ట్విటర్ పోలింగ్ ద్వారా కాంగ్రెస్ సెల్ఫ్‌గోల్ చేసుకున్న విషయం తెలిసిందే. ఆ పోలింగ్‌లో అధికార కాంగ్రెస్ పార్టీకి అతి స్వల్పంగా ఓట్లు పోల్ కాగా, బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువగా ఓట్లు పోల్ అయ్యాయి. దీంతో కంగుతిన్న కాంగ్రెస్ పార్టీకి దిమ్మతిరిగి మైండ్ బ్లాకయిపోయింది. మరునాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జహీరాబాద్‌కు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో అధికార పక్షాన్ని ఉద్దేశించి ‘నేను కొడితే మామూలుగా ఉండదు’ అని హెచ్చరించడంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సహా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల వెన్నులో వణుకు పుట్టింది. దటీజ్ కేసీఆర్. ఆ మాటలు కేసీఆర్ ఆషామాషీగా చెప్పలేదు. ఆయన కొట్టిన దెబ్బలకు చరిత్రే సాక్ష్యం.
అయినా.. పిల్ల కాకికేం తెలుసు ఉండేలు దెబ్బ అన్నట్టు కేసీఆర్ దెబ్బ రేవంత్ రెడ్డికి ఎలా తెలుస్తుంది. తమ అధినేత్రి సోనియా గాంధీ, గురువు చంద్రబాబులకు బాగా తెలుసు. కేసీఆర్ కొడితే మామూలుగా ఉండదని నేనెందుకు చెప్తున్నానంటే.. అందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి. 2001లో డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి టీడీపీ నుంచి బయటికి వచ్చినప్పుడు అందరూ కేసీఆర్‌ను హేళన చేశారు. మంత్రి పదవి రాలేదని తెలంగాణ రాగమందుకున్నారని విమర్శించారు. కానీ, తెలంగాణ సాధించాలన్న లక్ష్యాన్ని తన నరనరాన ఎక్కించుకున్న కేసీఆర్ స్వరాష్ట్ర సాధనే ఏకైక ఆశయంగా 2001లో టీఆర్ఎస్ను స్థాపించి 2014 జూన్ 2న తెలంగాణ సాధించారు. ఇది సమైక్యాంధ్ర నాయకులకు కేసీఆర్ కొట్టిన పెద్ద దెబ్బ.
తెలంగాణ వస్తే చీకటిమయమవుతుందని ఉమ్మడి ఏపీ చివరి సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి కేసీఆర్ కొట్టిన దెబ్బతో పాపం కనుమరుగైపోయాడు. అంతెందుకు తెలంగాణ రాష్ర్టాన్ని అస్థిరపరచాలని నాడు చంద్రబాబు నాయుడు చేయని కుట్రలు లేవు. ఆయన కుయుక్తులను పసిగట్టిన కేసీఆర్ కోలుకోలేని దెబ్బకొట్టారు. ఆయన దెబ్బకు చంద్రబాబు హైదరాబాద్‌ను వదిలి పలాయనం చిత్తగించారు. అంతటితో ఆగకుండా 2018లో మరోసారి తెలంగాణ వ్యతిరేక పార్టీ అయిన కాంగ్రెస్‌తో జతకట్టి కేసీఆర్‌పై దండయాత్ర చేయాలని చూశారు. ఈసారి కొట్టిన దెబ్బతో తెలంగాణలో సైకిల్ పంచరై పాత ఇనుప సామాన్లకు కూడా పనికిరాకుండా పోయింది. ఇప్పుడు విర్రవీగుతున్న రేవంత్‌రెడ్డి కూడా కేసీఆర్ కొట్టే దెబ్బకు కనుమరుగు కావడం ఖాయం. నల్లారి వారికి పట్టిన గతే, ఎనుముల వారికి పడుతుంది. అదెంతో దూరం లేదు సుమా.
– గ్యాదరి బాలమల్లు, కార్పొరేషన్ మాజీ చైర్మన్