దేశంలోని మధ్యతరగతి వర్గం మరోసారి దేశ ఆర్థిక రంగంలో చర్చనీయాంశంగా మారుతున్నది. వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకనేది తెలియాలంటే, 2000 సంవత్సరంలోకి వెళ్లాలి. అప్పటికీ నేను ఉద్యోగంలో చేరి రెండేండ్లవుతున్నది. పరిశోధనలో కొన్నేండ్లు గడిపిన కారణంగా నేను జాబ్ మార్కెట్లోకి చాలా ఆలస్యంగా ప్రవేశించాను. అప్పుడు నా జీతం రూ. 40 వేలు మాత్రమే ఉండటానికి అది కూడా ఒక కారణం కావచ్చు. అది ఇప్పటి ధరల్లో చూస్తే దాదాపు రూ.1.7 లక్షలకు సమానం.
నేను కేవలం జర్నలిస్టును అన్నది మీరు గుర్తుంచుకోవాలి. ఈ కారణంగా రాబడి, ఆదాయం లక్ష్యాల లాంటివేవీ ఉండవు. అదే సమయంలో కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్న నా స్నేహితులు నా కంటే రెండింతల జీతం సంపాదిస్తున్నారు. ఇది ప్రారంభం మాత్రమే. 2004-05లో స్టాక్ మార్కెట్ బూమ్ తర్వాత వారి వేతనాలు మరింత పెరిగాయి. 2007-08 నాటికి గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి.
క్యాపిటల్ మార్కెట్లో డబ్బుల వరద పారడంతో అత్యున్నత ప్రతిభ కలిగినవారికి ఎక్కువ వేతనాలు ఇచ్చి, వారిని ఆకర్షించేందుకు గానూ కంపెనీలు నిధులను సేకరించాయి. ఈ బూమ్ ముగిసే నాటికి సీనియర్ మేనేజ్మెంట్ పొజిషన్లలో ఉన్న వైట్‌కాలర్ ప్రొఫెషనర్లు ఏడాదికి రూ.30-50 లక్షలు సంపాదించే స్థాయికి చేరుకున్నారు. టాప్ పొజిషన్లలో ఉన్నవారు రూ.కోటికి పైగా ప్యాకేజీలను అందుకుంటున్నారు. ఆ తర్వాత ప్రపంచ ఆర్థిక సంక్షోభం వచ్చింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది. స్టాక్‌మార్కెట్లు కుప్పకూలాయి. ఈజీ మనీ ఆగిపోయింది. దీంతో సీఈవోలు, సీనియర్ మేనేజర్లకు ఖర్చులు తగ్గించుకోవడం, ఉద్యోగాల్లో కోత లాంటి టాస్క్‌లను కార్పొరేట్లు అప్పగించారు. 2010 నాటికి చాలా కంపెనీలు తమ పీ అండ్ ఎల్ స్టేట్మెంట్లపై తక్కువ ఖర్చులను చూపించగలిగాయి. అంతేకాదు, ఈ ప్రక్రియ ముగిసే నాటికి బాగా పనిచేసినవారికి పెద్దమొత్తంలో బోనస్‌లను ఇవ్వజూపాయి.
వైట్‌కాలర్ ఉద్యోగుల వేతనాల్లో వ్యత్యాసానికి ఇది నాంది. ఉదాహరణకు టాప్ ఐటీ కంపెనీల్లో 2012-22 మధ్యకాలంలో సీఈవోల వేతనాలు 1,450 శాతం పెరగగా.. ఫ్రెషర్ల వేతనాలు 40 శాతం మాత్రమే పెరిగాయి. మీరు ద్రవ్యోల్బణం ప్రకారం దీన్ని సర్దుబాటు చేస్తే.. భారతదేశ ఐటీ రంగంలో సగటు ప్రవేశ జీతం వాస్తవ కొనుగోలు శక్తి పరంగా 25 శాతం తగ్గిందని తెలుస్తుంది.
స్టార్ట్-అప్ ఈ స్తబ్ధత నుంచి తప్పించుకుందనుకుంటే మీరు పొరబడినట్టే. 2014-15లో నగదు రూపంలో చెల్లించే జీతాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొన్ని స్టార్టప్‌లలోని పాత ఉద్యోగులు తమ కంపెనీలు గత రెండేండ్లలో పబ్లిక్ ఇష్యూకి వెళ్లినప్పుడు వారి ఈఎస్ఓపీలను (ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్) వాడుకోవడం ద్వారా డబ్బు సంపాదించారు. కానీ, చాలామంది ఉద్యోగులకు గత దశాబ్దకాలంలో వాస్తవ ఆదాయం తగ్గింది. బ్యాంకులు, ఫైనాన్షియల్ రంగంలోని కంపెనీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. పదిహేనేండ్ల కిందట ఓ మధ్యస్థాయి ఉద్యోగికి ఏడాదికి రూ.40-50 లక్షలు చెల్లించేవారు. నేడు హెచ్చుతగ్గుల బోనస్‌లతో కలిపి అది రూ.60-70 లక్షలకు చేరుకున్నది. వాస్తవంగా ద్రవ్యోల్బణం సర్దుబాటు నిబంధనల ప్రకారం.. వారి ఆదాయం 40 శాతం వరకు పడిపోయింది.
మీడియాలో జీతాలు దారుణంగా ఉన్నాయి. అగ్రశ్రేణి యాంకర్లు, ఎడిటర్లు ఇప్పటికీ వారి కార్పొరేట్ రంగంలోని సహచరుల మాదిరిగానే సంపాదిస్తున్నారు. అయితే సీనియ ర్ న్యూస్‌రూమ్ స్థానాల్లో ఉన్నవారి వాస్తవ ఆదాయాలు గత దశాబ్దకాలంలో సగానికి పడిపోయాయి. ఇప్పుడే ఈ రంగం లో ప్రవేశిస్తున్నవారికి 20 ఏండ్ల కిందట లభించే వేతనాల మాదిరిగానే ఇప్పటికీ జీతాలు ఇస్తున్నారు.
వైద్యులు, న్యాయవాదులు, ఆర్కిటెక్ట్‌లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఇతర స్వయం ఉపాధి నిపుణుల డేటా అస్పష్టంగా ఉంది. అయితే ఈ వృత్తులలో చాలా వరకు ఆదాయాలు నిలిచిపోయాయని తెలుస్తున్నది. మీ రెగ్యులర్ జీపీకి మీరు చెల్లించే కన్సల్టేషన్ చార్జీలే అందుకు ఉదాహరణ. 2000లో రెట్టింపు కంటే ఎక్కువ ఉన్న ఇది గత దశాబ్దంలో 50 శాతం పెరిగింది. అలాగే మీ సీఏ ఫీజులు కూడా చాలా అరుదుగా పెరిగాయి. బహుశా న్యాయవాదులకు ఇందుకు మినహాయింపు ఉండవచ్చు. వారి ఫీజులు పెరుగుతూనే ఉన్నాయి. రెండు దశాబ్దాల పాటు న్యాయవాద వృత్తిలో ఉంటూ, ఇప్పుడు ఉన్నత న్యాయస్థానాల్లో వాదిస్తున్న న్యాయవాదుల ఆదాయాలు, వారి సంపద అనూహ్యంగా పెరిగాయి. అందుకేనేమో దక్షిణ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే గత మూడేండ్లలో స్థిరాస్తి ధరలు బాగా పెరిగాయి. న్యాయవాదులు ఇండ్లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ పెరుగుదల కనిపిస్తున్నది.
దేశంలోని ఎగువ మధ్యతరగతి ప్రజల రోజువారీ జీవితాలను ఇది ఎలా ప్రభావితం చేసిందో ఇప్పుడు ఆలోచించండి. కుటుంబంలో సంపాదించే వ్యక్తి తన 40 ఏండ్ల చివరిలో లేదా 50 ఏండ్ల ప్రారంభంలో ఉన్న చాలా కుటుంబాలు ఉన్నత జీవన ప్రమాణాలకు అలవాటుపడ్డాయి. ఇప్పుడు వారికి ఆదాయాలు ఉండవు. కాబట్టి, అలాంటివారు ఆస్తులను, బంగారాన్ని విక్రయించి, పొదుపులను, మ్యూచువల్ ఫండ్లలో ఉన్న పెట్టుబడులను వాడుకొని జీవిస్తున్నారు. కొందరు తమ పూర్వీకుల ఆస్తులను విక్రయించి జీవనం సాగిస్తున్నారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి కుటుంబాల్లోని కొంతమంది యువకులు ప్రస్తుతం శ్రామికశక్తిగా మారుతున్నారు. వారు తమ తల్లిదండ్రులు, ఇండ్లు, సొంత ఊర్లను విడిచిపెట్టి ఉపాధిబాట పడుతున్నారు. కానీ, వారికి అందుతున్న వేతనాలు పాకెట్ మనీకే సరిపోతున్నాయి. వారి సంపాదనలో ఎక్కువ భాగం నూతన బైక్, మంచి బట్టలు, కొత్త ఫోన్, స్నేహితులతో షికార్లకే సరిపోతున్నాయి. అయితే వారి తల్లిదండ్రులు వారికిచ్చిన అదే జీవనశైలితో సొంత జీవితాన్ని ప్రారంభించడానికి ఇది ఏ మాత్రం సరిపోదు. నేటి యువతకు పెండ్లిళ్లు చేసుకొని పిల్లలను కనేంత స్థోమత లేదు. సొంత ఇండ్లను కలిగి ఉండాలనే ఆశ వారిలో లేదు. ఎందుకంటే, వారు ఈఎంఐలను భరించలేరు. తమ తల్లిదండ్రుల కంటే తక్కువ సంపాదనతోనే వారు సరిపెట్టుకుంటున్నారు. ఇప్పటికీ విలాసాలు, ప్రీమియం ఉత్పత్తులపై ఖర్చు చేస్తారు. కానీ, తల్లిదండ్రులు చేయగలిగిన అదే స్థిరమైన స్థాయిలో మాత్రం కాదు.
2008-09 నాటి ప్రపంచ ఆర్థిక మాంద్యం నుంచి దాదాపు రెండు దశాబ్దాలుగా దేశంలోని మధ్యతరగతి ఈ స్తబ్ధతను ఎదుర్కొంటున్నది. 2000వ దశకం ప్రారంభంలో తాము అనుభవించిన ‘అచ్ఛే దిన్’ను నరేంద్ర మోదీ తిరిగి తీసుకువస్తారనే ఆశతో 2014లో అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని గద్దె దించడంతో ఇది ప్రారంభమైంది. కానీ, వారు ఆశించింది జరగలేదు. డీమానిటైజేషన్, జీఎస్టీ, కొవిడ్ లాంటివి వచ్చాయి,
వెళ్లిపోయాయి. కానీ, దేశంలోని వృత్తిపరమైన తరగతుల జీవితాలు మాత్రం మెరుగుపడలేదు.
2008-09 నాటి ప్రపంచ ఆర్థిక మాంద్యం నుంచి దాదాపు రెండు దశాబ్దాలుగా దేశంలోని మధ్యతరగతి ఈ స్తబ్ధతను ఎదుర్కొంటున్నది. 2000వ దశకం ప్రారంభంలో తాము అనుభవించిన ‘అచ్ఛే దిన్’ను నరేంద్ర మోదీ తిరిగి తీసుకువస్తారనే ఆశతో 2014లో అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని గద్దె దించడంతో ఇది ప్రారంభమైంది. కానీ, వారు ఆశించింది జరగలేదు. డీమానిటైజేషన్, జీఎస్టీ, కొవిడ్ లాం టివి వచ్చాయి, వెళ్లిపోయాయి. కానీ, దేశంలోని వృత్తిపరమైన తరగతుల జీవితాలు మాత్రం మెరుగుపడలేదు. ఏదైనా జరిగిందంటే.. అది కేవలం గత దశాబ్దం లేదా అంతకంటే ఎక్కువకాలంగా ద్రవ్యోల్బణం వారి జీవితాలను ప్రభావితం చేయడమే. పన్ను స్లాబ్‌లు మారి ఉండవచ్చు. కానీ, అవి ధరల రేటు ప్రకారం మారలేదు. అదే సమయంలో మధ్యతరగతికి అతి కీలకమైన మెడికల్ ఇన్సూరెన్స్ వంటివి చేరికతో జీఎస్టీ పరిధిలోకి వచ్చే అంశాల జాబితా పెరుగుతున్నది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం మధ్యతరగతి కుటుంబాల్లో ఆశలు చిగురించేలా కనిపించడం లేదు. స్థిరమైన ఆదాయాలు, నిరంతరం పెరుగుతున్న ధరల మధ్య వారు చిక్కుకున్నారు. పైకి తెలియకుండానే వారిలోని నిశ్చలతత్వం నిరాశకు దారితీసింది. ఈ నిరాశ ఇప్పుడు తీవ్ర ఆగ్రహంగా మారే ప్రమాదం ఉన్నది.
(‘ది క్వింట్’ సౌజన్యంతో)
– అనింద్యో చక్రవర్తి