ఒడువని ముచ్చట.. తీరని గోస.. పదంపై దాడి.. పాదం మీద దాడి. భాషకు ఈసడింపు.. గోసికి ఎక్కిరింపు. పనికి పరాచికాలు.. తిండికి పేర్లు పెట్టడాలు. పైర్లు పాడెక్కించిన తీరు.. రైతును రోడ్డెక్కించిన ఘోరం. పెద్ద కొలువుల్లో వాళ్లు.. చెపరాసి సీట్లలో వీళ్లు. తిండిక్కడిది.. పాటక్కడిది. బొగ్గులిక్కడ.. బుగ్గలక్కడ. కాల్వతవ్వకాలీడా.. నీళ్ల పార్కం ఆడ.
గుడిసెకు దిక్కులేదు.. మెతుక్కు హక్కులేదు.. భవంతులకు ఢోకా లేదు.. భోగాలకు అడ్డూఅదుపు లేదు. చెప్పుకొంటాపోతే గుక్కతి ప్పుకోలేని తీరు.. తల్చుకుంటూ కూసుంటే మాటరాని ఘోరం. అన్నీ చూసిన ఆయన (కేసీఆర్) అరిగోసను దిగమింగిండు.. ప్రాణాలుపోయినా సరే సాధించాలని బైలెళ్లిండు. కాళ్లల్లో కట్టెలను దారికి ఊతంగా వాడుకుంటూ.. సూటిపోటి మాటలను ఫిరంగి గుండ్లుగా మల్చుకుంటూ.. పళ్లికిలించిన వారికి చెంపచెళ్లుమనేలా చేసి.. బొక్కబోర్లపడేలా చేద్దామనుకున్నవారిని ముక్కున వేలేసుకునేలా మార్చి.. అనుకున్నది సాధించి.. కలగన్నది తీర్చిదిద్ది.. బక్కతనం పల్చన కాదు.. బలుపుతనం మందమూ అవ్వదని రాష్ర్టాని తెచ్చి.. రచనా పర్వానికి తెరతీసి నాలుగు కోట్ల యావత్ తెలంగాణ బిడ్డలకు దిక్సూచిగా నిలిచిన ఒకే ఒక్కడు.. పాతికేండ్ల పండుగకు నిలువెత్తు నిజస్వరూపుడు.. గోసపడుతున్న పడావు భూముల్లో పచ్చని రంగులు పులిమి శ్వాస నిలిపిన దేవుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.
ఊహ కందనిది.. ఊహల్లోలేనిది. ఏమోలే ఎన్నో వచ్చాయి.. పోయాయి.. ఎందరో ఎగిరారు.. ఎల్లెలుకల పడ్డారు. అందులో ఇదొకటి. ఎన్ని చూళ్లేదు. ఏదో ఆవేశంగా పెట్టాడు.. ఆ తర్వాత నాలుక్కర్చుకుని అంతకన్నా వేగంగా కాలగర్భంలో కల్వడం. ఇదీ అంతే… కలుస్తాడు.. కలిసి తీరుతాడు. ఆలోచించాల్సిన అవసరం లేదు.. అంతగా పట్టించుకోవాల్సిన విషయమూ కాదు. అంతా మనమే.. అన్నింట్లో మనోళ్లే. అసలే బక్క మనిషి (బక్క పీనుగ అన్న సందర్భాలూ కోకొల్లలు).. అందునా ఒక్కడంటే ఒక్కడే. అప్పటికే 1969లోని ఉవ్వెత్తు తరంగాన్ని ‘స్వార్థపు గ్రహణం’ మింగిన చేదు అనుభవం. ఆ దెబ్బతో జనం నైరాశ్యం చెందడం.. రాజకీయం కోసం పావుగా వాడుకుంటున్నారన్న నమ్మకం బహుబలంగా స్థిరపడటంతో వారనుకున్నట్టే అంతా భయం ఆవహించిన సమయం.
చరిత్రకు సిద్ధమైన క్షణాలివి. పండుగకు ఏర్పాట్లు జరుపుకొంటున్న సందర్భమిది. పురిట్లోనే పోతాడనుకున్న రోజుల బాలుడు మొండిఘటంగా మారి పోరాడి.. ప్రతిఘటించి.. నిలిచి.. గెలిచి.. సాధించిన తీరు అప్రతిహతం. సాగరహారం.. మిలియన్ మార్చ్.. సకలజనుల సమ్మె.. పది లక్షలకు పైగా జనసమీకరణతో దద్దరిల్లిన ప్రకాశ్‌రెడ్డిపేట సమావేశాలు.. ఇలా ఒక్కటేమిటి కాంక్షను దశదిశలా చాటిన పోరు తెలంగాణం ఆది నుంచి సాధింపు వరకు ఓ చరిత్ర పుటే. నాటి నైజం నుంచి నేటి అంకుశాన్ని లాక్కున్న సీమాంధ్ర మదపుటేనుగు వరకు కలియబడ్డ తీరు ప్రత్యేకమేనాయె. అసలు ఆ మాటకొస్తే చరిత్ర అనే పదం చాలా చిన్నదే.. అప్పుడెప్పుడో తేలిపోయినదే. భవిష్యత్తు కోసం వర్తమానాన్ని నేర్పుతో ఒడిసిపట్టి అనుకూలంగా మలుచుకుంటూ చరిత్ర సృష్టించిన ఆ బక్కపల్చని మేధావితనం రంగప్రవేశం చేసిన తర్వాత ఆ హిస్టరీయే సాష్టాంగపడి సంబురపడిన ఘడియలు లెక్కకు మిక్కిలి.
అంతా ఎక్కడికక్కడ తొక్కేయాలనే బలం.. డబ్బుతో కొనే బలుపు.. పదవులతో కొట్టే విభేదం.. అన్నింటికి మించి ఏనుగు వంటి మహాద్భుతమైన గతానికి ముసుగులు వేసి, అక్షరాలకు దీపపు మసి బారేలా చేసి తిమ్మిని బమ్మిగా.. నిజాన్ని అబద్ధంగా మలిచిన కపటం ఆరు దశాబ్దాలు కులికిన తనం. లౌక్యంగా దరి చేరి.. మావటిని మాటల్లో పెట్టి, అతి తెలివిగా అంకుశాన్ని కైవసం చేసుకుని తరతరాలుగా తరగని ఆశలతో తంతెలు తంతెలుగా స్వారీ చేయడానికి మరిగిన ఆ బాపతు వాళ్లు పేట్రేగిన తరుణం. ఇక్కడున్నోళ్లను ఒక్కటి చేయలేక.. అంత బలమైన మందగా ఉన్న ఆడోళ్లతో ఒక్కడిగా నెట్టుకురావాల్సిన అతి భయానక సందర్భం. అన్నింటినీ దిగమింగుకుంటూ, కనిపించిన దారంటే నడుస్తూ అప్పుడప్పుడే మొగ్గలేస్తున్న గులాబీకి ముల్లు గుచ్చి ఛిద్రం చేయాలనుకుని కాచుక్కూర్చున్న సీమాంధ్ర రాజ్యం అది.
పుట్టడానికే ఆపసోపాలు పడిన ఘడియలు. ‘పురిట్లోనే పిసికేస్తాం లే’ అని గోతికాడి నక్కల్లా కూర్చున్న ‘రియల్’ రుబాబులు.. తండ్రులు, తాతల తరాల నుంచి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్న బాబులు.. రంగుల తెరపై మెరుస్తూ పెట్టుబడులతో ‘హిల్స్’ ఎక్కి నాట్యం చేస్తూ.. అన్నింటినీ తొక్కేస్తూ అందనంత ఎత్తుగా ఎదిగిన తెర అనకొండలు.. మన ప్రకృతిని కూడా వికృతంగా చూపుతూ, తాము తప్ప దిక్కెవరు లేరనే ప్రచారాన్ని ముమ్మరం చేసి, ఇక్కడిదంతా మరుగుమందు.. తమకాడిదంతా మెరుగైన విందుగా కలరింగ్ ఇస్తూ వేళ్లూనుకున్న వికటాట్టహాసం. అన్నీ ఆ చేతుల్లోనే, అవాస్తవాన్ని కూడా అందంగా ముస్తాబు చేసి అర్ధరాత్రుళ్లు ప్రపంచమంతా చుట్టేసి వచ్చేన్ని సౌకర్యాలు ఆ కోటరీలోనివే. అయినా అధైర్యపడని తనమే
మనోడి బలం.
ఎన్నో చేదు గుళికలు. అన్నింటికన్నా ఏకాకి బాటసారి జీవితం. పెట్టుబడికి కాదు కదా, జేబు ఖర్చులకు కూడా లేని దయనీయం. వచ్చిన ఆలోచనను చావకుండా, తననెవరు ఏమన్నా పర్లేదు అన్నట్టుగా.. ముందు తరాల కోసం తొవ్వైతే వేస్తాను.. నడువనైతే నడుస్తాను.. సాధిస్తానో.. చస్తానో తెలియదు కానీ, నడక ఆపేది లేదని బైలెళ్లిన ఆ పల్చని తనువు సంకల్పం కాలక్రమేణా పటుత్వం సంపాదించిన తీరు అమోఘం. రాత్రికి రాత్రో, ఉన్నపళంగానో వచ్చింది కాదని తరచి చూసిన వారందరికి తెలిసిందే. ఇనుప కంచెలు.. ఉక్కు చెరలను దాటుకుంటూ, ఒక్కో మెట్టు ఎక్కుతూ, ఆ ఒక్కడితో పదులు.. వందలు.. వేలు.. లక్షలు.. ఆఖరుకు కోట్లలోనే కాదు సమస్త తెలంగాణ సమాజం వెంట నడిచే స్థాయికి తీసుకెళ్లిన తీరు అమోఘం. అణువణువు ఆకాంక్షను పులుముకుని, అందరిలో తెలంగాణ వీరత్వాన్ని నింపి ముందునడిచిన తీరు యావత్ ప్రపంచ చరిత్రలోనే తరచిచూసినా కనిపించని ఓ అమోఘఘట్టం.
అడుగు పడింది.. నడక సాగింది.. పరుగు లంఘించుకుంది.. అనుకున్నది చేసి చూపించింది. ఒక్కటిగా.. ఒక్కడిగా మొదలైతేనేమి నేడు పాతికేండ్ల పండుగ వరకు సాగిన ప్రస్థానం మహాద్భుతం. ప్రేమలు చిగురించేలా చేసిన గులాబీ నేడు పవిత్ర కార్యానికి సిద్ధమైంది. రాజకీయాలు కాదు, రాక్షసానందం అంతకన్నా లేదు. అంతా ఆ పువ్వు రెమ్మలే, అన్నీ ఆ రంగు పువ్వులే. బతుకు జీవుడా అన్న స్థాయి నుంచి బతుకిదిరా.. అనే రేంజ్‌కు తీసుకెళ్లిన కేసీఆర్ తీరు ఎంత చెప్పినా తక్కువే. నాడు హనుమకొండ కాకతీయ డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో రెండో మూడో జీబులు.. నలుగురో ఐదుగురో వెంటున్నవారు. అసలు అక్కడికి కేసీఆర్ వచ్చారా.. అనేలా అనుమానంగా.. అంతగా పట్టించుకోని దుస్థితి. ఎక్కడి జలదృశ్యం మరెక్కడి ఎల్కతుర్తి.
ఇరవై ఐదేండ్ల ప్రయాణంలో ఆటుపోట్లను అధిగమించి, అనుకున్నది సాధించిన చంద్రశేఖరుడు తెలంగాణ సమాజానికి ఓ దిక్సూచి.. ఎవరూ అనుమానించాల్సిన అవసరం లేని ఓ కలికితురాయి. ఒక్కసారి పీక పిసికితే ఇగ కనిపించడని, పనైపోతుందని సీమాంధ్ర పైశాచికం ఉవ్విళ్లూరుతున్న వేళ ఆవేశకావేషాలను అదిమిపట్టుకుని తన కోసం కాదు, వెనకున్న అమాయక జనం కోసం ఎంతకైనా అన్నట్టుగా నిలిచిన ఆయన తీరు ఇప్పుడు ప్రతి పల్లెలో కనిపిస్తున్న దృశ్యాల సమాహారమే.
వెల్కమ్ ఎల్కతుర్తి..
ఆల్ ది బెస్ట్ టూ పింక్ ఫెస్టివల్..
గుడ్ లక్ గులాబీ బాస్..
గొడ్డుకెరుక.. గోదకెరుక..
ఒడ్డున పరవశించే పచ్చి గడ్డికెరుక..
తుమ్మలు మొలిచిన కాల్వలకెరుక..
అందున పారుతున్న నీళ్లకెరుక..
వాగున ఊరుతున్న చెలిమెకెరుక..
నోళ్లు తెరిచిన బీళ్లకెరుక..
ఇరాము లేకుండా పోస్తున్న మోటరుకెరుక..
ఇంటికొచ్చి దించుతున్న వైద్యబృందానికెరుక..
ఆడపిల్ల నుదిటి బొట్టుకెరుక..
ఆసరాగా నిలిచిన ముసలవ్వకెరుక..
పొలంలోని వరి పైరుకెరుక..
పక్షికెరుక.. పశువుకెరుక..
పువ్వుకెరుక.. చిరునవ్వుకెరుక..
యావత్ తెలంగాణ సమాజానికెరుక..
పుట్టింది తెలంగాణ కోసమే అని..
కేసీఆర్ సంకల్పం సమస్త జనాలకై అని..
మచ్చలు రావొచ్చుగాక.. మరకలు అంటొచ్చుగాక..
కాసిన చెట్టుకే దెబ్బలు సహజం అన్నట్టుగా..
చేసిన అయ్యకే నిందలూ సర్వసాధారణం.
బతుకమ్మ దీవెనలతో..
సమక్కసారలమ్మలిచ్చిన ధైర్యంతో..
యాదాద్రి నృసింహుడి ఆశీస్సులతో..
గులాబీ వర్ధిల్లాలి.. గులాబీ వికసించాలి..
పాతికేండ్ల పండుగతో గతవైభవ
ప్రభను తిరిగిపొందాలి.
– రాజేంద్ర ప్రసాద్ చేలిక 99858 35601