రెండు పుష్కరాలు దాటిపోయింది. రాజకీయ క్రీడ ఎంత బలవత్తరంగా సాగినా.. ఓ వ్యక్తి వ్యక్తిత్వం రసవత్తరంగా ఆవిష్కృతమైన ఘట్టం అది. అంకెల లంకెపై శంకలున్నా.. దేశమంతా తన వంక గర్వంగా చూస్తున్నా.. ఆయన మిడిసిపాటుతో రంకెలు వేయలేదు. 1999లో అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఒక్క ఓటుతో ప్రధాని పదవి కోల్పోయిన అటల్ బిహారీ వాజపేయిని వికాస్ పురుష్ అని అందుకే అన్నారేమో!
అవిశ్వాసాన్ని ఎదుర్కోవడం ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి సులభమే కావొచ్చు! కానీ, ప్రజల విశ్వాసాన్ని పొందడం మాత్రం కష్టసాధ్యమే! ‘2023లోనూ నాపై అవిశ్వాసం తీసుకొచ్చేలా మీకు అవకాశం రావాలి. అందుకు మీరు సిద్ధమవ్వాలని కోరుకుంటున్నా’ 2019 బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలివి. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ప్రధాని మాటల్లో అతి విశ్వాసం గోచరిస్తున్నది కానీ, ఆత్మ విశ్వాసం కాదు! ఇలా అతిగా స్పందించే తీరు ప్రధానికి ఎప్పట్నుంచో ఉన్న వైఖరే! ఒకసారి సాటి పార్లమెంట్ సభ్యురాలి నవ్వును రామాయణం సీరియల్లో ‘శూర్పణఖ’ హాసంతో పోల్చి పరిహసించి ఛప్పన్ ఇంచ్ ఛాతీని మరో రెండు అంగుళాలు పెంచుకున్న తీరు మనకింకా గుర్తు! మరో సందర్భం 2018లో పార్లమెంట్లో తన ప్రసంగం తర్వాత మోదీ దగ్గరికి వెళ్లి ఆయన్ను ఆలింగనం చేసుకోవడాన్ని కాసేపు రాహుల్ అపరిపక్వతే అనుకుందాం! కానీ, ఆ వెంటనే ‘ఉఠో.. ఉఠో.. ఉఠో..’ అంటూ స్కూల్ పిల్లాడిలా మోదీ స్పందించిన తీరు మాత్రం ప్రధాని స్థాయికి తగ్గట్టుగా అనిపించలేదు.
గతంలో పార్లమెంట్లో చర్చల సందర్భంగా పలువురు సభ్యులు వింతవింతగా ప్రవర్తించిన దాఖలాలు కోకొల్లలు. కానీ, ప్రధాని పీఠంపై కూర్చున్నవాళ్లు వాటిని హుందాగా స్వీకరించేవారు. గంభీరంగా సమాధానం చెప్పేవారు. ఇప్పుడున్న ప్రధానికి ఆ ఓపిక లేకపోవడం గర్హనీయం. వ్యక్తిగా ఆ తీరు వారికీ, వారి అనుయాయులకూ సమ్మతమే కావొచ్చు. వారిని అంతగా సమ్మోహితం చేశారని భావించవచ్చు. కానీ, ఇది ప్రధాని పీఠానికి వన్నె తీసుకురాకపోగా… దాని స్థాయిని మరింత దిగజారుస్తుంది! ‘మీ వ్యక్తిత్వంలో నాకు రెండు పార్శాలు కనిపిస్తున్నాయి. మీలో చర్చిల్ కనిపిస్తున్నాడు, చాంబర్లిన్ కూడా కనిపిస్తున్నాడు’ అని దేశ తొలి ప్రధాని నెహ్రూను అప్పటి ఎంపీ వాజపేయి కాస్త ఘాటుగానే విమర్శించారు. దానికి నెహ్రూ ఊగిపోలేదు. ఉద్రిక్త పడలేదు సరికదా.. నాటి సాయం త్రం అనుకోకుండా తారసపడిన వాజపేయితో ‘భలే మాట్లాడావోయ్! ఇలాగే కొనసాగించు’ అని భుజం తట్టారు. ఇదే వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు లాలూప్రసాద్ యాదవ్ ‘మీరు మంచి వ్యక్తే కానీ, తప్పుడు పార్టీలో ఉన్నారు’ అని వాగ్బాణం సంధించారు. దానికి ఆ పెద్దాయన చిన్నగా నవ్వి ఊరుకున్నారే కానీ, ‘మేరా దేశ్.. మేరా పార్టీ.. సాథియో..’ అని ఊకదంపుడు లెక్చర్లివ్వలేదు. ఇన్ని విషయాలనూ ప్రస్తావించడం దేనికంటే.. మణిపూర్ను కుదిపేస్తున్న, దేశాన్ని కలచివేస్తున్న దుర్ఘటనలపై సుదీర్ఘ మౌనం పాటించిన ప్రధాని ప్రతివిమర్శే సమాధానంగా ఎంచుకుంటారన్నది అందరి అంచనా! అందుకు పార్లమెంట్ సాక్షిగా ఆయన చేసిన గత ప్రసంగాలే ఉదాహరణ. అదానీతో సంబంధాలపై నిలదీస్తే..
‘ఫలానా రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చి ఇన్నేండ్లయింది. ఈ రాష్ట్రంలో మీ ఓట్ల శాతం ఇంత దిగజారిపోయింది..’
అని విపక్షాలను తూర్పారబట్టానని అనుకున్నారే కానీ, అదానీపై తనకెందుకు అంత అవ్యాజమైన అభిమానమో చెప్పలేదు! ఇప్పుడూ ఇదే పద్ధతిని అవలంబించినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు.
విపక్షాలను విమర్శించడం తప్ప.. తమ రాష్ర్టానికి ఒక భరోసా, తమ మహిళలకు రక్షణ కల్పించే వచనాలు ప్రధాని మోదీ నోటి వెంట పెగలవని సగటు మణిపూర్వాసి ఆందోళన.
ఆ రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై నాలుగైదు రోజుల కిందట స్పందించిన మోదీ ‘రాజస్థాన్.. ఛత్తీస్గఢ్, మణిపూర్..’ తదితర రాష్ర్టాల్లో జరుగుతున్న అకృత్యాలపై కఠినంగా స్పందించాల్సిన అవసరం ఉన్నది’ అన్నారు. జాతి యావత్తూ కలత చెందిన అంశంలో, దేశ ప్రతిష్ఠ దెబ్బతింటున్న తరుణంలోనూ రాజకీయ కోణంలోనే ఆయన మాట్లాడారు. దేశ ప్రధానిగా కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలపై విమర్శలకే మొదటి ప్రాధాన్యం ఇచ్చారు. తర్వాతే మణిపూర్ దుస్సంఘటనలపై పెదవి విరిచారు. పార్లమెంట్లోనూ అదే తరహాలో స్పందిస్తారని దేశవాసుల అనుమానం! వీటికితోడు దేశ పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూలేని విధంగా ‘మోదీ.. మోదీ..’ అని కాషాయ సభ్యులంతా బల్లలు మోదుతుంటే ప్రధాని పీఠం కలవరపాటుకు గురై ఉంటుందన్నది కాదనలేని సత్యం. ఈ దఫా ‘విశ్వగురు’ భజన మరేస్థాయిలో ఉంటుందో చూడాలి. చివరగా, 1999 అవిశ్వాసం సందర్భంగా సంఖ్యాబలం లేకపోయినా.. అప్పటి ప్రధాని వాజపేయి ముఖంలో నిఖార్సయిన నిజం కనిపించింది. ఈ నాడు కావాల్సిన దానికన్నా అధికంగా సంఖ్యా బలమున్నా.. మోదీ ముఖంలో అబద్ధం విస్పష్టంగా కనిపిస్తున్నది. ‘సాథియో.. తయార్ రహో’!!
– కణ్వస