పాదుకు కాసిన కుకమూతి పిందెను చూసి ఎన్ని రోజులని దిగులు పడుతాం. ఇప్పుడిది ఆ చెట్టుకు సోకిన తెగులు గురించి ఆలోచన చేసే సమయం. హైడ్రా వెనుక దాకొని బుల్డోజర్ పంపినవాడి వీరత్వం గురించి మాట్లాడుకుందాం. పాలకుల విన్యాసం, హైడ్రా విధ్వంసం, మూసీ విశ్వరూపంతో సర్వం పోగొట్టుకున్న పరాజితుల గురించి ఇంకేం మాట్లాడుకుంటాం. సకలజనులను పీడించడమే పాలక ధర్మం అనుకున్న దుష్ట గర్విత మహిషాసురున్ని వదించిన అపరాజిత పరాక్రమం గురించి మాట్లాడుకుందాం. ప్రజలను హింసించే దుష్టుడు ఒక వేటుకేమీ కూలలేదు. ఆది పరాశక్తి దుర్గాదేవి బహు రూపాలు సంతరించుకున్నది. తొమ్మిది రాత్రులు పోరాడింది. పదవ రోజున మహిషాసురున్ని శూలంపోటు పొడిస్తే.. ముల్లోకాలకు ముప్పు తప్పింది. అది భూలోక జనులకు దసరా అయింది.
మరోసారి తెలంగాణ అస్తిత్వ విధ్వంసం జరుగుతున్నది. ఉరకలెత్తే గోదావరి నదికి నడకలు నేర్పిన వశిష్ఠున్ని ఇవాళ అపరాధిగా నిలబెట్ట జూస్తున్నారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని దాశరథి స్ఫూర్తినిస్తే.. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ‘నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణి’ అని సాగు చేసి నిరూపించిన కేసీఆర్ మీద సీబీఐ దర్యాఫ్తు వేయటం రాక్షస పాలకుల క్షుద్ర మాంత్రిక కళకు నిజ దర్పణం. ఈ దర్పణం నుంచి జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే వాస్తవ దృశ్యం కనిపిస్తుంది. ప్రజాపాలన ముసుగులో జరుగుతున్న శత్రుదాడి కనిపిస్తుంది. ఆ దాడిని నిర్దేశిస్తూ.. నియంత్రిస్తున్న దుష్టశక్తుల అంతర్ముఖ రూపాలు బహిర్గతంగా కనిపిస్తాయి.
మొన్నటికి మొన్న నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) ఇండియా క్రైమ్ రిపోర్టును వెల్లడించింది. కేసీఆర్ పరిపాలన నాటి తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు తగ్గాయని ఎన్సీఆర్బీ సూటిగా చెప్పింది. తెలంగాణలో 2014లో 1,347 రైతు ఆత్మహత్యలు నమోదు కాగా, 2023 నాటికి 48కి తగ్గాయని క్రైం రిపోర్టు చెప్పింది. దేశవ్యాప్తంగా తెలంగాణది 0.51 శాతం వాటా మాత్రమేనని నిర్ధారించింది. ఇది రైతును రాజును చేసిన కేసీఆర్ సంకల్పానికి, రామసేతు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు శ్రేష్ఠతకు తిరుగు లేని కొలమానం. మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ, 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతు రుణమాఫీ, రైతుబంధు, పంట కొనుగోళ్లతో ప్రోత్సాహం పథకాల తోడ్పాటుకు అందిన ఫలితం. వంద మాటలు ఎందుకు? తెలంగాణ ఆత్మ బంధువులు ఎవరో? అంతర్ముఖ శత్రువులు ఎవరో? ఈ ఒక్క రికార్డు తేల్చి చెప్పింది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు రిపేర్ చేయించాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత ఏజెన్సీలను ఆహ్వానిస్తున్నట్టు ఒక ప్రకటన విడుదల చేసింది. నిన్నటిదాకా కాళేశ్వరం కూలిపోయిందన్నరు. అవినీతి ప్రాజెక్టు అని అడ్డగోలు వాదనలు ముందుపెట్టిండ్రు. ఎన్డీఎస్ఏ కమిటీ దర్యాప్తు అన్నరు. ఘోష్ కమిషన్ అన్నరు. ఆఖరికి అర్ధరాత్రి అసెంబ్లీ పెట్టి సీబీఐ విచారణకు తీర్మానం చేసిండ్రు. ఇప్పుడేమో రిపేర్ చేస్తామంటున్నరు. ఇది కదా..! ఒక్క ఓటు వేసి గెలిపించిన పాపానికి ముక్కారు పంటలకు నీళ్లిచ్చే ప్రాజెక్టును బలిపీఠం ఎక్కించిన దుష్ట పన్నాగం. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినయి. మళ్లీ ఓటు అవసరం వచ్చింది. అందుకే, కాళేశ్వరం ప్రాజెక్టును రిపేర్ చేసి బాగు చేస్తామని బొంకుతున్నరు. వీళ్ల మానసిక స్థితిని అర్థం చేసుకొనే మాజీ మంత్రి హరీశ్‌రావు ఒక మాట చెప్తుంటారు. ‘కేసీఆర్‌కు, రైతుకు మధ్య ఉన్నది పేగుబంధమైతే.. కాంగ్రెస్‌కు ఉన్నది కేవలం ఓటు బంధమే’ అంటారు.
కేసీఆర్ అంటే ఒక విజన్. ఎన్నికలప్పుడు మినహా.. అభివృద్ధిలో రాజకీయాలు ఆలోచించని విజ్ఞత ఆయనది. ఇక్కడో ఉదాహరణ చెప్పాలి. 2018 ఎన్నికల్లో ములుగు ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించారు. కేసీఆర్ కాకుండా ముఖ్యమంత్రి స్థానంలో ఇంకెవరున్నా.. ములుగును మూలకు పెట్టేవాళ్లు. అక్కడి బీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోయినా ములుగును జిల్లా చేసిండ్రు. జిల్లా కేంద్రాన్ని మున్సిపాలిటీ చేసిండ్రు. మెడికల్ కళాశాలను మంజూరు చేసి 200 పడకల ఆసుపత్రి ఇచ్చిండ్రు.
కాంగ్రెస్ పాలనలో దేశంలోనే 329వ ర్యాంకులో ఉన్న ఇదే ములుగు బీఆర్ఎస్ పరిపాలనలో 31వ ర్యాంకుకు మెరుగుపడింది. విజన్ ఉన్న నాయకుని సంకల్పం ఇది. ఇప్పుడు ఈ తరహా పాలన చూడగలమా? తన మన భేదం లేకుండా రాష్ట్రవ్యాప్త సమాన అభివృద్ధిని కాంక్షించగలమా?
త్రేతాయుగంలో అయితే మంచి, చెడుకు మధ్య సముద్రం అడ్డమున్నది. చెడును దునుమాడటానికి రాముడు సంద్రం దాటాల్సి వచ్చింది. కానీ, ఇది కలియుగం. మంచి, చెడు ఒక్కింట్లనే తిష్ట వేసినయి. ఏ ఇంటి పెద్ద ఆ ఇంట్లో చెడుకు, మంచికి మధ్య విభజన రేఖ గీసుకోవాల్సిందే. ఏది మంచో? ఏది చెడో గుర్తించాల్సిన బాధ్యతా వాళ్లదే. తెలంగాణ ప్రజలు ఏది మం చో, ఏది చెడో ఇప్పటికే ఒక అంచనాకు వచ్చిండ్రు. చెడును వదిలించుకోవటానికి మనోబలాన్ని కూడగట్టుకున్నరు. అదను మీద ఆయుధ పూజకు అంకురార్పణ చేస్తున్నరు. అందుకు విజయదశమి కన్నా సరైన తరుణం ఏముంటుంది? మహిషాసురా..! ఊపిరి పీల్చుకో… పరాజితులొస్తున్నరు. మర్మం తెలిసి, మాయతెరలు తొలగించుకొని వస్తున్నరు. పోరాడే వీరుని చేతికే కత్తినందించి, శ్రమ జీవన సౌందర్య జయ కేతనాన్ని సగర్వంగా ఎగురవేయడానికి సంసిద్ధమై వస్తున్నరు. చూస్తూ ఉండు. జై తెలంగాణ!