ఆర్థిక క్రమశిక్షణ లేని నిర్ణయాలు, రాష్ట్ర సంపద పెంచే ఆలోచనలు లేని దివాలా పాలనతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. మరోవైపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఖర్చును భరించాల్సిన అనివార్య రాజకీయ పరిస్థితి ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వంపై ఉన్నది. దీంతోఅధికార పార్టీ నేతలు నిధుల సమీకరణ కోసం తెలంగాణలో ఖరీదైన భూములపై పడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు అవుతున్నది. రోజురోజుకూ ఆర్థికంగా, రాజకీయంగా గడ్డుపరిస్థితే. కానీ మెరుగయ్యే పరిస్థితులు ఏకోశానా కనిపించడం లేదు. ఈ రెండున్నరేండ్లలో పేదల ఇండ్ల కూల్చివేతలు, విపక్ష బీఆర్ఎస్ నేతలను బూతులు తిడుతూ రాజకీయాలు అంటేనే అసహ్యించుకునేట్టు చేయడం మినహా సాధించిందేమీ లేదు.
కాంగ్రెస్ పాలనలోని వాస్తవాలు ప్రజలకు అర్థమయ్యాయి. సహజంగా సామాన్యులు మేల్కొన్న చాలా కాలానికి మేధావులు మేల్కొంటారు. జర్నలిస్టులు, మేధావులు ఇప్పుడు మెల్లమెల్లగా మేల్కొంటున్నారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లే కాదు.. తాము నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌ను కూడా కూల్చివేయడానికి రేవంత్‌రెడ్డి సర్కార్ సిద్ధం కావడంతో పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్లో నివసించే 500 కుటుంబాల్లో ఓ అరడజను జర్నలిస్టుల కుటుంబాలు కూడా ఉన్నాయి. వారంతా మేధావులుగా గుర్తింపు పొందినవారు. ‘కేసీఆర్ దిగిపోవాలి, రేవంత్‌రెడ్డి అధికారంలోకి రావాలి’ అని గట్టిగా ప్రయత్నించిన వాళ్లే. అట్లాంటివాళ్లే ఇప్పుడు మింగలేక, కక్కలేక సతమతమవుతున్నారు.
సెంట్రల్ యూనివర్సిటీ భూములపై మేధావులు ఇంకా అధ్యయనం పూర్తి చేయలేదేమో! వర్సిటీలో వందలాది చెట్లు నరికేసి , వన్యప్రాణులను చంపేసి భూములను అమ్ముకోవాలని కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తే.. సుప్రీంకోర్టు కన్నెర్రజేసి, ఆ భూముల్లోనే జైలు నిర్మించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని జైలులో వేస్తామని హెచ్చరించింది. కానీ సోకాల్డ్ మేధావవులకు ఆ భూముల్లో ఏం జరిగిందో తెలియదు.
ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఏ హామీ అమలు కావడం లేదు. రిటైరైన ప్రభుత్వ ఉద్యోగులకు రెండున్నరేండ్ల నుంచి బెనిఫిట్స్ కూడా ఇవ్వడం లేదు. కొందరు కోర్టుకు వెళ్లగా, న్యాయస్థానం ఆదేశించినా అమలు కావడం లేదు. ఒకవైపు హామీలు అమలు చేసే పరిస్థితి లేదు. ‘మింగ మెతుకు లేదు..మీసాలకు సంపెంగ నూనె’ అన్నట్టు లక్షా 50 వేల కోట్ల వ్యయంతో మూసీ సుందరీకరణ చేసి తీరుతామని రేవంత్‌రెడ్డి చాలెంజ్ చేసి మరీ చెప్తున్నారు.
కేసీఆర్ సర్కార్ అమలు చేసిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పాలకులు ఒక్కొక్కటిగా అటకెక్కిస్తున్నారు. మరోవవైపు లక్షా 50 వేల కోట్లతో మూసీ సుందరీకరణ అంటూ ప్రభుత్వం చూపుతున్న అత్యుత్సాహం అనుమానాలను కలిగిస్తున్నది. మూసీని సుందరీకరిస్తారా? సుందరీకరణ పేరుతో మూసీ భూములు ప్రైవేటుపరం చేయనున్నారా? అని ఎవరికైనా సులభగంగానే అర్థమవుతుంది.
కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు మూసీ భూముల మీద, ఫ్యూచర్ సిటీ మీద పడారు. మొదట సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద కన్నేస్తే విద్యార్థులు అడ్డుకోవడం, సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడంతో ఆ ప్రయత్నాన్ని నిలిపివేయక తప్పలేదు. ఆ తర్వాత మూసీ భూములు ప్రభుత్వానికి బంగారు బాతుగుడ్లలా కనిపించాయి. సమైక్య పాలకులు ప్రభుత్వరంగ సంస్థలను మూసేసి ఉద్యోగులను తొలగించడానికి పెట్టిన ముద్దు పేరు ‘గోల్డెన్ షేక్‌హ్యాండ్’.. ఇప్పుడు ప్రభుత్వ భూములు ప్రైవేట్ వారికి కట్టబెట్టడానికి కాంగ్రెస్ పాకులు పెట్టుకున్న ముద్దు పేరు మూసీ నదీ తీరం ‘సుందరీకరణ’, గాంధీ సరోవర్.
మరోవైపు హస్తం పార్టీ పెద్దలు ఫ్యూచర్ సిటీ భూములు, చుట్టుపక్కల రియల్ ఎస్టేట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నా అక్కడ కదలిక లేదు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రజాప్రతినిధులు, సివిల్ సర్వెంట్లు, జర్నలిస్టులకు 20 ఏండ్ల క్రితం ఇండ్ల స్థలాలు కేటాయించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరను వారంతా చెల్లించారు. వివాదాలు, కోర్టు కేసుల తర్వాత భూకేటాయింపు జీవోను సుప్రీంకోర్టు కొట్టేసింది. కొనుక్కున్నాం కనుక ఈ భూములు తమకు దక్కుతాయని తొలుత జర్నలిస్టులకు బోలెడు ఆశలు ఉండేవి. క్రమంగా ఆ ఆశలు అడుగంటాయి. ఈ భూములు విక్రయిస్తే ప్రభుత్వానికి రూ.40 వేల కోట్ల వరకు వస్తాయని అంచనా.
విలువైన భూములు ఎక్కడున్నా ప్రభుత్వ పెద్దలు అక్కడ కన్నేస్తున్నారు. ఫ్యూచర్ సిటీని, రేవంత్‌రెడ్డిని నమ్ముకొని ఆ ప్రాంతంలో వెంచర్లు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్కడ ఎలాంటి కదలిక లేకపోవడంతో నిండామునిగిపోయామని విలవిల్లాడుతున్నారు. ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వం కనీసం ఇందిరమ్మ ఇండ్లు కూడా నిర్మించడంలేదు. రాష్ట్రంలో ఎక్కడైనా ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం పూర్తి చేసుకున్నాయా? హైదరాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ప్రభుత్వం కూల్చిన ఇండ్ల సంఖ్యలో కనీసం పది శాతమైనా ఈ నిర్మించిన ఆనవాళ్లు లేవు. మిగిలిన రెండేండ్ల కాలంలో వాటాలు ‘పంచుకోవడం’లో బిజీగా ఉంటారేమో కానీ, నిర్మాణాలు మాత్రం చేపట్టలేరని వారి పనితీరు చెప్పకనే చెప్తున్నది. ఇక కాంగ్రెస్ పాలకులు పరిపాలన చేస్తున్నారా? రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారా? అనే సందేహాలు కలుగుగమానవు.
– బుద్దా మురళి