తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీతో సుమారు 20 నెలల కిందట అసెంబ్లీ ఎన్నికల సమయంలో కుదిరిన సోషల్ కాంట్రాక్ట్ ముగిసిపోయింది. రైతుల కోసం ఎరువులకు సంబంధించి ప్రస్తుతం కనిపిస్తున్న దారుణ వైఫల్యం అందుకు తాజా దృష్టాంతం మాత్రమే. 2023 చివరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు 5 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీలతో కూడిన 42 పేజీల మ్యానిఫెస్టో రూపంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలతో ఒక సోషల్ కాంట్రాక్టు చేసుకున్నది. అందులో ‘వరంగల్ రైతు డిక్లరేషన్’ కూడా ఒకటి. కాని తక్కిన అన్ని డిక్లరేషన్లు, గ్యారెంటీలతో పాటు రైతు డిక్లరేషన్ అమలులోనూ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. ఆ విధంగా ఆ పార్టీతో ప్రజలకు జరిగిన కాంట్రాక్టు భంగపడిపోయింది.
ప్రజాస్వామ్యమన్నదే పాలకులకు, ప్రజలకు మధ్య జరిగే సోషల్ కాంట్రాక్టు. తమను పాలించగలమని ముందుకు వచ్చేవారు తమ కోసం ఏమేమి చేయగలమని చెప్పేదీ ప్రజలు గమనిస్తారు. ఏమేమి చేయాలో ప్రజలు తమ వైపు నుంచి కూడా కోరుకుంటారు. అదేవిధంగా, అట్లా కోరుకునే ప్రజలు చేయవలసిందేమిటో పాలకులు కోరుకుంటారు. అవన్నీ కలిపి వారి మధ్య కాంట్రాక్టు అవుతాయి. ఇక్కడ గమనించవలసిందేమంటే, ఎన్నికైన ప్రభుత్వం తన కాం ట్రాక్టు నిబంధనలను మధ్యలో ఉల్లంఘించినా, చట్ట ప్రకారం రక్షణ ఉంటుంది గనుక తనను ప్రజలేమీ చేయలేరు. తమ వై పు నుంచి కాంట్రాక్టును ఉల్లంఘించే అవకాశం ప్రజలకు ఉండదు. కాకపోతే, ప్రభుత్వం ఉల్లంఘించినప్పుడు నిరసనలు మాత్రం ప్రకటించగలరు. అందువల్ల ప్రభుత్వం మారకపోవచ్చుగాక. కాని, కాం ట్రాక్టును ప్రభు త్వం ఉల్లంఘించిందనేది మాత్రం స్పష్టమవుతుంది.
ఇప్పుడు తెలంగాణలో అదే స్పష్టమవుతున్నది. రైతు ల విషయంలోనే గాక అన్ని విధాలుగా. కొన్ని అమలై కొన్ని కానట్టయితే కాంట్రాక్టు పూర్తిగా విఫలమైనట్టు కాదు. కాని మొత్తం అన్ని డిక్లరేషన్లు, అన్ని గ్యారంటీల పరిస్థితి కూడా ప్రభుత్వ కాల పరిమితి 60 నెలలలో 20 నెలలు గడిచిన వెనుక కూడా కాంట్రాక్టు ఉల్లంఘన మార్గంలోనే సాగుతున్నప్పుడు కలిగే అభిప్రాయం ఏమిటి? ఇక మిగిలిన కాలంలోనైనా వారేదో చేయగలరనే నమ్మకం ప్రజలకు కలగటం లేదు. పాలకుల మాటలు, చేతలు, ప్రవర్తన ఆ నమ్మకాన్ని కలిగించటం లేదు. దానిని బట్టి, తమకు కాంగ్రెస్‌తో కుదిరిన కాంట్రాక్టు ఇంతకాలంలో భంగపడటంతో ఆగక, రాగల కాలంలో మరింత భంగపడగలదన్న అభిప్రాయం వారి కి దాదాపు ఏర్పడిపోయింది.
ఒక కాంట్రాక్టు అంటూ ఇచ్చినప్పుడు తొలి దశలో పాలకుల నుంచి కొన్ని అమలై, కొన్ని తొట్రుపాట్లు కనిపించినా ప్రజలు అర్థం చేసుకుంటారు. సర్దుబాట్లు, దిద్దుబాట్లకు తగు సమయం ఇస్తారు. అంతకుమించితే మాత్రం ఆమోదించలేరు. ఇది అంత టా జరిగేదే. తెలంగాణలో తొలి దశ అనేది గడిచిపోయింది. ప్రభుత్వం స్వయంగా పెట్టుకున్న 100 రోజుల గడువు, సాధారణంగా పరిశీలకులు ఇచ్చే 180 రోజుల (6 మాసాలు) హనీమూన్ గడువు, 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వం పెట్టుకున్న 354 రోజుల (1 సంవత్సరం) గడువు అన్నీ పూర్తయ్యాయి.
కాంట్రాక్టు జరిగి ఇప్పటికి 600 రోజులవుతున్నది. కానీ ప్రభు త్వం తాను చేయవలసింది చేయకుండా ఇంకా గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ గడుపుతున్నది. ఎప్పు డో ఒకసారి గాక ప్రతిరోజూ అదే పని చేస్తున్నది. మొత్తం ప్రభుత్వంలో, పార్టీ యంత్రాంగంలో ప్రతి ఒక్కరూ అదే పని చేస్తున్నారు. దీనితో ప్రజలకు వారితో గల కాం ట్రాక్టు వైఫల్యం నుంచి, అప నమ్మకం నుంచి, జుగుప్సా రూపాన్ని తీసుకుంటున్నది. మరింత విసుగెత్తిస్తున్నది.
ఇంతవరకు చెప్పుకొన్న ఈ లక్షణాలన్నీ 5 డిక్లరేషన్లు, 6 గ్యారంటీలతో కూడిన మొత్తం మ్యానిఫెస్టో విషయంలో కనిపిస్తుండగా, ప్రస్తుతం వ్యవసాయానికి ఎరువుల తతంగాన్ని సంకేతప్రాయం చేసుకొని ప్రతిరోజూ మన కండ్ల ఎదుటనే మరింత కొట్టవచ్చినట్టు మారింది. రైతాంగంతో జరిగిన కాంట్రాక్టు ఉల్లంఘనను కొద్దిసేపు అట్లుంచి ఎరువుల విషయం చూద్దాం. అది తక్షణ సమస్యగా మారినందున. వాస్తవానికి ఆ విషయాలు ప్రతిరోజు పత్రికలలో, ఛానళ్లలో వస్తున్నవే అయినందున అదనంగా చెప్పుకోవలసింది కూడా ఏమీ లేదు. అయి నా రెండు మాటలు అనుకోవాలంటే, ఇటువంటి విషయాలలో ప్రభుత్వం సీజన్ కన్న ముందునుంచే ఎరువులు నిల్వ చేసుకోవాలి. అవి పక్కదారి పట్టకుండా, నల్ల బజారుకు తరలకుండా జాగ్రత్తపడాలి.
ఏవైనా సమస్యలుంటే రైతులకు పారదర్శకంగా తెలియజేయాలి. మొత్తం ప్రభుత్వానిది ఒకే మాటగా ఉండాలి. కానీ, వీటిలో ఏ ఒక్కటీ జరగటం లేదు. సమస్య అక్కడ వస్తున్నది. పైగా, ఒక మంత్రి ఎరువుల కొరత లేదంటే ఒక మంత్రి ఉన్నదంటారు. కొరత లేనట్టయితే రైతులు ఇంకా తెల్లవారక ముందునుంచే వరుసలు కట్టడం ఎందుకు? నిల్వలు అయిపోయి మధ్యలోనే తిరిగిపోవ టం ఎందుకు? ఫర్లాంగు పొడవున చెప్పుల వరుసలు ఎందుకు? వారిపై పోలీసు జులుం ఎందుకు? రైతులు ఆందోళన చేసేదాకా ఎందుకు వచ్చింది?
అసలు అవసరమెంత, ఉన్న నిల్వలెన్ని? అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోవటం ఎందువల్ల? ఇవేమీ చేయలేని ప్రభు త్వం అనబడే కాంట్రాక్టర్, కొరత ఉంది గాని అది నిజం గా లేనిదని, ఎవరో సృష్టిస్తున్నదనీ, కొతర రాష్ట్రంలో లేదు కాని దేశమంతటా ఉందనీ; కొరత లేదు కాని పత్రికలు రాస్తూ ప్రతిపక్షం మాట్లాడుతున్నందుకే కొరత కనిపిస్తున్నదనీ; కొరత లేదు కాని కేంద్రం సరఫరా చేయనందుకే కొరత వచ్చిందని; కొరత లేదు కాని త్వరలో అదనపు సరఫరాలు రానున్నాయనీ; రైతులు ఆందోళన చెందవద్దని, కాని క్యూలో నిలబడినవారు, ఆందోళన చేసేవారు, చెప్పుల వరుసలు పెట్టేవారు అసలు రైతులే కారనీ చిత్ర విచిత్రమైన ప్రకటనలతో నవ్వుల పాలవుతున్నారు. ఇది చాలదన్నట్టు రాష్ర్టానికి చెందిన కేంద్ర మంత్రి కావలసినన్ని నిల్వలు పంపాము, అవి ఏమయ్యాయో తెలవటం లేదని, కొరత కొరత అనటంతోనే కొరత వచ్చిందంటూ మొత్తం మీద కొరత మాట వాస్తవమంటున్నారు. ఇదంతా చూసి రైతులకు అనివార్యంగా గత ప్రభుత్వం గుర్తుకువస్తున్నది.
దీనంతటిని బట్టి తెలంగాణ రైతులు ఏమని అర్థం చేసుకోవాలి? ఎవరూ ఏమీ చెప్పనక్కరలేదు. వారికి అర్థమయ్యేది అవుతూనే ఉన్నది. మనకన్నా బాగా అర్థమవుతుంది కూడా. ఎందుకంటే మనం వ్యవసాయరంగానికి బయటి మనుషులం. రైతులు స్వయంగా ఆ రంగంవారే గాక కాంగ్రెస్ పార్టీతో 20 మాసాల క్రితం సోషల్ కాంట్రాక్టు రాసి, అధికారంలోకి తెచ్చి, నమ్మి ఎదురుచూస్తున్నవారు. వాస్తవానికి ఈ ఎరువుల విషయమే కాదు. ‘వరంగల్ రైతు డిక్లరేషన్’లోని మొత్తం 9 అంశాల అమలు కోసం వారు గత 20 నెలలుగా వేచిచూస్తూనే ఉన్నారు.
ఆ 9 అంశాలు ఏమిటన్నది మ్యానిఫెస్టోను తిరగవేసి గమనిస్తే ఈ విధంగా ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ, రైతులతో పాటు కౌలు రైతులకు ఏడాదికి ఎకరానికి రూ.15 వేలు; భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు; అన్ని పంటలను మెరుగైన మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేయటం, మూతబడిన చక్కెర కర్మాగారాలు తెరవటం; తక్షణ పరిహారం ఇచ్చే ట్టు పంటల బీమా పథకం; రైతు కూలీలకు, భూమి లేని రైతులకు రైతు బీమా; ఉపాధి హామీ పథకం పంటలకు అనుసంధానం; పోడు రైతులకు, అసైన్డ్ వారికి అన్ని యాజమాన్య హక్కులు; ప్రతి ఎకరానికి నీరందేట్లు ప్రాజెక్టుల పూర్తి, మొత్తం 10 రకాల పంటలకు కొత్త మద్దతు ధరల జాబితా మ్యానిఫెస్టోలో ప్రకటన.
ఆ డిక్లరేషన్‌లోని రైతు కమిషన్ ఏర్పాటు, ధరణి పోర్టల్ రద్దు వంటి రెండు మూడు మినహా, ఇంతవరకు జరిగిందేమీ లేదు. రైతాంగంతో కాంట్రాక్టుకు సంబంధించి మొత్తం 60 నెలల పాలనా కాలంలో 20 నెలలు గడిచేసరికి పరిస్థితి ఇది కాగా, ఇక మిగిలింది 40 నెలలు. అందులో చివరి 6 నెలలు చేసేందుకు ఏమీ ఉండదు. ఇది రైతులకు తెలియనిది కాదు. సమస్య ఏమంటే, ఇంతవరకు చేసింది అతిస్వల్పం కాగా, కనీసం మునుముందు చేయగల లక్షణాలు కూడా కనిపించటం లేదు.
కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్‌ను తయారు చేసి ప్రకటించినప్పుడు, అధికారానికి వచ్చినప్పుడు, ఈ కాంట్రాక్టును అమలుపరచటంలోని సాధక బాధకాలు తెలియనివా? అంతటి విద్యావంతులకు, ఎంతో అనుభవం గలవారికి తెలియదని ఎవరూ భావించరు. వారు చేసింది వరుసగా రెండు సార్లు గెలవలేకపోయిన తాము ఎట్టి పరిస్థితుల్లోనూ మూడవ సారైనా అధికారం సంపాదించటం కోసం, పచ్చి మోసపూరితమైన కాంట్రాక్టును ప్రకటించటం. ఏమిచేసినా చేయకున్నా ఐదేండ్లయితే అధికారం అనుభవించవచ్చు గదా అనుకోవటం. ఆ లోపల రైతులు గాని మరొకరు గాని ఏమీ చేయలేరు గదా అన్న ధీమా.
కాంగ్రెస్ కాంట్రాక్టు రైతులతో గత 20 నెలలుగా అన్నివిధాలూ భంగపడుతూ ఇప్పుడు ఎరువుల విషయమై మరొకమారు భంగపడుతున్నది. అయితే, భంగపాటు రైతుల విషయంలోనే కాదు. 5 డిక్లరేషన్లు, 6 గ్యారంటీలని పైన అనుకున్నాం. అవన్నీ తెలంగాణ ప్రజలలో, వేర్వేరు వర్గాలకు సంబంధించినవి. అవన్నీ కూడా ఇదేవిధంగా భంగపడుతున్నాయి. అవేమిటో ఆయా వర్గాల వారు గుర్తించి మాట్లాడుకుంటున్నవే. మొత్తం సమాజ స్థాయిలోనూ చర్చకు వస్తున్నవే. ఆసక్తికరం ఏమంటే, పైకి ఒప్పుకోకుండా బుకాయించటమో, మౌనంగా ఉండటమో చేస్తున్నారు గాని, స్వయంగా కాంగ్రెస్‌వాదులు కూడా తమలో తాము చెప్పుకొంటున్నవే. రోజులు ఇదేవిధంగా గడిచేకొద్దీ వారిలో ప్రజలు ఏమి చేయగలరోననే భయాలు కూడా మొదలవుతాయి.
– టంకశాల అశోక్