తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి దిశ పూర్తిగా మారిపోయింది. ఉద్యమ ఆకాంక్షలతో ప్రారంభమైన ఈ ప్రయాణం నేడు ఒక గ్లోబల్ అవకాశాల కేంద్రంగా రూపాంతరం చెందింది. ఈ మార్పులో రెండు ప్రధాన శక్తులు కీలక పాత్ర పోషించాయి. విదేశాల్లో ఉన్న తెలంగాణ ఎన్ఆర్ఐలు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, కేటీఆర్ చొరవ.
విదేశాల్లో నివసిస్తున్న తెలంగాణ ఎన్ఆర్ఐలు కేవలం వ్యక్తిగత విజయాలకే పరిమితం కాకుండా తమ మూలాలను మరచిపోకుండా స్వంత రాష్ట్రం అభివృద్ధికి ఒక బలమైన గ్లోబల్ బ్రిడ్జ్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వారు అంతర్జాతీయ వేదికలపై ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని చాటిచెప్పి, ఉద్యమానికి అంతర్జాతీయ గుర్తింపును తీసుకువచ్చారు. ఆర్థిక, మానసిక, రాజకీయ మద్దతుతో ఉద్యమాన్ని బలోపేతం చేయటానికి ఇతోధికంగా దోహదపడ్డారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎన్ఆర్ఐల పాత్ర మరింత విస్తరించింది. పెట్టుబడులు, స్టార్టప్ మెంటరింగ్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, స్కిల్ డెవలప్మెంట్, ఆర్ అండ్ డీ సహకారం వంటి రంగాల్లో వారు రాష్ట్ర అభివృద్ధికి ప్రపంచ అనుభవాన్ని తీసుకువస్తున్నారు. ముఖ్యంగా ఐటీ, ఫిన్‌టెక్, హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్ రంగాల్లో వారి గ్లోబల్ నెట్వర్క్ రాష్ట్ర అభివృద్ధికి బలమైన ఆధారంగా మారింది. ఎన్ఆర్ఐలు కేవలం పెట్టుబడిదారులు మాత్రమే కాకుండా, తెలంగాణ సంస్కృతి, భాష, గుర్తింపును విశ్వవ్యాప్తంగా ప్రచారం చేసే సాంస్కృతిక అంబాసిడర్లుగా కూడా నిలుస్తున్నారు.
తెలంగాణ ఎన్ఆర్ఐల అభివృద్ధి ప్రయాణంలో రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం కీలకమైన మలుపుగా నిలిచింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రం పురోగమన పథంలో పయనించింది. ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని దశాబ్దాలపాటు వనరుల కొరత, పెట్టుబడుల అనిశ్చితి, అభివృద్ధి లోపం వంటి సమస్యలను ఎదుర్కొన్న తెలంగాణను కేసీఆర్ తనదైన సరికొత్త విజన్‌తో వేగంగా అభివృద్ధి దిశగా నడిపించారు. కేసీఆర్ దూరదృష్టి, విజన్‌ను నూటికి నూరుపాళ్లు కార్యరూపం దాల్చేలా చేయటంలో బీఆర్ఎస్ అగ్ర నేత కేటీఆర్ కీలక పాత్ర పోషించారు. యువ నాయకుడిగా ఆయన చూపిన చురుకుదనం, వేగవంతమైన నిర్ణయాలు, గ్లోబల్ దృష్టి తెలంగాణ అభివృద్ధి యాత్రను ఉన్నతసాయికి తీసుకెళ్లాయి. పాలనను కేవలం విధానాల స్థాయిలో కాకుండా ఫలితాల స్థాయికి తీసుకెళ్లే విధంగా ఆయన సమర్థవంతంగా కృషి చేశారు.
పెట్టుబడుల ఆకర్షణ, ఐటీ రంగం విస్తరణ, హైదరాబాద్ నగర రూపాంతరం, స్టార్టప్‌లు, ఎకోసిస్టమ్ వంటి అంశాల్లో కేటీఆర్ కీలక పాత్ర పోషించారు. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు, అమెరికా, యూరప్, ఆసియా వంటి దేశాల్లో అంతర్జాతీయ రోడ్‌షోల ద్వారా ప్రపంచంలోని పెట్టుబడిదారులను నేరుగా తెలంగాణతో అనుసంధానించటంలో ఆయన కృతకృత్యులయ్యారు. ఆయన చేసిన ప్రయత్నాలతో తెలంగాణలో గ్లోబల్ కంపెనీలు, ఆర్ అండ్ డీ కేంద్రాలు, టెక్ హబ్‌లు స్థాపించేందుకు బలమైన పునాది ఏర్పడింది. ఈ క్రమంలో తెలంగాణను ఒక గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్‌గా మార్చటంలో కేటీఆర్ వ్యూహాత్మక చొరవ ప్రధాన పాత్ర పోషించింది.
ఎన్ఆర్ఐల గ్లోబల్ నెట్వర్క్, కేటీఆర్ సమర్ధ నాయకత్వం కలగలసి తెలంగాణకు ఒక శక్తివంతమైన అంతర్జాతీయ ఎకోసిస్టమ్‌ను నిర్మించాయి. ఎన్ఆర్ఐలు పెట్టుబడులు పెట్టటానికి ఆసక్తి చూపటం, టెక్నాలజీని తీసుకువస్తే వాటిని పాలసీ, అభివృద్ధి రూపంలో అమలు చేయటంలో కేటీఆర్ ముద్ర చెరగనిది. ఈ సమన్వయమే తెలంగాణను ఒక ప్రాంతీయ రాష్ట్రం నుంచి గ్లోబల్ అవకాశాల కేంద్రంగా మార్చింది.
గ్లోబల్ స్పీకింగ్, పాలసీ ఇన్ఫ్ల్లుయెన్స్, అంతర్జాతీయ పెట్టుబడుల కోసం దౌత్యం నెరపడం, విశ్వవేదికలపై తెలంగాణ పేరును ప్రతిధ్వనించే అంశాలు కేటీఆర్ నాయకత్వాన్ని మరింత బలపరిచాయి. అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లు, పాలసీ సమ్మిట్లు, వ్యాపార వేదికల ద్వారా ఆయన తెలంగాణ అభివృద్ధి మాడల్‌ను ప్రపంచానికి సమర్థంగా పరిచయం చేశారు.
డిజిటల్ ఇన్ఫ్లుయెన్స్, లింక్డ్ఇన్ గుర్తింపులో కూడా కేటీఆర్ ప్రత్యేక స్థానం దక్కించుకున్నారు. ఆధునిక డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పెట్టుబడిదారులు, యువత, స్టార్టప్ వ్యవస్థాపకులతో ఇప్పటికీ నేరుగా సంభాషిస్తూ తెలంగాణ అవకాశాలను ప్రపంచానికి చేరవేస్తున్నారు. అదేవిధంగా యువత, జెన్‌జీపై ఆయన గ్లోబల్ దృక్పథం స్పష్టంగా కనిపిస్తున్నది. ఆయన దృష్టిలో జెన్‌జీ ఒకే కథ కాదు..అది విభిన్న వాస్తవాల సమాహారం. ఒకవైపు గ్లోబల్ స్టార్టప్‌లు నిర్మిస్తున్న యువత, మరోవైపు అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ప్రతిభావంతమైన యువత. సమస్య అనేది ప్రతిభలో కాదు, అవకాశాలు, ఎకోసిస్టమ్‌లో ఉందని ఆయన స్పష్టం చేశారు.
డయాస్పోరా స్థాయిలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు ప్రపంచవ్యాప్తంగా ఐక్యతకు వేదికలుగా మారాయి. ఉదాహరణకు 2025లో డల్లాస్‌లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో అమెరికాలో ఉన్న తెలంగాణ ఎన్ఆర్ఐలు పెద్ద సంఖ్యలో పాల్గొని రాష్ట్ర అభివృద్ధికి తమ సంపూర్ణ భాగస్వామ్యాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై తెలంగాణ అభివృద్ధిలో ఎన్ఆర్ఐల పాత్రను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. ఆయన ఈ వేదికలో పెట్టుబడులు, స్టార్టప్ భాగస్వామ్యం, స్కిల్ డెవలప్మెంట్, గ్లోబల్ నెట్వర్క్ ద్వారా తెలంగాణతో మరింత గట్టి అనుసంధానం కావాలని సూచించారు. భవిష్యత్తులో కూడా డల్లాస్ వంటి గ్లోబల్ నగరాల్లో జరిగే ఎన్ఆర్ఐ సమావేశాలు తెలంగాణ అభివృద్ధికి దిశానిర్దేశం చేసే కీలక వేదికలుగా మారతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
అదేవిధంగా మలేషియాలో జూన్‌లో జరుగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కూడా ఎన్ఆర్ఐల గ్లోబల్ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు సాగనున్నాయి. ఈ కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ సమాజాన్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చి, పెట్టుబడులు, నైపుణ్యాలు, టెక్నాలజీ, సహకారం రాష్ట్ర అభివృద్ధికి అనుసంధానించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది భవిష్యత్తులో ప్రతి దేశంలోని ఎన్ఆర్ఐలను ఒక సమన్వయ గ్లోబల్ అభివృద్ధి భాగస్వామ్య వ్యవస్థగా మార్చే దిశగా ఓ కీలక అడుగు పడనున్నది.
మొత్తంగా చూస్తే, కేటీఆర్ ఒక ప్రాంతీయ నాయకుడి పరిమితులను దాటి, గ్లోబల్ పెట్టుబడిదారులు, డయాస్పోరా కమ్యూనిటీ, యువత, పాలసీ ప్రపంచాన్ని అనుసంధానించే ఒక ఆధునిక గ్లోబల్ ఇన్ఫ్లుయెన్సర్గా ఎదిగారు. ఆయన పాత్ర తెలంగాణను కేవలం అభివృద్ధి రాష్ట్రంగా కాకుండా, ప్రపంచ స్థాయి అవకాశాల కేంద్రంగా నిలబెట్టటంలో కీలకంగా మారింది.
చెన్నైలో ఇటీవల జరిగిన ఒక రాజకీయ వేదిక సమావేశానికి హాజరైన సందర్భంగా కేటీఆర్ మా ట్లాడుతూ డీలిమిటేషన్ విధానం దక్షిణ రాష్ర్టాల పార్లమెంటరీ ప్రాతినిధ్యాన్ని బలహీనపరుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధంగా ఆయన ప్రాంతీయ హక్కుల పరిరక్షణపై నిక్కచ్చిగా, గట్టిగా తన అభిప్రాయాన్ని ప్రకటించారు. ఈ సంద ర్భం..ఆయన పాత్రను కేవలం గ్లోబల్ స్థాయిలోనే కాకుండా, ప్రతి రాజకీయ వేదికలోనూ తెలంగాణ ప్రయోజనాలు, దక్షిణ భారత రాష్ర్టాల హక్కుల కోసం నిలబడే నాయకుడిగా చూపిస్తున్నది.
– గుర్రాల నాగరాజు
0027765537388