కశ్మీర్‌లోని పహెల్గాంలో పాకిస్థాన్ ప్రేరేపిత మత ఉగ్రవాదులు 27 మంది అమాయక పర్యాటకులను కాల్చి చంపడంపై మన దేశం తీవ్రంగా స్పందించింది. మత ఉగ్రవాదులు జరిపిన దారుణ మారణహోమంపై దేశమంతా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
అరువై ఏండ్ల కిందట కుదుర్చుకున్న సింధు నదీజలాల పంపిణీ ఒప్పందాన్ని నిలిపి వేయాలని నరేంద్ర మోదీ నాయ క త్వంలోని భారత ప్రభుత్వం నిర్ణయించడం పాక్‌లో కలకలం రేపిం ది. ప్రపంచబ్యాంకు మధ్యవర్తిత్వంతో 1960వ దశకం ఆరంభంలో సింధు నదీజలాల పంపిణీ ఒప్పందం కుదరింది. ఈ ఒప్పందం ప్రకారం పశ్చిమ వాహినులైన సింధు, జీలం, చీనాబ్ నదుల జలాలను పాకిస్థాన్‌కు, తూర్పు దిశగా ప్రవహించే రావి, బియాస్, సట్లెజ్ నదీజలాలను భారత్‌కు ప్రత్యేకించారు.
గత అరువై ఏండ్ల కాలంలో భారత్, పాకిస్థాన్ మధ్య 1965, 1971 కార్గిల్ వంటి ఎన్నో యుద్ధాలు జరిగినా, ముంబై తాజ్ హోటల్‌పై ఉగ్రవాదులు దారుణ మారణహోమం జరిపి ఎందరో అమాయకులను కాల్చి చంపినా, పాక్ గూఢచారి సంస్థలతో లష్కరే తోయిబా వంటి మతోన్మాద ఉగ్రవాదులు తెగబడి ఎన్నో హిం సా త్మక విధ్వంసక దాడులు జరిపినా, సింధు జలాల ఒప్పందం చెక్కు చెదరలేదు. అయితే పాక్ ప్రేరణతో పహెల్గాంలో ఉగ్రవాదులు జరి పిన మారణకాండతో దేశమంతా ఆగ్రహావేశాలు పెల్లుబుకు తున్నా యి. అందుకే ఉగ్రవాద హింసాకాండపై దృఢమైన వైఖరిని భారత ప్రభుత్వం వ్యక్తం చేసింది. కొత్త ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాల య సిబ్బందిని సగానికి సగం తగ్గించింది. సైనిక సల హాదారులను, భారత్‌లో ఉన్న పాక్ పౌరులను వెంటనే దేశం విడిచి వెళ్లాలని ఆదే శించింది. సరిహద్దుల్లో భారత సైన్యాన్ని సర్వ సన్నద్ధంగా ఉంచింది.
దేశంలోని కీలక ప్రాంతాల్లో నిఘా పెంచింది. సింధు పరీవాహక ప్రాంతం నుంచి లభించే జలాలు పాక్ ‘జీవ నాడి’ వంటివి. అందుకే తీవ్రవాదం పెరిగిపోతున్న పాక్‌ను కట్టడి చేసేందుకు పాక్ ఆర్థిక మూలాలను దెబ్బతీసే వ్యూహాన్ని అమలు చేసి గుణపాఠం నేర్పాలని ప్రయత్నిస్తున్నది.
పాకిస్థాన్ నీటి అవసరాల్లో 76 శాతం సింధు, బియాస్, సట్లెజ్ జలాల ద్వారానే తీరుతున్నాయి. 80 శాతం భూములకు ఈ నదులు జీవ జలాలను అందిస్తున్నాయి. పాక్‌లో 90 శాతం ఆహారోత్పత్తి సింధు నదీజలాల ద్వారానే జరుగుతున్నది. కేవలం 244 మి.మీ. వార్షిక వర్షపాతం గల పాకిస్థాన్‌కు సింధు నదీజలాల ద్వారానే తాగునీరు లభిస్తున్నది. పాకిస్థాన్‌లో దాదాపు 40 శాతం శ్రామికులకు ఈ నదీజలాల ద్వారానే ఉపాధి లభిస్తున్నది. పాక్ జాతీయోత్పత్తి జీడీపీలో 24 శాతం సింధు నదీజలాల ఆధారంగా జరిగే ఉత్పత్తి ద్వారానే వస్తున్నది. టర్బేలా, మంగళ వంటి భారీ జలాశయాలు సింధు జలాల ద్వారా నిండుతున్నాయి. సింధు నది కాలువల వ్యవస్థ పాక్‌కు అత్యంత కీలకం. నీటి కాలువల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం అధిక నీరు అవసరమయ్యే వరి, గోధుమ వంటి ఆహార పంటలు, పత్తి వంటి వాణిజ్య పంటల సాగువల్ల తరచూ నీటి కొరత ఏర్పడుతున్నది. తీవ్ర నీటి కొరత గల దేశాల్లో పాక్‌ది మూడవ స్థానం అని ఆ సర్వేలో తేలింది. వాతావరణ మార్పుల వల్ల హిమ ఖండాలు కరిగి తొలుత నీటి లభ్యత పెరిగినా తదుపరి కొరత తప్పదు. ఈ పరిస్థితుల్లో సింధు నదీజలాల ఒప్పందాన్ని నిలిపివేయడం వల్ల పాక్‌కు 70 శాతం నీటి సరఫరా తగ్గి తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతాయని నిపుణుల అంచనా.
పంజాబ్, సింధు వంటి సస్య శ్యామల రాష్ర్టాలు మరు భూములుగా మారవచ్చు. సింధు నదీ పంట కాలువలకు నీటి సరఫరా నిలిచిపోతే పాక్‌లో ఆహారోత్పత్తి పడిపోయి ధరలు, దారిద్య్రం పెరిగి ఆకలితో అలమటించే దుస్థితి ఏర్పడవచ్చు. పాక్ జనాభాలో 80 శాతం గ్రామీణ ప్రజలు. వారి జీవనోపాధి వ్యవసాయమే. సింధు జలాలు నిలిపివేస్తే వారు ఉపాధి కోసం లాహోర్, కరాచి, పెషావర్, రావల్పిండి వంటి పట్టణాలకు వలస పోవలసి ఉంటుంది. ఇప్పటికే నీరు, విద్యుత్తు, రహదారులు ఇలా కొరతతో సతమతమవుతున్న ఆ నగరాల ప్రజావసరాలు మరింత దుర్భరంగా మారవచ్చు. సింధు నదీజలాల ద్వారా జరిగే 30 శాతం జలవిద్యుత్తు ఉత్పత్తి బాగా పడిపోయి పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు మూసివేస్తే నిరుద్యోగం మరింత పెరిగే అవకాశమున్నది.
ఒక్కసారిగా సింధు జలాలను ఆపివేస్తే ఆ నీటి నిల్వకు అనువైన జలాశయాలు భారత్‌లో లేవు. వానకాలంలో అదనంగా వచ్చే నీటిని నిల్వ చేయడం కష్టం. పడమటి దిశగా వెళ్లే జలాలను ఇతర ప్రాంతాలకు మళ్లించాలంటే ఇంజినీరింగ్ నైపుణ్యాలే గాక సమయం అవసరం. భాక్రానంగల్ తదితర డ్యాంలు తూర్పు దిశగా పారే నీటి నిల్వకే సరిపోతాయి. పల్లపు ప్రాంతాలు ముఖ్యంగా కశ్మీర్లో ఎక్కువ భాగం ముంపునకు గురవుతాయి. పాక్‌లో కూడా అత్యవసర పరిస్థితి రావచ్చు.
రక్తపుటేరులు, నీరు ఏకకాలంలో ప్రవహించే వీల్లేదని ప్రధాని మోదీ పాక్ నేతలకు గట్టి హెచ్చరిక చేసినా ఫలితం లేకపోయింది. అందుకే సింధు జలాల నిలుపుదల ముందుకు తెచ్చారు. ఉగ్రవాదాన్ని నిరోధిం చకపోతే సింధు జలాలను ఇతర ప్రాంతాలకు మళ్లిస్తామని కేంద్ర మం త్రి నితిన్ గడ్కరీ కూడా హెచ్చ రించారు. ఇదే జరిగితే పాక్ పొరుగు దేశంగా ఉన్న చైనా సింధు నదికి ఎగువన డ్యామ్‌లు నిర్మించి భారత్‌ను కట్టడిచేసేందుకు ప్రయత్నించవ చ్చు. సింధు జలాలను నిరోధిస్తే పాక్‌కు భారీగా నీటి కొరత ఏర్ప డవచ్చు. పాకిస్థాన్ ఇప్పటికైనా మత చాందసవాదులను పైకి ఎగ దోసి, మత మారణకాండను ప్రేరే పించే దుశ్చర్యలకు స్వస్తి చెప్పి వాస్తవ దృష్టితో వ్యవహరించి ప్రజలకు అన్నవస్ర్తాలు అందించి, అభివృద్ధి పథంలో పయనిస్తేనే ఉపఖండంలో సుహృద్భావం, శాంతి సాధ్యమవుతుంది.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు)
– పతకమూరు దామోదర్ ప్రసాద్
94409 90381