ఇరవై ఏండ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుపేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములపై వారికి పూర్తి హక్కులు కల్పించింది. ఈ సందర్భంగా 54,129. 45 ఎకరాలను క్రమబద్ధీకరించాలని అక్కడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా కర్ణాటక ప్రభుత్వం కూడా అసైన్డ్ భూములను క్రమబద్ధీకరించి ఆ రాష్ట్రంలోని రైతుల కష్టాలను కడతేర్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయానా రైతు. అందుకే ఆయన తరచూ రైతు సంక్షేమ నిర్ణయాలు తీసుకుంటారు.
ఇందులో భాగంగానే రాష్ట్రంలో 24 గంటల ఉచిత కరెంటును అందిస్తున్నారు. అందుకే రాష్ట్ర ప్రజానీకం ఉద్యమనేత, ముఖ్యమంత్రి కేసీఆర్ను రైతు బాంధవునిగా కీర్తిస్తారు. అంతేకాదు ఆయన రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మీ, దళితబంధు లాంటి బృహత్తర సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తూ తెలంగాణను దేశంలో అగ్రగామిగా నిలిపారు. కాగా, తెలంగాణలో కూడా ఇరవై ఏండ్లకుపైగా అసైన్డ్ భూముల్లో సొంతంగా వ్యవసాయం చేసుకుంటున్న రైతులున్నారు. అలాంటి రైతులకు కూడా పూర్తిహక్కులు కల్పించి ముఖ్యమంత్రి కేసీఆర్ తమ జీవితాల్లో వెలుగులు నింపాలని అసైన్డ్ భూముల రైతులు కోరుతున్నారు. ఈ దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవాలని వినతి.
– పి.సయ్యాజిరావు 94942 36060