2025, మే 10వ తేదీన‘పాకిస్థాన్! యుద్ధం చేయలేదు; చేయకుండా ఉండలేదు; చేస్తే ఉండేలా లేదు!’ ధాము నర్మాల అనే జర్నలిస్ట్ మిత్రుడు రాసిన పై లైన్ ప్రస్తుత యధార్థ స్థితిని చెప్తున్నది.
అయితే, పాక్-భారత్‌ల బలాబలాలు; అంతర్జాతీయ అంశాలు; దౌత్య పరిభాష; మతానికీ, ఉగ్రవాదానికీ సారూప్య వైరుధ్యాలు ఇవేవీ పట్టకుండా ఊగిపోతున్న రెండు శిబిరాలు మన దేశమంతా గోచరిస్తున్నయి. సామాజిక మాధ్యమాల్లో వీటి ప్రతినిధిత్వం స్పష్టంగా కనిపిస్తున్నది. ‘భారతదేశం ఇంటాబయటా విధ్వంసానికి పాల్పడుతున్నది. యుద్ధం ఎవరికీ మంచిది కాదు…’ లాంటి సువచనాలు అలవోకగా దొరలిస్తున్నది ఒక శిబిరం. ‘ఇదే అదను, పాక్‌ను నేలమట్టం చేయాలి’ అంటూ ఊగిపోతున్నది మరొక శిబిరం.
బీ.ఆర్. చోప్రా ‘మహాభారత్’ సీరియల్ కాలం లాగా మనం నిర్మోహంగా చూడగలిగితే చాలా విషయాలు స్పష్టమవుతయి. పాకిస్థాన్ కంటే మెరుగైన సమాజపు పౌరులుగా భారతీయులకు ఈ దృష్టి అవసరం. ఈ వ్యాసం ఆ ప్రయత్నంలో భాగమే.
పహల్గాం ఊచకోత ఉగ్రవాదానికి, మతానికి హద్దు చెరిపివేసింది. మతం అడిగి, ఖురాన్ కల్మా చదవగలరో, లేదో అడిగి మరీ చంపడం ముమ్మాటికీ దారుణ హత్యలే. పాకిస్థాన్ మసీదుల్లో సైతం బాంబులు పేల్చి, సాటి ముస్లింలను బలిగొన్న సంఘటనల సందర్భంలో ‘ఉగ్రవాదానికి మతం లేదు’ అనగలిగే మా బోంట్లను పహల్గాం అశక్తులను చేసింది. గతంలో కూడా హిందూ-ముస్లిం మత ఘర్షణలు, కర్ఫ్యూలను మనం చూసినం. కట్టూబొట్టు చూసి పరస్పరం చంపుకొన్న విషాదం మనకు ఎరుకే. అయితే ఈ ధోరణి క్రాస్-బోర్డర్ టెర్రరిజానికి వ్యాపించడం కొత్త పరిణామం.
భారత ప్రభుత్వం, సైన్యం ఈ అంశాన్ని చాలా లోతుగా చూడటం వల్లనే సంయమనంతో కూడిన ప్రతిచర్యకు దిగింది. పాక్ పౌరులే కాదు, పాక్ మిలటరీ స్థావరాలు సైతం తమ లక్ష్యం కాదంటూ ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే దాడి జరిపింది. నెహ్రూ కాలం నాటి దౌత్య పరిణతి ఇప్పుడూ కొనసాగుతుండటం ముదావహం. అటు ఐక్యరాజ్య సమితిలో పాక్ ఒంటరి అయ్యింది, తన మిత్ర దేశం చైనా కూడా మౌనం వహించవలసి రావడం ఎవరు దోషో తేటతెల్లం చేసింది. కాబట్టే సౌదీ, దుబాయ్, అఫ్ఘాన్ లాంటి ముస్లిం దేశాలు పాక్‌ను తప్పుబట్టినయి. ఉగ్రదాడులను ప్రోత్సహించడం పాక్ మానుకోవడం ఒక్కటే సమస్యకు పరిష్కారం.
పేదరికం, నిరక్షరాస్యతలో తమ పౌరులను నిరంతరం ఉంచుతూ, వారి దుస్థితికి కారణం దాయాది భారత్ అని రెచ్చగొడుతూ పబ్బం గడుపుకొంటరు పాక్ పాలకులు, ముఖ్యంగా సైనికాధికారులు, నియంతలు! వారు మాత్రం లండన్‌లో విలాస జీవితం గడుపుతూ ఉంటరు. తమ పిల్లలకు పంజాబీ, ఉర్దూ భాషలు రానంత ‘బ్రిటిషర్లు’గా వారిని పెంచుతరు.
సమాచార. సాంకేతిక విస్ఫోటనం తర్వాత, సామాజిక మాధ్యమాలు అందరికీ వేదికలైన సందర్భంలో మామూలు పాక్ పౌరులు కూడా ఆలోచనలో పడుతున్నరు. ఇండో-పాక్ హెరిటేజ్ క్లబ్ లాంటి ఫోరంలలో చాలా ఉపయోగకరమైన, లోతైన మేధోమథనం జరుగుతున్నది. ఇది మంచి పరిణామం. దశాబ్దంన్నర క్రితం ట్యునీషియాలో నియంతను 28 రోజుల్లో దించేసింది సామాజిక మాధ్యమ ప్రేరేపిత ‘జాస్మిన్ విప్లవం’. బంగ్లాదేశ్, శ్రీలంకలో సైతం ప్రజాగ్రహానికి రాజసౌధాలు బూడిదైనయి. పాక్‌లో ఇలాంటి ప్రజా తిరుగుబాటు రావాల్సిందే. కొందరు భారత రాజకీయవాదులు కోరుకుంటున్నట్టు అది మన వల్ల సాధ్యం కాదు. కోడిగుడ్డు లోపలి నుంచి ఒత్తిడి వస్తే ప్రాణం పోసుకుంటుంది, బయటి ఒత్తిడికి చితికిపోతుంది.
సమాచార. సాంకేతిక విస్ఫోటనం తర్వాత, సామాజిక మాధ్యమాలు అందరికీ వేదికలైన సందర్భంలో మామూలు పాక్ పౌరులు కూడా ఆలోచనలో పడుతున్నరు. ఇండో-పాక్ హెరిటేజ్ క్లబ్ లాంటి ఫోరంలలో చాలా ఉపయోగకరమైన, లోతైన మేధోమథనం జరుగుతున్నది. ఇది మంచి పరిణామం.
‘గజ్వా-ఏ-హింద్’ (భారతదేశ ఇస్లామీకరణ) అజెండాను తమ మదర్సాలలో పెంచి పోషిస్తున్నది పాక్. ఆ విషవాయువులను ఒక్క సామాన్య ప్రజలే కాదు అక్కడి మేధావులు, చదువుకున్నవాళ్లు కూడా నిరంతరం పీల్చుతూనే ఉంటరు. పహల్గాం, యూరి, చార్ధామ్ సహా కశ్మీర్ ఇతర ప్రాంతాల్లో దాడుల వెనుక ఉన్న మనస్తత్వం ఇదే. ‘ఆపరేషన్ సిందూర్’కు సంబంధించి కేంద్ర రక్షణ శాఖ వెల్లడించిన విషయాలను మనం ఎలాంటి ప్రశ్నలు లేకుండా స్వీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. భావోద్వేగాలకు లోనై సైన్యానికి ముప్పు కలిగే స్థాయిలో బాహాటంగా, బాధ్యతారహితంగా సోషల్ మీడియాలో రాయవద్దని కూడా రక్షణ శాఖ ఆదేశాలు ఇచ్చింది. పూనకాలతో ఊగిపోయే మన వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్‌లు ఇది గమనించాలి.
సశక్తమైన భారత్ ఈసారి త్రివిధ దళాలను మోహరించి ఉగ్రవాదాన్ని అష్టదిగ్బంధనం చేసింది. అత్యంత క్రూరుడైన మసూద్ అజహర్ కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయింది. కశ్మీర్ లోయలో ఎంతోమంది అమాయక ప్రజల ప్రాణాలు తీసిన కరుడుగట్టిన ఉగ్రవాది అజహర్. యునైటెడ్ నేషన్ ‘కౌంటర్ రిటాలియేషన్’ను హక్కుగా అన్ని దేశాలకు వర్తింపజేసింది. ఈ హక్కును మనం ఉగ్రవాద శిబిరాలను పేల్చివేయడానికి వాడుతున్నం. ఒకటీ అరా మినహాయిస్తే ప్రపంచ దేశాలన్నీ సంఘీభావంగా ఉన్నయంటేనే మనం ఎంత బాధ్యతగా ఉన్నమన్నది తెలుస్తున్నది. కాబట్టే, చైనా కూడా మిన్నకుండిపోయింది.
కేంద్రప్రభుత్వం చెప్పినట్టు మన శత్రువు టెర్రరిజం మాత్రమే. తీవ్రవాదులు చదువు, విద్య, ఉపాధి, జీవితం పట్ల ఆశయాలు, ఏ లక్ష్యాలు లేని క్రూరమృగాలు. అందరి జీవితం మరణంతో ముగిస్తే జిహాదీల జీవితం మరణం తర్వాత స్వర్గంలో మొదలవుతుందనే భావజాలంలో కూరుకుపోయిన ఉగ్ర మనస్తత్వాలు చేస్తున్న విధ్వంస చర్యల మీద, వాళ్ల ధ్వంసరచన మీద మనం సమర్థంగా విజయం సాధిస్తున్నం. తీవ్రవాద సంస్థలు స్త్రీలు, పిల్లలను షీల్డ్‌లుగా వాడుకుంటూ, జనావాసాల్లో ఉంటూ, మన దేశం మీద విధ్వంసకర దాడులకు పాల్పడుతున్నరు. అయినా మనం సంయమనం కోల్పోలేదు. సామాన్య ప్రజలు, ప్రార్థనా మందిరాల జోలికి పోకుండా టెర్రరిస్టు క్యాంపుల మీదనే దాడులు జరిపినం. ఈ యుద్ధ నేపథ్యంలో అంతర్జాతీయ విషయాలూ చర్చించుకోవాలి. అగ్రరాజ్యమనే పేరు శాశ్వత పరచుకునే లక్ష్యంతో అమెరికా నిరంతరం యుద్ధాలు ఎగదోస్తూనే ఉంటుంది. వాళ్లు ఎవరికీ మిత్రులు కాదు. రష్యాను అడ్డుకోవడానికి పాకిస్థాన్‌ను ఆర్మీ బేస్‌గా చేసుకొని, వాళ్ల అవసరాల కోసం పాకిస్థాన్‌కు అణు సాంకేతికత, ఎఫ్-16 యుద్ధ విమానాలు ఇచ్చింది. ఈ విమానాల్లో సగం పనిచేయవు. వాటి సాంకేతిక లోపాల మెయింటెనెన్స్ కోసం అప్పుడప్పుడు అమెరికా డబ్బులు ఇస్తుంది. ఈ మధ్య కూడా 400 మిలియన్ డాలర్లు ఇచ్చింది. ఇంత డ బ్బు ఇవ్వడానికి ప్రధాన కారణం పాకిస్థాన్‌ను పావుగా వాడుకొని ఇరాన్ మీద దాడులు చేయడానికి. ఇది మొన్నటి హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం వెనుక ఉన్న చీకటి కోణం.
పాకిస్థాన్‌కు సొంత తెగలను తెగనరకడం కొత్తేమీ కాదు. గతంలో జుల్ఫీకర్ అలీ భుట్టోను ఉరితీసిన జనరల్ హక్ తన ఆర్మీని సిరియా, పాలస్థీనా ప్రజలను ఊచకోత కోయడం కోసం, అగ్రరాజ్యం తరఫున పంపించాడు. ఇంతటి రక్తచరిత్ర కలిగిన ఆర్మీ, ఇంతటి నమ్మకద్రోహం చేసే సైనిక అధికారులు ఈ భూమండలం మీద ఎక్కడా లేరు. ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే పాకిస్థాన్ మిలటరీ అధికారులకు స్వపర తేడాలేమీ లేవు. వారు తమ సొంత ప్రజలను కూడా శత్రువులుగా చూస్తారు.
దేశ విభజన పంపకాల్లో 76 శాతం సారవంతమైన భూములు తీసుకున్న పాకిస్థాన్.. ఈ రోజు పాపిస్థాన్గా మారిపోయింది. మిగిలిన 24 శాతం భూమి తీసుకున్న భారత్ నేడు అన్ని రంగాల్లో మేటి శక్తిగా ఎదిగింది. వాళ్లు పంచనదుల్లో రక్తం ప్రవహింపజేస్తమని బెదిరిస్తరు. ఆ భూమిలో బంగారం పండించడానికి మనం హలం పడుతం. శాస్త్రీయ విద్యకు దూరమవుతున్న ఆటవిక మూకలు ఒక భారతదేశానికే కాదు, ప్రపంచానికీ ప్రమాదకరమే. విద్యే మన శక్తి, విద్యే మన ఆయుధం. ఏ వనరులు సంపూర్ణంగా లేని మన దేశం ఈ రోజు పరిపూర్ణంగా అవతరించడానికి కారణం విద్య మాత్రమే.
వ్యక్తులే కాదు, దేశాలూ గుర్తింపు రాహిత్యంతో బాధపడుతూ ఉంటయి. సోషల్ మీడియాలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు డొల్ల వాదనలతో నగుబాటు అవుతున్న చందాన కొన్ని దేశాలు కూడా తమ పూర్వపు అస్తిత్వాన్ని కోల్పోయి, కొత్త సాంస్కృతిక ఒరవడిలో తమ ఐడెంటిటీ క్రైసిస్‌ను బయటపెట్టుకుంటూ ఉంటయి. ఇందుకు పాకిస్థాన్ కన్నా గొప్ప ఉదాహరణ ఇంకొకటి లేదు.
భారతదేశం నుంచి మతపరమైన వాదనతో విడిపోయిన పాకిస్థాన్ తన గుర్తింపును మొదట్లో అరబ్ దేశాలతో పోల్చుకుంది. వాళ్లు తన్ని తరిమేశారు. తరువాత కాలంలో మాది ఉజ్బెక్ అజర్బైజాన్, తుర్క్మెనిస్థాన్ లీగ్ అన్నది. పాకిస్థాన్ పంజాబీ నాయకులు తమ మూలాలు టర్కీలో ఉన్నాయని ఇంకో వాదన తెచ్చారు. ప్రస్తుతం టర్కీతో ఫిక్స్ అయిపోయారు. పాకిస్థాన్ పంజాబీ బ్యాచ్ పూర్తిగా పాకిస్థాన్ రాజకీయాలు, ఆర్మీని శాసిస్తాయి. పాకిస్థాన్ అనే నైసర్గిక స్వరూపంలో బలూచ్, ఫష్తూన్, సింథీలు మైనారిటీలు అయిపోయా రు. ఈ ఆటలో పాకిస్థాన్ క్రూర క్రీడలకు మిగ తా ప్రాంతాలు బలైపోతూనే ఉన్నయి. కాబట్టే ఈ తెగలు ఇప్పుడు పాకిస్థాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తున్నయి. స్వతంత్ర దేశాలుగా ప్రకటించుకుంటున్నయి. ఇందులో మనం ప్రధానంగా చర్చించుకోవాల్సింది టర్కీ, సౌదీ అరేబియా, పాకిస్థాన్, ఇరాన్ మధ్యలో జరుగుతున్న ఖలీఫా ఆధిప త్య పోరాటం. ఇస్లాం పుట్టింది సౌదీలో. మొదట్లో సౌదీ తన ఆధిపత్యం ప్రదర్శించుకున్నది. తర్వాత కాలంలో మతతత్వా న్ని పక్కనపెట్టి ఆధునికత వై పు నడిచారు. ఒకానొక సమయంలో పాకిస్థాన్ అరబ్ రిప్రజెంటేషన్ కోసం పాకులాడింది.
ఇదే సమయంలో ఇస్లామిస్ట్ ఫండమెంటల్ రాడికలిస్ట్ అయిన ఎర్డోగన్ టర్కీలో అధికారం చేపట్టాడు. ఆర్థికంగా బలమైన టర్కీ పాకిస్థాన్‌కు కశ్మీరి విషయంలో మద్దతిస్తూ, తన ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చింది. తన దాయాది అయిన సిరియాలోని షియా అల్ బషర్ ప్రభుత్వాన్ని కూల్చడంలో ప్రధాన పాత్ర వహించింది. ఇప్పటి పాకిస్థాన్ ఆర్థిక దుర్భర పరిస్థితికి ఇస్లామిస్ట్ ఖలీఫా అయ్యే కోరిక కూడా ఒకటి. భారీ భూ కంపంలో భారత సహాయం పొందిన టర్కీ లాంటి దేశానికి ఎలాంటి కృతజ్ఞత లేదు. ఎర్డోగన్ ప్రభుత్వానికి ఇస్లామిజం తప్పి స్తే ఇంకో ఆలోచన లేదు. అదే బాటలో పాకిస్థాన్ ఉన్నది. ఒక టెర్రరిస్ట్ నేషన్‌గా గుర్తింపు పొందిన పాక్ ఏనాటికైనా నాలుగు ముక్కలవడం ఖాయం!
ఇప్పటికైనా పాక్ కాస్త తెలివి తెచ్చుకొని ఉగ్రవాదాన్ని తరిమేయడంలో భారత్‌తో కలిసి పనిచేయాలి. లేదంటే ఎన్నటికైనా పాకిస్థాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.
సంయమనంతో, బాధ్యతతో మెలగవలసిందిగా సాటి భారతీయులకు మా సవినయ విజ్ఞప్తి. సామాజిక మాధ్యమాల మూసోద్వేగాలలో కొట్టుకుపోవద్దు. సౌత్ ఏషియాలో మనమే అందరికీ ఆదర్శం. కుత్సిత కుల, మత రాజకీయాలకు దేశాన్ని బలి కానివ్వొద్దు. ఏయే కారణాలతో పాకిస్థాన్‌ను విమర్శిస్తున్నామో, మనమూ వారిలా మారొద్దు. చైతన్యవంతమైన, సాంస్కృతిక విలువల పరిపుష్టితో విలసిల్లుదాం.
జై హింద్!
– శ్రీశైల్ రెడ్డి పంజుగుల 90309 97371
– అనిల్ ఏ.కే.వీ