Telugu University | తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై దశాబ్ద కాలం దాటింది. మొన్నటి జూన్ 2 వరకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నగరం ఇప్పుడు కేవలం తెలంగాణ రాష్ట్ర రాజధానిగా మారింది. దీంతో తెలంగాణ అస్తిత్వ ప్రదర్శనకు ఆఖరి అవరోధం కూడా తొలగినట్టయింది. అందుకే ఈ సందర్భంలో తెలంగాణ అస్తిత్వాన్ని మరింత బలంగా చాటి చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది.
తెలంగాణ ఘనతను, చరిత్రను, సంస్కృతిని రక్షించుకోవాలి. అందులో భాగంగా హైదరాబాద్‌లో ఉన్నటువంటి తెలుగు విశ్వవిద్యాలయానికి ‘సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం’ అని నామకరణం చేసుకోవాలి. ఎందుకంటే, సురవరం తొలి తెలంగాణవాది. 1934లో ‘తెలంగాణలో కవులు పూజ్యం’ అని విమర్శ వచ్చినప్పుడు ఇక్కడి కవులు ‘పూజ్యం కాదు, పూజనీయులు’ అని లెక్కగట్టి 369 మందితో ‘గోలకొండ కవుల సంచిక’ను వెలువరించి ఆత్మగౌరవాన్ని ప్రకటించారు. అంతేకాదు, పలు ప్రక్రియల్లో రాసిన సాహితీవేత్తగా, పత్రికా సంపాదకుడిగా, చరిత్రకారుడిగా, పరిష్కర్తగా, హక్కుల ఉద్యమ కార్యకర్తగా, ప్రచురణ సంస్థ నిర్వాహకుడిగా, ఆంధ్రమహాసభ నాయకుడిగా, ఎమ్మెల్యేగా, సాహిత్య సంస్థల నిర్మాతగా, ఆంధ్రవిద్యాలయ లాంటి విద్యాసంస్థల స్థాపకుడిగా, గ్రంథాలయోద్యమ నేతగా, మద్యపాన నిరోధక ప్రచారకుడిగా ఇట్లా బహుముఖాలుగా పనిచేసిన సురవరం ప్రతాపరెడ్డికి సముచిత స్థానం దక్కలేదు. ప్రస్తుతం ఉన్న తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు భాష, చరిత్ర, సంస్కృతి, కళల అధ్యయనం, అధ్యాపన కోసం 1985లో డిసెంబర్ 2న ఏర్పాటు చేసిండ్రు. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు భాష, చరిత్ర, సంస్కృతి, కళలు, జర్నలిజం, పరిశోధన రంగాల్లో విశేషమైన కృషి చేసిండ్రు. ఇట్లా విశ్వవిద్యాలయం ఏర్పాటు లక్ష్యాలన్నింటిలోనూ ప్రతాపరెడ్డి విశిష్ఠమైన కృషిచేసిండ్రు. అందుకే ఈ డిసెంబర్ 2న 40వ ఏడులో ప్రవేశిస్తున్న సందర్భంలో ఆయన పేరు పెట్టే ప్రక్రియను పూర్తిచేసి గౌరవించుకోవాలి. ఇది ప్రతాపరెడ్డికి గౌరవం కాదు, తెలంగాణకు గర్వకారణం.
ఈ విషయమై ఇటీవల అసెంబ్లీలో రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. అన్ని పక్షాలకు సమ్మతమైతే సురవరం పేరును పెట్టడానికి తమకేమి అభ్యంతరం లేదని ప్రకటించారు. ఈయన పేరు పెట్టాలని అసెంబ్లీలో ప్రస్తావన తెచ్చింది సీపీఐ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, ఆ ప్రతిపాదనకు బీఆర్ఎస్ తరపున కేటీఆర్ మద్దతు కూడా పలికారు.
వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఖ్యాతి దశదిశలా విస్తరించేందుకు సురవరం ఒక మార్గం. రాష్ట్ర విభజన చట్టంలో ‘పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం’ షెడ్యూల్ 9లో ఉండటంతో గత పదేండ్లుగా రెండు రాష్ర్టాల్లో అడ్మిషన్లు, పీఠాల నిర్వహణ హైదరాబాద్ నుంచే జరిగింది. అయితే, ఈ సంవత్సరం అడ్మిషన్లు తెలంగాణలో మాత్రమే జరిగేలా నోటిఫికేషన్లు కూడా జారీ చేసిండ్రు. కాబట్టి ఈ ‘నామకరణ’ ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాల్సిన అవసరం ఉన్నది.
ఇప్పటికే రాజమండ్రి, మొవ్వ, శ్రీశైలంలలో ఉన్న పీఠా లు ఆంధ్రాకు వెళ్లిపోవడంతో వాటి స్థానంలో తెలంగాణలో చరిత్ర, సాహిత్యం, కళలు, జర్నలిజం, భాష రక్షణకు ప్రత్యేకంగా ఈ ప్రాంతంలోని వివిధ ప్రదేశాల్లో పీఠాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. వీటిపై త్వరలో నియామకం అయ్యే వైస్‌చాన్సలర్ దృష్టిసారించాలి.
‘సురవరం’ పేరును విశ్వవిద్యాలయానికి పెట్టడమే కాకుండా, ఆయన సమగ్ర రచనలు, సంపాదకీయాలు దాదాపు పది, పన్నెండు వేల పేజీల్లో లభ్యంగా ఉన్నాయి. వాటన్నింటిని సంపుటాలుగా ప్రచురించాల్సిన అవసవరం ఉన్నది. అట్లాగే ఆయన పేరిట ప్రత్యేక అధ్యయన కేంద్రాన్ని ఏర్పా టు చేసేందుకు కూడా ఈ సందర్భంగా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాధినేతలు అసెంబ్లీలో ప్రకటించిన విషయాన్ని గౌరవించి సాధ్యమైనంత త్వరగా తెలుగు విశ్వవిద్యాలయానికి ‘సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం’ అని పేరు పెట్టాలి.
-డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్