1995 తర్వాత ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను నాటి ప్రభుత్వాలు స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులను చేశాయి. అయితే, ఆ నిబంధనను రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కొనసాగించడం సరికాదు. 1990లలో దేశంలో జనాభా విస్ఫోటనం సంభవించి దశాబ్ద వృద్ధిరేటు 24కు చేరింది. దాంతో జనాభా నియంత్రణ కోసం ముగ్గుర పిల్లల నిబంధనను తెచ్చారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం దేశంలో సంతానోత్పత్తి రేటు 2 కాగా, తెలంగాణలో అది 1.9గా ఉంది. జనాభా శాస్త్రవేత్తలు 2.1ని ఆదర్శనీయ సంతానోత్పత్తి రేటుగా చెప్తుంటారు. కానీ, మన దేశంలో గాని, రాష్ట్రంలో గాని అంతకంటే తక్కువే నమోదవడం గమనార్హం.
ఈ నేపథ్యంలో భవిష్యత్తులో రాష్ట్ర, దేశ జనాభా వృద్ధిరేటు గణనీయంగా తగ్గడంతోపాటు పని చేసే జనాభా కూడా తగ్గుతుందని, ఇది ఆర్థిక వ్యవస్థకు ఏ మాత్రం మంచిది కాదని జనాభా శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హులని చెప్పడం సహేతుకం కాదు. మన రాష్ట్రంలోనే 2018లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఈ నిబంధనను ఎత్తేసిన ఎన్నికల సంఘం.. గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో మాత్రం ఇంకా కొనసాగించడం ఏ విధంగా సమర్థనీయం? ఒకే రాష్ట్రంలో ద్వంద్వ ప్రమాణాలు పాటించడం ఏమిటి? ఈ చర్యలు రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 14, 15లను ఉల్లంఘించడమే.
మన పితృస్వామ్య వ్యవస్థలో కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉండాలనే విషయమై తల్లికి దాదాపుగా ఎలాంటి నిర్ణయాధికారం లేదు. అంటే ఒక మహిళ తన ప్రమేయం లేకుండానే ఒకవేళ ముగ్గురు పిల్లలను కలిగి ఉంటే, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోతుంది. కాబట్టి మహిళా సాధికారత సాధించాలన్నా, లింగవివక్షను రూపుమాపాలన్నా, పనిచేసే జనాభా పెరగాలన్నా ముగ్గురు పిల్లల నిబంధనను ఎత్తివేయాలి.
-శాగ శ్రీనివాస్