వానరాకడ.. ప్రాణం పోకడ అనేది పాత సామెత. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ప్రాణం మాటేమో గానీ, వాన ఎప్పుడొస్తుందో మాత్రం చెప్పే నైపుణ్యం స్పష్టంగా అందుబాటులో ఉంది. ముందస్తుగా సమాచారం ఉన్నప్పటికీ మేల్కోనకుండా, మొద్దునిద్రపోతే అది ముమ్మాటికీ మానవ తప్పిదమే తప్ప, ప్రకృతి పగ అసలే కాదు. ఒక యూనిట్ టెస్టు రాయబోయే ప్రైమరీ స్కూల్ పిల్లాడే ఉదయం తీసుకెళ్లే పరీక్ష ప్యాడ్, పెన్ను, పెన్సిల్, షార్ప్‌నర్, రబ్బర్… అన్నింటికి తోడు హాల్ టిక్కెట్ ఒకటికి పది సార్లు పరీక్షించుకుని, ఒక దగ్గర పెట్టుకుని ముందురోజు రాత్రి నిద్రకు ఉపక్రమిస్తాడు. ఉదయం లేచిన తర్వాత కూడా మరో రెండు మూడుసార్లు అన్నీ సరిగ్గా పెట్టుకున్నానా.. ఏమైనా మిస్ అయ్యానా.. అని మళ్లీమళ్లీ చెక్ చేసుకుంటాడు. స్కూల్ స్థాయిలో నిర్వహించే చిన్న పరీక్షకే పిల్లోడు అంత జాగ్రత్తపడితే రాష్ట్రంలోని పంటంతా మార్కెట్లకు పోటెత్తబోతుంది.. దిగుబడంతా తరలిరాబోతున్న సమయం ఆసన్నమవుతోందన్నప్పుడు ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకెంత అప్రమత్తంగా ఉండాలి.
సంచిలోంచి వండటానికి బియ్యం తీస్తుంటేనే చెయ్యిజారి కొన్ని గింజలు కిందపోతే ఆ రోజంతా ఏదో పోగొట్టుకున్నట్టు దిగాలు పడుతాం. వండిన బుక్కడు బువ్వ కూడా నోటికి సహించదు. అట్లాంటిది ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా పది ట్రాక్టర్ల లోడ్ వడ్లు, అంటే సుమారు 150 క్వింటాళ్ల వడ్ల రాశి వరదకు కరిగిపోతుంటే, చంటి బిడ్డలెక్క కాపాడుకున్న పంట.. కాలువలో పడి కొట్టుకుపోతుం టే ఆ తారవ్వ (హుస్నాబాద్ మహిళా రైతు) గుండె ఏమవ్వాలి? కంటికిరెప్పలా పంటను కాపాడుకుంటూ, ఒక్కొక్క గింజను జాగ్రత్తగా ఒడిసిపట్టి, అంతెందుకు పంట కోస్తున్నప్పుడు ఒడ్ల వెంట, మడి మూలల్ల మిగిలిన గొలుసులను కూడా వదిలేయకుండా కొడవలితో కోసి కుప్పజేసే రైతు పంటంతా నీళ్లపాలైతే ఎలా తట్టుకోవాలి?
అసలే ఎన్నో కష్టనష్టాల మధ్య వర్షకాలం సాగు సాగింది. కేసీఆర్ ప్రభుత్వంపై ఉన్న కోపంతో రేవంత్ సర్కార్ కాళేశ్వరం వంకతో నీళ్లను వదిలింది లేదు, పొలాలకు ఇచ్చింది లేదు. రకరకాలుగా అరిగోస పెట్టి రైతులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది సర్కార్. దీంతో ఎన్నో తిప్పలుపడి రైతులు ఎలాగోలా పంటలు ఎండిపోకుండా, కాపాడుకొని ఇంతదూరం తీసుకొచ్చిండ్రు. హమ్మయ్యా కోత కొచ్చినయ్ ఇక మార్కెట్‌కు తీసుకెళ్తే అయిపాయె అనుకుని ఆశలెన్నో పెట్టుకున్నరు.
ఇలాంటి సమయంలో కనీసం కొనుగోళ్లు, ధాన్యం రవాణా, తరలింపు, అనుకోకుండా ఉపద్రవం ముంచుకొస్తే ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాల్సిందిపోయి, అజాగ్రత్తగా రైతు నోట్లో మన్ను కొట్టింది. కష్టమంతా గంగపాలు జేసింది.
కేవలం రేవంత్ సర్కార్ తీసుకున్న పనికిమాలిన చర్యలతోనే నేడు పంటలన్నీ కండ్లముందే కరిగిపోతున్నాయి. దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుపడ్డట్టు తయారైంది తెలంగాణ రైతాంగం పరిస్థితి. కష్టపడి పంట పండించినా కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయక అన్నదాతలు దేహీ అనేలా చేసింది సర్కార్.
రాష్ట్రవ్యాప్తంగా ఈ ఖరీఫ్ సీజన్లో 1,32,44,305 ఎకరాల సగటు పంటల సాగుగా అంచనా వేస్తే, నమోదైంది మాత్రం 1,33,09,765 ఎకరాలు (సెప్టెంబర్ చివరి నాటికి) అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లెక్కలే చెప్తున్నాయి. గత జూలై చివరి వారం, ఆగస్టు మొదటివారం వరకు 26,10,003 ఎకరాల్లో వరి నాట్లు వేయగా; 43,28,721 ఎకరాల్లో పత్తి, 31,815 ఎకరాల్లో జొన్న, 5,46,884 ఎకరాల్లో మొక్కజొన్న సాగు అయ్యింది. మే నెలలోనే వర్షాలు మొదలుకావడంతో చాలా ముందుగానే సాగు ఊపందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పంటల సాగు కూడా సెప్టెంబర్ మొదటి వారంలో మరింత పెరిగింది. 59,56,406 ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. ఇక మిగతా పంటలైన పత్తి 45,26,485 ఎకరాలు, మొక్కజొన్న అనూహ్యంగా 6,22,883 ఎకరాలకు పెరిగింది. పంటల సాగు విస్తీర్ణం మొత్తంగా సెప్టెంబర్ నెలాఖరు వరకు గణనీయంగా పెరిగింది. సాగు సంబురమైతే పెరిగింది గానీ, రేవంత్ సర్కార్ మాత్రం అన్నదాతకు కల్పించాల్సిన కనీస సదుపాయాల విషయాన్ని పూర్తిగా విస్మరించిన ముచ్చట యూరియా కొరతతోనే తెలిసిపోయింది. అన్నదాతలు యంత్రాంగం కాళ్లపై పడి యూరియా కోసం రాత్రిళ్లు బార్లుగా నిలబడిన దృశ్యాలెన్నో చూశాం. సాగు పెరిగిందని, దిగుబడి బ్రహ్మాండంగా ఉందని జబ్బలు చరుచుకున్న సర్కార్ పెద్దల నిర్లక్ష్య ధోరణి.. ధాన్యం సేకరణ, కొనుగోలు వేళ ఈ వరదలతో మరింత స్పష్టంగా తేలిపోయింది. లక్షల ఎకరాల్లో పంట దిగుబడి మార్కెట్‌ను ముంచెత్తబోతున్నదని తెలిసినా సంబంధిత మంత్రులు పట్టించుకున్నది లేదు. కమాండ్ చేయాల్సిన ముఖ్యమంత్రి నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించారు. అటు పంపకాలు, ఇటు సొంత వ్యవహారాలు అన్నట్టుగా అటు సీఎం, ఇటు మంత్రులు రోజుకో కయ్యంతో బిజీబిజీగా మారారు.
ముందస్తు జాగ్రత్తలు తీసుకుని నష్ట నివారణను తగ్గించాలి గానీ, మరింత పెరిగేలా చేసే తీరును ప్రభుత్వమే బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది. మొంథా తుఫాన్ ప్రభావంతో 12 జిల్లాలు అతలాకుతలమయ్యాయి. 179 మండలాల్లో వరద ప్రభావం తీవ్రంగా ఉంది.
రాష్ట్రంలో 4,47,864 ఎకరాల్లో పంట పూర్తిగా మునిగిపోయింది. 2.82 లక్షల ఎకరాల వరి, 1.51 లక్షల పత్తితో పాటు ఇంకా ఇతరత్రా పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. పంటనే నమ్ముకుని దిగుబడి అమ్మి అప్పులు తీర్చుకోవాలనుకున్న 2,53,033 రైతులు పూర్తిగా ఇప్పుడు రోడ్డునపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన నాటినుంచి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటనలున్నాయి. రైతులకు భరోసా కల్పించి, కొనుగోళ్ల వ్యవహారంలో వారి అనుమానాలు నివృత్తి చేస్తూ కాపాడుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలు కేవలం తమ పనులను చక్కబెట్టుకునే ముచ్చట్లలోనే సమయాన్ని గడుపుతున్నట్టుగా తోస్తున్నది.
తప్పు ఒక్కసారి చేస్తే క్షమించొచ్చు.. రెండోసారైతే మందలించొచ్చు.. మూడోసారి జరిగితే హెచ్చరించొచ్చు.. పదేపదే తప్పు జరుగుతూనే ఉన్నా గుణపాఠం నేర్చుకోలేదంటే అది బరితెగింపు అయి నా అనుకోవాలి, నాశనగాలంగానైనా భావించాలి. ప్రస్తుతం తెలంగాణ సర్కా ర్ పరిస్థితి కూడా అందుకు అన్వయింపుగానే ఉంది. పంట ఇంట్లకొచ్చే కాలంలో జరుగుతున్న నిర్లక్ష్యపు చర్యలు వ్యవసాయం అంటేనే భయపడేలా, సాగు చేయడం కంటే సావడం నయం అన్నట్టుగా పరిస్థితిని మారుస్తున్నది. తుఫా న్లు, వరదలు, పంట నష్టపోవడం కొత్తే మీ కాదు. అనుకోకుండా వచ్చిన వానకు ఆగమాగమైతే ఏం చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. కానీ, ఉపద్రవం ముంచుకొస్తుందని తెలిసినా పట్టించుకోని నిర్లక్ష్యమే నేటి ఈ అన్నదాత కన్నీటికి ప్రధాన కారణం. ముందుగానే టార్పాలిన్లు, కవర్లు, ధాన్యం రవాణాకు వాహనాల ఏర్పాట్లు, మిల్లర్లను అప్రమత్తం చేయడం, ఆరబోయడానికి సౌకర్యాలు, తూకం విషయంలో మోసం జరగకుండా చర్యలు, వ్యాపారుల మోసాలపై నిఘా నేత్రాలు.. ఇలా ఎన్నో సమకూర్చాల్సిన ప్రభుత్వం మొద్దునిద్రలో జూబ్లీహిల్స్ ఎన్నికల జాతరలో తేలుతూ అన్నదాతను పూర్తిగా ముంచేసింది. ఉప ఎన్నికలపై ఉన్న యావ రైతన్నపై లేదనేది సీఎం తీరుతో స్పష్టంగా తెలుస్తున్నది. ఓ పక్క రాష్ట్రమంతా వరదల్లో చిక్కుకుని విలవిలలాడుతుంటే కేవలం ఒక వర్గం ఓటర్లను ప్రభావితం చేసే కార్యానికి శ్రీకారం చుట్టిన వారి ఘనతను ప్రజలంతా గమనించారు. ఎలాగైనా ఓట్లు కొల్లగొట్టాలి, అధిష్ఠానం దగ్గర మార్కులు కొట్టేయాలని ఉన్నపళంగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించే కార్యక్రమాన్ని ఆగమేఘాలపై చేయించిన ముఖ్యమంత్రి నిజస్వరూపాన్ని ఆ మాత్రం అర్థం చేసుకోలేనంత అమాయకులైతే కాదు రైతన్నలు.
అదీకాకుండా ప్రజలంతా వరదల్లో తిండితిప్పలు లేకుండా, అన్నీ తడిసి, కనీసం కప్పుకోవడానికి దుప్పట్లు లేక బిక్కుబిక్కున రెండు రాత్రులు గడుపుతున్నా యంత్రాంగాన్ని కూడా పురమాయించకుండా సమీక్షలో గడిపిన తీరును అంతా గమనించిందే. మరీ ముఖ్యంగా ఆగమాగమైన వరంగల్, హన్మకొండ, కాజీపేట నగరాల్లో ప్రజలు నేరుగా అధికారులను, మేయర్‌ను, ఇతర నేతలను నిలదీసిన దృశ్యాలే వారి కడుపు మంట ఎలా ఉందో తెలియజెప్తున్నాయి. కొసమెరుపు ఏంటంటే వరదంతా తగ్గుముఖం పట్టిన తర్వాత ఏరియల్ రివ్యూకు వచ్చిన సీఎం తీరు ఇంకా తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. ఏదేమైనా చిత్తం శివుని మీద, భక్తి చెప్పుల మీద అన్నట్టుగా ఉన్న రాష్ట్ర సర్కార్ తీరుతో మొన్నటి వరకు యూరియా కొరత సహా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడిన రైతన్న పరిస్థితి రేవంత్ ప్రభుత్వపు ఉదాసీనతతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా తయారైంది.
తప్పు ఒక్కసారి చేస్తే క్షమించొచ్చు.. రెండోసారైతే మందలించొచ్చు.. మూడోసారి జరిగితే హెచ్చరించొచ్చు.. పదేపదే తప్పు
జరుగుతూనే ఉన్నా గుణపాఠం నేర్చుకోలేదంటే అది బరితెగింపు అయినా అనుకోవాలి, నాశనగాలంగానైనా భావించాలి. ప్రస్తుతం తెలంగాణ సర్కార్ పరిస్థితి కూడా అందుకు అన్వయింపుగానే ఉంది. పంట ఇంట్లకొచ్చే కాలంలో జరుగుతున్న నిర్లక్ష్యపు చర్యలు వ్యవసాయం అంటేనే భయపడేలా, సాగు చేయడం కంటే సావడం నయం అన్నట్టుగా పరిస్థితిని మారుస్తున్నది.