ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే దిశగా సర్కార్ అడుగులు వేస్తున్నది. ఇందుకోసం కొన్ని స్వచ్ఛంద సంస్థలను రంగంలోకి దింపింది. ఆయా సంస్థల ప్రతినిధులు తెర వెనుక ఉండి చక్రం తిప్పుతున్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి తెచ్చిన కాంపిటెంట్ స్కూళ్ల ఎంపిక ఇందులో భాగమేనని తెలుస్తున్నది. అందుకే అక్కడ కావాల్సినంత బోధనా సిబ్బందిని సమకూర్చడం లేదు. పిల్లల సామర్థ్యాలు పెంచడంలో ఉపాధ్యాయులు విఫలమవుతున్నారనే ముద్రవేసి, ఆ ముసుగులో బడులను మూసివేసే దిశగా పావులు కదుపుతున్నది. ప్రస్తుతం ఉపాధ్యాయవర్గాల్లో ఇదే చర్చ నడుస్తున్నది.
ప్రాథమిక విద్యారంగం, మెరుగైన విద్య, ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం చేస్తున్న ఆర్భాటపు ప్రకటనల మాటున పెద్ద కుట్రనే ఉన్నట్టు అనిపిస్తున్నది. పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే.. బడుల మూసివేతకు సర్కార్ వేస్తున్న అడుగులు కనిపిస్తాయి. నిజానికి కాంపిటెంట్ పాఠశాలలు ఏర్పాటు చేయడం పెద్ద తప్పిదమనే భావన వ్యక్తమవుతున్నది. నాణ్యమైన విద్యను అందరికీ అందించకపోవడం విద్యాహక్కు చట్టం స్ఫూర్తికి విరుద్ధం. సర్కార్ బడులపై జరుగుతున్న విష ప్రచారాలు, ప్రక్షాళన పేరుతో అమలు చేస్తున్న పథకాలు, కాంపిటెంట్ పాఠశాలల విధానాలను లోతుగా చూస్తే.. ప్రాథమిక విద్యారంగం ఎంత ప్రమాదంలో ఉన్నదో అర్థమవుతున్నది. తెలంగాణలోని 27,000 ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను 4వేలకు కుదించి, మిగిలిన 23వేల బడులను మూసివేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే వెల్లడించారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే సుమారు 8,700 గ్రామాల్లో ప్రభుత్వ బడి లేకుండా పోతుంది. పేద పిల్లలు విద్యకు దూరమవుతారు. బడుల మూసివేత ప్రతిపాదనను విరమించుకోవాలంటూ 125 మంది విద్యావేత్తలు, మేధావులు, ప్రజాసంఘాల ప్రతినిధులు సీఎంకు బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ విద్యను బలహీనపరిచి ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించడం సరికాదని స్పష్టంచేశారు.
మరోవైపు యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు, తరగతి గదుల్లో టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఉపాధ్యాయులను విదేశాలకు స్టడీ టూర్‌కు పంపుతామంటూ సర్కార్ చెప్పుకొచ్చింది. కానీ లోతుగా చూస్తే కొత్త ప్రయోగాల పేరిట అమల్లోకి తెస్తున్న విధానాలు.. సర్కార్ విద్యను నిర్వీర్యం చేసే దిశగానే కనిపిస్తున్నాయి.
నిజానికి ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమం రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో కొన్నేండ్లుగా అమలవుతున్నది. ఇప్పుడు దీనిని కాదని.. ఓ స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకొని ఈ విద్యాసంవత్సరం నుంచి కాంపిటెంట్ స్కూళ్లను అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా ప్రతి స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో అత్యధిక విద్యార్థులున్న మూడు పాఠశాలలను ఎంపిక చేశారు. వీటి ఎంపిక వెనుక ఓ స్వచ్ఛంద సంస్థ చక్రం తిప్పుతున్నదని విద్యాశాఖలో చర్చ జరుగుతున్నది. కాంపిటెంట్ పాఠశాలలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, బోధనా సిబ్బందిని ప్రభుత్వం ఇవ్వడం లేదు. ప్రభుత్వానికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే.. కాంపిటెంట్ పాఠశాలల్లో కనీసం తరగతికి ఒక ఉపాధ్యాయుడినైనా కేటాయించాలి. రాష్ట్రంలో ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి 1:15 ఉన్నదని చెప్పిన ప్రభుత్వం, కాంపిటెంట్ స్కూళ్లకు తరగతికొక ఉపాధ్యాయుడిని ఇవ్వకపోవడం వెనుక పెద్ద కుట్రనే దాగి ఉన్నట్టు అనిపిస్తున్నది.
రాష్ట్రంలో ప్రభుత్వ విద్య రోజురోజుకూ దిగజారిపోతున్నది. చిత్తశుద్ధి లేని ప్రభుత్వం, ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలతో కుమ్మక్కు అవుతున్న కొందరు అధికారుల వల్ల సర్కారీ బడులు ఖాళీ అవుతున్నాయి. ప్రభుత్వ బడులపై విద్యార్థుల తల్లిదండ్రులు విశ్వాసం కోల్పోతున్నారు. ఇదిలా ఉంటే విద్యా కమిషన్ ఇచ్చిన తలాతోక లేని ప్రతిపాదనలను పట్టుకొని ప్రభుత్వం మరోవైపు పయనిస్తున్నది. రెండు వైపులా లాగుతున్న ఎద్దులబండి పరిస్థితి మాదిరిగా ప్రభుత్వ విద్య దుస్థితి ఉన్నది.
విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు వారాలు దాటుతున్నా విద్యార్థులకు యూనిఫామ్, సరిపడా పుస్తకాలు అందలేదు. వర్క్ బుక్కుల అతీగతీ లేదు. 22 అంశాల ఎడ్యుకేషన్ కిట్ ఊసే లేదు. బ్రేక్ ఫాస్ట్ అమలు ఎన్ని నెలలు పడుతుందో తెలియదు. తెలంగాణ విద్యా పాలసీ అని వేసిన కే.కేశవరావు కమిటీ ఎక్కడ ఉన్నదో, ఏం చేస్తున్నదో తెలియదు.
ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడంలేదు. ఇన్చార్జులను విద్యాధికారులుగా, కార్యాలయాల్లో, పర్యవేక్షణ నిమిత్తం ఇష్టారాజ్యంగా వాడుకొంటూ మరింత కొరత సృష్టిస్తూనే ఉన్నది. నిజానికి ప్రాథమిక విద్యా రంగంలోనే ఉపాధ్యాయుల అవసరం ఉన్నదని నిపుణులు చెప్తుండగా, ఆ విషయాన్ని సర్కార్ విస్మరిస్తున్నది. ఉన్న సిబ్బందినే డైట్ వంటి విభాగాలకు సర్దుబాటు చేస్తున్నది. ప్రాథమిక విద్యపై సర్కార్‌కు ఉన్న వివక్షకు ఇదే నిదర్శనం. ఇప్పటికైనా సర్కార్ తీరు మారాలని నిపుణులు సూచిస్తున్నారు. కాంపిటెంట్ పాఠశాలలను ముందుగా తెలంగాణ ఫౌండేషనల్ స్కూళ్లుగా ప్రకటించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రాథమిక పాఠశాలలను ఫౌండేషన్ స్కూళ్లుగా ప్రకటించి అధిక సౌకర్యాలు, వసతులు, వనరులు ఇవ్వాలి. ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి అని గిరిగీసుకొని కూర్చోకుండా తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కాంపిటెంట్ స్కూళ్లకు కేటాయించాలి. లేదంటే చివరకు పిల్లల ప్రగతి ఆశించిన రీతిలో సాధ్యం కాదు. తద్వారా సమాజంలో ప్రభుత్వ స్కూళ్లు మరింత చులకన అవుతాయి. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించడం వల్ల బోధనకు మూడు గంటల సమయమే లభిస్తున్నది. ఈ విధానం విడనాడి, సిబ్బందిని పెంచాలి. విద్యా విధానంలోకి స్వచ్ఛంద సంస్థలు రాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు భిన్నంగా కాంగ్రెస్ సర్కార్ వాటికి పెద్దపీట వేస్తున్నది. ఈ విధానంలో మార్పు వస్తేనే.. ప్రాథమిక విద్యారంగం తల్లిదండ్రుల్లో నమ్మకం కలిగిస్తుంది. తద్వారా ప్రభుత్వ పాఠశాలలు మనుగడ సాగిస్తాయి. లేకపోతే పేదల పిల్లలకు సర్కార్ ద్రోహం చేసినట్టే అవుతుంది.
– కడపత్రి ప్రకాశ్‌రావు 80966 77022