తెలుగు సమాజానికి ఉజ్వలమైన చరిత్ర ఉన్నది. దేశవిముక్తి ఉద్యమాలు.. భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగిన పోరాటాలు తెలంగాణ నేల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అయితే, రాజుల కాలం నుంచి నేటి ప్రజాస్వామ్య కాలం వరకు తిరుగుబాట్లపై అణచివేత మాత్రం అలాగే కొనసాగుతోంది. ప్రతి తిరుగుబాటుపైన కాలాన్ని బట్టి, అక్కడున్న వ్యవస్థలను బట్టి రూపం మార్చుకుంటూ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. రాజ్యాధికారాన్ని ధిక్కరించి మాట్లాడినవాళ్లంతా ఏదో ఒక రూపంలో దాడులకు గురయ్యారు. నిర్బంధాలను ఎదుర్కొన్నారు. అసువులుబాసారు. వీరతెలంగాణ సాయుధ పోరాటంలో 4 వేల మంది నేలకొరిగారు.
స్వాతంత్య్రానంతరం రాజ్యానికి, నక్సలైట్లకు మధ్య జరిగిన పోరాటంలో వేలమంది పోలీసులు, నక్సలైట్లు చనిపోయారు. ఈ ఉద్యమ ప్రవాహంలో సాహిత్య, సాంస్కృతిక సంస్థలు వెలువరించిన కావ్యాలపై, కవితలపై, పాటలపై, మాటలపై, అడుగులపై, నడకలపై, నడతలపై, కాలిగజ్జెలపై, గొంగళ్లపై, ప్రజాకంఠాలపైన నిషేధాలు విధించారు. నిషేధ సాహిత్యంపై విశ్వవిద్యాలయాలే పరిశోధనలు చేసి పీహెచ్డీ పట్టాలిచ్చాయి. అది శ్రీకాకుళం గిరిజన రైతాంత పోరాటమైనా, నక్సల్బరీ వసంత మేఘ గర్జనతో ఉత్తర తెలంగాణ ఎరుపెక్కినా ఆయా కాలాల్లో వచ్చిన సాహిత్యంపై నిషేధాలు విధించారు. ఇది రాజ్యస్వభావం. దీనికి ఆశ్చర్యపోనక్కర్లేదు.
నిషేధాలు ఎక్కువగా చేసే ప్రభుత్వాలు నిరంకుశ సర్కార్లుగా చరిత్రలో నిలిచిపోతాయి. అవి ఎమర్జెన్సీ చీకటి రోజులు కావచ్చు.. 1970-1975 వరకు తెలంగాణ జిల్లాల్లో కొనసాగిన అప్రకటిత చీకటి రోజులు కావచ్చు. రాజ్యానికి కోపం వస్తే ఎన్‌కౌంటర్లతోనే పరిమితమైపోదు. అది సాహిత్యాన్ని కూడా నిషేధిస్తుంది. ఆట, పాట, మాటను కూడా నిషేధిస్తుంది. రాజ్యం కన్నెర్రజేస్తే వీరుల స్తూపాలను కూడా నేలరాలుస్తుంది. రాజ్యానికి అవసరం వస్తే అమరుల స్తూపాలకు మొక్కుతుంది. అందుకు పార్టీల పేరును ఉటంకించాల్సిన అవసరం లేదు. అందరికీ తెలిసినవే. ‘ఇందిరమ్మ సోషలిజం ఎందాకొచ్చిందిరో, అది ఇంద్రవెల్లిలోన వంద మందిని మింగిందిరో’, ‘ఇంద్రవెల్లి కదిలింది పోరుబాట సాగింది.. పోరాటం ఆపకుండా మున్ముందుకు సాగింది’ అన్న పాటలు తెలంగాణ నేలకు సుపరిచితాలే. ఎవరి పాలనలో, ఏ రాజ్యం ఏలుబడిలో వీరుల నెత్తురు నేలచింది ఇంద్రవెల్లి స్తూపం అయ్యిందో.. అదే రాజ్యం కొన్ని దశాబ్దాల తర్వాత అదే స్తూపానికి మొక్కి ఆ అమరుల వీరత్వాన్ని చాటి చెప్పడం కూడా తెలంగాణ నేల చూసింది.
విప్లవ రచనలపై నిషేధం వాయిదాల పద్ధతిలో నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. అది ఆగేది కాదు. ప్రతిఘటన పోరాటాలపై, ఉద్యమాలపై ప్రభుత్వ దాడులు, ఘర్షణలు సహజం. అది వర్గాల మధ్య వర్గపోరాటంగా కొనసాగుతూ ఉంటుంది. అధికార రాజముద్రల మధ్య కూడా పోరాటం అదే రీతిలో కొనసాగుతూ ఉంటుంది. అది ఒక ప్రభుత్వంపై మరో ప్రభుత్వం దశల్ని బట్టి స్థాయిల్ని బట్టి ఉంటుంది. అది విమర్శల పర్వం కావచ్చు, దాడుల పర్వం కావచ్చు, ఒకరిపై ఒకరు ఆ ఘర్షణల పరంపరను వర్తమాన సంఘర్షణగానూ మార్చవచ్చు.
గత ప్రభుత్వం చేసిన పనుల కంటే తాము గద్దెనెక్కినాక చేసే పనులు మరింత గొప్పగా ఉండాలని ప్రభుత్వాలు పాలనలో పోటీ పడటం సహజం. అది ఆరోగ్యకరమైన స్థితికి చిహ్నమే. కానీ, ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నదేమిటంటే అనారోగ్య రాజకీయ వాతావరణం. అది రాష్ట్రమంతటా భారీ వ్యాధిగా మారిపోయింది.
అది ముదిరి ఎక్కడిదాకా వచ్చిందంటే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన తెలంగాణ తల్లి విగ్రహం మార్పు దాకా. ఇప్పుడు తెలంగాణలో విగ్రహాల యుద్ధం నడుస్తోంది. మలిదశ తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఈ విగ్రహ తల్లుల చర్చ లెగిసింది. అప్పుడు తెలుగు తల్లి, తెలంగాణ తల్లి విగ్రహాల మధ్య భారీగా చర్చ జరిగింది. ఆ మలిదశ తెలంగాణ ఉద్యమం తనకు తానుగా సృష్టించుకున్న తెలంగాణ తల్లి విగ్రహం అది. కవులు, కళాకారులు, శిల్పులతో లోతుగా చర్చించి ఉద్యమ బిడ్డలు తమ ఉద్యమతల్లి రూపాన్ని ప్రతిష్ఠించుకున్నారు. బతుకమ్మలు, బోనాలు, వంటావార్పులు, జేఏసీలు, ధూంధాంలలో ఆ ఉద్యమతల్లి రూపాన్ని స్ఫూర్తిగా తీసుకుని అనేక ప్రజా, విద్యార్థి, యువజన సంఘాలు ముందుకుసాగాయి. రాజకీయ ప్రక్రియతో ఉద్యమించిన ఉద్యమపార్టీ టీఆర్ఎస్ ఆ తెలంగాణ తల్లి విగ్రహాలను వందల, వేల గ్రామాల్లో ఉద్యమకాలంలోనే ప్రతిష్ఠించింది. నాటి వలసాధిపత్య ప్రభుత్వం కూడా ఉద్యమ తల్లి విగ్రహంపై ఆంక్షలు విధించలేకపోయింది. మలిదశ ఉద్యమ గెలుపుతో స్వరాష్ట్రం అవతరించాక అమరుల స్వర్గధామాన్ని తెలంగాణ సచివాలయం ఎదుటే నిర్మించుకున్నాం. ఆ అమరజ్యోతిలో తెలంగాణ తల్లి రూపాన్ని కూడా ప్రతిష్ఠించుకున్నాం.
కానీ, 2023 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం తెలంగాణ తల్లి విగ్రహం రూపుమార్చి కొత్త విగ్రహాన్ని సచివాలయంలో ప్రతిష్ఠించింది. తాము రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహమే అధికారిక తెలంగాణ తల్లి అని జీవో కూడా విడుదల చేసింది. ఇప్పటిదాకా పుస్తకాలపై నిషేధాన్నే చూసిన తెలుగు సమాజం ఇక విగ్రహాలపై కూడా నిషేధాన్ని చూస్తోంది. తమ గుర్తులు శాశ్వతంగా నిలిచిపోవాలని కొత్త ప్రభుత్వాలు పనిచేస్తాయి. గత ప్రభుత్వం చేసిన మంచి పనులను కూడా కొనసాగిస్తాయి. అది ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు కావచ్చు, ఇంకేమైనా ఉండవచ్చు. కానీ, కాంగ్రెస్ సర్కార్ అలా కాదు. గత ప్రభుత్వ గుర్తులను చెరిపేసే లక్ష్యంతో ముందుకుసాగుతున్నది. గత ప్రభుత్వం ముద్రించిన పుస్తకాల్లో తొలి ముఖ్యమంత్రి ముఖచిత్రాలను కూడా చించివేయించడం ఏ సంస్కృతికి చిహ్నమో అర్థం కావడం లేదు. సాహిత్య అకాడమీ, తెలంగాణ సాంస్కృతిక శాఖ తదితర సంస్థలు పాఠ్యపుస్తకాల్లో నాటి ముఖ్యమంత్రి ఫోటోలు లేదా వారి సందేశాలు ఉండటం సహజం. కానీ, ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం తొలి తెలంగాణ ముఖ్యమంత్రి ముద్రించిన పుస్తకాల్లోని కేసీఆర్ ముద్రల్ని తొలగించే కార్యాన్ని చేపట్టింది. ఇప్పటికే పాఠ్యపుస్తకాలను వెనక్కు తెప్పించి కేసీఆర్ ముఖచిత్రం లేకుండా తీసివేశారు. ఇప్పుడు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ముద్రించిన గత ముఖ్యమంత్రి సందేశాలు ఉన్న పేజీలను చింపేశారు. ఈ పనిని బహిరంగంగానే ప్రకటించి మరీ చేస్తున్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చూస్తాం, చేస్తాం అని ఒక పక్క ముఖ్యమంత్రి బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, ఆలోచనల మేరకు ప్రభుత్వ శాఖలు పనిచేయాలి. దాన్నెవ్వరు కాదనరు. కానీ, గత ప్రభుత్వంలో వేసిన చరిత్ర పుస్తకాల నుంచి వెదికి మరీ నాటి ముఖ్యమంత్రి ఆనవాళ్లను చెరిపేయడానికి ప్రభుత్వ శాఖలే పూనుకొనడం విచారకరం.
42 రోజుల పాటు జరిగిన సకలజనుల సమ్మె చరిత్రను ఎవరూ చెరిపేయలేరు. తెలంగాణ ఉద్యమ ఘట్టాలను చెరిపేయలేరు. ఎవరికనుకూలంగా వారు చరిత్రను సొంత గళంతో రాసుకుంటే రాసుకోవచ్చు. కానీ, అసలైన చరిత్రపై హస్తాలు వేస్తామంటే చరిత్ర ఒప్పుకోదు, చరిత్రకారులు ఒప్పుకోరు. పొరుగు రాష్ట్రం తమిళనాడు సీఎం స్టాలిన్ అంతకుముందు ముఖ్యమంత్రి జయలలిత ముఖచిత్రంతో ఉన్న పిల్లల పుస్తకాల సంచుల్ని చింపివేయలేదు. పుస్తకాల్లో ఉన్న జయలలిత సందేశాలను తొలగించలేదు. అమ్మ క్యాంటీన్ల పేరు మార్చలేదు. రాజులు పోవచ్చు, రాజ్యాలు పోవచ్చు. పాలకులు మారొచ్చు, ప్రభుత్వాలు పోవచ్చు. చరిత్ర మాత్రం మారదు. తల్లులు మారరు. అలాగే సిలబస్‌లు మారొచ్చు.. కానీ, చరిత్ర మారదు.
కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చూస్తాం, చేస్తాం అని ఒక పక్క ముఖ్యమంత్రి బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, ఆలోచనల మేరకు ప్రభుత్వ శాఖలు పనిచేయాలి. దాన్నెవ్వరు కాదనరు. కానీ, గత ప్రభుత్వంలో వేసిన చరిత్ర పుస్తకాల నుంచి వెదికి మరీ నాటి ముఖ్యమంత్రి ఆనవాళ్లను చెరిపేయడానికి ప్రభుత్వ శాఖలే పూనుకొనడం విచారకరం.