అలవికాని హామీలతో అధికారం చేజిక్కించుకున్న కొత్తలో కాంగ్రెస్ పాలకులు ఇదివరకటి బీఆర్ఎస్ పాలన మీద బురద జల్లాలని చూశారు. రాష్ట్రం అప్పులతో దివాళా తీసిందని, ఖాళీ ఖజానాను చేతికిచ్చి వెళ్లిపోయారని బీద అరుపులు అరిచారు. కానీ, ప్రగతి, సంక్షేమాలకు సమ ప్రాధాన్యం ఇచ్చిన ప్రథమ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ర్టాన్ని కొత్తపుంతలు తొక్కిస్తూ నడిపిన అద్వితీయ పాలన చరిత్రలో నమోదైంది. రికార్డులు, అవార్డులు ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇదంతా మూసిపెడితే మాయమయ్యేదా? ఎవరి నుంచైతే దొంగిలించామో వారిని ఎన్నటికీ క్షమించలేమని అంటా రు పెద్దలు. సీఎం రేవంత్ ఇదే తీరులో మాట్లాడేవారు.
పదేండ్లలో తెలంగాణ అభివృద్ధి సాధించిందని ఒప్పుకుంటే ఎక్కడ కేసీఆర్ ప్రతిభా పాటవాలను ప్రశంసించినట్టు అవుతుందోనని ఆయన వెనుకాడేవారు. కానీ, కేంద్రం నుంచి వెలువడుతున్న నివేదికలు రాష్ట్ర ప్రగతిని వేనోళ్ల పొగుడుతుంటే రేవంత్ మాత్రం ఏం చేయగలరు? మాటమార్చి రాష్ట్ర ఆర్థికస్థితి సవ్యంగానే కాదు, దివ్యంగా కూడా ఉన్నట్టు నసుగుతూ అయినా చెప్పక తప్పలేదు. కాదు కాదన్నవారే ఔననేలా చేస్తుంది సత్యం. అదీ సత్యానికున్న శక్తి. దాచినకొద్దీ ఎగదన్నుకు రావడం దాని నైజం.
ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) విడుదల చేసిన తాజా నివేదిక కాంగ్రెస్ కల్లబొల్లి మాటల గాలి తీసేసింది. వయసులో అతిచిన్న రాష్ట్రం అభివృద్ధిలో అంగలు వేసినట్టు ఆ నివేదిక చాటిచెప్పింది. ఒకరకంగా చెప్పాలంటే సుమారు తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనకు ఆ నివేదిక మెరిట్ సర్టిఫికెట్ లాంటిది. కేసీఆర్ హయాంలో తలసరి ఆదాయంలో, జీఎస్డీపీలో రాష్ట్రం దూసుకుపోయింది. టాప్-10 రాష్ర్టాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. ఈ క్రమంలో తలసరిలో జాతీయ సగటు కన్నా ఏకంగా 94 శాతం ఆధిక్యం సాధించడం విశేషం. ఇక రాష్ట్రం ఏర్పడిన నాటికి రూ.5.05 లక్షల కోట్లుగా ఉన్న జీఎస్డీపీ.. 2023-24 నాటికి మూడింతలు పెరిగి రూ.14.64 లక్షల కోట్లకు చేరింది. ఇది బీఆర్ఎస్ పాలనలో జరిగిందని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు.
ఇవి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అంగీకరించి, ఆవిష్కరించిన గణాంకాలు. ఇక తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మధ్య, చిన్నతరహా పరిశ్రమల విధాన పత్రంలో కేసీఆర్ హయాంలో సాధించిన ప్రగతిని ప్రశంసించడం గమనార్హం. పదేండ్లలో ఎంఎస్ఎంఈలు 15 శాతం వృద్ధి సాధించాయని స్వయంగా కాంగ్రెస్ సర్కార్ చెప్పిందంటే.. బీఆర్ఎస్ పాలనలో జరిగిన ముందంజను ముచ్చటగా ఒప్పేసుకోవడమే కదా! కరోనా కల్లోలం ఫలితంగా మూతబడిన ఎంఎస్ఎంఈల సంఖ్య రాష్ట్రంలో అతి తక్కువగా ఉండటం గురించి కూడా విధాన పత్రంలో ప్రస్తావించారు. దీనికి కేవలం కేసీఆర్ పరిపాలనా పటిమ, దార్శనికత కారణమని ఎవరైనా చెప్పక తప్పదు. కాంగ్రెస్ పాలకులకు కొంచెం ఎక్కువ సమయం పట్టింది. అంతే తేడా.