గత వైభవం ఎంతోగాని ప్రస్తుత రాజకీయ కాలుష్యం అవధుల్లేని దురాగతాల పాలై విలవిల్లాడుతున్నది. పరనింద-ఆత్మస్తుతి పరాకాష్ఠకు చేరి సత్యమేదో, అసత్యమేదో సామాన్యుడు గ్రహించజాలని దుర్దశ రాజకీయాల్లో దాపురించింది.
చట్టసభల్లో, సామాజిక మాధ్యమాల్లో, విభిన్న ఛానెళ్ల లో ఎడతెరిపి లేని చర్చ లు, విశ్లేషణలు ఆయా రాజకీయ పార్టీలకు తొత్తులుగా సాగుతాయే కానీ, సార్వజనీన సత్యాలు గాలికి వదిలివేస్తున్నాయి. సత్యదూరమైన విష ప్రచారాలకు బానిసలై కాలాతీతమైన ప్రజాభ్యుదయాన్ని పరిగణనలోకి తీసుకోలేకపోతున్నాయి.
దశాబ్దకాలంగా ఉప్పెనై ఉప్పొంగిన అభ్యుదయాన్ని అపహాస్యం చేస్తూ పదవీలాలసత పొందుతున్నారు రాజకీయ నాయకులు. ప్రజా సంక్షేమంతో ముడిపడ్డ ప్రజా ప్రభుత్వాలు ప్రణాళికా రచనల్లో ప్రజాభ్యుదయ రాజకీయాలకు అంకితమై జనరంజకంగా సాగవలసిన పరిపాలన ప్రజా కంటకంగా మారితే దిక్కెవరు?
రాజ్యాంగబద్ధ ప్రమాణాలు, న్యాయవ్యవస్థ స్థిరీకరించిన సత్సాంప్రదాయాలు నేలమట్టమై కేవలం వ్యక్తిగతం రాజ్యమేలే దుష్ట సంప్రదాయాలకు చట్టసభలు నిలయాలైతే సంస్కరించేదెవరు? ఒక స్థాయిలో ఉన్న ప్రజా నాయకులే ఉచ్ఛరించ వీలుకాని పద ప్రయోగాలకు చట్టసభలు వేదికలా? తర్కం ఎక్కడైతే విఫలమౌతుందో అక్కడ భౌతికదాడి దాపురిస్తుంది. (Physical force comes into exforce where the logic fails) గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ అహంభావం, అరాచకం రాజ్యమేలిందంటూ మేధావులు ప్రచారాస్ర్తాలను సంధిస్తున్నారు. కానీ, జాతీయ, అంతర్జాతీయ అధికార నివేదికలు దశాబ్దకాలంగా తెలంగాణ రాష్ట్ర ప్రగతిని వేనోళ్ల ప్రశంసిస్తూ ప్రకటించిన వివరాలు ఈ కండ్లున్న కబోదులకు కనిపించడం లేదా?
సమాజ శ్రేయస్సు కాంక్షించే మేధావివర్గం నిర్లిప్తంగా, నిద్రాణంగా గత ప్రభుత్వాన్ని కూలదోయడంలో క్రియాశీలక పాత్ర పోషించింది. కానీ, నేటి దుస్థితిని ఎందుకు ప్రతిఘటించలేకపోతున్నది? సమాజ సంరక్షకులుగా కీర్తించబడుతున్న మేధావులు తమ పాత్ర బలంగా పోషిస్తూ ఈ దారుణాలను నివారించే ప్రయత్నం చేయాలి. చట్టసభల్లో చేసే వాదాలు-వివాదాలపై పోస్ట్‌మార్టం చేయగల మేధోసంపత్తి గల చింతనాపరులు వారు తమ ఏకాంతానికే పరిమితమైన మేధో పరిమళాలతో ప్రస్తుత రాజకీయ కాలుష్యాన్ని నివారించడంలో మార్గ నిర్దేశనం చేయాలి. అప్పుడే పరిస్థితిలో మార్పు గణనీయంగా రాగలదు.
– కె.లక్ష్మణ్‌గౌడ్ 97049 30509