అస్తిత్వం, ఐడెంటిటీ, ఉనికి, గుర్తింపు ఏవైనా కొద్దిపాటి తేడాలతో అన్నీ సమానార్థకాలే. తెలంగాణ అస్తిత్వం వెనుక ఉన్న చారిత్రక, రాజకీయ నేపథ్యాన్ని నిరంతరం గుర్తుచేసుకోవడం ఎంత ముఖ్యమో, దాన్ని కాపాడుకోవడానికి ఎల్లప్పుడూ జాగృతంగా, చైతన్యంగా ఉండటం కూడా అంతకంటే ముఖ్యం. తెలంగాణ చరిత్రలో మూడు ప్రధాన ఉద్యమ ఘట్టాలు కనిపిస్తాయి. 1952 నుంచి 1956 వరకు జరిగిన గైర్ ముల్కీ గోబ్యాక్ ఉద్యమం. అది హైదరాబాద్ స్టేట్ ఉన్నప్పుడు మొదటి ముల్కీ ఉద్యమం. ఆ తర్వాత 1969లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చింది. ఉవ్వెత్తున ఎగిసిపడిన ఆ ఉద్యమంలో 369 మంది అమరులయ్యారు. అనంతరం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన మలిదశ ఉద్యమం. అది చాలా శాంతియుతంగా జరిగిన పోరాటం. అమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సాకారమైంది.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనవాళ్లలో కొందరికి కొంత ఆరామీ- సుకూన్ స్వభావం లేదా ‘కామ్ హోగయ చలో‘ అన్న స్వభావం చోటు చేసుకుంది. ‘తెలంగాణ వచ్చేసింది కదా, ఇంకేం కాదులే‘ అనే నిర్లిప్తత ఆవహించింది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఆ ఆరామీ-సుకూన్ స్వభావం మనల్ని ఎంత ప్రమాదకరమైన స్థితికి తీసుకెళ్లిందో కనిపిస్తున్నది. గతంలో ఏం జరిగిందనేది ఎంత ముఖ్యమో, వర్తమానంలో ఏం జరుగుతున్నది? మనం ఎంత యాక్టివ్‌గా ఉన్నాం? అనేది భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఇప్పుడు నిమ్మళంగా ఉంటే, భవిష్యత్తు అగమ్య గోచరమై మొదటికొచ్చి ’వైకుంఠపాళిలో పెద్ద పాము మింగినట్టు’ వెనక్కి పడిపోతాం.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యాలు ఉన్నాయి. ’నీళ్లు, నిధులు, నియామకాలు’ అనే నినాదంలో నీళ్లకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి పనులు జరిగాయి. ఉద్యోగాల విషయంలో కూడా 95 శాతం స్థానికులకే వచ్చేలా మార్పులు జరిగాయి.
అయినప్పటికీ, ఎక్కడ లోటు జరిగింది అంటే.. తెలంగాణ అస్తిత్వాన్ని, దాని సామాజిక-సాంస్కృతిక వారసత్వాన్ని ఎలా రక్షించుకోవాలనే ప్రణాళికను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోయాం. బతుకమ్మ పండుగను అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి అంతర్జాతీయ వేదికల వరకు తీసుకెళ్లి విస్తృత ప్రచారం కల్పించినప్పటికీ, కేవలం ఆటాపాటలతోనే అస్తిత్వ రక్షణ జరుగదు. ఇప్పుడు మళ్లీ పాత శక్తులు తలలెత్తుతున్నాయి. ఉద్యమ కాలంలో ప్రతి విషయంపైనా ఎంతో క్లారిటీ ఉండేది. కానీ నేడు ‘తెలంగాణ ఎక్కడుంది? తెలంగాణ అస్తిత్వం ఎక్కడుంది?‘ అని ప్రశ్నించే పరిస్థితి తెస్తున్నారు. ఒకవైపు తెలంగాణలోనూ టీడీపీని బలోపేతం చేస్తామని నారా లోకేశ్ అంటుంటే, మరోవైపు పవన్ కల్యాణ్ లాంటి విచిత్రమైన వ్యక్తి ఇక్కడి అస్తిత్వాన్ని సవాల్ చేస్తున్నడు. కాంగ్రెస్ పార్టీ, రేవంత్‌రెడ్డి వైఖరిలోనూ ఇటువంటి నాటకాలే కనిపిస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీరందరికీ ఇక్కడ స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయి. ఆంధ్రా ప్రాంత పెట్టుబడిదారులకు, సరిహద్దు ప్రాంతాల వారికి, హైదరాబాద్‌లోనే ఎకరాల భూములు, చెరువులు, కుంటలు ఆక్రమణ చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, హోటల్ బిజినెస్, సినిమా ఇండస్ట్రీ వంటి వ్యాపారాలు ఉన్నవారి ప్రయోజనాలను రక్షించుకోవడానికే వారు తెలంగాణ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు.
ఈ వ్యూహాల వెనుక స్పష్టమైన కుట్ర దాగి ఉన్నది. ’చేపలను పట్టాలంటే మొదట నీటిని కదల్చాలి’ తెలంగాణలో భావోద్వేగాలను రెచ్చగొట్టి, హింసను ప్రేరేపించి, తద్వారా ఇక్కడి ప్రాంతీయ శక్తులను (బీఆర్ఎస్ను) అణచివేయాలని చూస్తున్నారు. దీని వెనుక నరేంద్రమోదీ డైరెక్షన్ ఉంటే, దానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ బహిరంగ మద్దతు ఇస్తే రేవంత్‌రెడ్డి సైలెంట్‌గా మద్దతు ఇస్తున్నడు. రాబోయే కాలంలో రేవంత్ రెడ్డి తన వర్గంతో కలిసి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ నలుగురి, దుష్ట చతుష్టయం, (మోడీ, చంద్రబాబు, పవన్, రేవంత్) కూటమి తెలంగాణ అస్తిత్వంపై నిశ్శబ్దంగా కుట్రలు చేస్తున్నది. నిన్నటివరకు క్యూబా విప్లవకారుడు చేగువేరా లా మాట్లాడిన పవన్ కళ్యాణ్, నేడు సనాతన ధర్మం అంటూ కాషాయ వస్ర్తాలు వేసుకోవడం వారి అవకాశవాదానికి, చిత్ర-విచిత్రమైన రాజకీయ ప్రదర్శనలకు నిదర్శనం. ఇలాంటి శక్తులకు కేవలం ఓటు ద్వారానే బుద్ధి చెప్పాలి, ఒక్క ఓటు కూడా పడకుండా తిరస్కరించాలి.
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సాగునీటికే కాదు తాగునీటికి కూడా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్లిష్ట సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయాలు మాని నీళ్లను ఎత్తిపోయాలని సాగునీటి నిపుణులు, రిటైర్డ్ ఇంజినీర్లు, రైతాంగం, ప్రధానప్రతిపక్షం బీఆర్ఎస్ విజ్ఞప్తి చేస్తున్నా రేవంత్‌రెడ్డి సర్కార్ మొండిగా వ్యవహరిస్తున్నది.
ఆ ప్రాజెక్టుపై ఎన్నికల ముందు చేసిన అసత్య ప్రచారాలనే ఇంకా కొనసాగిస్తున్నది. మోటర్లు ఆన్ చేసి నీళ్లను ఎత్తిపోస్తే వచ్చే నష్టమేమీ లేదని రిటైర్డ్ ఇంజినీర్లు సూచిస్తే వాళ్లపై, విపక్ష పార్టీ నేతలపై పాలకులు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు మెప్పు కోసం ఇదంతా చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణ అనేది నిన్న మొన్న పుట్టిన పదం కాదు. దీనికి మూడు వేల ఏండ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్నది. ఎనిమిదవ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ ’తెల్లాపూర్ శాసనం’ లోని స్తంభంపై మొట్టమొదటిసారిగా ‘తెలంగాణ‘ అనే పదం లిఖితపూర్వకంగా చెక్కబడింది. అంతకంటే ముందు, భారతదేశంలోని 16 మహాజన పదాలలో (షోడశ జనపదాలు) ఒకటైన ’అస్మక జనపదం’ గోదావరి లోయ ప్రాంతంలోనే విలసిల్లింది. నేటి బోధన్ (పోతలి) దీనికి రాజధానిగా ఉండేది. అలాగే మెట్పల్లి-ఖానాపూర్ మధ్య గోదావరి నది ఏడు పాయలుగా చీలే చోట ఉన్న ’బాదనకుర్తి’ (బాదనగుర్తి) ద్వీప గ్రామానికి అపారమైన బౌద్ధ చరిత్ర ఉంది. శాతవాహనుల కాలంలో భావరి అనే ఋషి తన శిష్యులను ఇక్కడి నుంచే బుద్ధుని వద్దకు పంపినట్లు ఆధారాలు ఉన్నాయి. ఇంతటి ఘన చరిత్ర ఉన్న తెలంగాణ అస్తిత్వాన్ని ఎవరో వలసవాదులు లేదన్నంత మాత్రాన అది చెరిగిపోదు.
రాష్ట్రంలో 30 నెలలుగా పరిణామాలన్నీ చూసిన తర్వాత ఆంధ్రా పెత్తందార్ల, వలసవాదుల కుట్రలను తిప్పికొట్టడానికి తెలంగాణ పౌర సమాజం మళ్లీ సంఘటితం కావాలి. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న అస్తిత్వ వేదిక, సోషల్ ఫౌండేషన్ వంటి వాటిని వేదికలుగా చేసుకొని ప్రజలు కలిసికట్టుగా పోరాడాలి. ప్రతి ప్రాంతానికి, సమాజానికి ఒక సామూహిక మనస్తత్వం ఉంటుంది. మన మలిదశ ఉద్యమంలో, అంతమంది యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నారంటే దానికి కారణం మన అస్తిత్వంపై మనకున్న అపారమైన ప్రేమే. ఆ నైతిక శక్తితోనే నిరంతర చైతన్యంతో మన అస్తిత్వాన్ని, సామాజిక నిర్మాణాన్ని, ప్రాంతీయ రాజకీయ బలాన్ని కాపాడుకోవడమే నేటి తెలంగాణ సమాజం ముందున్న తక్షణ కర్తవ్యం. మన అస్తిత్వానికి నిత్య చైతన్యమే శ్రీరామరక్ష.