రాష్ట్రంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు వేడెక్కేసరికి విద్యుత్తు డిమాండ్ గణనీయ స్థాయిలో పెరిగింది. కానీ, డిమాండ్‌కు తగ్గట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్తును అందజేయలేకపోతున్నది. ముఖ్యంగా హైదరాబాద్ మహా నగరంలో విద్యుత్తు కోతలు అధికమయ్యాయి. అధికారిక, అనధికారిక కోతలతో నగరవాసులు, పరిశ్రమలు ఇబ్బందులు పడుతున్నాయి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జనరేటర్లు, ఇన్వర్టర్ల వాడకం ఎక్కువగా ఉండేది. కానీ, పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కనీసం ఒక్క క్షణం కూడా విద్యుత్తు కోత లేకుండా కేసీఆర్ ప్రభుత్వం చూసుకున్నది. కానీ, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాత్రం రాష్ర్టాన్ని పూర్తిగా అంధకారంలోకి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తున్నది.
గత ప్రభుత్వ హయాంలో విద్యుత్తును డిమాండ్‌కు తగ్గట్టుగా అందించిన ప్రభుత్వ కృషి వల్లే హైదరాబాద్‌లో పరిశ్రమలు వర్ధిల్లాయి. గతేడాది వేసవి ఎలాగోలా గట్టెక్కినప్పటికీ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే కోతలు మొదలయ్యాయి. జనవరిలో 15 వేల మెగావాట్ల పీక్ అవర్ డిమాండ్ నమోదైంది. సరైన ప్రణాళిక లేకుండా వెళ్తున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వల్ల వేసవిలో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నది. గతేడాది ఇలాగే అనధికారిక కోతలు విధించిన ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జర్నలిస్టులు, సామాన్యులపై పోలీసు కేసులు పెట్టించిందీ ప్రభుత్వం. తమ ప్రభుత్వంలోని లోపాలను సరిదిద్దుకోవటానికి బదులుగా కేసులు పెట్టడం ఎంతవరకు ప్రజాస్వామికం.
గత పదేండ్లుగా సుపరిపాలన, వ్యాపార కార్యకలాపాలకు అనుమతుల వల్ల విద్యుత్తు డిమాండ్ ఏటా 5 నుంచి 6 శాతం పెరుగుతున్నది. కానీ, ఈ ఏడాది ఒక్క జనవరిలోనే 10 శాతం డిమాండ్ పెరిగింది. ఈ పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా ఏర్పాట్లు చేయకుండా గతంలో ప్రభుత్వం విద్యుత్తు ఉద్యోగులను బద్నాం చేసింది. కారణం లేకుండా కోతలు విధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏకంగా ముఖ్యమంత్రే ఉద్యోగులను హెచ్చరించారు. వీటిపై అప్పట్లోనే విద్యుత్తు జేఏసీ మండిపడింది. ముఖ్యమంత్రి అకారణంగా ఉద్యోగులపై తప్పు నెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించింది.
ప్రస్తుతం హైదరాబాద్‌లో రెండు నుంచి మూడు గంటలు కోతలు విధిస్తున్నారు. గృహ వినియోగదారులకే కాకుండా పరిశ్రమలకు ఈ కోతలు విధిస్తున్నారు. అధికారికంగా వెల్లడించకుండా కోతలు విధించటం వల్ల తీవ్ర అసౌకర్యం కలుగుతున్నది. చిన్న చిన్న వ్యాపారుల నుంచి మొదలుపెడితే విద్యుత్తుపై ఆధారపడి వ్యాపారం చేసే వాళ్లందరూ కరెంట్ కోతల పట్ల భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరిలోనే ఈ పరిస్థితి ఉంటే ఎండలు ముదిరే కొద్దీ ఈ ప్రభుత్వ అసమర్థత బయటపడుతుంది. కోతల్లేకుండా విద్యుత్తు అందించటం ప్రభుత్వ కనీస బాధ్యత అంతే తప్ప విద్యుత్తు కోసం ప్రజలు ఎదురుచూసేలా చేయటం ఎంతవరకు సమంజసం. గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ పవర్ గ్రిడ్ విశ్వసనీయంగా ఉండేది. కానీ, ఏడాదిలోనే పరిస్థితి తారుమారైంది.
ఓ వైపు విద్యుత్తు డిమాండ్ గణనీయంగా పెరుగుతున్నప్పటికీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాత్రం సరైన కార్యాచరరణ ఏది లేకుండా వ్యవహరిస్తున్నది. రామగుండంలోని ఎన్టీపీసీ సంస్థతో 16 వందల మెగావాట్ల విద్యుత్తు ఒప్పందంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎన్టీపీసీ మాత్రం 4 వేల మెగావాట్ల పూర్తి విద్యుత్తును అందించేందుకు సిద్ధమని ప్రకటించినా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తున్నదో తెలియట్లేదు. త్వరగా పూర్తిచేసి తెలంగాణకు విద్యుత్తు అందజేయాల్సిన భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రాలపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించిన ప్రభుత్వానికి ఎలాంటి లోపాలు కనిపించలేదు. ఇంకా రాజకీయ లబ్ధి కోసం కాలయాపన చేస్తే తెలంగాణ ప్రజలకు తీవ్ర నష్టం కలుగుతుంది. అభివృద్ధికి విద్యుత్తు అవసరం అన్న విషయాన్ని గుర్తించిన కేసీఆర్ జాతీయ గ్రిడ్‌తో రాష్ర్టాన్ని అనుసంధానించటానికి అంగుల్ పలాస, వార్దా డిచ్పల్లి లైన్ నిర్మించారు. హైదరాబాద్‌కు నిరంతరం సరఫరా అందించటానికి పవర్ ఐలాండ్‌ను ఏర్పాటుచేశారు. కానీ, రేవంత్ రెడ్డి మాత్రం గత ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్నారే తప్ప విద్యుత్తు డిమాండ్‌ను ఎదుర్కొవటానికి ఏం చేయట్లేదు.
యాసంగి పంటలు వేసిన రైతులకు విద్యుత్తు కోతల వల్ల పంటలకు నీళ్లందించే పరిస్థితి లేదు. బడ్జెట్లో కొత్త హై టెన్షన్ లైన్లు వేస్తామన్న రేవంత్‌రెడ్డి వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యుత్తు కోతలను వెంటనే ఆపెయ్యాలి. పెండింగ్‌లో ఉన్న థర్మల్ ప్రాజెక్టులను సత్వరం పూర్తిచేసి రైతులకు, పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్తును అందించాలి.
– ఓ.నరసింహా రెడ్డి, 80080 02927