తెలంగాణలో పుష్ప వైల్డ్ ఫైర్ హైడ్రామాకు తెరపడింది. రాష్ట్రంలో ఆ సినిమా ఏ స్థాయిలో ఆడిందో తెలియదు కానీ, మూడు వారాల పాటు రాజకీయ రచ్చ మాత్రం కావాల్సినంత జరిగింది. పుష్ప ఫైర్‌లో రాష్ట్రంలోని అన్ని సమస్యలు కాలిబూడిదైపోయాయి. చివరికి అసెంబ్లీ సమావేశాల్లో సైతం ప్రజా సమస్యలపై చర్చ జరగలేదు. ప్రభుత్వం, సినీ పరిశ్రమకు మధ్య జరిగిన తాజా భేటీతో 22 రోజుల సినిమాకు ఎండ్ కార్డ్ పడినట్టయింది.
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, మాటలు అన్నీ తానై సీఎం రేవంత్ నడిపించిన పొలిటికల్ హైడ్రామాలో చివరికి విలన్‌గా మారింది మాత్రం కమ్యూనిస్టు పార్టీ. ప్రభుత్వం, ఎంఐఎం ట్రాప్‌లో ఎర్ర జెండా పార్టీ పడిపోయింది. ప్రజాధనంతో ముడిపడి ఉన్న ఫార్ములా-ఈ రేస్‌పై సభలో చర్చకు బీఆర్ఎస్ పట్టుబడితే అది ఒక కుటుంబ వ్యవహారమని చెప్పిన కమ్యూనిస్టు నేతకు సంధ్య థియేటర్ అంశంలో ఎలాంటి ప్రజా సమస్య కనిపించిందో మరి? కుటుంబ వ్యవహారం కోసం సభ సమయం వృథా చేయాలా? అని ప్రశ్నించిన లెఫ్ట్ పార్టీకి ఒక వ్యక్తి గురించి గంటల కొద్దీ ప్రసంగిస్తుంటే విలువైన సమయం వృథా అవుతున్నట్టు కనిపించకపోవడం విడ్డూరం. ఫార్ములా-ఈ రేస్ ప్రభుత్వ ఈవెంట్. ఆ ఈవెంట్లో ప్రజల డబ్బు ఉంది. అందులో అవినీతి జరిగిందని ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంటే అది వ్యక్తిగతం ఎట్లా అవుతుందో వారి విజ్ఞతకే వదిలేద్దాం.
రాష్ట్రంలో గురుకులాల్లో విద్యార్థులు విషాహారం తిని మృతిచెందుతున్నారు. రైతులు, ఆటోకార్మికులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. మూసీ, హైడ్రా బాధితులు రోడ్డునపడ్డారు. క్రైమ్ రేట్ దాదాపు 41 శాతం పెరిగిందని పోలీసుల నివేదికలే చెబుతున్నాయి. ఇంకా రాష్ట్రంలో అనేకానేక సమస్యలున్నాయి. వీటిపై ఎప్పుడైనా ఇంత అత్యవసరంగా ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారా? మంత్రులతో కూర్చొని మాట్లాడిన ఉదంతాలు ఉన్నాయా? వీటంన్నిటినీ పక్కనపెట్టి మరీ సినీ పెద్దలతో అత్యవసరంగా ఎందుకు భేటీ అవుతున్నారని కమ్యూనిస్టులకు సీఎంను అడిగే దమ్ముందా?
నిజానికి తెలంగాణలో ఇప్పటికిప్పుడు సినిమా పరిశ్రమకు వచ్చిన కష్టం ఏమీ లేదు. సీఎం రేవంత్ చెప్పినట్లు వారు రాష్ట్రం కోసం, దేశం కోసం సరిహద్దుల్లో యుద్ధం ఏమైనా చేశారా? వాళ్లు వ్యాపారులు. పెట్టుబడి పెట్టి లాభాలు గడిస్తారు. మరి అలాంటివారి కోసం రాష్ట్రంలోని అన్ని సమస్యలను పక్కనపెట్టి మరీ ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ప్రశ్నించే ధైర్యం ఎర్రజెండా నేతలకు ఉందా? ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించే చరిత్ర కమ్యూనిస్టు పార్టీలది. ఇదంతా గతం. ఇప్పడు ఎర్ర జెండా పార్టీలు ప్రభుత్వం పక్షాన నిలబడుతున్నాయి. అందుకే ప్రజలే వారిని నిలదీసే పరిస్థితి వచ్చింది.
ఒకవైపు దేశంలో ప్రజలు ఏం తినాలి? ఏం మాట్లాడాలి? ఏం రాయాలి? ఎలాంటి సినిమాలు తీయాలి? ఎలాంటి బట్టలు వేసుకోవాలి? అని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజలపై ఒత్తిడి తీసుకువస్తున్నదని చెప్పే కమ్యూనిస్ట్ పార్టీలకు కాంగ్రెస్ పార్టీ నేడు పుష్ప సినిమాపై చేస్తున్న రాద్ధాంతం కనిపించడం లేదా? ఇది వారి రెండు నాల్కల ధోరణికి నిదర్శనం కాదా? దేశంలోని కాంగ్రెస్, బీజేపీ, చివరికి కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఒకే తాను ముక్కలే అన్నది దీన్నిబట్టి స్పష్టమవుతున్నది. కాంగ్రెస్‌తో అంటకాగుతూ సినిమాను సినిమాలా చూడని భావదారిద్య్రానికి కమ్యూనిస్టులు దిగజారిపోయారు.
సినిమాను సినిమాలాగే చూడాలని అనేక వేదికపై ఉపన్యాసాలు దంచే వీరే ఇప్పుడు పుష్ప దగ్గరకు వచ్చేసరికి అందులో ఏదో ఉందని ఈకలు పీకుతున్నారు. కమ్యూనిస్టులు చెప్తున్నట్టు పుష్ప సినిమా చూసి యువత దొంగతనాలు చేస్తే.. మరి అనేక సినిమాల్లో హీరోలు అన్నలుగా నటించారు. నక్సల్స్ ఉద్యమాలే కథాంశంగా అనేక సినిమాలు వచ్చాయి. మరి యువత ఎందుకు ఆ ఉద్యమాల వైపు ఆకర్షితులు కాలేదు. అంతేకాదు, చాలా సినిమాల్లో ఎన్కౌంటర్ల సీన్లు ఉన్నాయి. మరి వాటి గురించి మాట్లాడకుండా కేవలం పుష్పలో ఇట్లా ఉంది, అట్లా ఉంది అంటూ మాట్లాడటం వాళ్ల మూల సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చారని చెప్పేందుకు నిదర్శనం కాదా? మరోవైపు సినిమా ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య దూరం పెరిగిందని అందుకే సంధ్య థియేటర్ ఇష్యూ ముదిరిందని కొందరు చెప్తున్నారు. అసలు ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య దూరం పెరగలేదు.
సీఎం రేవంత్ మాటల్లో చెప్పాలంటే కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల కోసం ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ యంత్రాంగం అత్యవసరంగా భేటీ కావాల్సిన అవసరం లేదు. వాస్తవానికి, ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య భారీ గ్యాప్ వచ్చింది. అయినా ఈ గ్యాప్‌ను పూడ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌కు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు సమయం ఉండటం లేదు.
మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆడిన చదరంగంలో అటు పోలీసు వ్యవస్థ, ఇటు కమ్యూనిస్ట్ పార్టీలు ప్రజల దృష్టిలో విలన్లుగా మారా యి. నిజానికి కమ్యూనిస్ట్ పార్టీలు ప్రజల పక్షం. ప్రజా ఉద్యమాలతో జనాల్లో చైతన్యం తీసుకువచ్చిన పేరు వాటికి ఉన్నది. అయితే, కాంగ్రెస్ ట్రాప్‌లో పడి ఆ పేరును కోల్పోతున్నాయి. అటు దేశంలోనే స్మార్ట్ పోలీసింగ్‌గా గుర్తింపు పొందిన తెలంగాణ పోలీస్ వ్యవస్థ కూడా పేరుప్రతిష్టలను పోగొట్టుకున్నది. ప్రభుత్వ ఒత్తిడితో అల్లు అర్జున్ ఇష్యూలో అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులు తమపై మచ్చపడేలా చేసుకున్నారని తెలంగాణ సమా జం చర్చించుకుంటున్నది. ఈ నేపథ్యంలో పోలీసు వ్యవస్థ తీరు ఆందోళనకరం.