వరంగల్ : కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ, కార్మికులకు వ్యతిరేకంగా నూతన చట్టాలను( Labor Laws) తీసుకొచ్చి కనీస హక్కులు లేకుండా కాలరాసే ప్రయత్నం చేస్తోందని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్(Dasyam Vinay Bhaskar ) విమర్శించారు.
ఉద్యోగ, కార్మికులు ఎంత వ్యతిరేకించినా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా 44 కార్మిక చట్టాలను రద్దు చేయడం కార్మిక సంక్షేమ వ్యతిరేక చర్య అని ఆరోపించారు. బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా కార్యాలయంలో ఈనెల 11న నిర్వహించనున్న జిల్లా స్థాయి సదస్సు పోస్టర్, కరపత్రాన్ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్టుబడిదారులు, సంపన్నుల కోసం కేంద్ర ప్రభుత్వం పేదల పొట్టకొడుతుందని పేర్కొన్నారు. నూతన కార్మిక కోడ్ల కారణంగా కార్మికులు కనీసం వేతనం, సెలవులు, నిరసన చేసే హక్కులను సైతం కోల్పోతారని వెల్లడించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గతంలో రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను తెస్తే రైతుల ఉద్యమానికి తలవంచిన కేంద్రం వాటిని వెనక్కి తీసుకుందని గుర్తు చేశారు. రైతుల ఉద్యమ స్ఫూర్తితో కేంద్రంపై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
నూతన కార్మిక చట్టాల రద్దు కోసం భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ ఇప్పటికే రాష్ట్ర స్థాయి కార్మికుల కోసం సదస్సును నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల రిటైర్డ్ బెనిఫిట్స్ సైతం చెల్లించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. సదస్సుకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ పార్టమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్, బీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు, నగరంలోని అన్ని కార్మిక, ఉద్యోగ సంఘాలు పాల్గొననున్నట్లు వివరించారు .
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్మిక విభాగం నాయకులు నాయిని రవి, ఎంజాల మల్లేశం, కార్మిక సంఘాల ప్రతినిధులు బొట్ల భిక్షపతి, నారాయణ గిరి, పాలడుగుల శివకుమార్, తేలు సారంగపాణి, తాళ్ల చేరాలు, సదానందం, రఘుపతి రెడ్డి, సాయి, వెంకటేశ్వర్లు, విజయ్, సిద్ధిఖ్, రాజు, ఇసంపెల్లి సంజీవ్, రవీందర్ రెడ్డి, ఇస్మాయిల్, తదితరులు పాల్గొన్నారు.