ఆకాశంలో సగం.. బస్సులో ఫుల్ అనే రోజులు వచ్చాయి. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రవేశపెట్టిన తర్వాత పురుష ప్రయాణికుల పాట్లు అన్నీఇన్నీ కావు. టికెట్ తీసుకొని ప్రయాణించే పురుషులేమో నిలబడి ప్రయాణం చేస్తుండగా, ఉచితంగా ప్రయాణించే మహిళలేమో దర్జాగా సీట్లో కూర్చొని వెళ్తున్నారు. బస్సులో 50-55 సీట్లకు మాత్రమే ఇన్సూరెన్స్ వర్తిస్తుందని, ఈ లెక్కన ఉచితంగా ప్రయాణించే మహిళలకే బీమా వర్తిస్తుండగా, నిలబడి ప్రయాణించే పురుషులకు వర్తించదనే విషయం తాజాగా బయటపడింది. దీంతో ‘ఇది మరీ అన్యాయం’ అని పురుషులు లబోదిబోమనడంతో ఆర్టీసీ కూడా ఆలోచనలో పడినట్టు సమాచారం. ‘ఆకాశంలో సగం’ లెక్కన బస్సులో సగం సీట్లను పురుషులకు కేటాయించాలని ఆర్టీసీ యోచిస్తున్నట్టు వినికిడి. ఇదే జరిగితే ఇక నుంచి ‘పురుషులను గౌరవిద్దాం.. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం’ అనే నినాదం బస్సుల్లో రాస్తారేమో చూడాలి.
కాంగ్రెస్‌లో వైఎస్ షర్మిల చేరిక విషయం ఎటూ తేలడం లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌లో షర్మిల చేరిక ఖాయమైందని గట్టి ప్రచారం జరిగింది. దీనికి బలం చేకూరుస్తూ ఆమె ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ కూడా అయ్యారు. ఈ విషయం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పార్టీలో చేర్చుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కానీ, ఆమెకు పార్టీ పగ్గాలు అప్పగించే విషయంలోనే కాంగ్రెస్ తర్జనభర్జన పడుతున్నట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. కాంగ్రెస్‌లో షర్మిల చేరికకు కొన్ని అదృశ్య శక్తులు అడ్డుపడుతున్నాయని సమాచారం. ఆ శక్తులు ఎవరనే దానిపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి.
ఒకప్పుడు క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకొనే బీజేపీలో ఇప్పుడు అది లేకుండా పోయింది. రాష్ర్టానికి జాతీయ నాయకులు ఎవరు వచ్చినా.. మీలో మీరు కొట్లాడుకోవద్దు.. అని చెప్పి వెళ్తున్నారు. ‘మీలో మీకు ఏవైనా గొడవలుంటే మా దృష్టికి (అధిష్ఠానం) తీసుకురండి, అంతే కానీ, ఒకరిపై ఒకరు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోసుకోవడమేంటి? అసహ్యంగా’ అని మొన్న రాష్ట్ర ఇన్చార్జి తరుణ్ చుగ్, నిన్న అమిత్ షా కాస్త గట్టిగానే తలంటినట్టు సమాచారం. ‘పార్టీలో గొడవలు లేకుండా ఉండి ఉంటే రాష్ట్రంలో మనం అధికారంలో ఉండే వాళ్లం’ అని అమిత్ షా వాపోయారట. అది సరే కానీ, పార్టీని బలహీనపరిచిందెవరు? తప్పు మీ వద్ద పెట్టుకొని.. మాకు సుద్దులు చెప్తే ఎలా? అని కొందరు నేతలు సణిగితే, ‘ఆ ఒక్కటి అడగొద్దు’ అన్నట్టు ఉంది వారి వ్యవహారమని సీనియర్ నేత ఒకరు వాపోయారు.
కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకున్న సీపీఐ ఎట్టకేలకు అసెంబ్లీలో అడుగుపెట్టింది. తాజాగా సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లోనూ గుర్తింపు సంఘంగా విజయం సాధించింది. పొత్తు ఒప్పందంలో భాగంగా మరో రెండు ఎమ్మెల్సీలను కూడా ఆ పార్టీ దక్కించుకోనున్నది. అంతటితో ఆ పార్టీ తృప్తి చెందడం లేదు. ఎన్నికలకు ముందు తమకు ఒక మంత్రి పదవి కూడా ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని సీపీఐ నేతలు గుర్తు చేస్తున్నారు. పాపం, అసెంబ్లీ ఎన్నికలలో బాగా నష్టపోయిన పార్టీ ఏదైనా ఉందా? అంటే ఒకటి సీపీఎం, రెండోది పవన్‌కల్యాణ్ జనసేన మాత్రమే. ఈ రెండు పార్టీలూ డిపాజిట్లు కోల్పోవడమే కాకుండా బర్రెలక్క కంటే తక్కువ ఓట్లు రావడంతో తలెత్తుకోలేకపోతున్నాయి.