‘ఠంచన్‌గా పడేదే పింఛను’ అనేది బీఆర్ఎస్ హయాంలో వినిపించిన మాట. కేసీఆర్ పదేండ్ల పాలనలో ఒకటో తారీకు నాడే లబ్ధిదారుల ఖాతాల్లో పింఛన్ కచ్చితంగా పడేది. మలిసంజెలో చేదోడు వాదోడుగా ఉండేది. ఖర్చులకు ధీమాగా ఉండేది. ఇప్పుడు కథ మారింది. పింఛన్ కట్టు తప్పింది. ఎప్పుడు వస్తుందో తెలియని అయోమయ స్థితిలో అవ్వా తాతలు పరేషాన్ అవుతున్నారు. ఒంటరి మహిళలకు, వికలాంగులకు, బీడీ కార్మికులకు, ఇంకా ఇతర లబ్ధిదారులకు మరీ ఇబ్బందిగా గడుస్తున్నది. బాంఛెన్ అన్నా కూడా చేతికి రానిది ‘పింఛన్’ అని జనం ఇప్పుడు చెప్పుకొంటున్నారు. ఆసరా అంటేనే నిస్సహాయ వర్గాలకు అందజేసే ఆర్థిక చేయూత అని అర్థం. అలాంటిది సకాలంలో అందితేనే లక్ష్యం నెరవేరినట్టు.
కానీ, కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత అంతా ఆగమాగమైపోవడంతో పండుటాకులు పరేషాన్ అవుతున్నారు. ఆలస్యంగా వేయడమనేది పరిపాటిగా మారింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో పింఛన్ రూ.2,016 నుంచి రూ.4,000కు పెంచడమనేది అతి ముఖ్యమైనది. అన్ని హామీలు, గ్యారెంటీల్లాగే ఇదీ కూడా అటకెక్కింది. పెంచిన పింఛన్ మాటేమో గానీ కేసీఆర్ ఇచ్చిన పింఛన్ అయినా సమయానికి ఇస్తున్నారా? అంటే అదీ లేదు. ఈ వెనుకా ముందుల వల్ల రెండు నెలల పింఛన్ ఎగవేత ఖాతాలో చేరిపోయింది. దీనికితోడు మూడు లక్షల మంది లబ్ధిదారులను జాబితా నుంచి తొలగించడం మరో వైపరీత్యం. కాంగ్రెస్ మార్క్ సంక్షేమానికి పింఛన్ల వ్యవహారం అద్దం పడుతున్నది.
స్వరాష్ట్రం ఏర్పాటైన తర్వాత పండుటాకుల కు ఉద్యమ ఫలాలు అందాలనే సమున్నత లక్ష్యంతో ప్రథమ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారం చేపట్టిన కొత్తలోనే ఆసరా పింఛన్ పథకాన్ని ప్రారంభించారు. అప్పటివరకు కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన పింఛన్ రూ.200 మాత్రమే. దీన్ని అంచెలంచెలుగా పెంచుతూపోయారు. ఒక్క వృద్ధులే కాదు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత, బీడీ కార్మికులు, కళాకారులు, హెచ్ఐవీ, ఫైలేరియా రోగులకు దీన్ని విస్తరించారు. అప్పటివరకు 36 లక్షలుగా ఉన్న పింఛన్‌దారుల సంఖ్య 46 లక్షలకు పెరిగింది. అప్పటివరకు 65 ఏండ్లుగా ఉన్న పింఛన్ అర్హతను 57 ఏండ్లకు తగ్గించడమూ దీనికి కారణం. లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ అందిస్తూ ఆత్మగౌరవంతో జీవించేందుకు వీలు కల్పించారు. ఇది బీఆర్ఎస్ మార్క్ సంక్షేమ విస్తరణకు తార్కాణంగా నిలిచింది. బీడీ కార్మికులకు పింఛన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ దేశమంతటా మన్ననలందుకున్నది. కేసీఆర్ పెద్దకొడుకులా ఆదుకోవడంతో వృద్ధులకు కుటుంబాల్లో ఆదరణ, గౌరవం పెరిగాయి.
ఓటు చేజారి, సర్కారు మారిపోవడంతో ఇప్పుడు ముదివగ్గులకు, ఇతరులకు పరిస్థితి తారుమారైంది. పింఛన్ కోసం వారు రోడ్డెక్కే రోజులు వచ్చాయి. అయినా సర్కార్‌లో చలనం వస్తున్న సూచనలు కనిపించడం లేదు. కనీసం పింఛన్ సమస్య గురించి ఆలోచిస్తున్న పాపాన పోవడం లేదని తెలుస్తూనే ఉన్నది. దీంతో కొన్నిచోట్ల కాంగ్రెస్ నేతలను పింఛన్ దారులు నిలదీస్తున్న సంఘటనలూ చోటు చేసుకుంటున్నాయి. అటు వికలాంగులూ పోరుబాట పడుతున్నారు. ‘కాంగ్రెసోళ్లు పింఛన్ పెంచుతమంటేనే నమ్మి ఓటు వేసినం.. మోసపోయి గోసపడ్తున్నం’ అని లబ్ధిదారులు వాపోతున్నారు. కేసీఆర్ రోజులను యాది చేసుకుంటున్నరు. సర్కార్ ఇప్పటికైనా మేలుకొని పింఛన్ సమస్యపై దృష్టిపెట్టడం ఎంతైనా అవసరం. నిన్న గెలిపించిన ప్రజలే నేడు ఓటుపో టుతో గుణపాఠం చెప్తారని కాంగ్రెస్ ప్రభు త్వం తెలుసుకుంటే మంచిది.