మైక్రోఫైనాన్స్‌లో ఆర్థిక సాధికారత అంశంపై చేసిన విశేష కృషికి గానూ 2006లో నోబెల్ పురస్కారం అందుకున్న మొహమ్మద్ యూనుస్ బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ సారథ్య బాధ్యతలు చేపట్టారు. ఆయన మధ్యంతర ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు. ఇది ప్రధానమంత్రికి సమానమైన హోదాగా చెప్తున్నారు. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న బంగ్లాదేశ్‌కు ఈ పరిణామం కొంతవరకు ఊరట కలిగించేదే. రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలను ఆయన కొత్త పుంతలు తొక్కిస్తారేమో చూడాలి. అయితే ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్జమాన్ రంగంలోకి దిగి, మధ్యంతర ప్రభుత్వానికి యూనుస్ సారథ్యం వహించేలా చేసిన తీరు మాత్రం బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య భవిష్యత్తుకు శ్రేయస్కరం కాదు.
Bangladesh | బంగ్లాదేశ్‌లో రాజకీయ అధికారాన్ని రుచి మరిగిన సైన్యాధిపతి వకార్ ఉజ్జమాన్ చిక్కినట్టే చిక్కి చేజారిపోతున్న దాన్ని అంత సులువుగా వదలకపోవచ్చు. ఈ పరిస్థితుల్లో ఆయన వెనకడుగు వేసే అవకాశం లేదనే చెప్పాలి. పాకిస్థాన్‌లో మాదిరిగా ఆయన కూడా కర్రపెత్తనానికి పాల్పడవచ్చు. ఆగస్టు 5న హసీనా రాజీనామా తర్వాత బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహమ్మద్ షహాబుద్దీన్ పార్లమెంట్‌ను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో మధ్యంతర ప్రభుత్వం ఆర్మీకి పబ్లిక్ ఫ్రంట్‌గా పనిచేయనున్నది. ప్రపంచంలోనే అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన హసీనా తన సుదీర్ఘ రాజకీయ జీవితానికి విషాదకరమైన రీతిలో ముగింపు పలికారు. ప్రాణాలను కాపాడుకునేందుకు బలవంతంగా తన పదవికి రాజీనామా చేసి, దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది.
షేక్ హసీనా తండ్రి, బంగ బంధు షేక్ ముజీబుర్ రెహ్మాన్ హత్యకు గురై ఆగస్టు 15 నాటికి 50 ఏండ్లు పూర్తవుతాయి. ఈ 50 ఏండ్లలో బంగ్లాదేశ్‌లో సుమారుగా 30 తిరుగుబాట్లు చోటుచేసుకున్నాయి. ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్జమాన్ ఒత్తిడి కారణంగా షేక్ హసీనా బలవంతంగా ప్రధాని పదవిని వదులుకోవాల్సి వచ్చింది. ఇది తాజా తిరుగుబాటుగానే చెప్పుకోవాలి. ఆ వెంటనే బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్పీ), జాతీయ పార్టీ, జమాత్- ఈ- ఇస్లామీలతో ఆయన చర్చలు జరిపారు. ఈ పరిణామం మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుకు దారితీసింది.
దేశం విడిచి వెళ్లేందుకు షేక్ హసీనాకు వకార్ 45 నిమిషాల సమయమిచ్చారు. దీంతో హసీనా ఆర్మీ విమానమెక్కి ఢిల్లీ శివార్లలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని హిండన్ విమానాశ్రయంలో దిగారు. దిగ్భ్రాంతికరమైన పరిస్థితుల నేపథ్యంలో తన భవిష్యత్తు ప్రణాళికల గురించి కూడా షేక్ హసీనా ఆలోచించుకోలేని స్థితిలో ఉన్నారు. భారత్‌లో హసీనా ఆశ్రయం పొందడం ఇది మొదటిసారి కాదు. 1975లో హసీనా తండ్రి ముజీబ్ సహా యావత్తు కుటుంబసభ్యులు దారుణ హత్యకు గురయ్యారు. ఆ సమయంలో జర్మనీలో ఉన్నందున హసీనా, ఆమె సోదరి ప్రాణా లు దక్కించుకున్నారు. 1975-1981 మధ్యకాలంలో హసీనా భారత్‌లో ఆశ్రయం పొందారు. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు 5 నుంచి ఆమె రెండోసారి మన దేశంలో ఆశ్రయం పొందుతున్నారు.
1947లో భారత్, పాకిస్థాన్‌లకు ఒకే సమయంలో స్వాతంత్య్రం వచ్చింది. అప్పటినుంచి భారత్‌లో ప్రజాస్వామ్య మూలాలు వేళ్లూనుకుపోయాయి. పాకిస్థాన్‌లో వలె 1971లో ఆవిర్భవించిన పొరుగుదేశం బంగ్లాదేశ్ కూడా నియంతృత్వంలో కూరుకుపోవడం విచారకరం. జనరల్ అయూబ్ ఖాన్ నుంచి యాహ్యా ఖాన్, జనరల్ జియా- ఉల్- హక్ నుంచి జనరల్ పర్వేజ్ ముషారఫ్ వరకు అనేకమంది సైనిక నియంతల పాలనను పాకిస్థాన్ చవిచూసింది. పాక్ ఆర్మీ ఇప్పటికీ రాజకీయాలపై ఆధిపత్యం కొనసాగిస్తూనే ఉన్నది. స్వాతంత్య్ర పోరాటం కారణంగా 1971లో ఆవిర్భవించిన బంగ్లాదేశ్‌లోనూ ప్రజాస్వామ్యం పట్టాలు తప్పినప్పుడు ఆ దేశం నియంతృత్వంలోకి జారుకున్నది.
1947లో స్వాతంత్య్ర పోరాటం నుంచి ఆవిర్భవించిన భారత నాయకత్వం ఎంతో శ్రమకోర్చి దేశంలో ప్రజాస్వామ్యానికి నారుపోసి, నీరుపోసి సంరక్షిస్తూ వచ్చింది. అయితే 1971లో స్వాతంత్య్రం సాధించిన నాలుగేండ్ల కంటే తక్కువ సమయంలోనే బంగ్లాదేశ్ తిరుగుబాటును చూసింది. ఇది ఆ దేశం ఎదుర్కొన్న తిరుగుబాట్లలో మొదటిది. 1975లో బంగ బంధు షేక్ ముజీబుర్ రెహ్మాన్ హత్య తర్వాత ఖోండ్కర్ ముస్తాక్ అహ్మద్ అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత ఖోండ్కర్ ముస్తాక్‌ను గద్దె దించేందుకు బ్రిగేడియర్ ఖాలెద్ ముషారఫ్ తిరుగుబాటు చేశారు. ఆపై హుస్సేన్ మొహమ్మద్ ఇర్షాద్ కూడా తిరుగుబాటు ద్వారానే అధికారంలోకి వచ్చారు. ఆయన తర్వాత జియా- ఉర్-రెహ్మాన్ వంతు. షేక్ హసీనా రాజకీయ ప్రత్యర్థి బీఎన్పీ నేత బేగం ఖాలెదా జియా గత 17 ఏండ్లు జైలు జీవితం గడిపారు. ఇటీవల దేశాధ్యక్షుడి ఆదేశాల మేరకు ఆమె విడుదలయ్యారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ ఆర్మీ ఇప్పటికీ ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తుండటంతో దేశంలో ప్రజాస్వామ్యం మళ్లీ పరిఢవిల్లే అవకాశం అంతంతమాత్రమేనని, ఆ మాటకొస్తే అసలు లేదనే చెప్పాలి.
1972లో బంగ బంధు ముజీబ్ తీసుకొచ్చిన కోటానే ప్రస్తుత వివాదానికి మూలం. బంగ్లాదేశ్ స్వాతంత్య్ర సమరయోధుల కోసం ఆయన అప్పట్లో ఓ కోటాను తెచ్చారు. అంతేకాదు, స్వాతంత్య్ర సమరం జరిగిన సమయంలో పాక్ సైనికుల చేతుల్లో చిత్రహింసలకు గురైన మహిళల కోసం కూడా ఒక కోటాను ఏర్పాటు చేశారు. పాకిస్థాన్ ఆర్మీతో పోరాడుతూ దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన, ఇబ్బందులు ఎదుర్కొన్నవారికి కొత్త దేశం న్యాయం చేస్తుందని ముజీబ్ అప్పట్లో హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుత సంక్షోభానికి కారణం 2018లో జరిగిన కోటా వ్యతిరేక ఉద్యమమనే చెప్పుకోవాలి. 1972 నుంచి కొనసాగుతున్న ఈ ప్రత్యేక కోటా చట్టబద్ధతను సవాలు చే స్తూ దాఖలైన పిటిషన్‌ను 2018 మార్చి 8న బం గ్లాదేశ్ హైకోర్టు కొట్టేసింది. ఈ నేపథ్యంలో 1971 నుంచి స్వాతంత్య్ర పోరాట యోధుల వారసులకు లబ్ధి చేకూర్చుతున్న ఈ కోటాలను కొనసాగిస్తానని షేక్ హసీనా ప్రకటించారు. తన తండ్రి వారసత్వాన్ని ముందుకుతీసుకెళ్లే క్రమంలో ఈ అంశం హసీనాకు భావోద్వేగపూరితమైనది.
కానీ, ఆమె నిర్ణయం విద్యార్థుల్లో ఆందోళనకు దారితీసింది. ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుల ద్వారా బంగ్లాదేశ్ సివిల్ సర్వీసెస్‌లో కోటా కనుమరుగైంది. మొదట్లో విద్యార్థులు కోటాలను సంస్కరించాలని కోరారు. వాటిని రద్దు చేయాలని కోరలేదు. కానీ, షేక్ హసీనా నిర్ణయం మాత్రం స్వాతంత్య్ర సమరయోధుల పిల్లలకు కోటా దక్కకపోతే, మరెవరికీ దక్కవనే సంకేతాలను ఇచ్చింది. ఆ తర్వాత రెండేండ్ల పాటు చర్చలు జరిగినప్పటికీ హసీనా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. అనంతరం 2020లో ఎగ్జిక్యూటివ్
ఆర్డర్ అమల్లోకి వచ్చింది.
యోగ్యత, సామర్థ్యం కంటే వ్యక్తిగత సంబంధాలు, కుటుంబ సంబంధాలకు విలువిచ్చే వ్యవస్థలో జరుగుతున్న అన్యాయంపై విద్యార్థుల్లో నిరసన వ్యక్తమైంది. వాస్తవానికి స్వాతంత్య్ర సమరయోధులు, వారి కుటుంబాలకు ఇస్తున్న కోటా అసలు సమస్య కానే కాదు. దీనిని మొదటినుంచీ వారు ఆశ్రిత పక్షపాతంగా చూడటమే సమస్యకు అసలు కారణం. ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో ఆగ్రహానికి గురైన హసీనా.. స్వాతంత్య్ర పోరాటం సమయంలో పాకిస్థాన్‌కు మద్దతుగా నిలిచిన రజాకార్లతో నిరసనకారులను పోల్చారు. హసీనా వ్యాఖ్యలపై భగ్గుమన్న నిరసనకారులు భారీ ర్యాలీ చేపట్టారు. నిరసనకారుల మనోవేదనను అర్థం చేసుకొని, వారి డిమాండ్లను పరిష్కరించాల్సిందిపోయి తిరుగుబాటును కఠినంగా అణచివేయాలని హసీనా నిర్ణయించారు. బంగ్లాదేశ్ అవామీ లీగ్ పార్టీకి చెందిన విద్యార్థి విభాగం బంగ్లాదేశ్ ఛాత్ర లీగ్‌ను ఆమె రంగంలోకి దించారు. వారికి పోలీసుల మద్దతు ఉండేలా చూశారు.
ఈ నేపథ్యంలో జూలై 15న జరిగిన ఘర్షణలో ఆరుగురు నిరసనకారులు మరణించారు. ఆ తర్వాత మూడు రోజుల్లోనే 200 మంది మృతిచెందారు. వారిలో 78 శాతం మంది విద్యార్థులు, సామాన్య పౌరులే. ఈ నిరసనల్లో అనేకమంది మరణిస్తున్నప్పటికీ వాటిపై దృష్టిసారించకుండా.. ఆందోళనల కారణంగా జరిగిన ఆర్థిక నష్టంపై షేక్ హసీనా దృష్టిపెట్టారు. అంతేకాదు, రాజకీయ లబ్ధి కోసం నిరసనకారులను ప్రతిపక్ష పార్టీలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. మృతుల కుటుంబాలను కలవకపోగా.. నిరసనలో ఆస్తి నష్టం జరిగిన ప్రాంతాలను సందర్శించడం మొదలుపెట్టారు. మృతుల పట్ల హసీనా కనీసం సానుభూతి చూపకపోవడంపై ప్రజల్లో ఆగ్రహం మరింత పెరిగింది. మొదట విద్యార్థులు కోటా సంస్కరణ, ఇతర డిమాండ్లను నెరవేర్చాలంటూ నిరసన చేశారు. కానీ, చివరికి హసీనా నుంచి క్షమాపణ, ఆమె రాజీనామా కోసం పట్టుబట్టడం మొదలుపెట్టారు.
1971లో ముజీబుర్ రెహ్మాన్ నేతృత్వంలో సార్వభౌమ, లౌకిక, ప్రజాస్వామ్య బంగ్లాదేశ్ ఆవిర్భావాన్ని.. విభజనకు దారితీసిన ముస్లిం లీగ్ నాయకుడు మహ్మద్ అలీ జిన్నా రెండు దేశాల సిద్ధాంతాన్ని తిరస్కరించడంగా భారత్ చూసింది. ఈ సిద్ధాంతం ప్రత్యక్ష కార్యాచరణ రోజుల నుంచి విభజన దాకా చెప్పలేని నష్టాల్ని, కష్టాల్ని తెచ్చిపెట్టింది. బంగ్లాదేశ్ కూడా పాకిస్థాన్ మార్గంలోనే వెళ్లినందున ఆ సంబురం ఎక్కువకాలం నిలవలేదు. తర్వాతి కాలంలో ఈ ధోరణిని వెనుకతట్టు పట్టించడంలో హసీనా విజయవంతమయ్యారు. అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలు భారత్‌కు అంత మంచివి కావు. పాకిస్థాన్‌లో వలె బంగ్లాదేశ్ భవిష్యత్తును నిర్దేశించేందుకు మరోసారి ఆర్మీ రంగంలోకి దిగింది.
స్వాతంత్య్రం సాధించిన నాలుగేండ్ల కంటే తక్కువ సమయంలోనే బంగ్లాదేశ్ తిరుగుబాటును చూసింది. ఇది ఆ దేశం ఎదుర్కొన్న తిరుగుబాట్లలో మొదటిది. 1975లో బంగ బంధు షేక్ ముజీబ్ హత్య తర్వాత ఖోండ్కర్ ముస్తాక్ అహ్మద్ అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత ఖోండ్కర్ ముస్తాక్‌ను గద్దె దించేందుకు బ్రిగేడియర్ ఖాలెద్ ముషారఫ్ తిరుగుబాటు చేశారు. ఆపై హుస్సేన్ మొహమ్మద్ ఇర్షాద్ కూడా తిరుగుబాటు ద్వారానే అధికారంలోకి వచ్చారు. ఆయన తర్వాత జియా- ఉర్-రెహ్మాన్ వంతు.
– వెంకట్ పర్సా