పహల్గాం మారణహోమం అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సైనిక చర్య నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ ఉద్రిక్తతల సమయంలో పాకిస్థాన్ అనాలోచితంగా అణ్యస్త్రాల ప్రస్తావన తెరపైకి తేవడం కూడా తెలిసిందే. పాకిస్థాన్ అణ్యస్త్రాల ప్రస్తావన తేవడం చాలా ఆశ్చర్యం, ఆందోళన కలిగించవలసిన విషయం. పాకిస్థాన్, భారత్ వద్ద అణ్యస్త్రాలున్న సంగతి ప్రపంచానికి తెలుసు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల వేళ అణ్వాయుధాల ప్రస్తావన తేవడం ఆషామాషీ వ్యవహారం కాదు.
అణ్వస్ర్తాలున్న రెండు పొరుగు దేశాల మధ్య ఉద్రిక్తతల వేళ ఆ ఆయుధాల ప్రస్తావన తేవటం అంటే ఆ ఆయుధాలను వాడతామని చెప్పటమే కదా! అటువంటి ఆలోచనే విస్మయం కలిగించే విషయం. ఇది అత్యంత బాధ్యతారహితమైన ఆలోచన. ఎందుకంటే అణ్వాయుధాలను ప్రయోగించి యుద్ధం చేస్తే గెలిచేవారు ఉండరు. యుద్ధాలు గెలవాలనే చేస్తారు ఎవరైనా. యుద్ధం ద్వారా ఏ సమస్యా పరిష్కారం కాలేదు చరిత్రలో. యుద్ధంలో గెలుపు మరో కొత్త సమస్యకు పురుడు పొయ్యటం మనకు తెలుసు. అయినా యుద్ధం చెయ్యటం మానుకోలేకపోతున్నాడు మనిషి. అణ్వాయుధాలను వాడితే గెలుపు అనేది ఉండదు. మనకు పాకిస్థాన్‌తో తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో విజ్ఞులైన నమస్తే తెలంగాణ పాఠకులకు, సామాన్య ప్రజలకు అణ్వాయుధాల మీద అవగాహన కలిగించటమే ఈ వ్యాసం ఉద్దేశం.
అణ్యస్త్రాల గురించి తెలుసుకోవాలంటే ముందు ఎన్పీటీ అనే దాన్ని గురించి అర్థం చేసుకోవాలి. అణ్యస్త్రాల విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఇది అత్యంత కీలకమైన అంశం. ఎన్పీటీ అంటే న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. అంటే అణ్వస్ర్తాల వ్యాప్తి నిరోధక ఒప్పందం. అణ్యస్త్రాలకు సంబంధించిన సాహిత్యం అంతా ఆంగ్లంలో ఉన్నది. పదజాలం కూడా ఎక్కువగా ఆంగ్లంలోనే ఉంది. వీలైనంత వరకు తెలుగులోకి మార్చి చెప్తాను. ఎన్పీటీ అనేది చాలా మంది విని ఉంటారు, అందులో ఏముందో లోతుగా తెలియకపోయినా. ఇక్కడ ఎన్పీటీని లోతుగా పరిశీలిద్దాం. 1968లో ఈ ఎన్పీటీ ఒప్పందానికి ప్రపంచదేశాలు సంతకం చేసి ఆమోదం తెలిపే ప్రక్రియ మొదలైంది. ఈ ఒప్పందం 1970 మార్చి 5వ తేదీన అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం 1967 జనవరి 1కి ముందు అణు విస్ఫోటనం చేసిన దేశాలు అణ్వస్త్ర దేశాలుగా గుర్తింపు పొందాయి. వాటిని న్యూక్లియర్ వెపన్ స్టేట్స్ అంటే అణ్వస్ర్తాలు కలిగిన రాజ్యాలు అంటారు. మిగిలిన దేశాలను నాన్ న్యూక్లియర్ వెపన్ స్టేట్స్ అనగా అణ్వస్ర్తాలు లేని రాజ్యాలుగా పరిగణిస్తారు. మిగతా దేశాలు ఏవైనా 1967 తర్వాత అణ్వస్ర్తాలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ ఆ దేశాలను ఈ ఒప్పందం అణ్వస్ర్తాలు ఉన్న దేశాలుగా గుర్తించదు. భారత్, పాకిస్థాన్ లాంటి దేశాలు ఈ కోవకే వస్తాయి. ఇదో రకమైన న్యూక్లియర్ ఫ్యూడలిజం.
న్యూక్లియర్ వెపన్ స్టేట్స్ అన్న గుర్తింపు పొందిన దేశాలు ఐదు మాత్రమే. అవి అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా. విచిత్రం ఏమంటే ఈ ఐదు దేశాలు ఐరాసలోని అతి కీలకమైన భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలే.
ఎందుకు విచిత్రమో కొద్దిసేపు తర్వాత వివరిస్తాను. 1967 తర్వాత అణు విస్ఫోటనం చేసిన దేశాలను అణ్వస్త్ర దేశాలుగా ఈ ఎన్పీటీ ఒప్పందం గుర్తించదు. అణ్వస్ర్తాలకు సంబంధించి అత్యంత కీలకమైన ఒడంబడిక పత్రం ఇది. ఈ ఒప్పందానికి దాదాపు 200 దేశాలు సంతకాలు చేశాయి. అంటే ఒప్పంద నియమాలను పాటించటానికి అంగీకరించాయి. 1970 తర్వాత అణు విస్ఫోటనం చేసి అణ్వాయుధాలు తయారు చేసినట్టు గుర్తింపు పొందిన దేశాలు కొన్ని ఉన్నాయి. అటువంటి దేశాల్లో భారత్, పాకిస్థాన్ ముఖ్యమైనవి. భారత్ పాకిస్థాన్ ఎన్పీటీ ఒప్పందాన్ని వ్యతిరేకించాయి. ఎందుకంటే 1970 తర్వాత విస్ఫోటనం చేసిన దేశాలను అణ్వస్త్ర దేశాలుగా ఈ ఒప్పందం గుర్తించదు. అలా గుర్తింపు పొందిన ఐదు దేశాలకు ఉండే సదుపాయాలు, మినహాయింపులు ఈ దేశాలకు ఉండవు. అందుకే ఎన్పీటీ వివక్షతో కూడుకున్న ఒప్పంద పత్రం అని ముఖ్యంగా భారత్ వాదన. ఎన్పీటీ ఒప్పందం మీద సంతకం చెయ్యటమంటే మనకున్న అణ్వస్ర్తాలను నిర్వీర్యం చేసి మన ఆయుధాగారాలను అంతర్జాతీయ పరిశీలనకు తెరిచి ఉంచాలి. ఈ నిబంధన అణ్వస్త్ర దేశాలుగా గుర్తింపు పొందిన ఐదు దేశాలకు వర్తించదు. 1967కి ముందు విస్ఫోటనం చేసిన దానికి ఉన్న పవిత్రత ఏమిటీ, ఆ తర్వాత విస్ఫోటనం జరిపిన దేశాలు చేసిన పాపం ఏమిటనేది ఈ ఒడంబడికకు ఉన్న ముఖ్యమైన బలహీనత. కడుపునిండా చద్దన్నం తిన్న అమ్మకు ఇతరుల ఆకలి ఏమి తెలుస్తుందన్న సామెత గుర్తుకు వస్తుంది ఈ ఒడంబడిక పదజాలం చూస్తుంటే. అణ్వస్ర్తాలు కలిగిన ఐదు దేశాలను ఇంతకుముందు విచిత్రం అనుకున్నాం కదా. ఎందుకు విచిత్రం అంటే భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలు ఐరాస ఆశయాల సాధనలో ముఖ్య భూమిక పోషించాలి. ఏమిటి ఆ ముఖ్య భూమిక అంటే? సభ్యదేశాల మధ్య యుద్ధాలను నిరోధించటం, శాంతిని స్థాపించటం.
కోల్డ్‌వార్ యుగంలో నాటో అన్న పేరుతో అమెరికా ఒకవైపు, వార్సా ప్యాక్ట్ అన్న పేరుతో అలనాటి సోవియెట్ యూనియన్ మరోవైపు ప్రపంచాన్ని అల్లకల్లోలానికి గురిచేశాయి. తద్వారా అనేక దేశాలు ఆయుధాలు ఏర్పాటు చేసుకునే పోటీ వాతావరణానికి శ్రీకారం చుట్టాయి. దెయ్యాలు వేదాలు వల్లించటం అంటే ఇదే కదా!
ఎన్పీటీలో మూడు ముఖ్యమైన అంశాలున్నాయి. అవి: ఆయుధాల వ్యాప్తిని అరికట్టడం, నిరాయుధీకరణ, అణుశక్తిని శాంతియుత ప్రయోజనాల కోసం వాడుకోవటం. ఒడంబడికలో ఉన్న ఆశయాలేవీ నెరవేరలేదు 55 ఏండ్ల తర్వాత కూడా. అంటే మన దేశంలో వరకట్న నిరోధక చట్టం లాంటిది ఈ ఎన్పీటీ ఒడంబడిక! భారత్, పాకిస్థాన్ ఈ ఒడంబడికను అంగీకరించలేదు గనుక ఇందులోని నిబంధనలు ఈ దేశాలకు వర్తించవు. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించవలసినది ఏమంటే అణ్వస్ర్తాలు భద్రత కోసం కన్నా కూడా భయం కలిగించటానికి ఏర్పాటు చేసుకోవటమనే విషయం. నా వద్ద అణ్వస్ర్తాలు ఉన్నాయి. నా జోలికి వచ్చావంటే జాగ్రత్త అనేది ఇక్కడ సూత్రం. అంటే, ఇవి నాకు బలాన్నివ్వవు. కానీ, నేనంటే భయాన్ని కొల్పుతాయన్నమాట. మరి రెండు పొరుగు దేశాలైన భారత్-పాకిస్థాన్ వద్ద అణ్వస్ర్తాలు ఉన్నప్పుడు ఒకరిని చూసి మరొకరు జాగ్రత్తగా ఉండాలి కదా! కానీ, పాకిస్థాన్ పసి పిల్లాడి మాదిరిగా మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నవని అదేపనిగా అరవటం దేనికి సంకేతం? మేము ఆ ఆయుధాలను వాడటానికి వెనకాడమని చెప్పటమే కదా! మరి భారత్ వద్ద కూడా ఉన్నవి కదా! పాకిస్థాన్ కంటే భారత్ వద్దే ఎక్కువ ఉంటాయి కదా అణ్వాయుధాలు. మరి భారత్‌ను బెదిరించటం ఏమిటి? ఇక్కడ గమనించవలసిన మరో ముఖ్యమైన విషయం ఏమంటే భారత్ ఎప్పుడూ అణ్వస్ర్తాల ప్రస్తావన తీసుకురాదు. అందరూ అంగీకరించే విషయాన్ని నిరూపించవలసిన అవసరం ఏమున్నది?
ఇక్కడ అణ్వాయుధాల పట్ల భారత్ వైఖరిని గురించి తెలుసుకోవాలి. ఈ విషయంలో భారత్ ఒక స్వీయ నియంత్రణ సిద్ధాంతాన్ని (న్యూక్లియర్ డాక్ట్రిన్) ఏర్పాటుచేసుకున్నది. అందులోని ముఖ్యమైన అంశం నాన్ ఫస్ట్ యూజ్. అంటే, మొదటగా మేము అణ్వస్ర్తాలను యుద్ధంలో ప్రయోగించబోమనేది భారత్ విధానం.
ఎవరైనా మా మీద ప్రయోగిస్తే తిరిగి మా అణ్వాయుధాలను ప్రయోగించటానికి వెనుకాడం. కానీ, మేము మాత్రం మొదటగా ప్రయోగించబోమనేది మొదటి సూత్రం. రెండవది అణ్వస్ర్తాలు లేని దేశం మీద అణ్వస్ర్తాలను ప్రయోగించం అనేది. ఇంతకు మించిన స్వీయ నియంత్రణ ఏముంటుంది? ఇది అత్యంత బాధ్యతాయుతమైన అణు ప్రవర్తన అనటంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. మన అణ్వస్త్ర ధర్మాన్ని రూపొందించింది కె.సుబ్రహ్మణ్యన్ అనే అణ్వస్త్ర వ్యూహకర్త. ఆయన కుమారుడే నేటి మన విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్!
ఒక్క మాటలో చెప్పాలంటే ఏ దేశానికైనా అణ్వాయుధాలు ఇతరులు మనజోలికి రాకుండా భయపెట్టే సాధనమే గానీ మనకు భద్రత కల్పించే వ్యవస్థ కాదు. దీన్నే దౌత్య భాషలో డిటరెన్స్ అంటారు. అంటే మనకు ఉత్సాహాన్ని పెంచేదానికన్నా ఇతరులను నిరుత్సాహపరచటం అన్న మాట. కానీ, పాకిస్థాన్ ఈ డిటరెన్స్ అన్న మాటను అర్థం చేసుకోకుండా కోతికి కొబ్బరికాయ దొరికినట్టు, పిచ్చోడి చేతిలో రాయి అన్నట్టు మాటిమాటికీ భారత్‌ను అణ్వస్ర్తాలతో బెదిరించటం హాస్యాస్పదంగా ఉన్నది. భారత్ దగ్గర ఉన్న అణ్వాయుధాలు దీపావళి పండుగ చేసుకోవటానికి కాదు గదా! ఇక్కడ వాస్తవం ఏమంటే అణ్వస్ర్తాలు ఎవరు ముందువాడినా, ఎవరు తర్వాత వాడినా, ఎవరూ మిగిలి ఉండరు. అణ్వస్ర్తాలు 1945లో మొదటిసారి జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి మీద ప్రయోగించినప్పుడు, అవి చాలా పరిమిత శక్తి కలిగిన ఆటంబాంబులు. 1945లో వాడిన ‘చిన్న బాలుడు’, ‘దొడ్డు మనిషి’ అన్న పేర్లు ఉన్న ఆటం బాంబుల విధ్వంసం హిరోషిమా నాగసాకి నగరాలు వాటి చుట్టుపక్కల ప్రాంతాలకు పరిమితమైనది. కానీ, 1945 తర్వాతి కాలంలో అణ్వస్ర్తాలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందినది. నేటి అణ్వస్ర్తాలు‘చిన్న బాలుడు, దొడ్డు మనిషి’ కన్నా చాలా శక్తివంతమైన ఆయుధాలు. ఈ ఆయుధాలను ప్రయోగిస్తే గెలిచేవారుండరు. ఇరువైపులా ఊహించలేనంత వినాశనమే. మ్యూచువల్లి అష్యూర్డ్ డిస్ట్రక్షన్ (MAD) అంటారు న్యూక్లియర్ పరిభాషలో. అంతటి వినాశన శక్తి కలిగిన ఆయుధాలు మావద్ద ఉన్నవని పాకిస్థాన్ అదే పనిగా అరవటం తాటాకు చప్పుడా లేక తెగింపునకు నిదర్శనమా? ఇటువంటి బాధ్యతా రాహిత్య ప్రవర్తనను ప్రపంచం ముక్తకంఠంతో ఖండించాలి. ఈ విషయం మీద నెలకొన్న నిశ్శబ్దాన్ని చూస్తుంటే ముక్తకంఠంతో పాకిస్థాన్‌ను ఖండించటానికి ప్రపంచం సిద్ధమా? అనేది సందేహమే. అది నిజంగా ప్రపంచం మొత్తానికి పట్టిన దురదృష్టం.
ఏ దేశానికైనా అణ్వాయుధాలు ఇతరులు మన జోలికి రాకుండా భయపెట్టే సాధనమే గానీ మనకు భద్రత కల్పించే వ్యవస్థ కాదు. దీన్నే దౌత్య భాషలో డిటరెన్స్ అంటారు. అంటే మనకు ఉత్సాహాన్ని పెంచేదానికన్నా ఇతరులను నిరుత్సాహపరచటం అన్న మాట. కానీ, పాకిస్థాన్ ఈ మాటను అర్థం చేసుకోకుండా పిచ్చోడి చేతిలో రాయి అన్నట్టు మాటిమాటికీ భారత్‌ను అణ్వస్ర్తాలతో బెదిరించటం హాస్యాస్పదం.
– గుమ్మడిదల రంగారావు