Telangana | ‘నకల్ మార్నెకో బీ అకల్ రహనా’ అన్నది ఉర్దూ సామెత. కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలన్నది దీని సారాంశం. చిన్న లాజిక్ మిస్ అయిన సైబర్ నేరగాళ్లు పప్పులో కాలేశారు. కాంగ్రెస్ అభ్యర్థులుగా ప్రకటించిన వారికి ఫోన్లు చేసిన సైబర్ నేరగాళ్లు.. ఏఐసీసీ నుంచి మాట్లాడుతున్నామని నమ్మిస్తూ ‘మీ బీ ఫామ్ సిద్ధమైంది. రూ.76 వేలు ఎక్స్ట్రా ఫోన్ పే చేస్తే దాన్ని వాట్సాప్‌కు పంపిస్తామని చెప్పారట. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో ఎంపీ టికెట్లకు కోట్లకు కోట్లు ధర పలుకుతుండగా.. మరీ ఛీప్‌గా రూ.76 వేలు ఏంది? అని కడియం శ్రీహరికి అనుమానం వచ్చిందట. కాంగ్రెస్ బీ ఫామ్‌లు మరి ఇంత అగ్గువకు అమ్ముతున్నారా? అని ఆయన ఏఐసీసీ నేతలకు ఫోన్ చేసి అడగగా.. సైబర్ నేరగాళ్ల తెలివి తక్కువతనం బయటపడింది.
వేసవిలో నీటి ఎద్దడి మామూలే. అయితే ఆ ప్రభా వం పెండ్లిలు, ఎంపీ ఎన్నికలపై పడటం మాత్రం ఇదే తొలిసారి. కర్ణాటకలో బీర్లు అయినా దొరుకుతాయి, కానీ మంచినీళ్లు దొరికే పరిస్థితి లేదని వార్తలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన ఒక పెండ్లిలో మంచినీళ్లకు బదులుగా బీర్లు అందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలైంది. అలాగని మున్ముందు బీర్లకు ఢోకా లేదనుకుంటే పప్పులో కాలేసినట్టే. నీటికొరత కారణంగా బీర్ల తయారీ ఫ్యాక్టరీలకు నీళ్లు సరఫరా చేయలేమని కర్ణాటక అధికారులు చేతులెత్తేశారు. ఈ సమాచారం ఎంపీ అభ్యర్థులను మరింత ఆందోళనకు గురి చేస్తున్నది. ‘డబ్బులది ఏముందిలే అన్నా! బీర్లు పంచిన పార్టీకే ఓటు వేస్తాం’ అని ఓటర్లంటే తామెక్కడికి పరుగెత్తేదని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
రాములమ్మ అసలు కాంగ్రెస్ పార్టీలో ఉందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ కార్యక్రమాల్లో ఆమె ఎక్కడా కనిపించడం లేదు. రాములమ్మ బొత్తిగా నల్లపూస అయిపోయారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కమలం పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరినప్పుడు కొంత హడావుడి చేసినప్పటికీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఆమె ఊసే ఎక్కడా కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి నిరాకరించిన ఆమె.. ఎంపీగా బరిలో దిగనున్నట్టు అప్పట్లో మీడియాకు సూచనప్రాయంగా చెప్పారు. కానీ, ఆ దిశగా కనీసం టికెట్ కోసం కూడా ప్రయత్నించలేదు. ఈ విషయం తెలియక కొందరు రాములమ్మ ఇంటికి వెళ్లి వినతిపత్రాలు ఇస్తున్నారట. అధికార పార్టీలో ఉన్నప్పటికీ ప్రస్తుతం తాను యాక్టివ్‌గా లేనని వారికి చెప్పలేక ఆ వినతి పత్రాలను సీఎం పేషీకి పంపించి రాములమ్మ చేతులు దులుపుకొంటున్నట్టు వినికిడి.
ప్రధాని మోదీ మొదలుకొని బీజేపీలో చోటామోటా నాయకుల వరకు తమ రాజకీయ ప్రత్యర్థులపై పరివార్వాదిగా ముద్ర వేస్తుంటారు. కానీ, విచిత్రంగా కర్ణాటక బీజేపీ ప్రస్తుతం ఈ ఆరోపణ వల్ల ఆత్మరక్షణలో పడింది. బీజేపీ అగ్రనేత, మాజీ సీఎం యడియూరప్ప కుటుంబపాలన ఆరోపణలతో సతమతమవుతున్నారు. ఆయన కుమారుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్రను పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్టు మాజీ డిప్యూటీ సీఎం ఈశ్వరప్ప సంచలన ప్రకటన చేశారు. ఈ విషయాన్ని అమిత్ షాకు చెప్తామని ఢిల్లీకి వెళ్తే, తనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని, ఇక ఆయన స్వయంగా పిలిచినా వెళ్లే ప్రసక్తే లేదని, బీజేపీలో కుటుంబ పాలనపై ప్రజలను చైతన్యపరచడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నట్టు ఈశ్వరప్ప బీజేపీని హెచ్చరించారు.
– వెల్జాల