అరువై ఏండ్ల వలసాంధ్రుల పాలనలో తెలంగాణ వంచించబడుతున్న క్రమాన్ని చూసిన కేసీఆర్ చలించిపోయారు. అందుకే టీఆర్ఎస్ అనే ఉద్యమ పార్టీని స్థాపించి, స్వరాష్ట్రమే లక్ష్యంగా ఉద్యమించి నాలుగు కోట్ల ప్రజల అరువై ఏండ్ల స్వప్నమైన తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారు. అంతేకాదు, రాష్ట్ర ఆవిర్భావ అనంతరం పదేండ్ల పాలనలో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలుచేసి అనతికాలంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని అగ్రపథాన నిలిపారు. తెలిసో, తెలియకో చేసిన తప్పిదాల వల్ల తెలంగాణ రాష్ట్రం మళ్లీ కాంగ్రెస్ పాలకుల చేతికే వెళ్లింది. ఫలితం.. అగ్రపథాన ఉన్న తెలంగాణ మళ్లీ అధఃపాతాళానికి పడిపోతున్నది.
ఆరు దశాబ్దాల సమైక్య పాలనను, బీఆర్ఎస్ పదేండ్ల పాలనను మనం చూశాం. అరువై ఏండ్లలో కాని అభివృద్ధి, ఒక్క దశాబ్ది కాలంలో ఎలా సాధ్యమైంది? అంటే బీఆర్ఎస్ ఒక్క రాజకీయ పార్టీనే కాదు, తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం పనిచేసే పార్టీ. పాతికేళ్లుగా తెలంగాణ ప్రయోజనాలను, తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని నరనరాన నింపుకొని పనిచేస్తున్న పార్టీ. తెలంగాణ ప్రాంత చారిత్రక అవసరం కోసం తెలంగాణ గడ్డ ప్రసవించిన బిడ్డ బీఆర్ఎస్ పార్టీ. నాడు అధికారంలో ఉన్నా, నేడు ప్రతిపక్షంలో ఉన్నా ఉద్యమ సారథి కేసీఆర్ మొదలు, నాయకులు, కార్యకర్తల దాకా పనిచేస్తున్నది తెలంగాణ ప్రజా సంక్షేమం కోసమే, తెలంగాణ బాగు కోసమే. ఈ విషయం విజ్ఞులైన తెలంగాణ ప్రజలకు తెలుసు. అందుకే కదా? ఏడాదిన్నర గడవకముందే మళ్లీ కేసీఆరే రావాలని కోరుకుంటున్నారు.
తెలంగాణపై ప్రేమ, ఇక్కడి ప్రజల ఆలనా, పాలన చూసుకునేది ఒక్క బీఆర్ఎస్ పార్టీనే అని ప్రజలకు అర్థమైంది. కాంగ్రెస్ కాదు, వేరే ఏ ఇతర పార్టీలకు తమపై ప్రేమ ఉండబోదని అర్థమైంది. అందుకే ప్రజలకు ఏ సమస్య ఎదురైనా అధికార పార్టీ దగ్గరికి పోకుండా ఆదరించే పార్టీ అయిన బీఆర్ఎస్ దగ్గరికి వస్తున్నారు. ఆ నాయకుడి దగ్గరే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నారు. ఇది కదా అసలు విజయం.
– వై.సతీష్‌రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్