డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతితో దేశం ఓ మహానేతను కోల్పోతే తెలంగాణ ఓ ఆత్మీయ స్నేహితుడిని కోల్పోయింది. తెలంగాణ గోస తెలుసుకొని మసులుకున్న ఏకైక ప్రధానిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోతారు. జవహర్లాల్ నెహ్రూ విడాకులు తీసుకోవచ్చనే నమ్మికను చూపించి తెలంగాణను ఉమ్మడి రాష్ట్రంలో కలిపేసి చేతులు దులుపుకొన్నారు. సౌభాగ్యానికి, సౌహార్దానికి నిలయమైన హైదరాబాద్ రాష్ర్టాన్ని భాషా ప్రయుక్తం పేరిట మూడు ముక్కలు చేసి మూడు దిక్కులకు విసిరేశారు.
తెలంగాణ మెడకు సమైక్య గుదిబండను తగిలించారు. అయినా ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షలు ప్రజ్వలించడం ఆగలేదు. తర్వాత ప్రధాని పదవి చేపట్టిన ఇందిరాగాంధీ ఉత్తుంగ తరంగమై లేచిన తొలిదశ ఉద్యమాన్ని అణచివేసి, అటకెక్కించే దాకా నిద్రపోలేదు. అదే కాంగ్రెస్ పరంపరలో కీలక పదవిని చేపట్టి భిన్నవైఖరి ప్రదర్శించిన విభిన్న నేత మన్మోహన్. కుటిల కాంగ్రెస్ పన్నాగాల పంకిలంలో అచ్చమైన ఆణిముత్యంలా నిలిచారాయన. అధిష్ఠానం నీడలో అష్టదిగ్బంధాల మధ్య ఆయన ప్రభుత్వం సాగడం తెలిసిందే. అయినప్పటికీ తెలంగాణ ఆవిర్భావం కోసం లోపలి నుంచి పావులు కదిపిన చతురుడాయన. నమ్మకద్రోహాలు, వెన్నుపోట్ల మధ్య కత్తి మీద సాము చేసి కార్యాన్ని నెరవేర్చిన ధీశాలి ఆయన.
మలిదశ ఉద్యమం మనసెరిగి ప్రజల కాంక్షను చెవియొగ్గి విని, చేయూతనందించిన మహానుభావుడు మన్మోహన్. కేసీఆర్ అవిశ్రాంత కృషితో ఉద్యమం ఊపందుకొని తారస్థాయికి చేరుకున్నది ఆయన హయాంలోనే కావడం యాదృచ్ఛికం కాదు. ఆ ఇద్దరు నేతల అనుబంధం తెలంగాణ ప్రజల భవితకు భరోసాగా నిలిచింది. రాజకీయ ఊగిసలాటలో తెలంగాణ పడిపోయినప్పుడు ఉక్కుస్తంభంలా అండదండలు అందించిన సహృదయుడు ఆయన.
రాజకీయ శషభిషల హోరులో తెరవెనుక ఆయన పోషించిన పాత్ర చిన్నదేం కాదు. స్వరాష్ట్ర కాంక్ష అంతిమగమ్యం చేరడంలో చోదకశక్తిగా పనిచేసిన ఈ కపటం లేని కర్మయోగి సహజంగానే ప్రచార ఆర్భాటాలకు నోచుకోలేదు. నిలిచి గెలిచిన తెలంగాణ కేసీఆర్ సారథ్యంలో సాధించిన ప్రగతి పరుగులు చూసి మురిసిపోయిన విజ్ఞుడు, రాజనీతిజ్ఞుడు మన్మోహన్.
భారత రాజకీయాల్లో ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ రాక ఒక అనూహ్యమైన, అద్భుతమైన మలుపు. ఆయన వ్యక్తిత్వం ప్రతిభాసామర్థ్యాలు, నీతి నిజాయితీల కలగలుపు. తెలంగాణ మలిదశ పోరాటంలో ఆయన ఆశీస్సులే గెలుపు మలుపు. ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా ఆయన చూపిన చాకచక్యం అనితర సాధ్యం. భారత ఆర్థికవ్యవస్థ సంకెళ్లు తెంచి పరుగులు పెట్టించడం అద్వితీయం. ఇరవై ఏండ్ల కిందట యూపీఏ సర్కారు అధికారంలోకి వచ్చినప్పుడు ఏర్పడిన రాజకీయ శూన్యంలో ప్రధాని పదవి వరించడం ఆయన పరిపాలనా సామర్థ్యానికి దక్కిన గౌరవంగానే భావించాలి. సంక్లిష్ట సమయంలో దేశానికి దశ, దిశ చూపించిన దార్శనికుడు మన్మోహన్. తెలంగాణ రాష్ట్ర ప్రాదుర్భావ ఘట్టాన్ని ఒడుపుగా నెరవేర్చిన మౌన ముని. ఎదిగిన కొద్దీ ఒదిగిపోయిన జ్ఞాన ఖని.