ఎదుటివారిని చిన్నతనం చేయడానికి నోరు పెద్దగ చేయాలనే ఆలోచన వల్నరబుల్ టైపికల్ నార్సిసిస్టిక్ లక్షణం. మానసిక డిజార్డర్‌లో ఇదో ఆత్మరక్షణ చరం. తాను గొప్పవాడిని అనే మానసిక భావనలు చెదిరిపోయినప్పుడు, తీట నోరు చాటంత చేసి ఇతరుల మీద పడటం, విమర్శలతో పోరాడుతున్నామనే భ్రమలో ఉండటం ఈ వ్యాధి లక్షణం. పోకపోక సొంత నియోజకవర్గం పోయి ఆయన చేసింది ఇదే. సారు తన పేరెత్త లేదని ఆయన నోరెత్తిండు. తన కీర్తి కేసీఆర్ వ్యక్తిత్వం ముందు బలాదూర్ అనే భావనలు చెలరేగి తొండ భాష అందుకున్నడు.
మానసిక విశ్లేషకులు ప్రత్యేకంగా రాజకీయ నేతల కోసం రోగ నిర్ధారణ పరీక్షలు ఏమీ చేయలేదు. కానీ, ఓ జర్నలిస్టు పెద్ద మనిషి తన అనుభవాలతో ప్రవర్తనా సూత్రీకరణలు చేశారు. ఆయన సూచీనే కొలబద్దగా చేసుకొని ఆయన బహిర్గత ప్రవర్తన, అంతర్గత ఆలోచనలను అంచనా కడితే వల్నరబుల్ టైపికల్ నార్సిసిస్టిక్గా తేలింది. మనో వైజ్ఞానిక శాస్త్రం ప్రకారం నార్సిజం అనే మానసిక రుగ్మత ఎనిమిది రకాలట. తెలంగాణ ప్రజల అనుభవంలోకి వచ్చింది మూడో రకం డిజార్డర్.
అంతులేని రాజకీయ అనుభవంతో జాతీయ స్థాయి పేరు ప్రఖ్యాతులు ఘడించానని, గ్లోబల్ పెట్టుబడులు, మెస్సీ దోస్తానతో తన రేంజ్ గ్లోబల్ గ్లోబు మీద 100 పాయింట్ల సెన్సెక్స్ సూచీ లెక్క గిర్రున తిరిగిందనే ఊహల్లో తేలిపోతున్నారు. పరిపాలన అంటే ఇదే అనే భ్రమల్లోకి వెళ్లిపోయారు. రెండేండ్ల పాలకుల గాలిమేడలు కట్టారు. అన్నింటిని గంభీరంగా గమనిస్తూ, వ్యూహాత్మక మౌనం దాల్చిన కేసీఆర్.. ఇక ఉండబట్టలేక నోరు విప్పారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పండబెట్టిన తీరును ఎండగట్టిండ్రు. తెలంగాణ రైతులు గోస పడుతుంటే కేసీఆర్ చూస్తుండబోడని తేల్చిచెప్పిన్రు.
కొలువు కూటం మీదికి ఎక్కిన 6 నెలలకే నిరుపేద ఇంటి మీదికి బుల్డోజర్ పంపిన దగ్గర నుంచి మొదలుపెట్టి చంద్రబాబు, మోదీ కూటమి తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని విడమరిచి చెప్పిండ్రు. కేసీఆర్ ఒక్కసారి నోరు విప్పినందుకే రెండేండ్ల భ్రమలు చెదిరిపోయి.. ఆయనలో వల్నరబుల్ టైపికల్ నార్సిసిజం చెలరేగిపోయింది. ఇంకేముంది? నోరు పెద్దగ చేసిండు. స్థాయి మరిచి ఊగిపోయిండు. తొండలను పట్టుకొచ్చిండు. బూతు పురాణం, తిట్ల దండకం అందుకున్నడు. తాను విమర్శలతో పోరాడుతున్నాననే అసంకల్పిత విభ్రమలతో మనుసు నియంత్రణ కోల్పోయింది. మాట అదుపు తప్పింది.
సమకాలీన రాజకీయ సంక్షోభాలను అర్థం చేసుకొని, పరిస్థితులకు అనుగుణంగా తులనం చేసి, దాన్ని రాష్ట్ర వ్యవహారాలకు అన్వయించి, ఫలితాలు రాబట్టడంలో కేసీఆర్ దిట్ట. ఏ నీళ్ల కోసం జనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నారో.. ఆ నీళ్లు నోటి నుంచి గొంతు దిగేలోపు దోసిట్లె నుంచే జారిపోతుంటే కేసీఆర్ చూస్తూ ఊకుంటరా? కేంద్రం- ఏపీ కలిసి ఆడుతున్న నదుల నాటకంలో మన రాష్ట్ర నేతలు నీళ్లు నమిలే పాత్రలోకి ఒదిగిపోయిన సందర్భంలో సారు అందుకున్నరు. కృష్ణా ట్రిబ్యునల్ డిపెండబుల్ వాటర్ కేటాయింపులు, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని సమగ్ర విషయ పరిజ్ఞానంతో తేల్చిచెప్పిండ్రు. కృష్ణా నది మీది ప్రాజెక్టుల డీపీఆర్‌లు కేంద్రం వెనక్కి పంపినా కిక్కురుమనకుండా మౌనం దాల్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తీరును ఎండగట్టిండ్రు. కొట్లాడి తెచ్చిన తెలంగాణను తుదకంటా కాపాడుకునే బాధ్యత కేసీఆర్‌ది. ఇప్పుడాయన అదే పని పెట్టుకున్నరు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చేసిన పనులు ఏమున్నాయని ‘గ్రోక్ ఏఐ’ని గోకితే.. ‘ఒకటి కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టుడు, మరోటి పాలమూరు ప్రాజెక్టును పండబెట్టుడు’ అని రెండు పనులు చూపించింది. 2023 డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేసిన ఆయన సరిగ్గా 25 రోజులకు, అంటే 2024 జనవరి 1న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల కింద రూ.5,600 కోట్ల విలువైన కాల్వ పనుల టెండర్‌ను నిర్దాక్షిణ్యంగా రద్దు చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు 5 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే కాల్వ అది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ ఆ కాల్వలకు టెండర్లు పిలవలేదు.
అనంతర కాలంలో రంగారెడ్డి జిల్లా నీటి వాటాను ప్రాజెక్టు నుంచి తొలగించారు. కొడంగల్-నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ పేరిట కొత్త ప్రాజెక్టుకు రూపకల్పన చేసి 2 లక్షల ఎకరాలు దాని పరిధిలోకి తీసుకొచ్చారు. మరో 3 లక్షల ఎకరాలు ప్రాణహిత-చేవెళ్లకు కలిపారు. ఇదంతా ఖతం పట్టిన తర్వాత అసలు పాచిక వేశారు. 2025 డిసెంబర్ 13న ‘మాకు 45 టీఎంసీల నీళ్లు చాలు’ అంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
అధికారంలోకి వచ్చిన ఏడాదికే కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టిన వీళ్లు, మళ్లీ ఏడాది తిరగకముందే పాలమూరు- రంగారెడ్డిని సుక్త చేసిండ్రు. ఇగో గింత అన్యాయం జరుగుతుంటే కేసీఆర్ ఒప్పుకుంటరా? మీడియా ముందుకువచ్చి ‘ఏందిది?’ అని నిలదీసిండ్రు. ‘కృష్ణా బేసిన్లో ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుకు (ఎస్ఎల్బీసీ)కి 40 టీఎంసీలు, కల్వకుర్తి ప్రాజెక్టుకు 40 టీఎంసీలు, నెట్టెంపాడుకు 25 టీఎంసీలు, మొత్తం 105 టీఎంసీలు వినియోగం కోసం అవసరమని నేను కొట్లాడి నీళ్లు మలిపితే.. పాలమూరు డీపీఆర్‌లను కేంద్రం వెనక్కి పంపే వరకు మీరు ఏం చేస్తున్నరు?’ అని నిలదీసిండ్రు. ఇది తప్పొంచిందట.
తెలంగాణ వాటాను 299 టీఎంసీలకు పరిమితం చేసి 512 టీఎంసీల నీళ్లను కేసీఆర్ ప్రభుత్వం ఆంధ్రకు అప్పజెప్పిందనే ఓ తొండి వాదన ముందేసుకున్నరు. వీళ్లకు తెలిసింది రెండే. అయితే తొండ భాష. లేకుండే తొండి వాదం. అందుకు వారు 2015 జూన్ 18, 19 తారీఖుల్లో జరిగిన అంతర్రాష్ట్ర సమావేశపు మినిట్స్ బుక్‌లోని కొన్ని అంశాలను పట్టుకొని ఇదే అసలైన సాక్ష్యమని చెప్తున్నరు. విచిత్రం ఏమిటంటే ఆయన పాడిన పాటకు తాళాలు వేయడానికి బీ టీమ్ తయారుగా ఉంటుంది.
బీఆర్ఎస్ విసిరిన సవాళ్లను ఆయన సహచర మంత్రుల టీం ఎదుర్కోలేక చతికిలపడిన ప్రతి సందర్భంలో అనూహ్యంగా బీ టీం తెరమీదకు వస్తున్నది. ‘అవునవును ఆయన చెప్పిందే నిజం.. మా దగ్గర ఒప్పంద పత్రాలు ఉన్నాయి’ అని తాళాలు కొట్టుకుంటూ మీడియా ముందుకు రానే వచ్చిండ్రు. 299 టీఎంసీలు చాలని అప్పట్లో కేసీఆర్ అంగీకరించారని, ఈ విషయం తనకు చంద్రబాబు చెప్పారని మీడియాను పిలిచి చెప్పారు.
పస లేని వాదన పెట్టొద్దని అప్పటి నీళ్ల మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలోనే ఆధారాలతో సహా చూపించారు. ‘ఇంగ్లిష్ చదవడం రాక ఇబ్బంది పడుతున్నారేమో ఒకసారి చూసుకోండి’ అని ఓ చురక కూడా అంటించారు. కేసీఆర్ పోరాటంతోనే సెక్షన్ 3 కింద కృష్ణా జలాల పునఃపంపిణీ ప్రక్రియను సాధించారని హరీశ్‌రావు అసెంబ్లీ లోపల, అసెంబ్లీ బయట విడమరిచి చెప్పారు. జలరంగ నిపుణులు దివంగత ఆర్ విద్యాసాగర్‌రావు తర్వాత అంతటి నిష్ణాతులైన శ్రీధర్‌రావు దేశ్‌పాండే పుస్తకాలే రాశారు.
నీళ్ల సంగతి ఇట్లుంటే.. పరిపాలనది ఇంకో తీరు. ముఖ్యమంత్రి కాకముందు ఆయన ఎవరో? పసిబిడ్డ తెలంగాణ గొంతు ఎట్లా నులమాలని చూశారో మనకు తెలుసు. ముఖ్యమంత్రి అయ్యాక ఆయన పోకడలను, బహిర్గత ప్రవర్తన గమనిస్తే.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌తో తన దర్పణ బింబాన్ని లోకల్ స్థాయి నుంచి గ్లోబల్ స్థాయికి విస్తరించాలని ఆరాటపడ్డారు. చంద్రబాబు అచ్చోసిన వైజాగ్ సీఐఐ పెట్టుబడుల కాపీని పట్టుకొచ్చి నాలుగో నగరంలో రియల్ ఎస్టేట్‌ను విస్తరించే వ్యూహ రచన చేశారు.
రూ.కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం చేశారు. తన ఊహలకు తగ్గట్టు ఉబలాటపడి ఊరు ఊరంత ఫ్లెక్సీలు పెట్టిండు. సహచర మంత్రుల ఫొటోలు కూడా లేకుండాఅన్నిట్లో తానొక్కడే అన్నట్టు కలరింగ్ ఇచ్చారు. ఇది నార్సిసిస్టిక్ డిజార్డర్ మొదటి రకం. ఈ ఫ్లెక్సీలు కనీసం పల్లె జనాన్ని కూడా ఆకట్టుకోలేకపోయాయి. మీర్ఖాన్పేటలో గ్లోబల్ సమ్మిట్ ముగిసిన నాలుగొద్దులకే అదే చోట జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాప చుట్టింది. భారత ఫ్యూచర్ నగరానికి క్యాపిటల్ అని బూస్టింగ్ ఇస్తున్న బేగరికంచెలోనూ బీఆర్ఎస్ సర్పంచ్ గెలిచారు. ఇంట గెలవని ఇమేజ్ తాను గొప్పవాడిని అనే భావనను చెదరగొట్టింది. ఈ దెబ్బకు ఓ ముఖ్య కార్యదర్శి సీఎంవో నుంచి ఔట్ అయ్యారు.
మీర్ఖాన్పేటలో డ్యామేజ్ అయిన ఇమేజ్ను ఉప్పల్ స్టేడియంలో రిపేర్ చేసుకోవాలనుకున్నరు. మెస్సీతో ఆడుతున్న ఒక్క వీడియో క్లిప్పింగ్ దొరికితే.. మూట గట్టుకున్న మునుపటి అపఖ్యాతి తొలగిపోయి, జాతీయ స్థాయి కీర్తి ఉషస్సులు మిరుమిట్లు గొలుపుతాయని ఆశపడ్డారు. తెల్లలాగు, తెల్ల చేతుల ఎర్ర జెర్సీ తొడిగి ఉప్పల్ స్టేడియంలో అటుఇటు ఉరుకులాడిండు. మెస్సీ అంతర్జాతీయ స్థాయి, తనది జాతీయ స్థాయి అనుకున్నడు కానీ, అక్కడా బంతి ఎదురు తన్నింది.
రూ.100 కోట్లు ప్రజాధనం లూటీ తప్ప, రాష్ర్టానికి ఒరిగింది శూన్యమేనని తేలిపోయింది. అయితే చరిత్రలో గొప్ప తాతగా తన మనవడి ప్రేమను పొందే అవకాశం అందిపుచ్చుకున్నరు. చిన్న చిన్న అడుగులతో మనవడు ముద్దుముద్దుగా ఫుట్‌బాల్‌ను తంతుంటే తాత ముసిముసిగా మురిసిపోయారు. ఆ సందర్భంలో తాతగారి ప్రమోదం అమూల్యం. దాన్ని అల్పమైన రూ.100 కోట్ల ప్రజాధనంలో చూడటం అర్భకుల పనే అన్న వాదన త్వరలోనే తెరమీదికి వచ్చినా రావచ్చు.
కేసీఆర్ ఏ హౌజ్‌లో ఉన్నా.. ఆయన రాడార్ తెలంగాణ చుట్టే ప్రరిభ్రమిస్తుందని, ఆయన హృదయం తెలంగాణ కోసమే పరితపిస్తుందనే సోయి లేని వాళ్లు అవాకులు చవాకులు పేలారు. ‘ఫాం హౌజ్ నుంచి బయటికి రా’ అంటూ సవాళ్లు విసిరారు. నిలబడలేడని.. నిలకడగా నడవలేడని వక్ర కూతలు కూసిండ్రు. వ్యక్తిత్వ హననానికైతే హద్దు పొద్దు లేదు. అన్నీ మౌనంగా విన్నారు. లోక కల్యాణార్థం గరళ కంఠుడు విషాన్ని గొంతులకు దిగమించినట్టు.. ఎడసరి కూతలను, పెడసరి మాటలను నిర్గుణుడిగా గుం డె లోతులకు దిగమింగుకున్నరు. ఎవరో రమ్మన్నారనో? ప్రేలాపనలు పేలారనో? కాశెపోసే మిడిసి పాటు మనిషి కాదు. కేసీఆర్‌ది అప్పుడైనా.. ఇప్పుడైనా శిష్ట రక్షణకు, దుష్ట శిక్షణకు కృష్ణావతారమే. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తన అవసరం ఉంటేనే ప్రత్యక్ష ఉద్యమంలోకి వస్తారు. వచ్చిండ్రు. కంఠం తెగినా వెనుకడుగు ఉండదు.
కృష్ణా జలాల పునఃపంపిణీ కోసం
2002 నుంచే పోరాటం చేసిన ఉద్యమ నాయకుడు కేసీఆర్. అటువంటిది కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగితే ఒప్పుకుంటరా? ఆయన మనసు ఇప్పుడు వేయి సంఘర్షణల సంగమం. ఇప్పుడిక మనం ప్రత్యేకంగా చేయాల్సింది కూడా ఏమీ లేదు. సకలజనులం సంఘటితమై ఇక సారుకు అండగా నిలబడడమే. ఆయన అడుగుల్లో అడగు వేయడమే. కాగల కార్యం ఆయనే తీర్చి అమృత ఫలాలు మన ఇంటిదాక పంపడం తథ్యం.
బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన నాడు కూడా జనం తాము కేసీఆర్‌ను ఓడించాలని అనుకోలేదని ఖరాకండీగా చెప్పారు. ‘కేసీఆరే ఈ రాష్ర్టాన్ని ఏలాలని; కానీ, మా ఎమ్మెల్యే ఒ క్కడు ఓడాలని ఓటేశాం’ అని చెప్పారు. జనం దృష్టిలో కేసీఆర్ అంటే ఒక ఐడియాలజీ. ఈ ఐడియాలజీలో మిషన్ భగీరథ ఉన్నది, మిషన్ కాకతీయ ఉన్నది, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, అదును మీద యూరి యా, రైతు వేదికలు, పంటలకు మద్దతు ధర, కల్యాణలక్ష్మి, షాదీముబాకర్, కేసీఆర్ కిట్, సింగిల్ విండో ఇండస్ట్రియల్ పాలసీ, ఆంధ్ర కుట్రలను ఎగతన్ని ఎదిగిన హైదరాబాద్, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునే వాచ్ డాగ్, గమ్యం కోసం బొంత పురుగునైనా ముద్దాడే సంకల్పం.. అన్నీ కలబోసుకున్న తెలంగాణ ముఖచిత్రం ఉన్నది. అటువంటి మహర్షి బయటికి వచ్చి లీడర్షిప్ పరీక్షకు నిలబడాలని కోరుకోవడం టైప్ 3 నార్సిసిస్టిక్ లక్షణమే.
రెండేండ్లుగా పాలకుల గాలిమేడలన్నింటినీ గంభీరంగా గమనిస్తూ, వ్యూహాత్మక మౌనం దాల్చిన కేసీఆర్.. ఇక ఉండబట్టలేక నోరు విప్పారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పండబెట్టిన తీరును ఎండగట్టిండ్రు. తెలంగాణ రైతులు గోస పడుతుంటే కేసీఆర్ చూస్తుండబోడని
తేల్చిచెప్పిన్రు. కేసీఆర్ ఒక్కసారి నోరు విప్పినందుకే రెండేండ్ల భ్రమలు చెదిరిపోయి.. ఆయనలో వల్నరబుల్ టైపికల్ నార్సిసిజం చెలరేగిపోయింది.
– వర్ధెల్లి వెంకటేశ్వర్లు