రెండు విభిన్న చారిత్రక నేపథ్యాలు కలిగి ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ఆ తరువాత కూడా భావసమైక్యత సాధించకపోవడానికి సాంస్కృతిక నేపథ్యాలు, భాషా భేదాలు కూడా బలమైన కారణాలే! ఈ వ్యాసంలో ఇరు ప్రాంతాల సంస్కృతి గురించి విశ్లేషిద్దాం.
తెలంగాణలో మతసామరస్యం, వైవిధ్యాలు ఉన్న ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండటానికి ముఖ్య కారణం అప్పటి ముస్లిం పాలకులు, వారి కింద పనిచేసిన ముస్లిం, ముస్లిమేతర అధికారులు, న్యాయస్థానాలు, న్యాయాధీశులు ధర్మమార్గంలో ఉండటమే. కొన్ని ఉదాహరణలు చూద్దాం! కుమ్రం భీం అనే గోండు జాతి యువకుడు ‘జల్, జంగల్, జమీన్’ అంటే, అడవుల్లో ఉండేవన్నీ గిరిజనులకే చెందాలని నిజాం మీద, అటవీశాఖ అధికారుల మీద ధిక్కరించి పోరాడాడు. నవాబ్ సైనికుల చేతిలో అతను మరణించాడని తెలుసుకున్న నిజాం కలతచెందాడు. వెంటనే లండన్ విశ్వవిద్యాలయంలో మానవశాస్త్ర (ఆంత్రపాలజీ) విభాగానికి అధిపతి అయిన ప్రొఫెసర్ క్రిస్టాఫ్ వాన్ ఫ్యూరర్ హైమన్‌డార్ఫ్ అనే నిపుణుడిని ఆహ్వానించాడు. ఆదిలాబాద్‌లో గోండు జాతివారి సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలు సూచించాలని ఆయనను ప్రత్యేకంగా నియమించాడు. హైమన్‌డార్ఫ్ సతీమణి ఎలిజబెత్ కూడా ఆయనతోపాటు వచ్చారు. ఇద్దరూ ఆదిలాబాద్‌లోనే ఏండ్ల తరబడి స్థిరపడిపోయారు. గోండుల జీవన విధానం, వారి ఆచార వ్యవహారాలు, హక్కులు, సమస్యల గురించి హైమన్‌డార్ఫ్ రెండు పుస్తకాలు రచించాడు. దంపతులు గోండులకు విద్యాబుద్ధులు నేర్పుతూ అక్కడి సమస్యలను నిజాం సహకారంతో తీర్చి, వారి హక్కుల మీద చట్టాలు చేశారు. యువతని విద్యావంతులుగా తీర్చిదిద్ది, వారిని పట్టణాల్లో చదువులు, ఉద్యోగాలు సంపాదించుకునేటట్టు చేశారు. అదీ ఒక పాలకుడి ఆదరం ప్రజల పట్ల! ఈ కథను ఆంధ్ర బాహుబలి డైరెక్టర్ అస్తవ్యస్తం చేసి కుమ్రం భీంని, అల్లూరి సీతారామరాజుని కలిపి చరిత్రని ఛిద్రం చేసి, అన్ని రకాల ప్రయత్నాలు చేసి, ఆస్కార్ అవార్డు తెచ్చుకున్నాడు. అదీ ఆంధ్ర వారి అవకాశవాదం. బెల్లం చుట్టూ చీమల్లాగా మూగుతారు లాభపడటానికి! తెలంగాణ మీద గౌరవం లేని వీరికి ఇక్కడి హీరోలు, జానపద గీతాలు కావాలి.
ఇంకొక ఉదంతం! ప్రజా కవి కాళోజీ వామపక్ష భావాలు కలిగిన ఆంధ్ర కమ్యూనిస్టు నాయకులతో స్నేహం నెరిపారు. ఒకసారి నిజాముకి వ్యతిరేకంగా కాళోజీకి ఒక ఆంధ్ర నాయకుడు లేఖ రాసి ఓ వ్యక్తి ద్వారా వరంగల్‌కు పంపించారు. దురదృష్టవశాత్తూ ఆ అబ్బాయి పోలీసులకు పట్టుబడ్డాడు. కాళోజీని అరెస్టు చేసి న్యాయస్థానంలో నిలిపారు పోలీసులు. పోలీసుని ఆ న్యాయస్థానంలోని జడ్జి ఇలా అడిగారు. ‘ఇటువంటి లేఖ నిజాముకి వచ్చిందనుకో, లేఖ రాసినవాడిని అరెస్టు చేస్తారా, నిజాముని అరెస్టు చేస్తారా?’ అని. పోలీసు నీళ్లు నమిలాడు. కాళోజీని గౌరవంగా విడుదల చేశారు. నిజాం ముస్లిం, ఆ పోలీసు ముస్లిం, న్యాయమూర్తి ముస్లిం, కాళోజీ మాత్రమే హిందువు. న్యాయం ఆ రకంగా ధర్మంతో పాలింపబడేది. బిల్కిస్ బానోపై లైంగికదాడి చేసినవారిని రక్షించడం, ఒక మహిళా అధికారిని జుట్టు పట్టి ఈడ్చుకెళ్లిన ఎమ్మెల్యేని కాపాడటం, మణిపూర్‌లో నగ్నంగా స్త్రీలను ఊరేగిస్తే మౌనమునిలా ప్రధానమంత్రి అక్కడికి వెళ్లకుండా మొహం చాటెయ్యడం వంటివి హైదరాబాద్ రాష్ట్ర పాలకుల్లో లేవు.
ఇక పండుగలు, పబ్చాలు చూస్తే తెలంగాణ వారివి, ఆంధ్ర వారివి పూర్తి వేరు. కానీ, తేడా ఏమిటంటే.. తెలంగాణలో హిందువుల పండుగల్లో ముస్లింలు, ముస్లింల పండుగల్లో హిందువులు మనస్ఫూర్తిగా పాల్గొనడం. గొప్ప, బీద, ఈ మతం, ఆ కులం అని వ్యత్యాసాలు పాటించకపోవడం తెలంగాణ సంస్కృతి లక్షణాలు. వీరి పండుగలు, జాతరలు ఈ విధంగా ఉంటాయి. 12వ శతాబ్దం నుంచీ జరుగుతున్న గిరిజనుల సంబురం సమ్మక్క-సారలమ్మ జాతర. నాగోబా జాతర గోండుల పండుగ. హైమన్‌డార్ఫ్ దంపతులు ఇక్కడ ఉన్నంతకాలం ఈ జాతరలో పాల్గొని ఆనందించేవారు. మంజీరా నది ఏడు పాయలుగా విడిపోయే చోట ఏడుపాయల జాతర జరుపుతారు. అక్కడున్న దుర్గామాత దేవాలయం 12వ శతాబ్దానికి చెందినది. ముత్యంపేట గ్రామ సమీపంలో ఉన్న గుడిలో కొండగట్టు అంజన్న జాతర జరుగుతుంది. యాదవ రాజులు నిర్మించిన లింగమంతులస్వామి దేవాలయంలో పెద్దగొల్లగట్టు జాతర జరుగుతుంది. కొమురవెల్లి జాతర కాకతీయుల కాలం నుంచీ జరుగుతున్నది. శివరాత్రి సందర్భంగా రామలింగేశ్వరస్వామి దేవాలయంలో రామప్ప జాతర జరుగుతుంది. కోటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలతో పాటు జాతర జరుగుతుంది. వేలాల గ్రామంలోని గుట్ట మీద వెలసిన మహాశివుడికి శివరాత్రి రోజున వేలాల జాతర నిర్వహిస్తారు. ఏకశిలా పర్వతం మీద ఉన్న లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో కాకతీయుల కాలం నుంచి బెజ్జంకి జాతర జరుగుతున్నది. పాలమూరు దగ్గర వెలసిన శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో 600 ఏండ్ల నుంచి మన్నెంకొండ జాతర జరుగుతున్నది.
1956 నుంచి ఇక్కడ నివసిస్తూ ఉద్యోగాలు, వ్యాపారాలు చేసి సంపాదించుకుని ఇండ్లు, భవనాలు కట్టుకొని, పాఠశాలలు, కళాశాలలు, దవాఖానలు నిర్మించి తెలంగాణ వారి నుంచి తమ ఆదాయం పొందుతున్న ఆంధ్రవారిని ఈ జాతరలకు వెళ్లారా? అని అడగటం లేదు. వీటన్నింటిలో ఎన్నింటి గురించి మీకు తెలుసని మాత్రం అడుగుతున్నాను.
తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక మొదలైన ఆరేడు రాష్ర్టాల నుంచి లక్షల మంది ఈ జాతరలకు వస్తారు. మేడారం ఆసియాలోనే అతిపెద్ద జాతర. కోట్ల మంది భక్తులు ఈ జాతరలో పాలుపంచుకుంటారు. ఆంధ్ర రాజకీయ నాయకులు తెలంగాణలో అధికారం వెలగబెట్టినప్పుడైనా ఏ ఒక్క జాతరకైనా ఒక్క రూపాయి ప్రభుత్వం తరఫున ఇచ్చారా? తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ ఈ జాతరలకు అధికారికంగా నిధులు సమకూర్చారు.
సంక్రాంతి, శివరాత్రి, వినాయక చవితి, హనుమజ్జయంతి, కృష్ణాష్టమి, శ్రీరామనవమి, ఉగాది, విజయదశమి పండుగలు తెలంగాణ, ఆంధ్ర ప్రజలంతా జరుపుకొనేవి. బోనాలు, హోళీ, బతుకమ్మ, రాఖీ తెలంగాణ వారు ప్రత్యేకంగా జరుపుకొనేవి. ఇందులో హోళీ, రాఖీ పండుగలను ఆంధ్రవారు కూడా ఇప్పటి తరాల్లో జరుపుకుంటున్నారు. ముస్లిం పండుగలైన రంజాన్, మొహర్రం, బక్రీదులో తెలంగాణ హిందువులు పాల్గొంటారు. కానీ, ఆంధ్ర హిందువులు ఆ జోలికి పోరు. ఇక క్రిస్టియన్ పండుగలైన క్రిస్మస్, గుడ్ ఫ్రైడే వంటి వాటిలో కూడా తెలంగాణ హిందువులు పాల్గొంటారు. ఇన్ని జాతరలు, పండుగలు జరుపుకొనే తెలంగాణ ప్రజలకు 1956 నుంచి 2014 దాకా ఆంధ్ర రాజకీయ నాయకుల అధికారంలో ఏ రకమైన వసతులు గాని, నిధులు గాని సమకూర్చలేదు. ఈ అన్యాయంపై ఆంధ్ర పత్రికలు నోరుమెదపలేదు. 3వ శతాబ్దం నుంచీ జరుపుకొంటున్న బతుకమ్మ పండుగ తెలంగాణ మహిళలకు, ప్రజలకు చాలా ముఖ్యమైనది. ఉద్యమ సమయంలో ఆంధ్ర పాలకులకు వ్యతిరేకంగా వారు తెలంగాణ సంస్కృతిని తొక్కిపెడుతున్న కారణంగా సాంస్కృతిక విప్లవం లాగా ఎగిసిపడిందే గానీ, ఆంధ్ర పాలకులు ప్రభుత్వం తరఫు నుంచి ఏ రకమైన సహకారమూ అందించలేదు. పైగా ట్యాంక్‌బండ్ వైపు వెళ్లడానికి కూడా ఆంక్షలు ఉండేవి. ఎందుకంటే అక్కడ ప్రతిష్ఠించిన 33 విగ్రహాల్లో 30 ఆంధ్రవాళ్లవి, 3 మాత్రమే తెలంగాణ వారివి. మరి అక్కడ విగ్రహాలుగా కొలువుదీరిన ఈ ప్రాంతవాసులు కాని వారికి బతుకమ్మ అంటే పడదు కదా!
ఈ రకంగా తెలంగాణ సంస్కృతి, చరిత్రని చెరిపేసే ప్రయత్నాలు చాలా జరిగాయి. మళ్లీ 2023 డిసెంబర్ నుంచీ జరుగుతున్నాయి. తెలంగాణ ప్రజలు మేల్కొని కాంగ్రెస్, తెలుగు (ఆంధ్ర) దేశం ప్రభుత్వాలు తమ ప్రాంతానికి చేసిన నష్టం, హాని, దుర్మార్గాలను గ్రహించి జాగ్రత్తపడకపోతే మళ్లీ అధఃపాతాళానికే!