భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఫిరాయింపుల వికృత నాటకంలో తొలి అంకానికి తెరవేసింది. విచక్షణాధికారాల వెసులుబాటుతో శాసనసభ్యుల ఫిరాయింపు వ్యవహారం ఏండ్ల తరబడి సాగదీతకు అవకాశం లేకుండా సభాపతికి మూడు నెలల కాల పరిమితి విధించింది. అయినా నాటకం ఇంకా మిగిలే ఉంది. ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై తెలంగాణ శాసనసభ సభాపతి ఒక సత్వర నిర్ణయం తీసుకోవాలి. తండ్రి చేసిన చట్టానికి తనయుడే తూట్లు పొడిచాడన్న అపకీర్తి రాకుండా ఉండాలంటే ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత తమ పదవులకు రాహుల్‌గాంధీ రాజీనామా చేయించాలి. ఇప్పుడు బంతి తెలంగాణ శాసనసభ ఆవరణలో ఉన్నది. సభాపతికి చక్కని అవకాశం ఇది.
దేశ చరిత్రలో పార్టీ ఫిరాయింపులకు దారులు వేసిన ఘనత కాంగ్రెస్‌దే. 1935 బ్రిటిష్ ఇండియా చట్టం ప్రకారం 1937లో జరిగిన ఆరు రాష్ర్టాల ఎన్నికల్లో అధికారం కోసం ముస్లిం లీగ్ శాసనసభ్యులను చేర్చుకొని ఫిరాయింపులకు కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది. స్వాతంత్య్రం వచ్చాక 1950-70ల మధ్యకాలంలో ఫిరాయింపులతో ప్రభుత్వాలు గద్దనెక్కడం, కూలిపోవడం వంటి సంఘటనలెన్నో జరిగాయి. 1967లో హర్యానాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గయా లాల్ ఒకేరోజు మూడు పార్టీలు మారి చరిత్ర సృష్టించాడు. ఆయనను ఉద్దేశించి నాటి కాంగ్రెస్ నేత రావు బీరేంద్ర సింగ్ ‘ఆయారాం గయారాం’ అని మీడియా ముందు చమత్కరించడంతో ఫిరాయింపులకు అది నానుడిగా మారింది. ఆ పుణ్యం మూట కట్టుకుంది కాంగ్రెస్ పార్టీనే. అదే ఏడాది 16 రాష్ర్టాలకు ఎన్నికలు జరిగితే 8 రాష్ర్టాల్లో కాంగ్రెస్ అధికారం కోల్పోయింది. వాటిలో యూపీ, రాజస్థాన్, పంజాబ్‌లలో ఫిరాయింపులు ప్రోత్సహించి మెజారిటీ సాధించింది. ఇలా.. నాటినుంచి నేటిదాకా కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులతోనే నెట్టుకొస్తున్నది.
ఈ ఫిరాయింపుల ఉదంతాలన్నింటిలో సభాపతుల పాత్ర ఏ మేరకు అన్న చర్చ విస్తృతంగా జరిగింది. ఈ నేపథ్యంలో 70వ దశకంలో రెండుసార్లు ఫిరాయింపుల నిరోధక బిల్లు పార్లమెంటు ముందుకొచ్చినా చట్టం కాలేదు. రాజీవ్‌గాంధీ హయాంలో 1985 మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చిన ఫిరాయింపుల నిరోధక చట్టం ఫిరాయింపులకు ఓ మేరకు అడ్డుకట్ట వేసింది. 1993లో అటల్ బిహారీ వాజపేయి హయాంలో వచ్చిన చట్టం మరింత పట్టు బిగించింది. ఇందిరమ్మ రాజీవ్ పేర్లను నిత్యం జపించే కాంగ్రెస్ వారి స్ఫూర్తికి భిన్నంగా బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు కండువాలు కప్పి పార్టీలో చేర్చుకుంది. దీన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ నిర్ణయం తీసుకోవడానికి నెల రోజుల అవధి నిర్దేశిస్తే డివిజన్ బెంచ్ తగిన సమయంలో అంటూ శాసనసభ సభాపతికి కొంత వెసులుబాటు కల్పించింది. ఇప్పుడు భారత అత్యున్నత న్యాయస్థానం 3 నెలల సమయాన్ని నిర్దేశించింది. ఇకపై దేశంలో ఏ సభాపతి అయినా ఫిరాయింపుల ముచ్చట 3 నెలల్లో ముగించాల్సిందే.
భారతదేశ చరిత్రలో దురదృష్టవశాత్తు పలు సందర్భాల్లో సభాపతుల పాత్ర వివాదాస్పదమైంది. అది ప్రజాస్వామ్యానికి అశనిపాతం. సభాపతుల విచక్షణాధికారాలు న్యాయ సమీక్షకు అతీతమైన బ్రహ్మపదార్థాలు కావని న్యాయస్థానాల తీర్పులతో తేలిపోయింది. ఈ పతాక సన్నివేశంలో తెలంగాణ సభాపతి నిర్ణయం కోసం తెలంగాణ సమాజమే కాదు, యావత్తు భారతదేశం ఎదురుచూస్తున్నది. అది ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిఢవిల్లేలా ఉండాలని ఆశిస్తున్నది. చట్టసభల చరిత్రలో ఒక సాహసోపేత నిర్ణయంగా నిలిచిపోవాలని కోరుకుంటున్నది. మరోవైపు 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏం జరగదన్న ధీమాతో ఉన్నారు. రకరకాల మాయోపాయాలను అన్వేషిస్తున్నారు. ‘మేం ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నాం’ అని కొందరు నాలుక మడతేస్తున్నారు.
కోట్ల మంది తెలంగాణ ప్రజలు చూస్తుండగా ప్రసార, ప్రచార మాధ్యమాల సాక్షిగా కాంగ్రెస్‌లో సదరు ఎమ్మెల్యేలు చేరితే తెలిసి కూడా ‘తమ పార్టీ అసలు చేర్చుకోనే లేదు. అంతా ఉత్తిదే’ అని ఒక మంత్రి బుకాయిస్తున్నారు. ‘ఉప ఎన్నికలు రావు. ఏమీ కాదు’ అంటూ ముఖ్యమంత్రి రాజ్యాంగ విరుద్ధమైన పరిభాషలో దబాయిస్తున్నారు. ఈ ఉదంతానికి ఉత్తమమైన పరిష్కారాలు రెండే రెండు. ఒకటి ఆ 10 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి, ఆయా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేసి ప్రజా తీర్పును కోరడం. రెండు, ఫిరాయింపు వాస్తవ సాక్ష్యాధారాల ప్రాతిపదికగా సభాపతి ఆ 10 మందిపై అనర్హత విధించడం. ఏం జరుగుతుందో చూద్దాం.
– డాక్టర్ అయాచితం శ్రీధర్ 98498 93238