మాజీ ప్రధాని షేక్ హసీనా వాజెద్‌కు బంగ్లాదేశ్‌లోని అంతర్జాతీయ వ్యవహారాల కోర్టు మరణశిక్ష విధించినట్టు వెలువడిన వార్త ఎవరినీ ఆశ్చర్యపరచలేదు. ఆమె ప్రభుత్వాన్ని అస్థిరపరి చిన శక్తులు ఇప్పుడు ఆమె ప్రాణాలను లక్ష్యంగా చేసుకున్నాయి. హసీనాపై మానవత్వ హననం వంటి తీవ్రమైన ఆరోపణలతో అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్‌లో కేసు నడిపించారు. దీని పేరులో అంతర్జాతీయం ఉన్నప్పటికీ ఇది పూర్తిగా స్థానిక న్యాయస్థానం. ప్రభుత్వం గుప్పిట్లో ఉండే ఈ ట్రైబ్యునల్ విచారణ బూటకమని హసీనా మొదటినుంచీ అంటున్నారు. హసీనాకు మరణశిక్ష విధించినట్టు వార్తలు వెలువడగానే దేశవ్యాప్తంగా ఆందోళనలు పెల్లుబుకడం బంగ్లా ప్రజల్లో ఇప్పటికీ హసీనా పార్టీకి ఉన్న మద్దతును తెలియజేస్తున్నది.
బంగ్లా విముక్తి కోసం పనిచేసిన స్వాతంత్య్ర యోధుల కుటుంబాలకు విద్య, ఉపాధిలో రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ గతేడాది జూలైలో మొదలైన ఆందోళనలు ఆగస్టు మొదటివారంలో అత్యంత హింసాత్మకంగా పరిణమించడం తెలిసిందే. నాటి ప్రధాని షేక్ హసీనా వాజెద్ ఆ ఆందోళనలను అదుపు చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆందోళనకారులు కోటా తొలగింపు నినాదాన్ని పైకి చెప్పినా హసీనా ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా పనిచేశారనేది వాస్తవం.
భారత అనుకూల నేత అయిన హసీనాను ఎన్నికల్లో ఓడించలేక మాజీ ప్రధాని ఖాలిదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బీఎన్పీ) హింసాత్మక ఆందోళనలను ఎగదోసింది. నినాదాలు ఏవైనప్పటికీ వీటి వెనుక భారత వ్యతిరేక శక్తులు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం కావడం తెలిసిందే. భద్రతా దళా ల కాల్పుల్లో పెద్దసంఖ్యలో ఆందోళనకారులు మరణించారు. పరిస్థితి చేయిదాటిపోవడంతో హసీనా తన పదవికి రాజీనామా చేసి భారత్‌లో ఆశ్రయం పొందారు. ఆమె తప్పుకోవడంతో ఏర్పడిన ఖాళీని సైన్యం ఆక్రమించింది. అయితే బంగ్లా పాత సంప్రదాయం ప్రకారం సైనికపాలన నేరుగా అమలు చేయలేదు. భారత వ్యతిరేకి అయిన వివాదాస్పద ఆర్థికవేత్త మహమ్మద్ యూనుస్‌కు ముఖ్యసలహాదారు అనే హోదా కల్పించి పౌరప్రభుత్వం ముసుగు తొడిగి పరోక్ష పాలనను కొనసాగిస్తున్నది.
ఇది బహిరంగ రహస్యమే. అప్పటి నుం చి న్యాయవిచారణ కోసం హసీనాను తమకు అప్పగించాలని పదేపదే డిమాండ్ చేస్తూ భారత్‌కు వ్యతిరేకంగా యూనుస్ ప్రకటనలు చేస్తుండటం గమనార్హం. ప్రజల ద్వారా ఎన్నిక కాని ప్రస్తుత పాలక కూటమి నిజానికి ఎన్నికలు నిర్వహించడంపై దృష్టి కేంద్రీకరించాలి. కానీ యూనుస్, ఆయన వెనుక నుంచి చక్రం తిప్పుతున్న సైన్యం హసీనాను తుదముట్టించడం లక్ష్యంగా పాచికలు కదుపుతున్నారు.
పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ ప్రజలు విముక్తి పొందేందుకు భారత్ అందించిన సహాయం చరిత్రాత్మకమైనది. 1971 యుద్ధంలో పాక్‌ను చిత్తుగా ఓడించి బంగ్లాదేశ్ ఏర్పాటుకు భారత్ మార్గం సుగమం చేసింది. విముక్తి వాహిని నేత ముజీబుర్ రహమాన్ నేతృత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పడింది. అయితే అనతికాలంలోనే ఆ ప్రభుత్వాన్ని సైన్యం పడగొట్టింది. జాతిపితగా, బంగబంధుగా మన్ననలు అందుకున్న ముజీబ్ సైనిక తిరుగుబాటులో ప్రాణాలు కోల్పోయారు. ఆయనతో పాటుగా యావత్తు కుటుంబాన్ని ఊచకోత కోశారు. ఆ సమయంలో విదేశాల్లో ఉండటం వల్ల హసీనా బతికిపోయారు. అప్పటి నుంచి బంగ్లాలో ఎక్కువ కాలం సైనికపాలనే కొనసాగింది. ఒకరు పోతే మరొకరు అన్నట్టుగా సైనిక నియంతలు బంగ్లాను ఉక్కుపాదాల కింద తొక్కిపెడుతూ వచ్చారు.
తర్వాతి కాలంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు కృషి చేసిన హసీనా ప్రధాని పదవిని చేపట్టడమే కాకుండా సుదీర్ఘకాలంగా ఆ పదవిలో కొనసాగారు. సహజంగానే తన తండ్రి వారసత్వానికి అనుగుణంగా ఆమె భారత్‌తో సన్నిహిత సంబంధాలు నెలకొల్పారు. అయితే ముజీబ్‌ను దారుణంగా హతమార్చిన శక్తులే ఇప్పుడు ఆయన కూతురు రక్తాన్ని కండ్లజూసేందుకు కంగారూ కోర్టు విచారణ పేరిట తెగబడుతుండటం చారిత్రక విషాదం. హసీనాకు కోర్టు విధించిన మరణశిక్ష తీర్పు తనకు ఎంతో ‘ఊరట’ కలిగించినట్టు మాజీ ప్రధాని ఖాలిదా జియా ప్రకటించడం విడ్డూరం. ఆ తీర్పును వెంటనే అమలు చేయాలని చెప్పడం మరింత దారుణం!