒకేదేశం, ఒకే ఎన్నిక’ తరహాలో ‘ఒకే భాష’, అంటే హిందీని దేశమంతటా రుద్దడం, వారి ఎజెండాలోని ప్రముఖ అంశాల్లో ఒకటి. ‘ఐచ్ఛికం’ అంటూనే బలవంతంగా రుద్దడం, ‘ఐక్యత’ పేరిట ఏకరూపత తేవడం విద్యాసంస్కరణ కాదు, సంస్కృతిపై దాడి అనే విమర్శలూ తీవ్రమవుతున్నాయి. మరోవైపు దేశంలో ఇంగ్లిష్ భాష స్థానం ఏమిటనే విషయంలో నెలకొన్న అయోమయం మరో కీలకమైన అంశం. సుప్రీంకోర్టు కూడా ఇంగ్లిష్‌ను భారతీయ భాషగా పరిగణించవచ్చా? అనే ప్రశ్నను లేవనెత్తింది. భాషా విధాన రూపకల్పనలో ఉన్న అస్పష్టతను ఇది బయటపెడుతున్నది. ఒక విధానం అమలుచేసే ముందు దాని మూల సూత్రాలపై స్పష్టత లేకపోతే, అది ఎలా విజయవంతమవుతుంది?
మూడు భాషల విధానం సమతుల్యత సాధించే ప్రయత్నంగానే మొదటినుంచీ ప్రచారం జరుగుతున్నది. కానీ ప్రస్తుతం అది రాజకీయ ప్రయోజనాలకు వేదికగా మారుతున్నది. విద్యార్థుల ప్రయోజనాలు, ఉపాధ్యాయుల సామర్థ్యాలు, ప్రాంతీయ వాస్తవాలు ఇవన్నీ కూడా పక్కనపెడుతున్నారు. సీబీఎస్ఈ, కేంద్రం కలిసి విద్యను ఒక ప్రయోగశాలగా మార్చుతున్నాయనే విమర్శలు తోసిపుచ్చదగ్గవేమీ కాదు. మూడు భాషల విధానం విద్యార్థుల అభివృద్ధికి కాకుండా, కేంద్ర విధానాల వైఫల్యానికి ప్రతీకగా మిగిలిపోతుంది.